Friday, April 26, 2019

||కపిల రామ్‌కుమార్‌||మనసేమీ బాగోలేదు||
మనసేమీ బాగోలేదు
ప్రతీనోట ఇదేమాట!
జెండర్ తేడాలేదు
ధనిక బీద వ్యత్యాసమసలే లేదు!
ప్రతీ నోట అదే పాట!
సర్కార్ల నిర్వాకం వల్లనే ఈ గతి!
జనాలకేదో మేలు చేస్తారనే దురాశతో
అమ్ముడుబోయి వోట్లు వేశాంకదా!
దాని పర్యవసానమే ఇది.!
''చౌపట్ రాజా అంథేరీ నగర్'' తీరు!
బ్యాంకులు కొల్లగొట్టుకెళ్ళినవారు
నిక్షేపంగానే వున్నారు
విదేశాల్లో విహారం చేస్తూ!
ఇక్కడే ఫణం దొరకక
పడిగాపులుకాస్తూ
తద్దినాలు పెడుతున్న సంగతి మాత్రం పట్టదెవరికి!
మబ్బులు కురవవు –
పంటలూ పండవు -
ఇక కైలూ కాదు –
ఆ పైన ధరా రాదు!
చదువులు సాగవు - కొలువులు రావు –
నెలవులు నిలవవు
శీలాలపై ఎక్కడో అక్కడ ప్రతీ క్షణం
శీలలు దిగబడ్డ ఆర్తనాదాలూ ఆగవు
సవాలు చేదామనుకున్న
ప్రతీ పురోగమన ఉద్యమాలని
శవాలుగా మార్చడమే
రాజ్యహింస ధ్యేయం కదా!
ఎవడు తలెత్తుకుని తిరగలేడు
ఎవడు ఎదిరించి బతకలేడు
చావుని చంకనబెట్టుకోకలిగితేనే ధైర్యమున్నట్లు
లేదా అందరూ పిరికివాళ్ళే
మనలో మనకు పరాయివాళ్ళే
మహోధృతంగా బహుజన వామపక్ష ఐక్యతే
ఈ రాబోయే వడగాలులకెదురు తిరిగేది!
కాబోయే కాలం కలిసొస్తుందని
గుర్తించి అడుగేయందే
బడుగుల బతుకుల్లో వెలుగు రాబోదు!
మనసున్న మనుషులుగా మనగలగాలంటే
ఆ దారి దొరకబుచ్చుకోవాల్సిందే
అప్పటిదాక
ఎవరి మనసు బాగోదు
మన మనసు బాగుకోసం
మన మనుగడకోసం
ఇకనైనా ఎత్తరా నీ కలాన్ని, గళాన్ని,
ఎగిరే అరుణపతాకం దారిలో
నీ అడుగు కదపరా!
ఆ గమ్యం చేరేలా కదలిరా!

No comments: