Friday, April 26, 2019

||కళ్ళు తెరు కవీ||
కొందరు అనధికార శాసనకర్తలిపుడు
అయోమయంలో పడ్డారు
స్వీయభద్రత కోల్పోయి
కులమతాల ఉన్మాదాల దెబ్బకు
దిక్కుతోచక కూడలిలో కూలబడ్డారు
కుదేలైపోయిన చందాన
ఆ బురద వరదలో కొట్టుకుపోవాలా?
సొంత గొతు పెగల్చుకుని సర్కారుపై శంఖమూదాలా?
జనాలకోసం కలాలు ఝళిపించాలా?
లేక కులాల మతాల మతలబులను యెలా మట్టుబెట్టాలా
అనే సందేహంలో తమ దేహాలను తాకట్టు పెట్టారు!
**
నరంలేని నాలుక విసిరే
అమ్మనా బూతులకు
అంగాలకు తొడుగులేసుకుని
కనబడ్డ యోనులపై అక్కసు కక్కుతున్న
భహిర్భూమి వ్యభిచారులమధ్య
మెదళ్ళు మొద్దుబారి, అకృత్యాల దృశ్యాలు చూడలేక
కళ్ళు మూసుకునే పళ్ళుకొరుకుతున్నారు!
కవీ కళ్ళు తెరు - కుళ్ళు కడుగ
మెతకబడి లొంగిపోవడం కంటే
తిరగబడి ముందుకుపోవడమెలా అని
తేల్చుకోవాల్సిన అగత్యమేర్పడినదన్నది నగ్న సత్యం కదా!
**
ఎటు నీ పయనం కవీ
గాలికి కొట్టుకుపోవడమా
ఎదురీది ..
సహితయోర్భావ: సాహిత్యమని
జనహితమై అడుగేయటమా యోచించు!
ఆలస్యం చేస్తే నువ్వే మట్టికొట్టుకు పోతావ్‌!
సూర్యుడు చూడలేనిది సైతం
కవి చూడగలడన్నది నిజమైతే
మౌనం వీడు బాణమై కదులు...1.4.2019

No comments: