Monday, April 22, 2013


కపిల రాంకుమార్|| వ్యత్యాసాలు - కరుణశ్రీ కవిత ||
పరిచయం
మా కండలు  పిండిన నెత్తురు
మీ పెండ్లికి చిలికిన అత్తరు!
మా మొగాలకీ కన్నీరూ
మీ మొగాలకీ పన్నీరూ!

మా నోట్లో ఆకటి భగ భగ
మీ నోట్లో సిజర్సు భుగ భుగ!
మాకీ పడిపోయిన గోడలు
మీకేడంస్తుల మేడలు!

చింపిగుడ్డ సింగారం మాకూ
ఒళ్ళంతా బంగారం మీకూ!
మేము మండుటెండల్లో మాడుతూ
మీరు పండు వెన్నెల్లో ఆడుతూ!

మీ కార్లకు పనికి రాని టైర్లు
మా కాళ్ళను కాపాడే జోళ్ళూ
మా బ్రతుకిది మళ్ళి మళ్ళి
మీ బుగ్గ తిరిగే కిళ్ళీ

బాబు గారి పాకీ దొడ్లో
పట్టపగలు ఎలక్ట్రిసిటీ
పాకీవాడి పూరి పాకలో
కార్మబ్బుల కటిక చీకటి

మా లోపల అగ్ని జ్వాలలు
మీ లోపల అజీర్ణ శూలలు
మీ మోటర్ లేపిన ధూళి
మా నుదిటికి గులాబి పౌడర్.
(కరుణశ్రీ కవితా కౌస్తుభం నుండి 1.1.1993 ముద్రణ)













No comments: