Saturday, April 27, 2013

| మీ కోసం||

కపిల రాంకుమార్|| మీ కోసం||

సామాన్యుడి గొంతులో రాగం లేదు
పేదవాడి బతుకులో జీవంలేదు
తెలుసుకోని మసలుకోను -తెలివిగాను బతుకగాను
అచ్చరాల బాటలోన – వెలుగుపాట పాడనిదే !

పీడితుడని తాడితుడని బుజ్జగింప చూసేరూ
హరిజనుడని, గిరిజనుడని ముద్దుపేరు పెట్టేరు
వెనుకబడిన జాతంటూ తమవెంటే తిప్పేరు
అడుగు ముందుకేయగా ఆదుగునకే తొక్కేరు ..1

మీ బాగు కోసమే మేమున్నామంటూ
సొరకాయ కోతలు చెరుపలేవు రాతలు
రాజ్యాంగం అందించిన సౌకర్యాలందకుండా
అడ్డుపుల్ల వేయుటలో దొడ్డబుద్ధి దొంగలు! .. 2
విగ్రహాల స్థాపనకు – స్మారక సభలకు
సావనీరు ముద్రించి మైల స్నానం చేసే్రు
చిత్తశుద్ధిలేని వారి వెనుకబడుటేలర!
విద్యనేర్చి తెలివిపొంద ముందడుగు వేయవేల …3

ఊరి చివరి కాపురాలు, స్వేచ్చలేని పావురాలు
ధనస్వామ్యపు కోరల్లో మాటాడని కోయిలలు
పరిసరాల పరిశుభ్రం మీ శక్తుల నైపుణ్యం
మీ కోసం గొంతు కలిపి మీరంతట అడుగనిదే …4

ఋతువులెన్ని మారినా బతుకులేమి మారవులే
అప్పువాత పడకుండా తిప్పలింక తప్పవులే
మీ పిల్లల ఆరోగ్యం -మీ బతుకున సమతుల్యం
బినామీల పేరు మీద కైంకర్యమవుతుంటే …. 5

మీ పేరున నిధులన్ని దొడ్డి దారిమళ్ళకుండ
ఊరేగే చట్టానికి గట్టి కాపలా లేకుంటే!
సామాన్యుడి గొంతులో రాగం లేదు
పేదవాడి బతుకులో జీవంలేదు!
27.4.2013

No comments: