Monday, October 6, 2014

కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||

కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||
1. 
అత్యాశ అధ:పాతాళానికి నెట్టినా
ఆశచావని మూఢులు
జ్యోతిష్యుడేదో ప్రవచించాడని
చొక్కాలు చించుకొని
విగ్రహాల విధ్వంసానికి పాల్పడినపుడు
వజ్రాలు దొరకలేదు సరికదా
కృష్ణజన్మ స్థానం మాత్రం దొరికింది!
చెప్పినవాడు పారిపోయాడు పత్తాలేకుండా!
ఇలాంటి మూఢ విశ్వాసాలను అరికట్టాలి
వారసత్వ సంపద కాపాడుకోవాలి!
**
2.
చట్టాలెన్నివున్నా
నిర్భయంగా
అత్యచారాలు
తామర తంపరలుగా అవతరిస్తూనేవున్నాయి!
అమాయక శీలాలేకాదు ప్రాణాలు అంతరిస్తూనేవున్నాయి!
**
3.
అబ్బో! ఓ నినాదాన్ని ఒకటి
మోసుకొచ్చి వీధులు ఊడ్చటంకాదు
రాజకీయ అవినీతి అతిరథుల వీధులు క్షాళన చెయ్యండి!
ఎన్నుకోబడిన నేతలలోని
నీతిలేని నేర చరితుల్ని ఊడ్చిపారేయండి యిప్పుడైనా!
తిరిగి యే చట్టసభల్లోను అడుగిడకుండా పూడ్చిపెట్టండి!
అప్పుడే '' స్వచ్ఛమేవ జయతి ''
పత్రికల్లో ఫొటోలు కాదు - ప్రతిదినం పాటుపడాలికదా!
**
4.
ప్రత్యేక యింక్రిమెంట్లు, వేతన సవరణలు ఎంత ముఖ్యమో
అవినీతికి దూరంగావుండి ప్రజాసేవ చేయడమే ముఖ్యం కదా!
చేతుల్ని మలినం చేసుకుని
చేతల్ని నాశనం చేసుకుని
మచ్చతెచ్చే పనులెందుకు?
ప్రజల ఉసురు తీయుటెందుకు?
కనీసం యిప్పుడైనా ఆలోచించరా?
కేటాయింపులు చేయగానే సంబరపడక
వాటాలకోసం గడ్డి తినకుంటేమేలు కదా!
ప్రజా ప్రతినిధులెంతమంది వున్నారన్నది కాదు
ప్రజల ప్రతీ నిధిని కాపాడాలికదా!
**
5.
ఆర్భాటాలకు విందు వినోదాలకు దుబారా కంటే
కనీస మనుగడ సాగించలేని
దారిద్ర్య రేఖ క్రింద నలుగుతున్న వారికి
చేయూతనివ్వండి!
వైద్యం కంటే ఆరోగ్యం ముఖ్యం కదా
సర్కారుదా, ప్రైవేటుదా అనికాదు ముఖ్యం!
స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన తాగునీరు
పోషకాహారం దొరికేలా చేయండి చాలు!
పాలకులెవరైనా సలాం కొడతా!
నిర్లక్ష్యం చేస్తే ఇలాగే చివాట్లు పెడతా!
**
6.
నచ్చని విగ్రహాలు తొలగించడమంటే
సాంస్కృతిక వారసత్వాన్ని కించపరచటమే
విశ్వవిఖ్యాత సంగీత సాహిత్యకారులు
ఏ జాతివారైనా ఎక్కడివారైనా అభినందనీయులే!
గుర్తించిన మహానుభావులందరి స్మారక విగ్రహాలు నిలపండి
నిగ్రహం కోల్పోయి విగ్రహాలకు గ్రహణం పట్టించకండి!
ఆలయాలెక్కడున్నా దర్శించికుంటూ గౌరవించినట్లు
ముఖేముఖే సరస్వతి అన్నట్లు
ప్రతిభ ఎవరిదైనా అభినందనీయమే
వివిక్షత ఎవరిపైనైనా ఖండనీయమే!
**
అక్టోబర్‌ 2/6.10.2014

No comments: