Friday, April 26, 2019

కపిల రామ్‌కుమార్ || మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?||
మట్టి మనిషి మట్టిలోనే కలవాలా?
'' అన్నదాతా సుఖీభవ ''
కంచం ముందు చేయికడిగినప్పుడల్లా
యాది చేసుకుంటున్నది సత్యం!
సుఖ జీవనమన్నది మృగ్యముతున్నదీ నగ్న సత్యం!!
**
వరైనా, మరేదైనా
దినదినగండం నూరేళ్ళాయుసులా
పంట కొరకెన్ని తంటాలో
పెంట వేస్తే పంటొస్తాది
అది సాగు ధర్మం
ఎరువులు బరువులై విత్తులకు
ఎత్తుల చిత్తులలో
మిత్తి మీదేసుకుంటే
చివరకు నెత్తి మీద గుడ్డకూడ మిగలదేమి?
పుట్టుదలకొరకు కాళ్ళరిగినా
పుట్టినదానికి చెలక తనఖాపెట్టితేకాని
సాలిరవాలు దుక్కులు
అదును పదునుకోసం దిక్కులు చూడక తప్పదు
మడినారు వడలిపోవుండా
ఆకుల ఆశ్రమం కట్టి సాదుకుంటేనే
తరుణ వయసులో మొక్కనాటితేనే
పూత, పింది కాయలొచ్చేది
ఆకు ముడత రాకుండా సశ్యరక్షణ్ చేసి
కైలు చేయ కూలీల వెతుకులాట
మండే ఎండలు, ధరలు పోటీలో
తనూ కుటుంబంతో చేయి వేస్తేనే
ఎర్రబంగారం గంపల చేరి
కళ్ళంలో తివాసీగా మారేది.
రంగు పోకుండా పెళపెళ మన్నపుడే
మంచుపదునులో గోనెలోకి చేర్చాఅలి
మొదటి కాత కొచ్చేది నాణ్యమైనదే అయినా
మార్కెట్‌ మాయాజాలంలో రవాణా మోతతో
గిట్టేదెంతో, చేతిలో పడేదెంతో
గుమ్మంకాడే కాసుక్కూచున్న షావుకారి వాటాపోటే
మిగిలేనో లేక
మడిసి మాత్రమే కుమిలేనో ?
ప్రపంచంలో ఉత్పత్తీ అయ్యే సరుకులన్నీ
తయారీ దారుడే ధర నిర్ణయిస్తే
ఈ ధరలో మాత్రం రైతు ఉత్పత్తికికి మాత్రం
ధర నిర్ణయ హక్కెందుకు లేదో
ఆ పెరుమ్మాళకెరుక!
తులనాత్మక ఆదాయం రాక
తులాభారంలో మొగ్గలేక
తలాపున దీపమెట్టించుకునే
గతికి కారణమెవరు?
శ్మశానాలలో ఖాళి లేక పెరటిలోనే
భస్మమయ్యే వ్యవసాయ కమురు కంపు
ముక్కుకు సోకలేదా?
రైతు నిష్క్రమణలకు ఎవరిని శిక్షించాలో
పంట అనుభవదారులూ తేల్చి చెప్పండి
అన్నం తిన్నపుడె కాదు
నిత్యం సుఖీజీవుడుగా రైతును బతికించండి!
ఎర్ర బంగారం/ తెల్ల బంగారం
కళ్ళార చూడలేక కళ్ళు మూసేసుకుంటున్న
కల్లం యజమాని గోడు పట్టించుకోండి!

No comments: