Sunday, April 26, 2015

కాళ్ళ క్రింద కృంగిన నేల

కపిల రాంకుమార్‌ \\ కాళ్ళ క్రింద కృంగిన నేల \\ ----
'' గత కాలంలో జరిగిన  గుజరాత్‌ భూకంప స్పందన కవిత యాదికొచ్చిందీ సందర్భంలో ''

భూకంపపు కౌగిలిలో-దీర్ఘనిద్ర నిర్యాణం
విశ్వరూప నర్తనలో-ప్రకృతెంత కాఠిన్యం!

గుండెపగిలి అండచెదరి-మండుచున్న ప్రళయాగ్ని
చరితలోన మరువలేని-శవ యాత్రల త్రేతాగ్ని!

తల్లిలాంటి నేలతల్లి-తల్లక్రిందులాయె
తల్లిలేని పసికందులు-తల్లడిల్లిపోయె

చెట్టుకొకరు పుట్టకొకరు-తోడులేని పక్షులాయె
పొట్టమాడి బట్టలేక-వీథిలోన బతుకులాయె

వితరణలో వివక్షతో- ఆలస్యం విషమాయె
ఆదరణకు నోచుకోక-ప్రతి యెదలో గుబులాయె

ప్రపంచాన మంచితనం కొంచమైన బతికున్నది
పంచదొరకు ఆశతో బాధిత జనమున్నది
మత రహితం కులరహితం సహాయాల ఆశయం
తోటివారినాదుకొనుట మనుగడకది నిలయం!

Wednesday, April 15, 2015

కపిల రాంకుమార్‌ \\ కొత్త పొద్దు పొడవాలి \\

కపిల రాంకుమార్‌ \\ కొత్త పొద్దు పొడవాలి \\

అబద్ధాల పునాదులపై
అద్దాల భవంతి కట్టి
అల్పసంఖ్య ఒట్లతో
అధిక స్థానాలు పొంది
కుక్కతోక వంకరలాంటి
పాలకవర్గ బుద్ధి మారాలంటే,
కష్టమే మరి!
మంది బలంతో
యావన్మందిని మభ్యపెట్టి
వాగ్దానాల భంగమే లక్ష్యంగా
నిత్యం జరిగే మానభంగాల సాక్షిగా
ప్రజావ్యతిరేకత పోగుచేసుకుంటున్నది!
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటంలో
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వర్ల్డ్‌ రికార్డ్‌  బద్దలుకొట్టి
వడివడిగా బడుగుల ఆశలపై
నీళ్ళేకాదు నిప్పులు జల్లే క్రమంలో
అడుగులు వేస్తున్నది
ఒక్క కేంద్రమే కాదు
మన తెలుగు రాష్ట్రాలు ఏం తక్కువ తినలేదు
వాటిదీ అదే వరస!
వాళ్ళ సిద్ధాంతాలు వేరైనా
రాద్ధాంతాలు పెట్టి
పబ్బంఅ గడుపుకోటానికి
ఒకే వర్గస్వభావం
ఒకే రకపు రక్తకణాలతో
ఊళ్ళను ఊడ్చేయటం
నోళ్ళను నొక్కేయటం
భద్రత పేర వీరభద్రులవటం
రక్షణపేరిట భక్షకులవటం
వితరణపేర నొప్పి తగలకుండా
లాఠీదెబ్బకనబడకుండా లూఠీ చేయడం
సంక్షేమం పేర సంక్షోభాలకు తెరదీయటం
ఖజానాపూడ్చటానికి చౌకబారు ఎత్తుగడలతో
బారుల్లాంటివి రుద్ది జనాల జేబులు కత్తిరించటం
నల్లపూసల్ని మట్టిలో కలిపేసి
చల్లని విడిది గృహాల్లో విందులుచేసుకోటం
రాయితీలిస్తామని
జిరాయితీ భూముల్ని సైతం మింగి
అరచేతి వైకుంఠాలు పొందలేనివార్ని
అరదండాలతో అణగతొక్కటం
సొంత సొరుగులు నింపుకోటానికి
బెరుకులేని అవినీతిని జాతీయవృత్తిగా స్వీకరించడం
మానవ విలువలు నాశనమౌతున్న దశలో
మెరుగుపరచకపోగా
మరింత మురుగుకాల్వలోకి తోసేయటం
స్వచ్చ భారత్‌ సాకుగా
ఫోటోలు దిగటమే కాని
కుళ్ళుకొట్టే రాజకీయ క్షాళనకు తిలోదకాలిచ్చి
పైపై మెరుగులతోనే,
కాలయాపన చేసే
ఈ దిక్కుమాలిన రాజకీయ పాలకవర్గాలకు
దిమ్మతిరిగే సమాధానమియ్యాలంటే
యావద్బాధితులంతా ఏకతాటిపై
సమరశీల పోరాటపు కొత్తబాట ఎన్నుకోవాల్సిందే!
ప్రపంచీకరణ, గ్లోబలీకరణ, తీవ్రవాద,
మతతత్వ ఉగ్రవాదాలకతీతమైన
కొత్త పొద్దులోని లేవెలుగుల అరుణకాంతులకై
కదం కదం కదిపి పిడికిలి బిగించేందుకు
అనివార్యం మరో ఉద్యమమిప్పుడు !
15.4.2015

Monday, April 13, 2015

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||

కపిల రాంకుమార్ || ముందడుగేస్తే ||
వాడు తిట్టాలనుకుంటే
మాటల కరువులేదు
తెచ్చి పెట్టినట్టుండవు
వచ్చి పడ్డట్టుంటాయి!
వాడు కొట్టాలనుకుంటే
కత్తులు కటారులక్కర్లే
మెత్తగావున్నట్టుండే
కత్తిలాంటి చూపులు చాలు!
వాడు పట్టాలనుకుంటే
పట్టకారులక్కర్లేదు
పట్టుదొరికించుకోగల
పట్టుదలే వాడి మూడోచేయి!
లోకంలో జరిగే అక్రమాలు
తూకాలు వేయలేం
తోకలకత్తిరించగ
చిత్తశుద్ధి వాడికుంది!
తిరిగుబాటు పాఠాలు
తీయగాను చెబుతాడు
జనాల మనసు నొవ్వ కుండ
కదనానికడుగులిస్తాడు!
మనసుంటే మార్గముందని
మన యింటినుండి పనిని
మొదలిడితే చాలంటాడు
మన వూరికి అదే మేలంటాడు.!
వాడి ఊహలను చేతలను
కుదేలు చేసే కుతంత్రాల
మాయగాళ్ళ డేగకళ్ళు
నిత్యమడ్డుకోచూస్తాయ్‌
అనుక్షణం కుయుక్తులతో
విలయాలను సృష్ఠింస్తే
దీటుగా తొడగొట్టి
తుత్తునియలు చేయగలడు
జనంతా ఒక్కటిగా
చేయిచేయి కలిపి
ముందడుగేస్తే
సాధ్యమే విజయమన్నది!
దాని వెనక వున్న నమ్మకం
దాని ముందున్న లక్ష్యం
దాని అమూల్యపు తెగింపు
తరతరాల ఎర్రబాటది!
అందుకే మార్క్సిజం
అజేయమమేయం!
తొలిపొద్దు లేకిరణాల
అరుణారుణోదయం! /....12.4.2015/13.4.2015

Thursday, April 9, 2015

|| రాజ్యహింసా? హత్యా? ? ||

కపిల రాంకుమార్‌ ||  రాజ్యహింసా? హత్యా? ? ||

ఆదాయం
ఇబ్బడి ముబ్బడి కావాలంటే
దొడ్డిదారి సంపాదన ఉండాలి
ఒకడిని తొక్కి పైకి వెళ్ళడమే
వారెంచుకునే మార్గం
తమ కోసం ప్రాణాలిచ్చేవారిని
కూలీలుగా, కమీషన్‌ దారుగా
స్మగ్లింగ్‌కు తోస్తారు
వారు భవంతుల్లో
ఏసి గదులో మందుకొడుతూంటే
వీళ్ళు అడవుల్లో
కష్టాలను భుజాన తగిలించుకుని
కడుపుమట చల్లార్చుకునేందుకు
చెప్పింది చేస్తూ
తోలుబొమ్మల్లా ఆడుతూ
ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు
**
నిఘా నేత్రాలు
కూలీల ఆచూకి చెప్పుతాయే కాని
అసలు మారాజులను పట్టలేవా
కక్కుర్తిపడకుండా వుంటే వాళ్ళు
వలలోనే చిక్కేవారు, కాని
వాటికి అక్కడో రిమోట్‌ వుంటుందేమో
దొరికిన వాడే దొంగ లేదా స్మగ్లర్‌
దొరకని వాడు దొరగారే కదా!
వాళ్ళ నెలవారి కేసుల లక్ష్యాలు చేరటానికో
బాగా పనిచేస్తూ అక్రమాలను అరికట్టుతున్నామని
మెప్పుపొందటానికో
పప్పులో కాలేసి
ఇలా అమాయకులను కాల్చేసి
కనీస విచారణ చేయాలనే మానవ హక్కును గాలికొదిలి
వాళ్ళప్రాణాలను గాలిలో ఒదిలేసి
చేతులుదులుపుకుంటే
సభ్య సమాజం చేతులు కట్టుకుని కూచుంటుందా!
ముక్త కంఠంతో ఖండించి్ ఎలుగెత్తుతుంది
మీ చేతకాని తనాన్ని ఎండగడుతుంది
**
చేతనైతే, చేవ వుంటే
ఇలాంటి దగుల్బాజీ పనులు
చేయించే నాయాళ్ళను పట్టుకోండిరా!
పొట్టకూటిగాళ్ళను పొట్టనుపెట్టుకోటంకాదు!
అందుకే బూటకపు ఎన్‌కౌంటర్లతో
రాజ్య హింసలు హత్యలు చేస్తే
సుప్రీం కోర్ట్‌ కలుగచేసుకోదా?
మానవహక్కుల కమీషన్‌ నిలదీయదా?
ఎందు నాలుక కరుచుకుంటారు?
నిజాలను దాచాలని తంటాలు పడతారు!
తస్మాత్‌ జాగ్రత - సామాన్యుడు తిరగ బడకముందే
మీ చేతివాటపు చేష్టలను, దుందుడుకు చర్యలను
సవ్యం చేసుకోండి!
లేదా
మీరోనాడూ ఇలాగే హవనం బారి పడాల్సివస్తుంది
జనాలకు జవాబుదారుగా మెలగండి
దొరలకు ఊడిగంచేస్తూ కాదు!
**
9/4/2015

Friday, April 3, 2015

కపిల రాంకుమార్ // లక్ష్యం ? ||

కపిల రాంకుమార్ // లక్ష్యం ? ||
ఛిద్రమైన జీవచ్ఛవాల్లా బతకటమేనా
ఏదైనా సాధించకుండా
విలువలన్నీ పోగొట్టుకొని
అనామకుడిలా వుంటే యెలా?
మనం ఓ పెద్ద సున్నా అని
నిర్వచించినపుడు
దానికి చీమకుట్టినట్టైనా
కదలిక వుండాలికదా! మిత్రమా!
సున్నాలకు ముందు
విలువైనది చేర్చాలని ప్రయత్నంలో -
వెలుపలికి లోపలికి, లోలోపలికి వెంపరలాట ..
ఒక గెలుపు కోసం,
లేకపోతే అటూ లోపలికి
ఇటు బయటికి తిరగటమే..
ఒక లక్ష్యమంటూ లేకపోతే
బతుకు నిర్లక్ష్యానికి గురయితే
పోస్ట్‌మార్టం అయిన శవానికి బడ్డ కుట్లలా
దేని కేదో బంధంలేని పార్థివంలా మిగులుతావు!
సంస్కారం చేయలేరు -
అంతిమ సంస్కారం తప్ప!

1.4.2015 ఉదయం 9.35

కపిల రాంకుమార్ || మిని ||

కపిల రాంకుమార్ || మిని ||
పట్ట పగలు
పుట్టే పగలు
కట్టె సెగలు
మట్టి గుబులు

2.04.2015

||ఎన్ని ఇష్టాలో అన్ని కష్టాలు||




కపిల రాంకుమార్
||ఎన్ని ఇష్టాలో అన్ని కష్టాలు||
ఇంత దూరం వచ్చాక నాకేమిష్టమో
చెప్పకపోతే పక్క  రాష్ట్రం నుండి
లగెత్తుకెందుకొచ్చావనగలరు!
అయినా భయమేమిలేదు
యేం చెప్పాలనిదాంట్లో స్పష్టతావుంది!
వేదికచేరుకునేటప్పపడే గౌరు నాయుడోపక్క
రామతీర్థో పక్క  అగబడ్డారు!
కుశాలయింది.
మరింక శివాలెత్తే ఎర్ర కవి గీడనేవుండె!
కాకినాడ అద్దేపల్లి , తిరుపతి మేడేపల్లి
నిండుగా నవ్వుతున్నట్లనిపించి
నా కైత పరుస్తున్నానిలా!
నాకు గాంధీయిజం యిష్టమే
కాని  అప్పుడప్పుడు
హింస అన్నవార్యం కదా!
నాకు మావోయిస్టులు యిష్టమే
కాన్న కొన్ని చేష్టలు మాత్రం అయిష్టం!
ఆస్వాదనీయమైన పానీయాలన్ని యిష్టమని
విషం తాగలేము కదా!
దృశ్యాలన్ని కనువిందు చేస్తాయని
అత్యాచారాలను చూసి ఆనందించలేం కదా!
నినదించకుండ వుండలేం కదా!

కుహనా వాదంతో చూసిన కళ్ళు చెప్పలేవని, 
చెప్పే నోరు చూడలేదని
చెరువుకట్ట మీంచి వచ్చాను కాని
నీళ్ళున్నాయో లేవో చూడలేదనే
కూట సాక్ష్యం చెప్ప లేం కదా!
నిజం ఎప్పుడూ చేదు అనుభవాలనే పంచుతుంది!
కొండకచో నిర్బంధాలను పెంచుతుంది!
నిజమంటే ఉన్నోడికి కోపం!
డబ్బు జబ్బుతో జబ్బలువాచినోడికి తాపం!
కక్కసులోదాచిన మర్మాల్ నిజం
ఎక్కడ వెలుగులోకి  తెస్తుందోనని
రాజకీయ మన్మథులకు కోపమే
వారి నిలువెత్తు రాసలీలన్నీ
ఏ సూక్ష్మ దుర్భిణి  తెరాడిస్తుందేమోనని
పొలాలను, సామాన్యుని స్థలాలను,
వారసత్వ బిలాలను
గ్లోబలవుతున్నాయనేది యెంత సత్యమో
సకల జనుల కలలను,
కథలను, కళలను, కవులను సైతం
బలయ్యే అంత్య  దశ చేరుకున్నాయని,
నిర్భయంగా చెప్ప దలచుకున్నాను!
అప్పుడు  వాటిని చూచి భరించలేక
చిన్ని  చితక ఆందోళనలు చేసే
ఎర్ర పక్షులన్నీ ఏకమై
కలుగులో దాక్కుని  దొంగదెబ్బతీసే
నల్ల త్రాచును నరికి పోగులుపెట్టాలంటే
పాణిగ్రాహి జముకులాడాలి!
తెలంగణా సాయుధరైతాంగ పోరాట అయిలమ్మ
తుపాకి మోగాలి!
శ్రీరాములయ్య  నిరంతరపోరాట గరిమ
అనంతనుండి విశాఖకు రావాల్ల!
విశాఖ నుండి విశాల ఆశయాల
విప్లవ భారతావనికి  వెన్నుదన్నుకావాలి!
ముక్దుం, రావెళ్ళ  దాశరథి, ఆరుద్ర, రాచకొండ,
కాళోజీ, శ్రీశ్రీ, శివసాగర్, ఛాయారాజ్‌ల
 విప్లవ సాహిత్య  పరిమళాలు పునర్వికసించాలి!
ఎన్ని ఇష్టాలో అన్ని కష్టాలు!
అయినా ఇన్ని యిష్టాలు నెరవేరాలంటే ఎన్ని కష్టాలెదురైనా!
అన్ని కమ్యూనిస్టు  శ్రేణులేకమవాలి!
మార్క్సిజం అజేయం –
ఆ విజయాన్నందుకోవటమే
మన లక్ష్యమ్ని  చెప్పటానికి  మీ ముందుకొచ్చాను!
ఇక్కడి బుగుత గారికి కోపం వచ్చినా,
భుక్తి కోసం పోరాడే జనావళికోసం
ఈ నాలుగు మాటల ముచ్చటించి, పిడికిల్ల బిగిస్తున్నాను!
రేపటి పోరుకోసం సన్నద్ధంకమ్మని విన్నవిస్తున్నాను!
**

మనం మనో మధనం చేయాలి '' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో కవుల అభిప్రాయం!


'' మనం మనో మధనం చేయాలి '' -మన్మథనామ ఉగాదినాడు కవి సమ్మేళనంలో  కవుల అభిప్రాయం!

               గత పదిహేను సంవత్సరాలుగా ఖమ్మంలో సాహితీ స్రవంతి యికనుండి తెలంగాణసాహితిగా యథవిధిగా సాహితీ కార్యక్రమాలు నిర్వహించుకుంటుందని, అనన్య సామాన్యమైన సేవలనెలా చేసిందో అదే విధంగా మరిన్ని విస్తృత కార్యక్రమాలు, సెమినార్లు, గోష్టులు, శిక్షణా తరగతులు నిర్వహించాలని తెలంగణా రాష్ట్ర బాధ్యులు కె. ఆనందాచారి, ఖమ్మం బి.వి.కె. గ్రంథాలయంలో మన్మథ నామ ఉగాది కవి సమ్మేళనంలో సందేశమిచ్చారు. తెలంగాణ సాహితి  జిల్లా అధ్యక్షుడు వెంకటయ్య ఆధ్వర్యంలో, కార్యదర్శి రౌతురవి,ఖమ్మం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు సంపటం దుర్గా ప్రసాద్‌, కంచెర్ల శ్రీనివాస్‌, డా. పి.సుబ్బా రావు,డా.పాపయ్యశాస్త్రి, బాణాల కృష్ణమాచారి, వేదికపై ఆశీనులుకాగా పట్టణంలోని కవులు, కళాకారులు సుమారు 36 మంది ఈకార్యక్రమంలొ పాల్గొన్నారు అధ్యక్షుడు  కన్నెగంటి  మాట్లాడుతూ మన్మథనామ ఉగాదిని ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యం అంధ్రప్రదేశ్‌ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగ విదివడి, ఈ తెలంగాణా రాష్ట్రంలో మొదటి సాహితీ సమవేశంగా కవి సమ్మేళనం  నిర్వహించు కుంటు, కొన్ని ప్రత్యేకమైన, రాష్ట్ర సమస్యలను, జాతీయ అంతర్జాతీయ సమస్యలను అవగాహనతొ పాటు అనుసంధానం చేసుకుంటూ సాహితీ కృషి జరుపుకొవలసిన అవసరంవుందని అన్నారు. ఆగడాలు, అత్యచారాలు, మోసాలు, ద్వేషాలు, ఘోరాలు, నేరాలు పెచ్చరిల్లుతున్న తరుణాలు కొనసాగుతూవున్న కాలంలో వాటిని ధీటుగా విశ్లేషించి నివారించే ప్రాతిపదికలుగా కవిత్వం వుండాలని అన్నారు. ప్రజా జీవితంతో ముడిపడిన అంశాలే మన కవితాంశాలు కావాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర బాధ్యులు ఆనందాచారిని వేదికపైకి అహ్వానించారు. సన్నగిల్లి పోవటమే కాదు, మృగ్యమయ్యే స్థితికి  చేరుకుంటున్న సంస్కృతీసంప్రదాయాలను కాపాడుకుంటూనే మూఢ నమ్మకాలకు, గ్లొబలీకరణకు, ప్రపంచీకరణకు, మతోన్మాద ఉగ్రవాదాలని నిలువరించే దిశ, దశ నిర్దేశించేలాకవిత్వం రాయాలని. విస్తృతంగా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని, అందరికి శుభాకంక్షలు తెలుపుతూ తన కవితతో కవి సమ్మేళనం ప్రారంభంచేసారు.  '' అరల్లో నిద్రించే వాటిని బయల్పరచాలి / కలాలకు కొత్త బలాను అందించాలి – అంటూ తెరపై రంగులు దుమ్ములేపుతాయి - కాలానికి సంబంధించిం స్పృహ వుండాలి - మన ఆలోచన ఆక్రమణకు గురౌతున్నది, పెట్టుబడి సామాజిక బీభత్సం చేసి మానవతా హృదయాలను కూలుస్తున్నది....కవీ! నువ్వైనా అప్రమత్తుడవై చూడాలి '' అని కొత్త ఆశంస వెలిబుచ్చారు తన కైతలో. కన్నెగంటివెంకటయ్య నవ్వులకు సంబంధించి వ్యంగ్య గేయాన్ని పాడి వినిపించారు. సవ్వులలోని రకాలు, నవ్వు వెనకాల వున్న మానవ నైజాలు ఉర్రూతలూగే కంఠస్వరాన్నందించి ముగ్ధుల్ని చేసారు. ప్రముఖ కవి, విమర్శకుడు జీవన్‌ సందేశం యిస్తూనే తన కవిత  ''యథాతధం ''లో - '' నల్లధనం మూలాలను,స్వరూపాలను వివరించారు. పసలేని నాటకానికి మోత ఎక్కువ, నాందీ వాక్యంలోనే భరత వాక్యం పలికింది '' ఈ వ్యవస్థపై తనదైన చురకలు వేసి అలరించారు. కటుకోజ్వల రమేష్‌  ఉగాది ఆశాగీతం అనే కవితలో '' భరోసాలేని భవితను ఎలా పంచమంటావ్‌?''  అంటూనే  '' కాలం చిలకొయ్యకు మాత్రం మమ్ములను తగిలించాఇ వెళ్ళావని '' చురకలు వేశారు.తాళ్ళూరి రాధ '' నిజం '' అనే కవితలో '' మానవీయ సంబంధాలు, ఆర్థిక బంధాలయినాయ్‌,'' అంటూ - మనిషి ' మనీ 'కొరకు చేస్తున్న సంకుచిత ధోరణులను యెత్తిచూపారు. డా.పొత్తూరి సుబ్బారావు : ఉగాది సందేశమిచ్చి, ఖమ్మం జిల్లా ప్రాశస్త్యాన్ని '' సితార '' నగారాలుగా ఆవిష్కరించి, మన తెలంగాణా ఔన్నత్యాన్ని, అలనాటి బౌద్ధమత విరాజిల్లడాన్ని తన కవితలో శ్లాఘించారు. నాగిరికతా సంస్కృతులకు ఖమ్మం జిల్లా ఉదాహరణ అంటూ జిల్లా గొప్పదనాన్ని ఆసాంతం ఆకట్టుకునేలా వినిపించారు. కవిత్వాన్ని ఓ ధృక్కోణంలో చూడటంకాదు తెలంగాణా అస్థిత్వాన్ని చక్కని చమత్కృతులతో వ్యక్తీ కరించారు.  బండి ఉష: ఉషోదయం అనే కవితలో మట్టికాళ్ళ మనిషి మౌనంగా మట్టిలోనే పొలి అవుతున్నాడు. అరిషడ్వర్గాల నుండి జయించే కొత్త ఉషోదయం రావాలని అకాంక్షించారు. ప్రేమ శరాలను విసరాలి అంటూ ముగించారు. అడవికట్ల ఆదామ్‌:  పద్య కవితలను ఆరు వినిపించారు. షడ్రుచులివేనన్నట్లుగా అవి అందరిని అలరించారు. చక్కటి శ్రావ్యమైన  స్వరంతో రాగయుక్తంగా వీనులవిందు చేసారు. షేక్‌ జాకీర్‌ : మరణించిన సమాజాన్ని మేల్కొనేవాడే కవి అంటు కవిత వినిపించారు.

              తదుపరి సాహితీ స్రవంతి 15 సంవత్సరాల ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి అవిస్కరించి, ఆ సందర్భంగా సందేశమిస్తూ బహుకొద్ది మందితో పదిహేనేళ్ళ క్రితం యేర్పడిన సాహితీస్రవంతి అచిరకాలంలో శాఖోపశాఖలుగా విస్తరించడం, తద్వారా ఉమ్మడి రాష్ట్రంలో ఒక బలమైన సాహితీ సంస్థగాను, ఒక సాహిత్య మాసపత్రిక ప్రస్థానం ఆవిర్భావానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగాను తాను తోడ్పడినందుకు ఆనందంగావుందని అన్నారు. యిప్పుడు కొత్త రాష్ట్రంలో తెలంగాణా భాషను, సంస్కృతులను మరింత పరిపుష్టం చేయడానికి మరింత కృషిలో భాగంగా తన నాటక రచనా వ్యాసంగాన్ని తెలంగాణా బాషలోనే సృజన చేస్తానని, యిన్నాళ్ళకు ఆ కల సాకార మవ్వబోతోందని సంతోషం వెలిబుచ్చారు.డా. ఆంజనేయులు : మనవూరి చెరువు - గుర్తుకు తెచ్చారు. చిన్నతనంలోని చిలిపి పనులు, చెరువు ఉపయోగం, బహుముఖాలుగా చెరువుకు ఊరికి వున్న బంధం చాకటి తెలంగాణా పలుకుబడులు పండేలా మంచి కైత వినిపించారు. అందరిని అలరించారు.తాళ్ళూరి లక్ష్మి:  తన కవితలో  నైతికంగా దిగజారిన మన సమాజాన్ని మనం జల్లెడ పట్టి, వ్యక్తి వర్తమానంలోబాటచూపించాలంటూ ఆకాంక్షిస్తూ ముందు ముందు నీళ్ళ టాంకులకోసం యుద్ధ టాంకులవసర్మేమో అని వ్యంగ్యంగా నీటి అవసరాన్ని తెలిపారు.గరికిపాటి మణీందర్‌:  '' ఏడిపించకండి దొర - బతికుండగానే చావు బాజా మోగించకండి '' అంటూ నేటి ఆసరాఅ పథకాలలో జరుగుతున్న అవకతవకలు ఎత్తిచూపించారు. ఫించను రాక టెన్‌షన్‌కు గురువుతున్న అనాన్ని పట్టించుకోమని కోరారు తన కవిత '' శిశిర గీతం ' లో. పొత్తూరి సీతారామారావు : హాస్య వ్యంగ్యోక్తులమిశ్రమైన సంభాషణల్తో ఆద్యంతం రక్తికట్టించేలా తన అవితను వినిపించారు.దేవయ్య : తొలి ఉషస్సు అనే కవిత, గొవిందు :
ఓ ఆత్మీయ అతిథి అనే కవిత, వినిపించగా డా.కావూరి పాపయ్య శాస్త్రి '' కోకిల ''పేర పద్యాలను వినిపించి అందులో జాతీయాలు, తెలుగు పలుకుబడులు, నుడికారాలు పొందుపరవటమే కాక చక్కటి వివరణలు తెలియచేసారు. కంచెర్ల శ్రీనివాస్‌ '' కోయిలమ్మ కూస్తోందిరా ' అనే కవితలో '' బడుగు భారత జనుల ఉషస్సులకు, ఆటంకాలు లేని ఇజాలు''  కావాలన్నారు.  కపిలరాంకుమార్‌ : పెపంచానికి కాస్త బుద్ది సెప్పండి అనే కవితలో ' కోయిల గొంతు మూగబోయింది, ' అంటూ కాకులు, కోకిలల మధ్య సారుప్యత లేకపోవడాన్ని చిత్రికపట్టారు. మన మనస్సులను మథనం చేసుకూంటూ, మేథో మథనం చేసికోవాలి అంటూ మనుషులు మృగాలవటాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. కారు( వయసు) తేడాలేని బతుకులకు చితికిపోవడాలకు స్వస్తి పలకాలంటూ ఆశాభావం వ్యక్తీకరించారు. పోతగాని సత్యనారాయణ '' కొన్ని యుగాలు తేల్చని సగాలు '' అనే కవితలో అకృత్యాలు, అధికారాలు కవలలు, అసమానతలు హద్దులు దాటాయంటూ ఆక్రోసించారు.ఆర్థిక స్వేచ్ఛ స్త్రీలకు లభించినపుడే, విశ్వంలో సగమై జయకేతనమెగురుతందని ముక్తాయింపునిచ్చారు. ఉరిమళ్ళ సునంద: అంతా కొత్త యాదే అంటూ యుగాదిని, ఉగాదిగా తలవాలంటే '' అస్థిత్వానికి తండ్లాడుతున్నాను, మట్టి పరిమళాలు పరివ్యాప్తం కావాలందుకే. అవనిపై జరుగుతున్న  విశృంఖలత్వాన్ని అక్షరీకరించారు. సంపటం దుర్గా ప్రసాదరావు తనదైన రీతిలో చిక్కని, చక్కని చిన్న కవిత చదివి అందర్ని అలరించారు. నారాయణ '' అది ఏరే - ఇది ఏరే '' అనేకవితను ఆలపించారు. కన్నెగంటి వెంకటయ్య  ' వైఫల్యాల గజనీ యాత్రలో నేనొక విశ్వాసంలేన్ని అశ్వాన్ని కాలేను, కాలం బడిలో పాఠాలు నేర్చుకునే బడిపిల్లమౌదాం అంటు నవగీతాంజలి పాఠం అవుదాం అని తన కవితలో ఆశించారు. ఈ సందర్భంగా  మన్మథ నామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ముందుగానే కూసిన కోయిలలాగ ఖమ్మం సాహితీ స్రవంతి తెలంగాణా సాహితీగా మారిన మొదటి కార్యక్రమంలొ గత15 సంత్సరాలుగా సాహితీకార్యక్రమాలలో బాధ్యతలు స్వీకరించినవారు, వివిధ సందర్భాలలలో వెన్నుదన్నుగా నిలచి సలహలు, ఉపన్యాసాలు అందించిన సీనియర్‌ కవులు, విమర్శకులను సన్మానించు కోవటం ఒక కొత్త ఒరవడికి సంప్రదాయానికి తెలంగాణా సాహితి ఖమ్మం జిల్లా కమిటి తెరతీసింది: ఈ సందర్భంగా ప్రముఖ ఆంగ్ల, ఆంధ్ర సాహిత్యంలో అందెవేసిన చేయి, డా. పొత్తూరి వెంకట సుబ్బారావు గారిని, కవి, విమర్శకుడు డా.కావూరి పాపయ్య శాస్త్రి గారిని, నటుడు ప్రయోక్త, దర్శకుడు, తెలంగాణా పడికట్టుపై పట్టున్న రచయిత, బానాలకృష్ణమాచారి గారిని, మరొ తెలంగాణా పలుకుబడిని పెట్టుబడిగా కలిగిన కవి, కథా రచయిత, జీవన్‌ గారిని, కవి, రచయిత, నటుడు, దర్శకు, బోడేపూడి విజ్ఞాకేంద్రం నిర్వాహకుడు, సాహితీ స్రవంతికి తొలినాళ్ళలో ఐదు సంవత్సరాలు అధ్యక్షస్థానాం నిర్వహించి, తదుపరిసాహితీ స్రవంతి అధ్యయన వేదిక నిర్వహిస్తున్న కపిల రాంకుమార్‌కు సన్మానం జరగటం. ఒక చారిత్రిక నిదర్శనంగా ఈ తొలి సాహిత్య కార్యక్రమం నిలుస్తుంది . రౌతు రవి కవులందరికి నమస్కారం అంటూ వందన సమర్పణ చేసారు.

 



photo.php 13.jpg

సాహితీ స్రవంతి 15 సంవత్సరాల ప్రత్యేక సంచిక -'' లోగిలి '' ( కపిల రాంకుమార్ ప్రధాన సంపాదకత్వంలో) బాణాల కృష్ణమాచారి

తిలక్‌ కవిత్వం నుండి ఎంపిక చేసిన ముత్యాలు ''

కపిల  రాంకుమార్ '' తిలక్‌ కవిత్వం నుండి ఎంపిక చేసిన ముత్యాలు ''

1. కవిత్వం అంతరాంతర
జ్యోతిస్సీమల్ని బహిర్గతం చేయాలి
విస్తరించాలి!
చైతన్యపరిథి
అగ్ని జల్లినా,
అమృతం కురిసినా,
అందం ఆనందం దాని పరమావధి కావాలి! 

2. కిటికీతెరిస్తే
గాలి వెలుతురుతొపాటు
జాలి జీవుల ధూళీ
జ్ఞాన ధూళీ కూడ వస్తాయి!
తెరిచే కిటికీని బట్టి
పరివ్యాప్తించే పుష్ప పరాగం వుంటుంది!

3. మేం నవీనులం
మేం భావుకులం
పాత లోకపు గుండెలో శతఘ్ని పగిలించి
భావికాలపు చంద్రకాంత శిల్పాల కరిగించి
పాట పాటకి సోకు స్వర్గంలాగ
మాట మాటకి దూకు సింహంలాగ
మేం నిలుస్తాం!
మేం పిలుస్తాం!

4. కాలం
కాలానికి రూపం లేదు
దానికి పాపం లేదు
అంధయుగమైనా
స్వర్ణయుగమైనా
అది మన ప్రతిబింబం!

5. మాకు దాస్యం లేదు
మాకు శాస్త్రం లేదు
మాకు లోకం గీటురాయి
మాకు కరుణ చిగురు తురాయి
మేం పరపీడన సహించం
మేం దివ్యత్వం నటించం!

6. జూదం
జీవితమే జూదం

ఖేదానికి మోదానికి
లేదసలే భేదం!

7. స్వప్నం
కల యెపుడు
మనిషికి బలం

విధాన జీవన రధ్యలలో
స్వప్నం ఒక సుందర తను మధ్య

8. చీకటి
పడుతోంది
చిటారు కొమ్మలో నక్షత్రం
చిక్కుకుంది
శిధిల సంధ్యాగగనం
రుధిరాన్ని కక్కుతోంది
దారంతా గోతులు
యిల్లేమో దూరం

చేతిలో దీపం లేదు
ధైర్యమే ఒక కవచం!

9. యుద్ధం
జడంగావున్న శాంతినుండి
ఎడంగా తప్పుకుంటాడు మానవుడు
సంచలనం కలిగించే
సమరాంగణాన్నే కోరుకుంటాడు
అందుకే మానవ చరిత్ర అంతా
యుద్ధమయం!
.....
19.3.2015

కపిల రాంకుమార్ // లక్ష్యం ? ||

కపిల రాంకుమార్ // లక్ష్యం ? ||
ఛిద్రమైన జీవచ్ఛవాల్లా బతకటమేనా
ఏదైనా సాధించకుండా
విలువ్లన్నీ పోగొట్టుకొని
అనామకుడిలా వుంటే యెలా?
మనం ఓ పెద్ద సున్నా అని
నిర్వచించినపుడు
దానికి చీమకుట్టినట్టైనా
కదలిక వుండాలికదా! మిత్రమా!
సున్నాలకు ముందు
విలువైనది  చేర్చాలని ప్రయత్నంలో -
వెలుపలికి లోపలికి, లోలోపలికి  వెంపరలాట ..
ఒక గెలుపు కోసం,
లేకపోతే అటూ లోపలికి
ఇటు బయటికి తిరగటమే..
ఒక లక్ష్యమంటూ లేకపోతే
బతుకు నిర్లక్ష్యానికి గురయితే
పోస్ట్‌మార్టం అయిన శవానికి బడ్డ కుట్లలా
దేని కేదో బంధంలేని పార్థివంలా మిగులుతావు!
సంస్కారం చేయలేరు -
అంతిమ సంస్కారం తప్ప!
1.4.2015 ఉదయం 9.35