Sunday, October 19, 2014

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమకుట్టినట్టైనాలేదే?
చీదరించుకుంటావెందుకు
దోమలుకుట్టి విష జ్వరాలకు
గిరి జనాల పానాలు పాడెక్కుతుంటే
సోద్యం చూస్తూ వైద్యం మరిచారేం?
అయినవారికి ఆకుల్లో
కాని వారికి (కాసులు కలిగిన వారికి)
(వెండి)కంచాల్లో 
విందు భోజనాలు వడ్డించే సంస్కృతి నుండి
తేరుకోనంతవరకు
జనసామాన్యపు మెప్పు పొందలేవు సరికదా
చెప్పు దెబ్బలు తినవలసిన అగత్యం పట్టేను సుమా!
నీరులేక జీవాలు బతకొచ్చేమో కాని
పంటచేలు చచ్చిపోతాయన్న
యింగితంలేకపోతే యెలా?
పారుదలకు, ఎత్తిపోతలకు సాధనమైన
విద్యుత్‌ సరఫరా లేక
వొట్టిమాటలై, వల్లకాడులు నింపటానికా?
మంత్రులకు, శాసన సభ్యులకు నజరానాలు కాదు
కడుపు కాలుతున్న  రైతన్నలకు చేయూతనివ్వు!
అల్లకల్లోలం కాకముందే
అలమటించేవారిని ఆదుకోలేకపోతే
బంగారు రాష్ట్రం మాట యేమో కాని
అధికారం శంకరగిరి మాన్యాలు పట్టవచ్చు!
తిట్టానని  కోప్పడటంకాదు - గట్టు దిగి కళ్ళుతెరిచి చూడు!
వాస్తవం ఎంత గబ్బుకొడుతున్నదో చూడు!
తదనంతరం నీ జబ్బునెలా కుదురుస్తుందో తెలుసుకో!
నిటారుగా నిక్కబడి చూడటంకాదు -
కాస్త వంగి వాస్తవంలోకి తొంగిచూడు!
నేలపైన చూపులు సారిస్తేనే
కాస్త సోయ కలుగుతుందేమో!
చల్లారిపోతున్న సంసారాల కమురువాసన
ముక్కుకు సోకుతుందేమో!
అప్పటికైనా నీకు జ్ఞానోదయం కలుగుతుందేమో!
నిజం యెప్పుడూ చేదే మరి
ఆ చేదుతో కాని ఉన్నరోగం పోదని తెలవదా?!
నేలవిడిచి సాము చేయకు బాబూ!
కాస్త గెలిపించినవారినీ పట్టించుకోకపోతే
కాల గర్భంలో కలిసిన రాజకీయ పార్టీల్లా
నీకూ అదే గతి! అదే సారూ అధోగతి!
తస్మాత్‌ జాగ్రత ....రుగ్మతలు తగ్గాలంటే
ఆహారంతో పాటూ వ్యాయామమూ కావాలి!
ప్రజాసేవచేయటానికి మనుగడ ముఖ్యం కదా!
తదుపరి కర్తవ్యం నీదే
దానికి ప్రతి స్పందనే మాది!
18.10.2014



No comments: