Wednesday, October 29, 2014

కపిల రాంకుమార్|| ప్రకృతి -మనిషి ||

కపిల రాంకుమార్|| ప్రకృతి  -మనిషి ||

పిడక, పుడక ఒకనాటి
వంటింటి ఇంధనాలు
ఆరోగ్యకర వంటకాలు
పిడకల దాలిలో కుండలో కాగిన పాల రుచి
ఆ తోడుపెట్టిన మీగడపెరుగు కల్పిన అన్నం
అందులోకి ఆవకాయబద్ద
నిమ్మపండంత వెన్నముద్ద
ఆహాఁ అది అమృత తుల్యమే కదా!
**
మట్టి గోడలు, అరుగులు 
పేడ అలుకుతో, ముగ్గుల అల్లికలమధ్య
అందమైన కుఢ్యాలను మించేవి కదా!
ఇప్పుడా పేడను అసహ్యయించుకుంటే
గ్రామీణ సంస్కృతిని అవమానపరచినట్టే!
మన మూలాలను సమూలంగా పాతిపెట్టినట్లే!
పశువులకొట్టంలోఊడ్చిన గడ్డి పేడ
ఎరువుల కుప్పై
పేడకళ్ళకు యింత ఊక కలిపి
గోడకు కొట్టిన పిడకై
కన్నెపిల్లల ఆటలలో '' గొబ్బెమ్మ ''
ఒక సాంస్కృతిక చిహ్నం
ఈ ధనుర్మాస ఆరంభం నుండి
మకర రాశిలో సూర్యుని పాదం మోపే భోగివరకు
సాగే సంప్రదాయానికి నిలువెత్తు సాక్ష్యమై
భోగి మంటల సెగలో వెలిగే
బాల్యపు ఆనందం మరువలేనిది!
**
కాలం మార్పులతో అదొక ఆదాయ వనరై
గ్రామ పంచాయితీల పేడ వేలంపాటల పాలై
అపురూప వస్తువైంది!
మనదోడ్లో వరకే దాని మీద హక్కు!
బజారున పడితే గుత్తే దారు వశం!
ఒక రకంగా గ్రామ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చింది
పరిసరాల శుభ్రత అందులో దాగుంది కూడా!
పెంట వేసి పంట అడుగమన్న పొలానికి
దొడ్లో ఎరువుకుప్ప అధారం కదా!
ఇంధన వనరుల లోటులో కట్టెలు దొరకటం

కనికష్టం అవుతున్నప్పుడు ఆ ఎరువుకుప్పే
గ్యాసునుత్పత్తిచేసే గోబర్ ప్లాంటవుతూనే
మిగిలినది పొలానికి బలాన్నిస్తోంది!
ఆ గోడకేసిన పిడకే వంటకే కాదు
మన అంతిమ సంస్కారానికి ఆధారమై
ఆజ్యమై ఛితాభస్మరూపంలో నీటిలో కలుస్తోంది!
మట్టికి మనిషికి - పేడకి పిడకకి
అవినాభావ సంబంధం!
**
28/10/2014

Sunday, October 19, 2014

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

కపిల రాంకుమార్‌ // నిజం ఎప్పుడు చేదే మరి //

ఓట్ల వరదలో
అధికార బురదలో చిక్కి
తామరపుష్పసింహాస్నమెక్కి
క్షాళనపేర మూలాలను విస్మరించకు!
ఆడినమాట గట్టుమీదపెట్టి
ఆశలను తుంగలో తొక్కి
కుంటిసాకుల ముట్టిపొగరులొద్దు!
కారుకూతలొద్దు!
అభివృద్ధిచేస్తామని చెప్పి
చేతికి ఎముకలేని చందాన
పరిశ్రమలకు వందల ఎకరాలు
అప్పనంగా దొబ్బపెట్టి,
సాగుచేసుకోటానికి  దున్నేవాడికి
చెలకలివ్వడానికి మీనమేషాలెందుకు
వెర్రిచూపులెందుకు!
నిజం చెప్పలేక తడబాటులెందుకు!
తక్షణ అవసరాలను నిర్లక్ష్యంచేసి
రాష్ట్రం అంధ:కారమౌతున్నా
చీమకుట్టినట్టైనాలేదే?
చీదరించుకుంటావెందుకు
దోమలుకుట్టి విష జ్వరాలకు
గిరి జనాల పానాలు పాడెక్కుతుంటే
సోద్యం చూస్తూ వైద్యం మరిచారేం?
అయినవారికి ఆకుల్లో
కాని వారికి (కాసులు కలిగిన వారికి)
(వెండి)కంచాల్లో 
విందు భోజనాలు వడ్డించే సంస్కృతి నుండి
తేరుకోనంతవరకు
జనసామాన్యపు మెప్పు పొందలేవు సరికదా
చెప్పు దెబ్బలు తినవలసిన అగత్యం పట్టేను సుమా!
నీరులేక జీవాలు బతకొచ్చేమో కాని
పంటచేలు చచ్చిపోతాయన్న
యింగితంలేకపోతే యెలా?
పారుదలకు, ఎత్తిపోతలకు సాధనమైన
విద్యుత్‌ సరఫరా లేక
వొట్టిమాటలై, వల్లకాడులు నింపటానికా?
మంత్రులకు, శాసన సభ్యులకు నజరానాలు కాదు
కడుపు కాలుతున్న  రైతన్నలకు చేయూతనివ్వు!
అల్లకల్లోలం కాకముందే
అలమటించేవారిని ఆదుకోలేకపోతే
బంగారు రాష్ట్రం మాట యేమో కాని
అధికారం శంకరగిరి మాన్యాలు పట్టవచ్చు!
తిట్టానని  కోప్పడటంకాదు - గట్టు దిగి కళ్ళుతెరిచి చూడు!
వాస్తవం ఎంత గబ్బుకొడుతున్నదో చూడు!
తదనంతరం నీ జబ్బునెలా కుదురుస్తుందో తెలుసుకో!
నిటారుగా నిక్కబడి చూడటంకాదు -
కాస్త వంగి వాస్తవంలోకి తొంగిచూడు!
నేలపైన చూపులు సారిస్తేనే
కాస్త సోయ కలుగుతుందేమో!
చల్లారిపోతున్న సంసారాల కమురువాసన
ముక్కుకు సోకుతుందేమో!
అప్పటికైనా నీకు జ్ఞానోదయం కలుగుతుందేమో!
నిజం యెప్పుడూ చేదే మరి
ఆ చేదుతో కాని ఉన్నరోగం పోదని తెలవదా?!
నేలవిడిచి సాము చేయకు బాబూ!
కాస్త గెలిపించినవారినీ పట్టించుకోకపోతే
కాల గర్భంలో కలిసిన రాజకీయ పార్టీల్లా
నీకూ అదే గతి! అదే సారూ అధోగతి!
తస్మాత్‌ జాగ్రత ....రుగ్మతలు తగ్గాలంటే
ఆహారంతో పాటూ వ్యాయామమూ కావాలి!
ప్రజాసేవచేయటానికి మనుగడ ముఖ్యం కదా!
తదుపరి కర్తవ్యం నీదే
దానికి ప్రతి స్పందనే మాది!
18.10.2014



Wednesday, October 8, 2014

బతుకమ్మా ఓ బతుకమ్మా

...బతుకమ్మా ఓ బతుకమ్మా
    నీబతుకు నీవే దిద్దుకోవమ్మా!
    కొమ్మలా పూల రెమ్మలా,
    పూలపండ్ల పొదరిల్లులా
    నీడలా జగతినాదుకునే
    మమతల గోడలా బతుగవ్వు
    బతుకవే, బతికించవే
    చితికిపోయే బుజ్జి
   బతుకమ్మలకమ్మవై!

బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

పుడమి కాలిడిన నాటినుండి
ఎడమ చూపుల బాధనుండి
ఆడపిల్ల వంచు అడ్డగింతల నుండి
పాబందీ సంకెల తొలిగిపోయేదాక
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

మొక్కుబడి ముచ్చట్లు
చెవికుట్టు సంబురాలు
మూడేళ్ళ ముగియ
మొట్టికాయల బతుకున
పరుగుల అడుగుల
కడుగడుగు అడ్డాలు
బతుకవే నీవు బతుకు పోరు కొరకు
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

ఆట పాటలలోన అపరాధ వర్తనలు
ఆంక్షల ముళ్ళకంచె దాటి,
అకాంక్షల మల్లెబాట పట్టేలా
పాతకాలపుటలవాట్లు మాని
పోరుబాట నడిచేలా    
బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు

చదువు సంధ్యలకు తాళాలు వేసి
ఇంటి పనులంటూ నిలువరించేరు
నలుగురిలో తిరుగరాదంటూ
పదుగురిలో నవ్వరాదంటూ
లంగావోణి తగిలించి
లంకణాలు చేయించి
ఎదుగుదలకు వంకలు పెడుతూ
బంధాల గదిలోన ఒంటరిని చేస్తారు!    
 
// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

మనసులోని మాట పైకి రానీక
కళ్లలో నీళ్ళు కుక్కుకుంటేను
మునుముందు మనుగడ కష్టాలే తల్లి
తెలియకుండానే మనువాడమంటారు
ఆలంచనల స్వేచ్ఛను నిలిపివేస్తారు
బలిపశువును చేసి మారాడనీకుండ
తాళితో ముడిపెట్టి కాళ్ళకు బంధాలు వేస్తారు
నీ ఆశలు నెరవేర మగనికి ఎదిరించa
నీ లోని చైతన్య భావాలు ఎదుగ      
        
// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

సంసార సంద్రాన మునిగి
పిల్లల కోడివై,  నీరసించకుండ
బాగోగులకైన వంతెనవ్వాలంటే
నీదైన గొంతు నినదించవలెనమ్మా
మగువంటే వంటింటి కుందేలు కాదని
తెగువుంటే దేశాన్ని నడిపించు నేతని
తెలిపేటి  రీతిలో అడుగులేయవమ్మ
జూలుదులిపి సమరశీలవతివై        

 // బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

అచ్చోసిన ఆబోతులు
పిచ్చెక్కిన కుక్కలు
ఉచ్ఛనీచాలు మరిచి
కుళ్ళ బొడుస్తాయి
అడ్డుకునే చట్టాలకు
చుట్టల తాకిడికి
మూగవైనావంటే
చట్టాలు నీరుకారు
ఎన్నాళ్ళని బాధపడతావు!

// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                    
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //


వెతలు లేని బతుకు కొరకు
చదువొక్కటే ఆయుధమ్ము
గతులు మార్చగ పోరుబాట
అనుసరించ కర్తవ్యమ్ము
అనునిత్యం జరుగుతున్న
అక్రమాల నెదిరింప
కొంగుముడిలో పిడికెడు ధైర్యం
గుండెనిండ ఆత్మవిశ్వాసం
పొందగాను సమర మార్గం
అనుసరించి, అనుకరించి, కొనసాగవమ్మ

// బతుకవే నీవు బతుకు పోరు కొరకు                                                      
బతుకవే నీవు మెతుకు దొరుకు వరకు //

Monday, October 6, 2014

కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||

కపిల రాంకుమార్|| షట్పద్యాల మాలిక||
1. 
అత్యాశ అధ:పాతాళానికి నెట్టినా
ఆశచావని మూఢులు
జ్యోతిష్యుడేదో ప్రవచించాడని
చొక్కాలు చించుకొని
విగ్రహాల విధ్వంసానికి పాల్పడినపుడు
వజ్రాలు దొరకలేదు సరికదా
కృష్ణజన్మ స్థానం మాత్రం దొరికింది!
చెప్పినవాడు పారిపోయాడు పత్తాలేకుండా!
ఇలాంటి మూఢ విశ్వాసాలను అరికట్టాలి
వారసత్వ సంపద కాపాడుకోవాలి!
**
2.
చట్టాలెన్నివున్నా
నిర్భయంగా
అత్యచారాలు
తామర తంపరలుగా అవతరిస్తూనేవున్నాయి!
అమాయక శీలాలేకాదు ప్రాణాలు అంతరిస్తూనేవున్నాయి!
**
3.
అబ్బో! ఓ నినాదాన్ని ఒకటి
మోసుకొచ్చి వీధులు ఊడ్చటంకాదు
రాజకీయ అవినీతి అతిరథుల వీధులు క్షాళన చెయ్యండి!
ఎన్నుకోబడిన నేతలలోని
నీతిలేని నేర చరితుల్ని ఊడ్చిపారేయండి యిప్పుడైనా!
తిరిగి యే చట్టసభల్లోను అడుగిడకుండా పూడ్చిపెట్టండి!
అప్పుడే '' స్వచ్ఛమేవ జయతి ''
పత్రికల్లో ఫొటోలు కాదు - ప్రతిదినం పాటుపడాలికదా!
**
4.
ప్రత్యేక యింక్రిమెంట్లు, వేతన సవరణలు ఎంత ముఖ్యమో
అవినీతికి దూరంగావుండి ప్రజాసేవ చేయడమే ముఖ్యం కదా!
చేతుల్ని మలినం చేసుకుని
చేతల్ని నాశనం చేసుకుని
మచ్చతెచ్చే పనులెందుకు?
ప్రజల ఉసురు తీయుటెందుకు?
కనీసం యిప్పుడైనా ఆలోచించరా?
కేటాయింపులు చేయగానే సంబరపడక
వాటాలకోసం గడ్డి తినకుంటేమేలు కదా!
ప్రజా ప్రతినిధులెంతమంది వున్నారన్నది కాదు
ప్రజల ప్రతీ నిధిని కాపాడాలికదా!
**
5.
ఆర్భాటాలకు విందు వినోదాలకు దుబారా కంటే
కనీస మనుగడ సాగించలేని
దారిద్ర్య రేఖ క్రింద నలుగుతున్న వారికి
చేయూతనివ్వండి!
వైద్యం కంటే ఆరోగ్యం ముఖ్యం కదా
సర్కారుదా, ప్రైవేటుదా అనికాదు ముఖ్యం!
స్వచ్ఛమైన గాలి, శుభ్రమైన తాగునీరు
పోషకాహారం దొరికేలా చేయండి చాలు!
పాలకులెవరైనా సలాం కొడతా!
నిర్లక్ష్యం చేస్తే ఇలాగే చివాట్లు పెడతా!
**
6.
నచ్చని విగ్రహాలు తొలగించడమంటే
సాంస్కృతిక వారసత్వాన్ని కించపరచటమే
విశ్వవిఖ్యాత సంగీత సాహిత్యకారులు
ఏ జాతివారైనా ఎక్కడివారైనా అభినందనీయులే!
గుర్తించిన మహానుభావులందరి స్మారక విగ్రహాలు నిలపండి
నిగ్రహం కోల్పోయి విగ్రహాలకు గ్రహణం పట్టించకండి!
ఆలయాలెక్కడున్నా దర్శించికుంటూ గౌరవించినట్లు
ముఖేముఖే సరస్వతి అన్నట్లు
ప్రతిభ ఎవరిదైనా అభినందనీయమే
వివిక్షత ఎవరిపైనైనా ఖండనీయమే!
**
అక్టోబర్‌ 2/6.10.2014

Saturday, October 4, 2014

''సాహితీ సౌరభాలతో పులకించిన ఖమ్మం ఖిల్లా '' - రిపోర్ట్‌
'' పలు సంకలనాలతిను '' లోగిలి '' ప్రత్యేక సంచిక ఒక ఆకర్షణగా సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం ఖమ్మం సాహితీ చరిత్రలో ఒక మైలు రాయి '' అని వార్షికోత్సవ సభను ప్రారంభించిన ముఖ్య అతిథి సుధామ అన్నారు. మనిషి సృష్టించుకున్న మా'నవ'సమాజంలో తానే ఒంటరైపోతున్నడని, అంతరాలు తగ్గించే మానవీకరణే కవిత్వ ప్రథాన ధ్యేయమని; కనుమరుగౌతున్న మానవవిలువలను కాపాడే విషయంలో కవులే ప్రధాన భూమిక నిర్వహించాలని ఉద్ఘాటించారు. చట్టాలు, శాసనాలతో అమలుకానివి కూడ కవులు కవులు కళకారులు తలుచుకుంటే సాధ్యమౌతుందని ఆలిండియా రేడియో విశ్రాంత ప్రొగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌, కవి, కాలమిస్ట్‌, సుధామ అన్నారు. ఈ వార్షికోత్సవ కార్యక్రమం ఖమ్మం లోని రోటరీక్లబ్‌ ఆర్టిఫిషియల్‌ లింబ్‌ సెంటర్‌ ( ఎన్‌.ఎస్‌.టి.రోడ్‌) లో ఉదయం 11.00 గంతలనుండి రాత్రి 9.00 గంటలవరకు విజయవంతంగా సుమారు 350 మంది కవులు, సాహిత్య అభిమానులు, కళాకారుల ఆనందోత్సాహాలతో నిర్వహించబడింది. ప్రముఖ దిన పత్రికలు ప్రశంసల జల్లు కురిపించాయి.మరో అతిథి ప్రముఖ కవయిత్రి షాజహానా మాట్లాడుతూ మనసు పలికే భాష కవిత్వమని, కొబ్బరినీళ్ళలాంటిదని అంటూకవిత్వమెప్పుడు ప్రజల పక్షానే నిలబడుతూ శాశ్వత ప్రతిపక్షంగా నిలుస్తుందన్నారు. కవులు సిద్ధాంత చట్రంలో యిరుక్కుని నలైగిపోతున్నారని, బయటకు వచ్చి నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న వివక్షాపూరిత దాడుల్ను ఖండిస్తూ వారికి మద్దతుగా నిలవాలని సూచించారు. ఈ సందర్భంగా కొన్ని మత మౌఢ్య సంస్థలు సాగిస్తున్న దమనకాండపై 
నిప్పులు చెరిగారు. ఆట్తడుగు వర్గాలకోసం రచనలు చేయటమే కవుల లక్ష్యంగావుండాలని అభిప్రాయపడ్డారు.ఈ సభలో మరో ముఖ్య అతిథి, సాహిత్య విమర్శకుడు, అద్దేపల్లి రామమోహనరావు మాట్లాడుతూ దేశ అస్థిత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపనవుందని, ముఖ్యంగా కవులపైన మరీ ఎక్కువగా వుందని నొక్కిచెప్పారు. పారిశ్రామికీకరణ పేరుతో ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేసారు. ప్రజలను ఉద్యమాలవెంపు, పోరాటలవెంపు నడవటానికి సంసిద్ధం చేయవలసిన వారు కవులేనని ఉద్బోదించారు. ఆ శక్తి సాహిత్యానికున్నదని, మన స్వాతంత్ర్యపోరాటంకాని, తెలంగాణా రైతంగ సాయుధపోరాటంకాని అందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా చరిత్రలో 
నిలిచాయని వివరించారు.సాహితీ స్రవంతి 15వ వార్షికోత్సవం సందర్భంగా సాహితీ స్రవంతి అధ్యయనవేదిక నిర్వాహకుడు 
రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో వెలువరించిన ప్రత్యేక సంచిక '' లోగిలి ''ని ఖమ్మం జిల్లా ఫెమా అధ్యక్షుడు, కవి, మువ్వా శ్రీనివాసరావు అవిష్కరించగా సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షుడు ఆనందాచారి పరిచయంచేసి, సంచికను తయారుచేయటంలో కృషి చేసిన కపిల రాంకుమార్‌ను, వారికి తోడ్పాటు అందించిన హైదరాబాద్ ప్రజాశక్తికి చెందిన అనంతోజు మోహనకృష్ణను అభినందించారు. తదుపరి వురిమళ్ళ సునంద రచించిన వరమళ్ళ వసంతం కవితా సంకలనం అద్దేపల్లి రామ మోహనరావు ఆవిష్కరించగా కన్నెగంటి వెంకటయ్య పుస్తక పరిచయం కావించారు. కవి, గాయకుడు సంపటం దుర్గాప్రసాదరావు సంకలనపరచిన ఖమ్మం జిల్లాకు చెందిన 340 మంది కవుల పరిచయగ్రంథంగా సాహితీమూర్తులనే పుస్తకాన్ని ప్రముఖ కవి, విమర్శకుడు డా.దిలావర్‌ ఆవిష్కరించగా సాహితీ స్రవంతి తెలంగాణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి పరిచయంచేసారు. మరో కవి, గాయకుడు మేడగాని శేషగిరి రచించి, స్వరపరచిన పాటల ఆడియో డిస్క్‌ ( సి.డి) '' పుడమి రెక్కలు '' ను తెలంగాణా రాష్ట్ర ప్రజానాట్యమండలి ప్రధాన కార్యదర్శి , కవి, కె. దేవేంద్ర ఆవిష్కరించగా, కవి పోతగాని సత్యనారాయణ పరిచయ వాక్యాలు పలికారు. ఖమ్మం జిల్లా సీనియర్‌ అచయిత, కవి అంకిత కేశవులు రచించిన '' మానవతా జిందాబాద్‌ '' కవితల సంపుటాన్ని ముఖ్య అతిథి ప్రముఖ కవి సుధామ ఆవిష్కరించగా బి.వి.కె. రాజకీయ విద్యా విభాగం కన్వీనర్, యువ కవి బండారు రమేష్ పుస్తక పరిచయం చేసారు. సాహితీ స్రవంతి పట్టణ కార్యదర్శి కంచర్ల శ్రీనివాస్ రచించిన పోలవరంపై గీతాన్ని ఆసు ప్రసాద్‌ ఉర్రూతలూగేలా ఆలపించాడు.వార్షికోత్సవ ప్రారంభ ముగిసిన అనంతరం భోజన విరామం అనంతరం సాహజహానా జనకఅవనం ఆరంభించగా, వీధుల రాంబాబు (భద్రాచలం) కటుకోజ్వల రమేష్‌ (ఇల్లందు) కవిసమ్మేళనం సమన్వయపరిచారు. వివిధ అంశాలపైన కవుల స్పందన అలరించింది. సుమారుగా 56 మంది కవితాగానం చేసారు.అనంతరం ఖమ్మం జిల్ల సాహితీ స్రవంతి నూతన కమిటీ కన్నెగంటీ వెంకటయ్య అధ్యక్షులుగా, రౌతు రవి ప్రధాన కార్యదర్శిగా, సంపటం దుర్గాప్రసాద్‌, పోతగాని సత్యనారాయణ, కటుకోజ్వల రమేష్‌, ఉపాధ్యక్షులుగా, మేడగాని శేషగిరి, శిరంశెట్టి కంతారావు, వీధుల రాంబాబు, సహాయ కార్యదర్శులుగా, వురిమళ్ళ సునంద కోశాధికారిగా ఎన్నికకాగా మాల్యశ్రీ, కపిల రాంకుమార్, మండవ సుబ్బారావు, కావూరి పాపయ్య శాస్త్రి, మువ్వా శ్రీనివాసరావు గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.
డా.సీతారాం, డా. సి.హెచ్‌.ఆంజనేయులు, డా.దిలావర్‌, మాల్యశ్రీ, మండవ సుబ్బారావు, సందేశాలిచ్చారు. సాగి వెంకన్న, మనోరమ, స్వప్న, ఆసుప్రసాద్‌, కన్నెగంటి వెంకటయ్య, శేషగిరి పలి అభ్య్దయ గీతాలాలపీంచి సభను మరింత రంజింపచేసారు. ముఖ్య అతిథులకు, సీనియర్‌ కవులకు మెమెంటోలు అందించి సత్కరించారు.జిల్లా నలుమూలలనుండి కవులు, గాయకులు పాల్గొన్న సభ మరింత ఉత్సాహాన్నిచ్చింది. సాధనాల, లెనిన్‌ శ్రీనివాస్‌, సబ్బతి సుమిత్రదేవి, యనగందుల దేవయ్య, బండిఉష, సునీత, హడ్డంహరి, తాళ్ళూరి లక్ష్మి, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్‌ తదితర కవులు, కవయిత్రులు పాల్గొన్నారు.ప్రారంభ సభలో రౌతు రవి సాహితీ స్రవంతి 15వ వార్షికోతసవం సంర్భం గత 15 సంవత్సరాలుగా నిర్వహించిన కార్యక్రమాల నివేది సభ్యుల కరతాళధనులమధ్య ప్రవేశపెట్టారు. ఈ సభ 
దివంగతులైన కళాదర్శకులు బాపు, ఇతర సాహితీ వేత్తల మరణానికి సంతాపం ప్రకటించి, ఒక నిముషం మౌనం పాటించింది. సాహితి స్రవంతి లాంటి సాహిత్య సంస్థల కార్యక్రమాల నిర్వహణకు ఒక దాశరథి లాంటి పేరుమీద ఒక సమావేశమందిరం ఖమ్మంలో నిర్మించాలని, 
కవుల రచనల ప్రచురణకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలు అందాలని, సాహిత్య సాంస్కృతిక విషయాలపై ప్రభుత్వం ఒక విధానాన్ని ప్రకటించాలని తీర్మానీంచారు. మేడగాని శేషగిరి వందన సమర్పణతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసి, ఖమ్మం జిల్లా కవులకు
నూతన ఉత్సాహాన్ని యిచ్చింది.

22.9.2014 /4.10.2013

సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి

కపిల రాంకుమార్|| సాహితీస్రవంతి అధ్యయన వేదిక 3వ ఆదివారం 21.9.2014 బతుకు + అమ్మ - కవితా గోష్టి ||
***
సాహితీ స్రవంతి నగరకమిటీ ఆధ్వర్యంలో 21.9.2014 ఆదివారం బి.వి.కె. గ్రంథాలయంలో
రాబోయే బతుకమ్మ పండుగను ఒక ప్రత్యామ్నాయ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రజల భాగస్వామ్యంతో జరుగుపోవాలనే తలంపుతో కవితా గోష్టి ఏర్పాటుచేసామని సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కార్యదర్శి రౌతు రవి తమ అధ్యక్ష్యోపన్యాసంలో పేర్కొన్నారు. పట్టణ అధ్యక్షులు సంపటం దుర్గా ప్రసాదరావు, సాహితీస్రవంతి అధ్యయన వేదిక నిర్వాహకుడు, బి.వి.కె. గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్, సాహితీ స్రవంతి కోశాధికారి సునంద,ఫెమా అధ్యక్షుడు, కవి మువ్వా శ్రీనివాసరావు, కవి, గాయకుడు మేడగాని శేషగిరి పాల్గొన్న ఈ కవితా గోష్టిలో బతుకమ్మ పండుగ విశిష్టతగురించి సునంద సోదాహరణ్ ప్రసంగంతో ఆరంభం అయింది. మువా శ్రీనివాసరావు సందేశమిస్తూ గురజాడ 152వ జన్మదినం జరుపుకుంటున్న ఈ రోజున కూడ స్త్రీలస్ పట్ల జరుగుతున్న అన్యాయాలగురించి మాట్లాడుకోటం కడుశోచనీయం. బాలికల దీనావస్థ గురించి కలం సంధించిన మొదటి కవి, ఆధునికుడు గురజాడ అని కొనియాడారు. పుత్తడిబొమ్మ పూర్ణమ గేయ కథ ద్వారా వయసుమీరిన వారిన వార్తో బాలికల వివాహంపై తన నిరశన వ్యక్తం చేయటమేకాక, ప్రజలను చైతన్యపరిచేలా నాడే కన్యాశుల్కం నాటకాన్ని రచించి, ప్రదర్శింపచేసిన ప్రగతివాద నాటక రచయితగా పేరు ప్రఖ్యాతులు పొందాడని.సమాజమ్లోని వివిధ వ్యక్తులు మానసిక వికారాలను ప్రస్పుటంగా ఆ నాటకంద్వారా వెలుగులోకి తెచ్చి సమాక హితం కోరిన గురజాడ నేటికీ ఆరాధ్యుడేనన్నారు. ఇవాళా కన్యాశుల్కం రూపం మారినా మరో విధంగా అది లోకంలో విలయతాండవమాడుతూ ఎన్నో సంసారాలలో నిప్పులు పోస్తూ గర్భసోకాలను కలిగిస్తున్నదని. అందుకే మనం అలాంటి మూఢ సంప్రదాయాలమీద, పసలేని దుష్ట సంస్కృతులపైన కవులుగా స్పందిస్తూ ప్రజలను చైతన్యపరచడమే తక్షణకర్తవ్యమని చెప్పారు. ఆసుప్రసాద్‌, శేషగిరి బృందం బతుకమ్మ పాటలను వినిపించారు. కపిల రాంకుమార్ రాసిన గేయాన్ని మేడగాని శేషగిరి ఆలపించారు. తదుపరి బండి ఉష, సునంద, బండారు రమేష్, చాగంటి కృష్ణమూర్తి, ఆదాం (విశ్రాంత జూనియర్‌ కళాశాల ప్రధానాచార్యులు) ,దేవులపల్లి హనుమంతరావు, మాటేటి శ్రీరామారావు, యడవల్లి శైలజ, కంచర్ల శ్రీనివాస్, నల్లమోతు శ్రీనివాసరావు, నారాయణ, మొదలగు వారు బతుకమ్మ కవితలు, స్త్రీలపై జరిగే అత్యాచారాలని నిరసిస్తూ కవితా గానం చేసారు. సదానందం బృందం సునంద రాసిన బతుకమ్మ పాటను పాడి అందరిని అలరించారు. మే్డగాని శేషగిరి వందన సమర్పణ చేస్తూ, బతుకమ్మంపండుగ సాక్షిగా '' ఆడపిల్లని పుట్టనిద్దాం, ఎదుగనిద్దాం, చదవనిద్దాం, ఆత్మ గౌరవంతో బతుకనిద్దాం '' అనే అంశాల ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ సంస్కృతినిని ప్రజలలోకి తీసుకువెడదామని, దానికి మరింతగా మనం ప్రోత్సహించవలసివుందని తెలియచేసారు. .
21.9.2014/4-10-2014