ఆశ్చర్యార్ధకాలేవీ లేవు
కనుబొమ్మలెగరేయ వద్దు
అందంగా చెప్పదలుచుకోలేదు
అతిశయమేమీ లేదు..
అది వేటకెళ్ళిన రాజుగారి కధ కాదు. రాజును వేటాడిన సైనికుల కథ
కటిక చీకటిలోంచి
కడగండ్ల దారులమీంచి
జవగల గుర్రంలా పరుగెత్తిన కథ
పేగు తెంపిన మంత్రసాని చనుబాలు తాగనివ్వని పసివాడి నోట్లోంచి బొటనవేలునై బయటకొస్తున్నాను
నేను భీమా నదిని...అంటూ
1818 - 2018 మధ్య నేపథ్యంలో ఓ దీర్ఘ కవిత భీమానదిచేత శ్రీరాం చెప్పించటం ఒక ప్రత్యేకత.
సాహిత్యం తో పాటు చరిత్ర, అర్థశాస్త్రం అధ్యయనం చేసినపుడు నేటి సమకాలీన జనజీవన ఇక్కట్లకు ఒక సాహితీ సార్థకత నెరపడమే కవి లక్ష్యం అని నా నమ్మకం.
అట్టి కవనానికి దీర్ఘ కవిత గా రూపొందించిన
కవికి అభినందనలు.
మరికొన్ని నాకు రుచించిన భీమానది నీటి తుంపరలు జల్లుతాను.
పేగు తెంపిన మంత్రసాని
చనుబాలు తాగనివ్వని పసివాడి నోట్లోంచి
బొటనవేలునై బయటకొస్తున్నాను
నేను భీమా నదిని...
కాళ్ళకి చెప్పుల్లేని నేల సిగ్గు కప్పుకునేందుకు గుడ్డ పీలిక లేని నేల
ప్రేమ తీరని నేల,
చేతులెత్తి రాత్రింబగళ్ళని కావులించుకునే వేళ ఆకాశం నుంచి వివక్షల వాన కురిసేది.
కాబట్టే
రెండు శతాబ్దాలుగా
నొప్పెడుతున్న అవయవాల్లోంచి
వొళ్ళు విరుస్తున్నాను
కప్పెట్టిన అవశేషాల్లోంచి
కళ్ళుతెరుస్తున్నాను
...
ఈ మౌనాన్ని బద్దలుకొట్టాలి
ఈ వేటని వ్యతిరేకించాలి
ఏ దేశమైనా దేవుళ్ళది కాదు
కష్టజీవులదని చెప్పాలి.
చరిత్ర రాసినవాడు అంతఃపురంలో వున్న రాణుల పాదాలకు పారాణి పూస్తాడు
సామ్రాజ్యాలు చుట్టి వచ్చిన రాజుగారి గుర్రపు డెక్కల కచేరీ చేస్తాడు.
ఇది పత్రహరితాన్ని వేటాడ్డం, ఇది సాల్వాజుడుం, అన్నల్ని చంపమని తమ్ముళ్ళని ఎగదోయడం అక్కల పాలిండ్లలో తల్లితనాన్ని నలపడం ఇది అరాచకం, ఈ యుద్ధం అంతం కావాలి
నేను భీమా నదిని, ప్రాధేయ పడుతున్నాను ఇసుక మేటలు వేస్తున్న చట్ట సభలనుంచి
ఈ దేశపు నత్తగుల్లల్ని ఎవరన్నా కాపాడండి
నేను భీమా నదిని ! మార్చురీ గదుల్లాంటి ఈ దేశపు జైళ్ళ ముందు సహచరుల కోసం గడ్డగట్టుకుపోతున్నాను
నేను భీమా నదిని ఈ దేశపు శ్రీకృష్ణ జనన గర్భానికి తల ఆన్చి దేశవాళీ పదాలతో లొల్లాయిగడుతున్నాను జైల్లోపల ఎవరో శూద్ర సంతతి తల్లి పేడనీళ్ళతో కళ్ళాపి జల్లి
బియ్యప్పిండి ముగ్గులు వేస్తోంది దాని చుట్టూ నల్లటి చీమలు బారులు తీరుతున్నాయి-
ధర్నాలు చేస్తారు, కవుకు దెబ్బలు తింటారు,
మీరీ దేశాన్ని ప్రేమిస్తారు, దగాపడుతున్న మనుషులంటే పడీ పడిచస్తారు మీకు ఎన్కౌంటర్లంటే భయం లేదు, మరణాన్ని లెక్క చేయరు
ఇండియా ! నీవు శ్రీకృష్ణదేవరాయుని వజ్రపు రాశివి కాదు రోజు కూలీ ( అడ్డాలో )కూడళ్ళలో నిలబడ్డ కాలే కడుపువి
నేను భీమా నదిని ! ఆఖరి సారి హెచ్చరిస్తున్నాను ఇండియా ! సాయిబాబాని విడిచిపెట్టు నా ప్రియాతి ప్రియమైన కవి వరవర రావును కూడా
నీ గుండెలవిసిపోయే లోపు నా ధర్మాగ్రహంతో దాహం తీర్చుకోవే ఇండియా ! కాస్త తెరిపిన పడు...
No comments:
Post a Comment