Wednesday, October 8, 2014

బతుకమ్మా ఓ బతుకమ్మా

...బతుకమ్మా ఓ బతుకమ్మా
    నీబతుకు నీవే దిద్దుకోవమ్మా!
    కొమ్మలా పూల రెమ్మలా,
    పూలపండ్ల పొదరిల్లులా
    నీడలా జగతినాదుకునే
    మమతల గోడలా బతుగవ్వు
    బతుకవే, బతికించవే
    చితికిపోయే బుజ్జి
   బతుకమ్మలకమ్మవై!

బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

పుడమి కాలిడిన నాటినుండి
ఎడమ చూపుల బాధనుండి
ఆడపిల్ల వంచు అడ్డగింతల నుండి
పాబందీ సంకెల తొలిగిపోయేదాక
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

మొక్కుబడి ముచ్చట్లు
చెవికుట్టు సంబురాలు
మూడేళ్ళ ముగియ
మొట్టికాయల బతుకున
పరుగుల అడుగుల
కడుగడుగు అడ్డాలు
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

ఆట పాటలలోన అపరాధ వర్తనలు
ఆంక్షల ముళ్ళకంచె దాటి,
అకాంక్షల మల్లెబాట పట్టేలా
పాతకాలపుటలవాట్లు మాని
పోరుబాట నడిచేలా    
బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

చదువు సంధ్యలకు తాళాలు వేసి
ఇంటి పనులంటూ నిలువరించేరు
నలుగురిలో తిరుగరాదంటూ
పదుగురిలో నవ్వరాదంటూ
లంగావోణి తగిలించి
లంకణాలు చేయించి
ఎదుగుదలకు వంకలు పెడుతూ
బంధాల గదిలోన ఒంటరిని చేస్తారు!    
 
// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

మనసులోని మాట పైకి రానీక
కళ్లలో నీళ్ళు కుక్కుకుంటేను
మునుముందు మనుగడ కష్టాలే తల్లి
తెలియకుండానే మనువాడమంటారు
ఆలంచనల స్వేచ్ఛను నిలిపివేస్తారు
బలిపశువును చేసి మారాడనీకుండ
తాళితో ముడిపెట్టి కాళ్ళకు బంధాలు వేస్తారు
నీ ఆశలు నెరవేర మగనికి ఎదిరించa
నీ లోని చైతన్య భావాలు ఎదుగ      
        
// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

సంసార సంద్రాన మునిగి
పిల్లల కోడివై,  నీరసించకుండ
బాగోగులకైన వంతెనవ్వాలంటే
నీదైన గొంతు నినదించవలెనమ్మా
మగువంటే వంటింటి కుందేలు కాదని
తెగువుంటే దేశాన్ని నడిపించు నేతని
తెలిపేటి  రీతిలో అడుగులేయవమ్మ
జూలుదులిపి సమరశీలవతివై        

 // బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

అచ్చోసిన ఆబోతులు
పిచ్చెక్కిన కుక్కలు
ఉచ్ఛనీచాలు మరిచి
కుళ్ళ బొడుస్తాయి
అడ్డుకునే చట్టాలకు
చుట్టల తాకిడికి
మూగవైనావంటే
చట్టాలు నీరుకారు
ఎన్నాళ్ళని బాధపడతావు!

// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                    
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //


వెతలు లేని బతుకు కొరకు
చదువొక్కటే ఆయుధమ్ము
గతులు మార్చగ పోరుబాట
అనుసరించ కర్తవ్యమ్ము
అనునిత్యం జరుగుతున్న
అక్రమాల నెదిరింప
కొంగుముడిలో పిడికెడు ధైర్యం
గుండెనిండ ఆత్మవిశ్వాసం
పొందగాను సమర మార్గం
అనుసరించి, అనుకరించి, కొనసాగవమ్మ

// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

No comments: