Friday, April 26, 2019

||కపిల రామ్‌కుమార్‌||మనసేమీ బాగోలేదు||
మనసేమీ బాగోలేదు
ప్రతీనోట ఇదేమాట!
జెండర్ తేడాలేదు
ధనిక బీద వ్యత్యాసమసలే లేదు!
ప్రతీ నోట అదే పాట!
సర్కార్ల నిర్వాకం వల్లనే ఈ గతి!
జనాలకేదో మేలు చేస్తారనే దురాశతో
అమ్ముడుబోయి వోట్లు వేశాంకదా!
దాని పర్యవసానమే ఇది.!
''చౌపట్ రాజా అంథేరీ నగర్'' తీరు!
బ్యాంకులు కొల్లగొట్టుకెళ్ళినవారు
నిక్షేపంగానే వున్నారు
విదేశాల్లో విహారం చేస్తూ!
ఇక్కడే ఫణం దొరకక
పడిగాపులుకాస్తూ
తద్దినాలు పెడుతున్న సంగతి మాత్రం పట్టదెవరికి!
మబ్బులు కురవవు –
పంటలూ పండవు -
ఇక కైలూ కాదు –
ఆ పైన ధరా రాదు!
చదువులు సాగవు - కొలువులు రావు –
నెలవులు నిలవవు
శీలాలపై ఎక్కడో అక్కడ ప్రతీ క్షణం
శీలలు దిగబడ్డ ఆర్తనాదాలూ ఆగవు
సవాలు చేదామనుకున్న
ప్రతీ పురోగమన ఉద్యమాలని
శవాలుగా మార్చడమే
రాజ్యహింస ధ్యేయం కదా!
ఎవడు తలెత్తుకుని తిరగలేడు
ఎవడు ఎదిరించి బతకలేడు
చావుని చంకనబెట్టుకోకలిగితేనే ధైర్యమున్నట్లు
లేదా అందరూ పిరికివాళ్ళే
మనలో మనకు పరాయివాళ్ళే
మహోధృతంగా బహుజన వామపక్ష ఐక్యతే
ఈ రాబోయే వడగాలులకెదురు తిరిగేది!
కాబోయే కాలం కలిసొస్తుందని
గుర్తించి అడుగేయందే
బడుగుల బతుకుల్లో వెలుగు రాబోదు!
మనసున్న మనుషులుగా మనగలగాలంటే
ఆ దారి దొరకబుచ్చుకోవాల్సిందే
అప్పటిదాక
ఎవరి మనసు బాగోదు
మన మనసు బాగుకోసం
మన మనుగడకోసం
ఇకనైనా ఎత్తరా నీ కలాన్ని, గళాన్ని,
ఎగిరే అరుణపతాకం దారిలో
నీ అడుగు కదపరా!
ఆ గమ్యం చేరేలా కదలిరా!
//కపిల రాంకుమార్..//చెట్టు//
ఎన్నాళ్ళు పెంచుతావో చూస్తనంది
పండ్లనివ్వలేదని విసుక్కోకంది
నీళ్ళు పోయలేక సాకులు వెతక్కంది
ఆకులు రాలిపోతుంటే...
వయసైపోయిందేమోనని అనుమానపడకంది
కాలానికి తగ్గట్టు చిగురెడతానని ఆశించమంది
కాకులు చేరి గోల చేస్తున్నాయని కోపంగా చూడకంది
కిలకిలరావాల పక్షులు చేరినపుడానందించమంది.
కాదు కూడదంటే నీ మనుగడేవుండదంది
***
కాలం మారటం కాదు
మనుషుల మనసే మారిపోతున్నకాలమిది
పచ్చదనం సహించలేరు
కాయలున్నచెట్టుపై రాళ్ళేస్తారు
కొమ్మలునరికి నిప్పు రాజేస్తారు
పొరుగువాడి మనసు చెడగొట్టి
చెట్టును పడగొట్టాలని తొడగొట్టుతారు
***
చెట్టునేమిచేదాం....
ఆలోచించు నేస్తం.
సాకుతావా
చావుకు సాగిలపడతావా.
ఆలోచించు. నేస్తం.
అవలోకించు.
కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||
అట్లతద్ది ఆటల్లో
చెట్టుకొమ్మన ఊయల్లో
బాల్యపు ఊసూలెన్నో కలబోసుకుంటూ
మగ ఆడ తేడలేకుండాచెట్లమ్మటి గుట్లెమ్మటి
తోసుకుంటూ గిచ్చుకుంటు
ఊహతెలియని జతకట్టుకుంటూ
వాగులెమ్మటి ఇసుకలో దుదుంపుల్లలాడుకుంటూ
అమ్మా నాన్నలాడుకుంటూ
గువ్వలమై ఎగిరిన రోజులు
గునగునమంటూ యాదిచేస్తుంన్నాయి!
**
పండుగలకు పబ్బాలకు
కలసికట్టుగ సామాగ్రితెచ్చిన రోజులు
తొక్కుడు బిళ్ళ, గుడుగుడు కుంచం గుండేరాగాలాడిన రోజులు
ముక్కుడు గిల్లులాట, చేలగట్ల పరుగులెత్తిన రోజులు
కలువపూలకోసం ఒక గుంపు
తామరపూల కోసం ఒక గుంపు
పోటీపడి ఈదులాడిన రోజులు
**
దీపావళి ఉప్పు పొట్లాలు
గోగుకాడ దివిటీలు
నాగులచవితికి దాచుకున్న రోజులు
కార్తీకపున్నమికి ఎగరేసిన తారాజువ్వలు
పోటీపడి కాల్చిన రోజులు
**
పరీక్షల హడావుడికి
కొత్త కలాలకోసం దెబ్బలాడుకున్న రోజులు
ఉదయాన్నే చద్దన్నంలో ఆవకాయతో వెన్నముద్దలేదని
గడ్డ పెరుగు పోయలేదని మారాము చేసిన రోజులు
పుస్తకాలు ముందేసుకుని
ఒకరికొకరం వల్లెవేయించుకున్న రోజులు
**
మాయదారి వయసులొచ్చి
లంగావోణీల్లో ముద్దబంతి పూవులైన నేస్తగాళ్ళతో
ఆ ఆటలు బందయినా
స్నేహ బంధం నిలుపున్న రోజులు
ప్రేమలు దోమలు అంటూ చదువు చెడకొట్టకండంటూ
పెదనాన్న మందలింపులు
చిన్నత్త సలహాలు, చెవి మెలిపెట్టి తీయించిన గుంజీలు
**
ఇక ఉద్యోగాల్లో కొందరు
ఇతరేతర వ్యాపకాల్లో కొందరు
చెల్లా చెదరైనా
వయసు పక్వానికొచ్చి అత్తారింటికి కొందరు
పిల్లలతో కుటుంబాలతో బిగించబడినా
సంవత్సరానికొకసారైనా కలసి నెమరేసుకున్న రోజులు
ఉత్తరాలు రాసుకునేవాళ్ళం
తరువాత ఫోనులు చేసుకునేవాళ్ళం
ఇక యిపుడైతే మెసేజీల పాలై
ఆనాటి అనుబంధాలు దూరమైనట్లనిస్తుందని
సరోజ, సుజాత, వెంకటీ, కృష్ణమూర్తి
ఫేసుబుక్కులో మొత్తుకున్నారు
**
ఆ రోజుల్లో జాజిపందిరికింద కందిరీగ కుట్టి
ఒక కన్ను పోయిగోలపెట్టిన గౌరి
పొలంగట్టున చెట్లకింద ముంజెలు తింటూ గట్టుజారిపడి
విరిగిన కాలుతో వెంకటి
కళ్ళముందు మెదిలే ఎల్లని, నల్లని మబ్బుదొంతరల రోజులు
గుర్తుకొస్తుంటే మసక కళ్ళను కన్నీరు కడుగుతున్నది
మనవళ్ళతో పాత అస్పష్ట జ్ఞాపకాల తెర!
కపిల రామ్‌కుమార్ || మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?||
మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?
'' అన్నదాతా సుఖీభవ ''
కంచం ముందు చేయికడిగినప్పుడల్లా
యాది చేసుకుంటున్నది సత్యం!
సుఖ జీవనమన్నది మృగ్యముతున్నదీ నగ్న సత్యం!!
**
వరైనా, మరేదైనా
దినదినగండం నూరేళ్ళాయుసులా
పంట కొరకెన్ని తంటాలో
పెంట వేస్తే పంటొస్తాది
అది సాగు ధర్మం
ఎరువులు బరువులై విత్తులకు
ఎత్తుల చిత్తులలో
మిత్తి మీదేసుకుంటే
చివరకు నెత్తి మీద గుడ్డకూడ మిగలదేమి?
పుట్టుదలకొరకు కాళ్ళరిగినా
పుట్టినదానికి చెలక తనఖాపెట్టితేకాని
సాలిరవాలు దుక్కులు
అదును పదునుకోసం దిక్కులు చూడక తప్పదు
మడినారు వడలిపోవుండా
ఆకుల ఆశ్రమం కట్టి సాదుకుంటేనే
తరుణ వయసులో మొక్కనాటితేనే
పూత, పింది కాయలొచ్చేది
ఆకు ముడత రాకుండా సశ్యరక్షణ్ చేసి
కైలు చేయ కూలీల వెతుకులాట
మండే ఎండలు, ధరలు పోటీలో
తనూ కుటుంబంతో చేయి వేస్తేనే
ఎర్రబంగారం గంపల చేరి
కళ్ళంలో తివాసీగా మారేది.
రంగు పోకుండా పెళపెళ మన్నపుడే
మంచుపదునులో గోనెలోకి చేర్చాఅలి
మొదటి కాత కొచ్చేది నాణ్యమైనదే అయినా
మార్కెట్‌ మాయాజాలంలో రవాణా మోతతో
గిట్టేదెంతో, చేతిలో పడేదెంతో
గుమ్మంకాడే కాసుక్కూచున్న షావుకారి వాటాపోటే
మిగిలేనో లేక
మడిసి మాత్రమే కుమిలేనో ?
ప్రపంచంలో ఉత్పత్తీ అయ్యే సరుకులన్నీ
తయారీ దారుడే ధర నిర్ణయిస్తే
ఈ ధరలో మాత్రం రైతు ఉత్పత్తికికి మాత్రం
ధర నిర్ణయ హక్కెందుకు లేదో
ఆ పెరుమ్మాళకెరుక!
తులనాత్మక ఆదాయం రాక
తులాభారంలో మొగ్గలేక
తలాపున దీపమెట్టించుకునే
గతికి కారణమెవరు?
శ్మశానాలలో ఖాళి లేక పెరటిలోనే
భస్మమయ్యే వ్యవసాయ కమురు కంపు
ముక్కుకు సోకలేదా?
రైతు నిష్క్రమణలకు ఎవరిని శిక్షించాలో
పంట అనుభవదారులూ తేల్చి చెప్పండి
అన్నం తిన్నపుడె కాదు
నిత్యం సుఖీజీవుడుగా రైతును బతికించండి!
ఎర్ర బంగారం/ తెల్ల బంగారం
కళ్ళార చూడలేక కళ్ళు మూసేసుకుంటున్న
కల్లం యజమాని గోడు పట్టించుకోండి!
పశ్చాత్తాపానికి పాతికేళ్ళు
ఔను
ప్రేమలో ఐదేళ్లు మునిగి
అసాధ్యపు కోరిక వలన
అలిగింది తను
ప్రేమించడం నా వల్లకాదు
చూసుకుంటా వల్లకాడు.
అంటూ మరలిపోయింది మరులు వదిలేసి
**
దాదాపు పాతికేళ్ళ అనంతరం
అనుకోకుండా కలసి
నేనలా కోరుకోవడం తప్పనుకుంటానంది
ఔను
నిజమేనేమో..
మారుమాటలేకుండా మాయమైంది తనేకద..
ఆలోచనలో పడ్డాను
ఉంటాను...అంటూ ఈయన తప్పిపోయిన
మీ తాతయ్యలే..
ఆయన లేడు ఈయనవున్నాడు
కేవలం స్నేహితుడుగా
..అని తన మనుమరాలుతో చెప్పి..మళ్ళీ మాయమైంది అప్పటిలాగే ...
ఎప్పటికీ అర్థంగా ప్రేమతత్వంలా.......4/2019
||కళ్ళు తెరు కవీ||
కొందరు అనధికార శాసనకర్తలిపుడు
అయోమయంలో పడ్డారు
స్వీయభద్రత కోల్పోయి
కులమతాల ఉన్మాదాల దెబ్బకు
దిక్కుతోచక కూడలిలో కూలబడ్డారు
కుదేలైపోయిన చందాన
ఆ బురద వరదలో కొట్టుకుపోవాలా?
సొంత గొతు పెగల్చుకుని సర్కారుపై శంఖమూదాలా?
జనాలకోసం కలాలు ఝళిపించాలా?
లేక కులాల మతాల మతలబులను యెలా మట్టుబెట్టాలా
అనే సందేహంలో తమ దేహాలను తాకట్టు పెట్టారు!
**
నరంలేని నాలుక విసిరే
అమ్మనా బూతులకు
అంగాలకు తొడుగులేసుకుని
కనబడ్డ యోనులపై అక్కసు కక్కుతున్న
భహిర్భూమి వ్యభిచారులమధ్య
మెదళ్ళు మొద్దుబారి, అకృత్యాల దృశ్యాలు చూడలేక
కళ్ళు మూసుకునే పళ్ళుకొరుకుతున్నారు!
కవీ కళ్ళు తెరు - కుళ్ళు కడుగ
మెతకబడి లొంగిపోవడం కంటే
తిరగబడి ముందుకుపోవడమెలా అని
తేల్చుకోవాల్సిన అగత్యమేర్పడినదన్నది నగ్న సత్యం కదా!
**
ఎటు నీ పయనం కవీ
గాలికి కొట్టుకుపోవడమా
ఎదురీది ..
సహితయోర్భావ: సాహిత్యమని
జనహితమై అడుగేయటమా యోచించు!
ఆలస్యం చేస్తే నువ్వే మట్టికొట్టుకు పోతావ్‌!
సూర్యుడు చూడలేనిది సైతం
కవి చూడగలడన్నది నిజమైతే
మౌనం వీడు బాణమై కదులు...1.4.2019
ఎప్పుడు ఆశ్చర్యపడాలంటే....
ఏరోజైతే...ఏ మొగ్గనలపబడనపుడు,
ఏ శ్వాస నొక్కబడనపుడు,
ఎక్కడా ఆర్తనాదం వినబడనపుడు...
విశ్వకవీ...నీ కోరిక..
ఈ భువిలో. నెరవేరనిదే.....
క్షమించు...
కపిల రాంకుమార్||తస్మాత్‌ జాగ్రత||
నమ్మకాలు అమ్మకంపెట్టిన
దగాకోరు నాయకుల చేష్టలకు
దిక్కుతోచని కోయిల మావిచివుళ్ళు దొరకక
మౌన విషాద రాగమాలపిస్తోంది!
ఎవడెప్పుడు యే పార్టీలో వుంటాడో తెలవదు
యే రోటికాడ యే పాట పాడతాడో,
యే రోత నింపుతాడో తెలియదు!
నిన్నటిదాక తిట్టిన నోటితోనే
నేటినుంచి పొగడాల్సిన దౌర్భాగ్యానికి
అడ్డ నామాలు చెరిపి, పంగనామాలు ధరించి
పచ్చి వ్యభిచార రాజకీయానికి అలవాటుపడ్డ
నేతల చెడ కారు కూతలకు వంతపాడాలేక
మౌనం వహించిందేమో!
నోటుకు ఓటు యేమైందో?
గోడదూకే పిల్లులపై వేటేమైందో?
మరుగునపడిందో, మురుగులో పడిందో!
పాత గుర్తు మరువలేక, కొత్త గుర్తు పలుకలేక
ఇబ్బంది పడే ఊచరైవెల్లులెందరో
నాలుక కరుచుకుంటూనే వున్నారు!
ప్రజా సమస్యలు పట్టవు
స్వలాభమే ముఖ్యంగా తిమ్మిని బొమ్మినిచేయడంలో
ప్రపంచ రికార్డ్‌ మన నాయకులది!
పెంటమీది ఈగలకైనా యింగితముంటదేమో కాని,
ఫిరాయింపు కంపునేతలకు ఫినాయిలే యింపైన ఔషధం!
చేసే వాగ్దానాలు పేలపిండి తీరు
గెలిచిన మర్నాడు పదవి మత్తులో బేజారు!
**
కక్కుర్తిపడి అమ్ముకుంటె
ఐదేళ్ళు అనుభవించాల్సిందే
అడిగే హక్కుండదు
కడిగే దిక్కుండదు
నీ విజ్ఞతకే వదిలేస్తా
నీ చేతిలోనే నీ భవిత! నిలుపుకుంటావో
బతుకు మలుపుకుంటావో!
వికారి నామ వత్సరంలో
కోయిల మౌనం వహించింది!
ఎన్నికలలో కోయిలలు మాత్రం
అపశృతులే మీటుతున్నాయ్‌!
తస్మాత్‌ జాగ్రత ! జాగ్రత!
6.4.2019 ఉదయం 11.45 కవి సమ్మేళనంలో చదివినది
కపిల రాంకుమార్‌|| ఓ సాయంత్రం ||
ఓ సాయంత్రాన్ని
భుజాన వేసుకుని,
పంజాగుట్టా చౌరస్తా దాటి, మైత్రీవనం దగ్గరకు రాగానే,
''వాలిపోతున్న సూర్యుడు చీకటిపడుతుంటే
ఏ మెహంది బజారుకుకు నీ పయనం!?
అని ప్రశ్నించినట్టు
సాయంత్రం నా భుజాన్ని గోకుతోంది!
మాటాడకుండానే
అడుగువేస్తుండగానే
ఫ్లైఓవర్‌ పక్క కిషన్‌ చాంద్ పాన్‌ షాపు
రమ్మని సైగ చేస్తున్నట్టుగా
మెరిసే కలర్‌ లైట్లు కన్నుగొట్టిన చందాన
నా కాళ్ళను లాగేసాయి
అలవాటుగానే ' బగర్‌ కత్తా, ఆర్కె కిమామ్‌ ' ఆర్డర్‌ చెప్పడం
అలవోకగానే పాన్‌ నా చేతికి అందటం జరిగింది
**
రెండు అడుగులు వేసానో లేదో
ఎవరిదో తీయటి స్వరం పేరుపెట్టి ఆపింది!
దగ్గరకు వస్తున్న గుర్తుగా
ఒంటి పెర్ఫ్యూమ్‌ నా ముక్కుపుటాలను గిలిగిలిగింతలు పెడుతోంది!
రూప నా ఎదురుబడి, మారుమాటనే సందివ్వకుండానే
'' నాతో వస్తున్నావంతే - తాతా'' అంటూ
చేతులుపట్టుకుని లాక్కెళ్ళుతోంది
ఇపుడు మాత్రం భుజం మీద సాయంత్రం సైలెంటయింది!
రికార్డ్‌ చేయాలేమోనని!
రూపా బ్యూటీ పార్లర్‌లోకి నా అడుగులు లాగబడుతున్నాయ్‌
ఎలర్ట్‌ అయ్యాను!
ఆగాను!
అనుమానమూ వచ్చింది!
అడుగు వెనక్కి వేదామంటే ఏదో అవరోధం
ఓ రెండు గుండేలు నా వీపును నొక్కేస్తూ నిలువరిస్తున్నాయ్‌!
చేతులు విదిలించుకునే వీలులేకుండా
ఆ పిల్ల చంకల్లో యిరుక్కుపోయి నడుముకు నాగాభరణమైనాయి!
ఇప్పుడు నేను త్రిశంకుణ్ణేమో?
'' తాతా - కంగారుపడకు పదినిముషాల్లో పంపిస్తాంలే!
పెద్దవాడివి కదా! మర్యాద చేదామని '' అదేశంలా ఆ పిల్ల
గొలుసులతో కట్టిన బందీనినేను!
అంతే
ఆసాంతం నన్నిద్దరు ఒక్కుదుటున ఎత్తుకుని
రివాల్వింగ్‌ కుర్చీలో ప్రతిష్ఠించి
పిల్ల నా కాళ్ళకు దండం పెట్టగా
మరో మగువ నా బుగ్గ ముద్దిచ్చింది
ఆశ్చర్యపడటం నా వంతు!
ఆబందించడం వారివంతు!
వారిరువురి చేష్టలకర్థం అగమ్యం!
చల్లని చిన్న టిన్‌ బీరు ఇస్తూ
'' తాతా ఆ మాత్రం మర్యాద చేయాలి కదా'' అంది
చేతులుపట్టుకుని లాక్కొచ్చిన కానిస్టేబులులాంటి పిల్ల
'' నిన్ను చూడగానే
ఎన్నడో నన్నిడిచివెళ్ళిపోయిన
నా మావ గుర్తుకొచ్చాడంటూ''
తనివితీర ఆలింగనం చేసుకుకుని ముద్దాడినానంతే
భయం వద్దు !
ఏ సాయంత్రమైనా ఇటురావాలనిపిస్తే మాకు ఆనందం,
నీకు ఇలా సేద తీరుస్తాం '' అంది రెండో మగువ!
**
కొన్ని సందర్భాలలో ఊహించేది ఒకటి!
జరిగేది మరొకటి!
మసిపూసి మారేడు కాయ మరింకొకటి!
మాధ్యమాల మహత్తులిలాకూడ వుంటాయేమో అనిపించి
సెలవు తీసుకున్నాను అక్కడనుండి
'' చీకటి నల్లదుప్పటి విసిరితే - నీ సేవకు రాత్రిని అప్పగించి నే వెడుతున్నా
నీ గమ్యం చేరే క్యాబ్‌వచ్చింది - బై '' అంటూ
తుర్రున ఎగిరెళ్ళిపోయింది
నా భుజం మీది సాయంత్రం!
-------------------------
హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018 - శనివారం 21.4.2018 న చదివిన కవిత
किताबें कुछ कहना चाहती हैं.. ...
किताबें करती हैं बातें
बीते जमानों की,
दुनिया की, इंसानों की,
आज की, कल की,
एक-एक पल की, गमों की,
फूलों की, बमों की, गनों की,
जीत की, हार की,
प्यार की, मार की।
क्या तुम नहीं सुनोगे
इन किताबों की बातें ?
किताबें कुछ कहना चाहती हैं
तुम्हारे पास रहना चाहती हैं
किताबों में चिड़िया चहचहाती हैं
किताबों में झरने गुनगुनाते हैं
परियों के किस्से सुनाते हैं
किताबों में रॉकेट का राज है
किताबों में साईंस की आवाज है
किताबों में ज्ञान की भरमार है
क्या तुम इस संसार में नहीं जाना चाहोगे?
किताबें कुछ कहना चाहती हैं..
तुम्हारे पास रहना चाहती हैं।
किताबें कुछ कहना चाहती हैं..
किताबें करती हैं बातें
बीते जमानों की,
दुनिया की, इंसानों की,
आज की, कल की, एक-एक पल की,
गमों की, फूलों की, बमों की, गनों की,
जीत की, हार की, प्यार की, मार की।
क्या तुम नहीं सुनोगे इन किताबों की बातें ?
किताबें कुछ कहना चाहती हैं
तुम्हारे पास रहना चाहती हैं
किताबों में चिड़िया चहचहाती हैं
किताबों में झरने गुनगुनाते हैं
परियों के किस्से सुनाते हैं
किताबों में रॉकेट का राज है
किताबों में साईंस की आवाज है
किताबों में ज्ञान की भरमार है
क्या तुम इस संसार में नहीं जाना चाहोगे?
किताबें कुछ कहना चाहती हैं..
तुम्हारे पास रहना चाहती हैं।
------------------------------------------------------
సఫ్దర్‌ హష్మీ కవిత కితాబేఁ కుచ్‌ కహనా చాహతీ హైఁ.... కి స్వేచ్ఛానుసరణ - కవిసంగమం ఆర్చివ్‌స్ నుండి.
కపిల రాంకుమార్// అంతేగా//
ఆవేశం
ఆలోచనని చంపుతుంది
ఆలోచనే
వివేకాన్ని పెంచుతుంది
ఈ రెంటి నిరంతర ఘర్షణ లోనే
జీవనపయనం
ఒడుదుడుగుల అలలపై
అడగుల తడబాటును
సరిచేసుకుంటూ!
26.4.2019