కపిల రాంకుమార్||శాసించడం కాదు శ్వాసించడం నేర్చుకో!||
నా అక్షరం పచ్చదనాన్ని ప్రేమిస్తుంది
నిప్పచ్చరాన్ని ద్వేషిస్తుంది!
సామాజిక స్పృహ నేలంతా కప్పుకున్న
పచ్చని మనిషి నీడ కోరుకుంటుంది!
తనలాంటి మరో అక్షరం కోసం
ఆబగా యెదురుచూస్తుంది- జతకట్టడానికి!
దొరికిందే తడవుగా రెండక్షరాల ‘ ప్రేమ’ పై
దాడిచేసే మబ్బులతో దోబూచులాడుతూ
అక్షయపాత్ర దొరికిందనుకుంటుంది!
అదుగో అక్కడే గొడవ ప్రారంభం
నాదంటే నాదనే వాదన మొదలవుతుంది!
అక్షరానికీ స్వార్థంవుంది
ముందువరసలో తనే వుండాలనే తపనవుంది!
అందుకు యే పద్ధతికైన సిద్ధమే
పద్యం, గద్యం, చంపూ కొరకురాని కొయ్యలైతే
పచనమయ్యే గీతమెనా అవుతుంది!
నిలువెల్ల పులకించే మనిషిని
ఆక్రమించుకుని తనకే సొంతమంటుంది!
తనకే పంచమంటుంది!
ఋతుచక్రంతో పనిలేదంటుంది
పగలు రాత్రి తేడాలేదంటుంది
నోరెత్తటానికి బలముంటె
అక్షరసరాలు యేర్పడతాయంటుంది!
కోయిలకన్న మిన్నగా
కాలాలకతీతంగా – కారణాల సాకుంటే చాలు
యే వేదికనైనా సొంతం చేసుకుని
ఆసాంతం సొంత గొంతుకై వినిపించాలంటుంది!
ప్రేరణలెక్కడవైనా
తెలుగులోపుట్టినవై వుండాలంటుంది
వెలుగుగ దారి చుఫలంటుంది
సృజనకారుదు కనుమరుగైన
సృజనాత్మకత శాశ్వతం కావాలంటుంది
యెంత యెదిగినా
ఒక్క విషయం గుర్తుంచుకోమంటుంది
చెట్టునెపుడు పచ్చగా వుంచమంటుంది
వేరుపురుగులు దరిచేరకుండా
నిఖార్సయిన అక్షర కంచె చెట్టు చుట్టూ
పాతాళందాకా పాతేయకలిగితేనే
మనుగడంటుంది!
చేదుతో యుద్ధంచేస్తూ
మంచిని నిబద్ధం చేస్తూ
అక్షరమై మిగలమంటుంది
ఊగిసలాటలు మాని స్థిరంగా
అక్షరాన్ని శాసించడం కాదు
నిబ్బరంగా
శ్వాసించడం నేర్చుకోమంటుంది!
***
2.4.2013 సాయంత్రం 6.45
No comments:
Post a Comment