Wednesday, October 29, 2014

కపిల రాంకుమార్|| ప్రకృతి -మనిషి ||

కపిల రాంకుమార్|| ప్రకృతి  -మనిషి ||

పిడక, పుడక ఒకనాటి
వంటింటి ఇంధనాలు
ఆరోగ్యకర వంటకాలు
పిడకల దాలిలో కుండలో కాగిన పాల రుచి
ఆ తోడుపెట్టిన మీగడపెరుగు కల్పిన అన్నం
అందులోకి ఆవకాయబద్ద
నిమ్మపండంత వెన్నముద్ద
ఆహాఁ అది అమృత తుల్యమే కదా!
**
మట్టి గోడలు, అరుగులు 
పేడ అలుకుతో, ముగ్గుల అల్లికలమధ్య
అందమైన కుఢ్యాలను మించేవి కదా!
ఇప్పుడా పేడను అసహ్యయించుకుంటే
గ్రామీణ సంస్కృతిని అవమానపరచినట్టే!
మన మూలాలను సమూలంగా పాతిపెట్టినట్లే!
పశువులకొట్టంలోఊడ్చిన గడ్డి పేడ
ఎరువుల కుప్పై
పేడకళ్ళకు యింత ఊక కలిపి
గోడకు కొట్టిన పిడకై
కన్నెపిల్లల ఆటలలో '' గొబ్బెమ్మ ''
ఒక సాంస్కృతిక చిహ్నం
ఈ ధనుర్మాస ఆరంభం నుండి
మకర రాశిలో సూర్యుని పాదం మోపే భోగివరకు
సాగే సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యమై
భోగి మంటల సెగలో వెలిగే
బాల్యపు ఆనందం మరువలేనిది!
**
కాలం మార్పులతో అదొక ఆదాయ వనరై
గ్రామ పంచాయితీల పేడ వేలంపాటల పాలై
అపురూప వస్తువైంది!
మనదోడ్లో వరకే దాని మీద హక్కు!
బజారున పడితే గుత్తే దారు వశం!
ఒక రకంగా గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది
పరిసరాల శుభ్రత అందులో దాగుంది కూడా!
పెంట వేసి పంట అడుగమన్న పొలానికి
దొడ్లో ఎరువుకుప్ప అధారం కదా!
ఇంధన వనరుల లోటులో కట్టెలు దొరకటం

కనికష్టం అవుతున్నప్పుడు ఆ ఎరువుకుప్పే
గ్యాసునుత్పత్తిచేసే గోబర్ ప్లాంటవుతూనే
మిగిలినది పొలానికి బలాన్నిస్తోంది!
ఆ గోడకేసిన పిడకే వంటకే కాదు
మన అంతిమ సంస్కారానికి ఆధారమై
ఆజ్యమై ఛితాభస్మరూపంలో నీటిలో కలుస్తోంది!
మట్టికి మనిషికి - పేడకి పిడకకి
అవినాభావ సంబంధం!
**
28/10/2014

No comments: