Monday, May 27, 2013

మెనీ మినీలు


కపిల రాంకుమార్|| మెనీ మినీలు ||
1.అశ్లీల దృశ్యాల జడివాన
తడిపిముద్దచేసి
లొట్టలేయిస్తుంది కాని
జబ్బువాత పడుతామని
జాగరూకత మరుస్తున్నారు!
2. మురికినీటి పరవళ్ళకి
ముక్కు పగులుతున్నా కాని
మూసీవొడ్డునే సరసాలు
మానలేకున్నారు.
కంపులోనే యింపుగా కాపురాలు
చేస్తారుగాని దోమకాలకు రోగాల పాలౌతున్నారు!
3.రాజకీయ పండితుల
సంస్కార రహిత సంస్కృతోచ్చారణ
కర్ణభేరి పగిలినా కాని
యెదురుదాడులు చేస్తారు కాని
బ్రౌన్‌ దొరకు  కూడ దొరకని
కొత్త నిఘంటువులకు బాంది వాచకమౌతారు!
4.అందాల పోటీలు కనువిందు చేస్తుంటే
అడ్డుకునే వారుంటారు
ఆడ్డకోలుగా ఆర్థికంగా బలిసే వారుంటారు
కబళించిన గ్లోబలి మాయాదండంలో
ఆడేవరిదా తప్పు! ఆడ ఆదువారిదాతప్పు!
ఆడించే వారిదా తప్పు!
కష్టాల కడలి దాటే యత్నాన
కష్టపడితేకాని మరి కొంత నష్టపడితేకాని
కాసులూ రాలవు – రోజులూ గడవవు!
స్వాభిమానులు మనుషులుగా మిగులుతారు
లొంగిపోయినవారు మానాలు ఫణంపెడతారు!
5. ఆకు కూరలు పప్పు ధాన్యాలు మాని
ఫాస్ట్ ఫుడ్ సెంటరులో పిజ్జాలు తిని
ఊబకాయాలతో బీపీలు షుగర్లు హెచ్చి
డాక్టర్ల జేబులునింపి గొల్లుమనే బికార్లవుతారు!
6. శాస్త్రీయ విద్యలు మృగ్యమౌతున్నాయికాన్వెంటు చదువురొంపిలో దిగి
ఉభయ  భ్రష్టత్వమై ఉన్నవాడికి తప్ప,
లేనోడికి కొలువురాక నిరుద్యోగ గ్రహాలు పెరిగె
7.పౌరాణిక యితిహాసపు పునాది లేని సాహిత్యం
మనజాలదు కలకాలంకాలక్షేపం కాదు కవిత్వం
వాక్యం, కావ్యం, పద్యం, వ్యాసం
గేయం, కవిత, రూపకంయేదైనా  సృజన మీదే ఆధారం
లేకపోతే నేల విడిచిన సామై
లక్ష్యం లేని గమ్యమై
సాధనలేని రాగమౌతుంది!
8. ఎన్నికల పండగొస్తే
యెన్నికలలు పండుతాయో
ఓటుకింత రేటు
నోటికింత సాపాటు
గొంతులోకి సారాయి
గిట్టుబాటైతే చాలు
చిన్ని నాపొట్టకి శ్రీరామ రక్ష
దేశమేమైతే నాకేమి
నేను చల్లగుంటే చాలు
అదే నాకు పదివేలు!
9: ముక్తాయింపు:
కవి ‘ లో ‘
కవిత్వం ‘ హై ‘
కపిత్వం ‘ సై ‘
ఎవరికి యేం కావాలి?
నాకు మాత్రం కవితత్వమే కావాలి!
నికార్సయిన కవిత్వంతో పాటు.!
27.5.2013  6.23 pm

Sunday, May 26, 2013

అంతర్వేదన -కవిత్వం-మెరాజ్ ఫాతిమా

అంతర్వేదన -కవిత్వం-మెరాజ్ ఫాతిమా

అంతర్వేదన -కవిత్వం-మెరాజ్ ఫాతిమా   Image
           రచయిత్రి వివిధ పత్రికల్లో తన కవితల  ద్వార పరిచయమయి, ఈ మధ్య కాలంలో అంతర్జాల కవిత్వంలో తనదైన  స్థానాన్ని పొందటం గమనింవచ్చును. ఆమె కవిత్వంలో ఒక  స్త్రీ సహజమైన భావనలు,  అణచివేతకు గురౌతున్న సందర్భాలు,  వివిధ స్థాయిల్లో వారి అలోచనలు, బాల్య, యౌవన, కౌమార, వార్థక్యాలు, తదనంతర జీవన సహజ పరిణామాలు ఊహలు, మానసిక సంఘర్షణలు, అనురాగాలు, అనుభవాలు, ఆప్యాయతల లేమి, ప్రేమ, భావ కవిత్వ ధోరణి చక్కగా అక్షరీకరించడంలో సఫలం చెందారనటంలో యెటువంటి సందేహంలేదు.  అంతర్వేదన  కవితా సంకలనాన్ని రెందు భాగాలు చేయటంతోనే ఆమె తన సాహితీ కృషీవలత్వం కనబడుతోంది.   స్త్రీ సహజ సమస్యలే కాక, సామాజిక స్పృహ కలిగిన కోణాన్ని కూడ ఆమె స్పృసించింది.  లోక రీతులు, సమాజ స్థితిగతులు, అన్యాయం, దోపిడి, వివిధ వ్యవస్థల్లోని లోపాలు యెత్తిచూపటంలోనూ  విజయం సాధించింది, తనదైన గొంతుకతో.
             పుస్తకానికి ముందుమాటలోనే  రాచపాళెం  చంద్ర శేఖర రెడ్డి, కితాబు పొందటమే ఒక గీటురాయి, వారి మాటల్లో ”ఆమె నిర్మించిన పదాల చతురత సహజ సౌందర్యమైనవే, కాక అందరికి అర్థమయ్యే లలిత పదాల సొబగులున్నాయని, కఠిన శిలా సదృశమైనదిగా కాక, మృదు మధురంగా, లాలిత్యంగా వున్నాయని, తనదైన కవితా నిర్మాణ కౌశలత కేవలం  ఫాతిమా సొంతమని, ఆమె శిల్పం ఆమెదే ” నని అన్నారంటే అంతకంటే కవికి ప్రోత్సాహం ఇంకేం కావాలి, మరొక కావ్యాన్ని ఆరంభించడానికి?
   
             మరొక సాహితీ  ప్రముఖుడు శాంతి నారాయణ అనునయ వాక్యాల  ద్వారా ఆమె కవిత్వం యేపాటిదో   మనం ఒక అవగాహనకు రావొచ్చును.  ప్రత్యేకంగా అమెను  నిత్యం ప్రోత్సహించి, మెచ్చుకోలు దీవెనగా ” ప్రవహిస్తున్న  లావా, ఫాతిమా కవిత్వం “  అన్నారంటే అదే పెద్ద సర్టిఫికేట్….సాహిత్యంలోకి తొంగి చూడ్డానికి ఫాతిమాకి ఈ కావ్యం వొక కొత్త గవాక్షం. ఈ గవాక్షం ద్వారా ఆధినిక తెలుగు కవిత్వమార్గాలనూ, గమనాలనూ, కాంతులనూ దర్శించి ముందుముందు తనదైన కవితా స్థానాన్ని సుస్థిరపరచుకోవాలని కోరుతూ కొత్తగొంతును ఆశీరభినందమలతో, సమాదరించడానికి మనలనందరిని కోరారు.
           మొదటి ప్రకరణంలో 42 : కవితలు
మాయావిలో:- ” గొంతునుండి గుబులు బయటకు రానీక/మాటలకు మమకారపు రంగు వేస్తుంది/యెదురుపడి వేదనను వెళ్ళగక్కే సమయానికి/అభిమానపుటాభరణం అరువుగా యిస్తుంది
గెలిచిన స్వప్నంలో :-” హంస వడగట్టిన పాలవు నీవు, హింసను వీడిన పరమ హంసవు నీవు ”  అంటుంది.
సఖా హాలికా!:- ” యువత – విద్యాలయాలు, విదేశాల బాట పడితే/యువరాజులా ధరణి ఎదపై దరఖాస్తు పెట్టుకుంటావు/హలంతో పొలం పుటలు తిరగేస్తూ/విత్తనాల అక్షరాలు ముచ్చటగా చల్లుతూ” రైతును సఖుడుగా పేర్కొనడం మట్టిని ప్రేమించే తత్వం, ” మరీ కృషీవలుడైన నీకు కులకాంతను కావాలి/ సఘజీవివైన నీకు సహచరిని కావాలి ” అనట ఆమె
నిరాడంబర  ప్రణయ తత్వం రైతుయెడ కలిగివుందని మనం ఆనందపడవలసిందే. సాహిత్యం కూడ సేద్య సమానమేకదా! అది  సాహితీ నైజంగా ఫాతిమా వ్యక్తీకరణకు నిర్వచనంగా నిలిచినందుకు మన:పూర్వకంగా చదివిన వారు అభినందనలు తెలుపవల్సిందే!
 చిన్నారి:- బాల్యాన్ని మనముందు పరిచారు ” నా నట్టింట నడయాడే చిన్ని దేవతవు నీవు/బ్రహ్మ సృష్టివి నీవు/ మాకు జన్మనిచ్చే ప్రతి సృష్టివినీవు ” కసుకందుల యెడ అభిజాత్యపు తల్లి ప్రేమను ఆవిష్కరించారు కవయిత్రి.
ఒక్కసారి:- ఎదురుచూపులు దాచుకుంటూ దొరికిపోయిన, నీ తడబాటునూ – చూడనీ ఒకసారి/కోటి వీణలు మీటినట్లు నీ పలుకు కంఠాన్ని దాటి రావటం విననీ ఒక సారీ’  యెదురుచూపులోని తన్మయత్వం పరిచారీ కవితలో.
మరీచిక:-”ఎదలో వున్నాను, వెతుకమన్నావు/ మది గదిలోవున్నాను, బతుకమన్నావు/ పగలంతా నా అడుగులకు తడబాటువై/రేయంతా నా పలవరింతల అలవాటువై” భావుకత చక్కగా పండింది.
అద్వైతం:- ” నావూహలకి ఊపిరివి/ నా ఊసులకి సరిగమవి ” చక్కటి పద చిత్రీకరణ.
సాక్షులు:- ఎలా వుంటారో ” హంస  కనలేదా మన అలకని/ హరిణి వినలేదా మన అలసటని ” అడిగమంటుంది ఫాతిమా ఈ కవితలో
నా చెలికాడు:- ” కలతలేని ఆ నిరాడంబరం/ కళ్ళెం లేని ఆ దానగుణం/ శత్రువుని యెదిరించే ఆ శూరత్వం/ యెల్లలు చెరిపేసే ఆ ధీరత్వం…కల చెలికాడు కావాలి ,,,చేపట్టిన వాడు కావాలి అలాంటి వానితోనే జీవన యానమంటుందీ రచయిత్రి….ఎందరికా భాగ్యం కలుగుతుందో కదా!
ప్రకృతి కాంత లందరిని మన యెదుట క్యాట్ వాక్ చేయించారు తన కవిత ‘ ప్రకృతి కాంత ‘ లో
నామది : ఆవిష్కరిస్తూ  ” నీ నిరశన రుచి చూచిన నా మది/అడవిగాచిన వెన్నెలలా,  నీ విరహం రుచి  చూచిన నా మది /వెన్నెల యెరుగని సోమునిలా
నీ ఆగమనం చూచిన నా మది/నర్తించిన మయూరం లా …..తన మది అవస్థలను చక్కటి కవన మయూర నృత్యంలా చూపెట్టారు.
మార్పు: అక్కడక్కడ అస్తవ్యస్తంగా వున్నా ఒక విస్పోటన ధృతి కనబడుతుంది తెలుగు కవితా హారానికి ఒక ఆంగ్ల పద తోక తగిలించి.  (కొంచెం హడావుడి పడినట్లు కనబడుతుందీ కవితలో..ఇంకా చిక్కగా రాయవచ్చు, నా సూచన మాత్రమే…యిలాగే వుండాలనే నియమం లేదనుకోండి)మొత్తానికి బావుంది
నిన్నేమనుకోను! నిన్నేమనుకోను? ( యేదైనా గుర్తు పెట్టితే యింకాఆకర్షణీయంగా వుండేది) ” దిగులు  సంద్రాన మునిగిన నాకు, చిరుహాసంలా చేరువయ్యావు!/పట్టుకొని అధరంపై అడ్డుకునేలోగా.. నిట్టూర్పువై నిష్క్రమించావు!”
అనడంలో భావం చక్కగా త్యోదకమయ్యేలా పాదాల విన్యాసం జరిగింది.( అక్కడక్కడ అక్షర దోషాలు ప్రూఫ్ లో సరిచూసుకోవలసివుంది)
తోడు:- అనే కవితాప్రారంభంలో ” మాసిపోయిన పసితనం/మరచిపోయిన హసితం/రుతువులు మారుతున్న వేళ/మనసున నాటుకున్న ముళ్ళు ” చక్కటి యెత్తుగడతో నడిచింది చివరిలో..” నీవే నా సాహసానివి, నీవే నా సైన్యానివి/ నీవే నా గతివీ – నీవే నా ధృతివీ”  సంప్రదాయకతపై తనకున్న విశ్వాసాన్ని ప్రకటించింది ఫాతిమా.
బంతిపూల బాసలు :-గ్రామీణ వనిత పట్నమెళ్ళిన పతికై యెదురుచూస్తూ ” నండూరి యెంకి ని గుర్తు చేసేలా చక్కటి జానపద యాసను సమపాళ్ళలో రంగరించిన ఫాతిమా- నిరీక్షీంచే  పడతి మానసిక అంతర్వేదనని   కొట్టవచ్చినట్టు కవిత్వీకరించింది.
అంతర్వేదన:-కవితా సంకలనానికి తలమానికమైన కవిత  ” జీవన పయోనిధిలో అంతరంగ రతంగాల ఆటుపోట్లను, ఎదుర్కొనే వోటు పడవనై,  నిరంతరం నీ ధ్యాసలో అలమటిస్తూ  ఆఖరి శ్వాస వరకు నీకై నిరీక్షించే అభిసారికనై, సమస్యలూ, సంధిగ్దాలూ, అనుమానాలు, అలసటలు, బాధలు, బాధ్యతలు, కష్టాలు, కలతలూ, వెతలు వేదనలూ,యేమీలేవనుకే  భవితాకాంక్షనై, బ్రతికేయాలనుకునే భావుకురాలై దోసిట అక్షరాలతో మోకరిల్లుతున్నా ” అంటు తనదైన కవితావేశం, నికార్సైన భావుకతను తెరచిన పుస్తకంలా ప్రతిపాదించింది కవయిత్రి నిజాయితీగా. చదవబోతూ రుచి  యెందుకుకాని ఇంకా   మొదటి  ప్రకరణంలో , అంతర్లాపి, ఎలా చెప్ప్ను, ఎంత బావుంటుంది, పూవనిలో ఆమని, ప్రతిస్పందన, అందని ప్రేమ, అతివ అంతరంగం, కల, స్వప్న కెరటం, అరణ్య రోదన, అనుకోని అతిథి, అంతరాన, నిరీక్షణ, నీ తలపుల్లో, శ్వేతపత్రం, ఎప్పుడొస్తావు, నిన్నే తలచుకుంటూ, భావన, ఓదార్పు , ఏమి చెప్పను, ఇలా చేస్తాను, మనసా కవ్వించకే. వ్యథ, దీపపు పురుగు, కోకిల మొదలగు కవితలున్నాయి.
               ఇక రెండవ ప్రకరణంలో 23 కవితలు మనల్ని పలుకరిస్తాయి. మొదటిగా ” మట్టి మనిషిని ” అన్న కవిత యిటు పాఠకుడ్ని, అటు విమర్శకుడ్ని కట్టిపడేస్తుంది. నేటి రైతు బతుకెలా అధ్వాన్నమయిందో కళ్ళకు కనపడేరీతిలో యెన్నో భావ చిత్రాలు, పద చిత్రాలు కనులముందు కదలాడి హృదయాన్ని కదిలిస్తాయి, కంటిని చెమరింపచేసి అందుకు కారణభూతమైన సర్కారును, వికటింపచేసే ప్రకృతిని , మోసపూరిత వ్యాపార వ్యవస్థను నిర్మొహమాటంగా తూర్పార పట్టిన తీరు ” హాట్సాఫ్ ‘  ఫాతిమా అనిపిస్తుంది!  అంతే కాదు  చక్కటి భావ చిత్రాలు, పద చిత్రాలున్నాయి ఈ కవితలో ‘  నారుమడులన్నీ పసుల పోరగాడి తొర్రి పళ్ళలా  నంగి నవ్వులు నవ్వుతూ నన్నెక్కిరిస్తున్నాయని ‘ అనే ఉపమానం హైలట్! ముఖ్యంగా  ”మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలో పాకి, మట్టినే కప్పుకుని, మట్టిలో కలసిపోయే పేదరైతును – నీ ఆకలి తీర్చటం తప్ప అన్నెంపున్నెమెరుగని అమాయకపు అన్నదాతను ” అందుకు నిలువెత్తు నిదర్శనమై ఆలోచింపచేసే కవితాపూర్వక ప్రశ్నల పరంపర ప్రతీ కవితలో మనకు కనపడతాయి. ‘ బందీ ‘  అనే కవితలో ; ఇంతకీ  నీ వెవరూ? నీకైనా తెలుసా?…….ఓడిపోతూ, క్రుంగిపోతూ, ఒక బంధం కోసం వేయి బంధాలముందు /ఓడిపోయిన అవిజేయుడివి ..జీవితాన్ని కుదువపెట్టిన వివాహితుడివి! ” ఆరోజు వస్తుంది” అనే కవితలో భవిష్యత్తుపై నమ్మకాని వ్యక్తపరిచిన తీరు, ‘ అతుకు అక్షరం ‘ లో బడికి, జీవిత పాఠశాలకి మధ్య వారథి  అక్షరమంటుంది ఫాతిమా ‘ తోలు బొమ్మలు ‘ శ్రమైక జీవులు బతుకు పోరాటంలో వారు ఆగ్రహిస్తే దోపిడిదారుల పునాదులు పెకిలిస్తారు అనే హెచ్చరిక, ‘ఏం చేద్దాం ‘ అంటూనే    …’ఆడపడుచులను ఆదుకోవాలన్న ఆలోచన రావాలి, అప్పటివరకు నేనిలా ఘోషిస్తూనే వుంటా ‘- అనే భరోసా ‘ దీన దీపికలు ‘,  ‘ నీ..నా’ ,తో పాటు   ‘ గురువు ‘ లో- ఆచార్య దేవో భవ  స్థానం  పూజార్హమని,మనమెన్నటికైనా’ కన్నీటి చారిక ‘ తుడవాలని ‘ గ్రంథం’ పదిమందికి దారి చూపాలని, ” నాణేనికి ఆవలి జీవితం ” వుందని అది  ‘ కంటి దోషం ‘ కాకూడదని, నిరంతరం ‘ మౌన రణం ‘ చేయాలని, యెల్లపుడు ‘ పాప నవ్వు ‘  హాయి కలిగించాలని,  ”కలలకి ఆకారమయిన చిరుమొలకని, కష్టాల కొమ్మకి చిక్కుకున్న గాలిపటానివి ” అంటూ  ‘ నిరుక్త ‘ అనే కవితలో రాసినా, ” ఆశ ” గా వ్యథలు నిందిన మనస్సు, యెదిగే వయస్సు, యెన్నాళ్ళు యీ తపస్సు, వస్తుందా నేనాశించిన ఉషస్సు ” అని తలపోసినా, ” అంధకారం అలముకోకముందే, అవివేకాన్ని అణిచివేద్దాం, వెలుగు వివేకాన్ని ఆహ్వానిద్దాం” అంటూ ” నవజీవనం ‘ కొనసగాలని కోరుకున్నా, ” ఇస్తున్నారా ? దోస్తున్నారా? దాస్తున్నారా? అని చెండాడుతూ ఇదండీ నేను నిత్యం చూసే (మీకు చూపే) కరెంట ‘ ఫైర్స్‌’ చదరంగాన్ని వ్యంగంగా చెద రంగమంటూ, పదాల తూటాలతో హెచ్చరిక చేసినా ప్రశాంతంగా,సామరస్యంగా  ‘ నివేదన ‘ అందించినా,  అక్కరలేని బిడ్డలను కని కడతేర్చే సామాజిక వ్యతిరేక  అకృత్యమేమిటని ‘ శిశుగీతా” న్ని ఆలపించినా మూర్తీభవించిన మాతృవేదన, సహజమైన స్పందన కవిత్వంలో తొణికిసలాడినా,
” మదిచింతన ” చేసినా,  ” ఎవరు దోషుల”ని  నిలదీసినా,….ప్రతీ కవితలో, ప్రతీ పాదంలో ఫాతిమా అక్షర విన్యాసం,
పదాల పరుగులు మనల్ని (పాఠకుల్ని) నిరంతరం వెంటాడుతూ ఒక సంతృప్తికరమైన, న్యాయమైన అంతర్వేదనని కలిగిస్తుంది.     మరింత బిగువైన, దిటవైన, నికార్సైన  ప్రక్షాళనకు నాందికాగల మరొక సంకలనాన్నీ చి.సౌ. ఫాతిమా మెరాజ్ నుండి మనసారా కోరుకుంటూ, చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ…….
                                              కవితాభినందనాశీసులతో
                                              కపిల రాంకుమార్, ఎం.ఏ., బి.యిడి,
                                              బి.వి.కె.   గ్రంథాలయ నిర్వాహకుడు,
                                              ( సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు )
                                              సుందరయ్య భవన్‌ ఖమ్మం
                                              507 002  : 9849 535 033  26.5.2013

కపిల రాంకుమార్|| నకిలీలలు||

కపిల రాంకుమార్|| నకిలీలలు||

దొంగ తొడుగు
తగిలించుకుని
ముఖపత్రంలో
అవాకులు చవాకులు రాసే వారు
కుప్పలు తెప్పలుగా పుట్టుకొచ్చి
నికార్సయిన కవనం
పచనం కాకో
వారికి వంట పట్టకో,
భాష, భావం జీర్ణించుకులేని
కుహనా కవులు కొందరు,
అసూయ, ఉక్రోషాలతో
పచ్చి బూతుల పంచాగంతో తమ (ప్ర)వచనంగా
బురదచల్లే ప్రక్రియ
నిరాఘాటంగా కొనసాగిస్తూ
అర్థం కాని పదాలకి
వక్రభాష్యం చెబుతూ
పది మంది వందిమాగధులను వెంటేసుకుని
స్వైరవిహారం కావిస్తూ
స్నేహానికి కళంకం తెచ్చే
పుకారుల తేరుపై షికారు చేస్తూ,
దుర్వాసన వ్యాప్తింప చేస్తూ
‘ ఎయిడ్స్‌ ‘ కంటే ప్రమాదకారులవుతూ
వ్య్వస్థను భ్రష్టు పట్టిస్తున్నారు
వారికి నచ్చనివారి కవితలను ఇష్టపడితే
రంకు అంటకట్టచూస్తారు
మౌనంగా వుంటే
స్పందనలేని వారికింద
జమకట్టి నపుంసకులంటారు.
బట్టతల మోకాలికి జడలల్లి
రోత పుట్టిస్తారు.
పైపెచ్చు జాగ్రతలంటూ
హెచ్చరికలు జరీచేస్తారు
అవినీతి రాజకీయ అభిమానులుగా
తమను తాము పరిచయం చేసుకొని
గోడలమీదా రాస్తామంటారు
మాతో పెట్టుకుంటే పచ్చడౌద్దంటూ
తొడగొ్ట్టి తోక జాడిస్తుంటారు
ఎదురుదాడిని తట్టుకోలేక!
నీతులు వల్లిస్తూ,
గురివింద గింజలా తమ క్రిందనున్న
నలుపుని కప్పిపుచ్చుతూ
ఎంత ఎర్రగా వున్నామో అని
కృత్రిమ సోషలిస్టు వాదనలతో
కంఠ శోష పెడుతుంటారు.
తెలుగు కవిత్వంలో
ఓనమాలుకూడ రాని బోగస్ పండితుల్లా
గ్లోబల్ ప్రచారం చేస్తూ నలుగురిలో
ప్రముఖంగా కనబడాలని
వంటిమీద ఆచ్చాదనలు లేకుండా
టాటూలతో అందాల భామల్లా
మీసాలు లేని మగధీరుల్లా
కయ్యానకి కాలుదువ్వుతూ
ఎదురుదెబ్బ తగలగానే
పలాయనం మంత్రం వల్లిస్తూ
మరొక రూపంలో
మరొక వేదికపై
కసువులూడుస్తూనే
కసుగాయలమమంటారు
పిస్నిగొట్టు యెత్తుగడలతో
అసలురూపం భౌతికంగా చూపే దమ్ములేక
యెల్లినో మల్లినో అడ్డుపెట్టుకొని
కాలం వెళ్ళబుచ్చుతారు
ఎప్పుడో ఒకప్పుడు కాల గర్భంలో కలుస్తారు!
నకిలీల లీలకు – కీలెరిగి శీలలు కొట్టకపోతే
లోకాన్నంతా  మాచేతిలోని లోలకం మంటారు
తస్మాత్ జాగ్రత …..
నకిలీ లీలలు కనిపెట్టి
మసలండి!
 26.5.2013 సాయంత్రం 4.27

Wednesday, May 22, 2013

||కొడవళ్ళై కదలాలి||

కపిలరాంకుమార్||కొడవళ్ళై కదలాలి||

ఎంతమంది మొత్తుకొన్నా,
వింతగానే చూస్తున్నారేం? కాక యెవడికీ యెక్కినట్లులేదు !
బాడకావు నాకొడుకులందరు గద్దెనెక్కిచచ్చారు కదా!
గుడ్డినాకొడుకులు , చెవిటి ముందాకొడుకులు!
మన్ను తిన్న పాములా, తన్నులుతిన్నా సిగ్గులేక
చూరు వట్టుకుని వేళ్ళాడే గబ్బిలాలు
ఎడ్డిమొకం సర్కారు ఒక్కెల్లి /
నడ్డి విరిగినా కిమ్మనని జనమొక్కెల్లి
ఛా! యే బతుకులురా మనయి!
తినటానికిగతిలేదు, - మనటానికి గతిలేదు,
నేత గజబబిజైతే - బట్టకటలేము
నేతలు గబ్బునాకొడుకులైతే - బతికి బట్టకట్టలేము !
**
66 యేండ్ల సంది యిదే తంతు
ఐదేళ్ళ పథకాల ఫలితాలు -
బయలుదేరినపుడు నిండు బండి
అడంగుచేరేటప్పటికి -
సడలిపోయి, చిరిగిపోయి, -
చక్రాలూడి, తొట్టికర్రలిరిగి
దేనికి పని కిరాని చందమైందని -
ఉభయపక్షాలు ఒప్పుకుంటూనే
అధికారమున్నప్పుడు - లేనప్పుడు ఒకలాగ -
పట్టించుకోరు -అందుకే వారు అంధులు! బధిరులు!
.ఆడది - ఏడదైనా, ఆడదైనా, ఈడదైనా,
ప్రాంత, భాషా బేధాలు లేని ఆ అకృత్యానికి
ఏడేళ్ళదైనా, ఏదు పదులదైనా, ఆడదైతా చాలులే అనే
సాకుతో కుతి తీర్చుకునే నాయాళ్ళకి ,
బిడ్డ, చెల్లి, తల్లి యాదుండరా?
పశు పక్ష్యాదులకున్న కనీస యింగితం లేని
దేహ జిలగాళ్ళా, మేహగులగాళ్ళా
అర్థంకాని మానసిక శాస్త్ర విశ్లేషణక్కూడ అందని
నీతి తక్కువ పని నిత్య కృత్య అత్యాచారమై,
రావణకాష్ఠాన్ని మించిపోతుంటే చోద్యం చూ డడమేనా?
'A' సర్టిఫికేట్ కంటే సుపీరియర్ సీరియల్ గా
దృశ్యమాద్యమాల చిత్రీకరణ విసుగొస్తూంటే అరికట్టే వారే లేరు!
అదొక ఆనందమా? డార్విన్ విశ్లేషణకు వక్ర భాష్యామా?
అందుకే కామోసు ,
యేతావాతా,
కమ్మదనం తగ్గిపోయి కనుమరుగౌతోంది
కాపుదలకు,
యేపుదలకు,
పాదుపోసేవారులేక
అదును,పదును అందక ,
చదునుకు భూమి దొరకక దిగాలుగా
యెడ్డెమొగాల సర్కారు -
జిడ్డు వదిలించుకోక మరింత పూసుకొని-
బురదలో దొర్లే పందిలా
తోకలు ఆడిస్తూ జనాల ధ్యాసే లేకుండా
ఖజానాలనింపే ఊసే యెప్పుడూ
జనానాల వద్ద తమ పరువు కాపాడుకోవాలికదా!
పరుపుమీద పడుకోవాలి కదా!
లేక పోతే బోజనం బందు ,
ముక్క బందు,పక్క బందు
స్వార్థం మాటున యే ఘాటు నిర్ణయానికైనా సిద్ధం!
రెండునాలుకల ధోరణి కాకపోతే యేమిటీ
జగన్ బయటకొస్తే సాక్ష్యాలు తారుమారవుతాయట
కళంకితులు సచివాలయంలోవుండే మాయమంత్రం చేయలేరా!
వారు లోపలెళ్ళకూడదట! చెవుల్లో పూవులు పెట్టుకున్నామా! మనం?
ఏ నేతతో విందు జాతరలో, యే నేలలో మందు పాతరలో
రోజూ -అయారాం గయారాం నాయకులతో
పునాదులు కదులుతున్నా
మొకరాలు చెదలుపట్టి కూలుతున్నా
శిఖరాన జెండా నిరాఘాటంగా ఎగుర్తోందని
సంబరపడుతున్నా యే భూకంపమో,
కాగిన నివేదికల
తాకిడ్కో ఇంద్ర భవన కూలబోతోందని గ్రహించరా?
అడ్డగోలు అనుమతుల ప్రభావమే వడగాలిలా,
సుడిగాలిలా,
తుఫానులా ,
మరో సునామీ వచ్చి
ఈ బినామీ గాళ్ళ భరతం పట్టేదాకా కళ్ళుతెరవని-చేతకాని,
చేత కానిలేని
చేవలేని సర్కారు
చేతిబలం చూసుకొని మురుస్తోంది
కాని నిద్రబోతున్న జనం
ఆ చేతిమీద తమ చేతితో
ప్రలోభాలకు లొంగక
ఓక్క గుద్దు గుద్దారో
శంకరగిరి మాన్యాలు పట్టాల్సిందే
ఆ ప్రజావెల్లువకోసం
కలాలు, కొత్త గళాలై
బిగించిన కొడవళ్ళై కదలాలి!
________________________________________________
(19.5.2013 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం - సాహితీ స్రవంతి నిర్వహించచిన జనకవనంలో చదివినది.)

Wednesday, May 8, 2013

ఆనందాచారి దీర్ఘ కవిత '' స్పూర్తి శిఖరం

BVK LIBRARY
7.5.2013 ఆనందాచారి దీర్ఘ కవిత '' స్పూర్తి శిఖరం '' పుస్తక పరిచయం చేస్తున్న డా. సీతారాం
=https://soundcloud.com/bvk-libra/7-5-2013?utm_source=soundcloud&utm_campaign=share&utm_medium=facebookfacebook

Tuesday, May 7, 2013

|''ఇంకొమ్మ ''||

కపిల రాంకుమార్||''ఇంకొమ్మ ''||

నాన్న ఇంకొమ్మని ( ఇంకో అమ్మని) చూపినప్పుడు
మా బుగ్గలపై కన్నీరింక మరింత ఉబుకొచ్చింది!
నెమ్మదిగా బెరుకు తీరి దగ్గరవటానికి ఆమె!
చేరాలా వద్దా సందేహాలతో మేము!
దగ్గరవుతున్నా మనుకున్నంతలోనే
ఇంకొమ్మ సీమంతానికి పుట్టింటికెళ్ళింది.
నీళ్ళాడినావిడ పొత్తిళ్ళలో బాబుతో తిరిగి
మా వద్దకే వచ్చింది!
చానాళ్ళ తరువాత మాతో ఆడుకోటానికి
తమ్ముడొచ్చాడని సంబరమైంది
ఎంత కొత్త భాద్యత వచ్చి పడినా
తమ్ముడితో సమానంగా మా
ఆలనా పాలనా తానే చూసింది!
మా తోబుట్టువులం ముగ్గురం మగ, ఇద్దరు ఆడ .
ఐతేనేం వాడితో కలిపి ఆరుగురం కలిసిమెలిసేవున్నాం!
మాకు పెళ్ళిళ్ళు అయినాయి-పిల్లలు కలిగారు
వాళ్ళు మాట్లాడం మొదలెట్టినతరువాత
ఆమె నాయనమ్మైనా ..అందరూ ' ఇంకొమ్మ ' అంటూనే పిలిచేవారు
ఆవిడ పెద్దదైంది...కాలంతో పాటు అవ్వ అయింది
అయినా ఇంకొమ్మ గానే ఊరూ పిలిచేది!
కొద్దికాలానికే ఆమె గంగా భగీరథీ సమానురాలైంది
మేము నాన్ననీ కోల్పోయాం!
మేమెమ్వరమైనా గ్రామాంతరం వెళితే
తాను ఇంటికి తాళం కప్పలా అతుక్కుని ఉండేది.
మా ఇంట మంచి చెడుల్కు ఆమె పెద్ద దిక్కు
యెంతమందికో ఆమె దీవెనలిచ్చింది,
పెళ్ళిళ్ళు చేసింది-పురుళ్ళు పోసింది
మునిమాపు వేళ ఊడల మర్రిపై దెయ్యం ఉంటుందన్న,
భయాలనెవరైనా వ్యాపింపచేస్తే,
పిచ్చి తండ్రుల్లారా అదేం లేదంటూ,
పదండి! దాని భరతం పడదామంటూ
మూఢనమ్మకాల్ను కొట్టిపారేసేది!
ఇంటి చాకిరీతో ఆమె చదువు అటకెక్కి పుష్కరాలు దాటినా
ఆడపిల్లల్ని సైతం చదివితీరాల్సిందే అని అందర్ని
ప్రోత్సహించింది! కాలచక్రం లో మరో కొన్ని బాదావత్సరాలు దొర్లాయి.
కాలం నైజం గమనమే కదా
ఒకరోజు ఆమే తలాపు దిక్కుకు దీప పెట్టారని తెలిసి
కర్ణం గారి ఇంకొమ్మ గారు కాలంచేసారట చూసొద్దం పదండి! అంటూ
తిరునాలగా వచ్చారు, ఇసుకేస్తే రాలనంత చుట్టుపక్కల నాలుగువూళ్ళ జనం!
ఆ వీధిలో వెళ్ళే ప్రతీ బాటసారి ఆమె చేతి దాహం తాగిన వారే
అరుగుమీద పీటవేసుకుని వచ్చేపోయేవారందరిని పిలిచి
చల్ల తాగి దాహం తీర్చుకోరా సన్నాసీ అంటూ ఆప్యాయంగా అందించిన
మజ్జిగ లోటా, తరువాణి కుండకి కూడ పూలదండ వేసి
తమ భక్తిని చాటుకున్నారు!
శోక సముద్రంగామారిన శోకపుటలల్ని చూస్తే
యెంతటి కరుకు రాతిగుండె ఇట్టే కరిగిపోవాలె!
ఇంకొమ్మ గారి లేని లోటు యెవరు తీర్చగలరు?
డొక్కా సీతమ్మలాగ యెంతమందికి కడుపు నింపిందో
ఆ మాటలు చాలు, ఎన్ని కోట్ల ఆస్తులుంటే సమానమౌతాయా ఆమె
అనుబంధానికి ఆప్యాయతకి!

7.5.2013 సాయంత్రం 6 గం.

(కొత్తమ్మ చదివిని తరువాత -మమతల మందారం మా ''ఇంకొమ్మ '' గుర్తుకొచ్చింది
కొత్తమ్మ స్వభావాలు వేరు - ఇంకొమ్మ గారి స్వభావం వేరు. ఆ అమృత ధార తాగిన అనుభూతికి
కవితా రూపం! ఇది పోటి కాదు, పేరడీ అంతకంటే కాదు ఒక స్మృతి కవిత మాత్రమే)