Friday, April 26, 2019

కపిల రాంకుమార్‌ || అస్పష్ట జ్ఞాపకం||
అట్లతద్ది ఆటల్లో
చెట్టుకొమ్మన ఊయల్లో
బాల్యపు ఊసూలెన్నో కలబోసుకుంటూ
మగ ఆడ తేడలేకుండాచెట్లమ్మటి గుట్లెమ్మటి
తోసుకుంటూ గిచ్చుకుంటు
ఊహతెలియని జతకట్టుకుంటూ
వాగులెమ్మటి ఇసుకలో దుదుంపుల్లలాడుకుంటూ
అమ్మా నాన్నలాడుకుంటూ
గువ్వలమై ఎగిరిన రోజులు
గునగునమంటూ యాదిచేస్తుంన్నాయి!
**
పండుగలకు పబ్బాలకు
కలసికట్టుగ సామాగ్రితెచ్చిన రోజులు
తొక్కుడు బిళ్ళ, గుడుగుడు కుంచం గుండేరాగాలాడిన రోజులు
ముక్కుడు గిల్లులాట, చేలగట్ల పరుగులెత్తిన రోజులు
కలువపూలకోసం ఒక గుంపు
తామరపూల కోసం ఒక గుంపు
పోటీపడి ఈదులాడిన రోజులు
**
దీపావళి ఉప్పు పొట్లాలు
గోగుకాడ దివిటీలు
నాగులచవితికి దాచుకున్న రోజులు
కార్తీకపున్నమికి ఎగరేసిన తారాజువ్వలు
పోటీపడి కాల్చిన రోజులు
**
పరీక్షల హడావుడికి
కొత్త కలాలకోసం దెబ్బలాడుకున్న రోజులు
ఉదయాన్నే చద్దన్నంలో ఆవకాయతో వెన్నముద్దలేదని
గడ్డ పెరుగు పోయలేదని మారాము చేసిన రోజులు
పుస్తకాలు ముందేసుకుని
ఒకరికొకరం వల్లెవేయించుకున్న రోజులు
**
మాయదారి వయసులొచ్చి
లంగావోణీల్లో ముద్దబంతి పూవులైన నేస్తగాళ్ళతో
ఆ ఆటలు బందయినా
స్నేహ బంధం నిలుపున్న రోజులు
ప్రేమలు దోమలు అంటూ చదువు చెడకొట్టకండంటూ
పెదనాన్న మందలింపులు
చిన్నత్త సలహాలు, చెవి మెలిపెట్టి తీయించిన గుంజీలు
**
ఇక ఉద్యోగాల్లో కొందరు
ఇతరేతర వ్యాపకాల్లో కొందరు
చెల్లా చెదరైనా
వయసు పక్వానికొచ్చి అత్తారింటికి కొందరు
పిల్లలతో కుటుంబాలతో బిగించబడినా
సంవత్సరానికొకసారైనా కలసి నెమరేసుకున్న రోజులు
ఉత్తరాలు రాసుకునేవాళ్ళం
తరువాత ఫోనులు చేసుకునేవాళ్ళం
ఇక యిపుడైతే మెసేజీల పాలై
ఆనాటి అనుబంధాలు దూరమైనట్లనిస్తుందని
సరోజ, సుజాత, వెంకటీ, కృష్ణమూర్తి
ఫేసుబుక్కులో మొత్తుకున్నారు
**
ఆ రోజుల్లో జాజిపందిరికింద కందిరీగ కుట్టి
ఒక కన్ను పోయిగోలపెట్టిన గౌరి
పొలంగట్టున చెట్లకింద ముంజెలు తింటూ గట్టుజారిపడి
విరిగిన కాలుతో వెంకటి
కళ్ళముందు మెదిలే ఎల్లని, నల్లని మబ్బుదొంతరల రోజులు
గుర్తుకొస్తుంటే మసక కళ్ళను కన్నీరు కడుగుతున్నది
మనవళ్ళతో పాత అస్పష్ట జ్ఞాపకాల తెర!

No comments: