Friday, April 26, 2019

కపిల రాంకుమార్‌|| ఓ సాయంత్రం ||
ఓ సాయంత్రాన్ని
భుజాన వేసుకుని,
పంజాగుట్టా చౌరస్తా దాటి, మైత్రీవనం దగ్గరకు రాగానే,
''వాలిపోతున్న సూర్యుడు చీకటిపడుతుంటే
ఏ మెహంది బజారుకుకు నీ పయనం!?
అని ప్రశ్నించినట్టు
సాయంత్రం నా భుజాన్ని గోకుతోంది!
మాటాడకుండానే
అడుగువేస్తుండగానే
ఫ్లైఓవర్‌ పక్క కిషన్‌ చాంద్ పాన్‌ షాపు
రమ్మని సైగ చేస్తున్నట్టుగా
మెరిసే కలర్‌ లైట్లు కన్నుగొట్టిన చందాన
నా కాళ్ళను లాగేసాయి
అలవాటుగానే ' బగర్‌ కత్తా, ఆర్కె కిమామ్‌ ' ఆర్డర్‌ చెప్పడం
అలవోకగానే పాన్‌ నా చేతికి అందటం జరిగింది
**
రెండు అడుగులు వేసానో లేదో
ఎవరిదో తీయటి స్వరం పేరుపెట్టి ఆపింది!
దగ్గరకు వస్తున్న గుర్తుగా
ఒంటి పెర్ఫ్యూమ్‌ నా ముక్కుపుటాలను గిలిగిలిగింతలు పెడుతోంది!
రూప నా ఎదురుబడి, మారుమాటనే సందివ్వకుండానే
'' నాతో వస్తున్నావంతే - తాతా'' అంటూ
చేతులుపట్టుకుని లాక్కెళ్ళుతోంది
ఇపుడు మాత్రం భుజం మీద సాయంత్రం సైలెంటయింది!
రికార్డ్‌ చేయాలేమోనని!
రూపా బ్యూటీ పార్లర్‌లోకి నా అడుగులు లాగబడుతున్నాయ్‌
ఎలర్ట్‌ అయ్యాను!
ఆగాను!
అనుమానమూ వచ్చింది!
అడుగు వెనక్కి వేదామంటే ఏదో అవరోధం
ఓ రెండు గుండేలు నా వీపును నొక్కేస్తూ నిలువరిస్తున్నాయ్‌!
చేతులు విదిలించుకునే వీలులేకుండా
ఆ పిల్ల చంకల్లో యిరుక్కుపోయి నడుముకు నాగాభరణమైనాయి!
ఇప్పుడు నేను త్రిశంకుణ్ణేమో?
'' తాతా - కంగారుపడకు పదినిముషాల్లో పంపిస్తాంలే!
పెద్దవాడివి కదా! మర్యాద చేదామని '' అదేశంలా ఆ పిల్ల
గొలుసులతో కట్టిన బందీనినేను!
అంతే
ఆసాంతం నన్నిద్దరు ఒక్కుదుటున ఎత్తుకుని
రివాల్వింగ్‌ కుర్చీలో ప్రతిష్ఠించి
పిల్ల నా కాళ్ళకు దండం పెట్టగా
మరో మగువ నా బుగ్గ ముద్దిచ్చింది
ఆశ్చర్యపడటం నా వంతు!
ఆబందించడం వారివంతు!
వారిరువురి చేష్టలకర్థం అగమ్యం!
చల్లని చిన్న టిన్‌ బీరు ఇస్తూ
'' తాతా ఆ మాత్రం మర్యాద చేయాలి కదా'' అంది
చేతులుపట్టుకుని లాక్కొచ్చిన కానిస్టేబులులాంటి పిల్ల
'' నిన్ను చూడగానే
ఎన్నడో నన్నిడిచివెళ్ళిపోయిన
నా మావ గుర్తుకొచ్చాడంటూ''
తనివితీర ఆలింగనం చేసుకుకుని ముద్దాడినానంతే
భయం వద్దు !
ఏ సాయంత్రమైనా ఇటురావాలనిపిస్తే మాకు ఆనందం,
నీకు ఇలా సేద తీరుస్తాం '' అంది రెండో మగువ!
**
కొన్ని సందర్భాలలో ఊహించేది ఒకటి!
జరిగేది మరొకటి!
మసిపూసి మారేడు కాయ మరింకొకటి!
మాధ్యమాల మహత్తులిలాకూడ వుంటాయేమో అనిపించి
సెలవు తీసుకున్నాను అక్కడనుండి
'' చీకటి నల్లదుప్పటి విసిరితే - నీ సేవకు రాత్రిని అప్పగించి నే వెడుతున్నా
నీ గమ్యం చేరే క్యాబ్‌వచ్చింది - బై '' అంటూ
తుర్రున ఎగిరెళ్ళిపోయింది
నా భుజం మీది సాయంత్రం!
-------------------------
హైదరాబాద్‌ ఫెస్ట్‌ 2018 - శనివారం 21.4.2018 న చదివిన కవిత

No comments: