Wednesday, September 19, 2012

తగదు-తగదు

కపిల రాం కుమార్ . బి.వి.కె. ఖమ్మం// తగదు-తగదు

ఇంట్లో అల్లరి చేస్తున్నారని ఒంట్లో ఓపిక లేదంటూ
వంటింట్లో గిన్నెలనన్నీ నట్టింట్లోవిసిరారంటూ
వయసెదగని బాలలను జయిలు పాలుచేయద్దు
వ్యామోహపు చదువు పేర బడికి బందీ చేయద్దూ!

ఆడుతు పాడుతు గంతులు వేసే
పాల బుగ్గలను బడికి పంపే
క్రూరమయిన ఆలోచనలెందుకు?
బాల్యాన్ని తుంచటమెందుకు?

ఎంత విసిగిస్తే మాత్రం ఆంతకోపం ఎందుకు?
బరువును వదిలించగ చదువు శిక్షలెందుకు?
తాతగారి బామ్మగారి ముద్దుల మురిపాలకు
దూరంగ తోలటం ఘోరమయిన తప్పిదం!

తోటివారి చెలిమిలోని తీపిదనం అంద కుండ
చిన్న చితక తప్పటదుగుల అనుభవాలు పొందకుండ
ముద్దులతో, ముద్దలతో అమ్మే మొదటి గురువను
నానుడిని నిర్దయగ వమ్ముచేయచూడద్దు!

ఆయాల పాలు చేసి అమ్మదనపు పాల తీపి
అందకుండ చేయడం, ప్రక్రుతికే విరుద్దం
చిన్నతనపు చిత్రాలను పదిలపరకుండానే
బాల్యాన్ని చిదిమేటం - తగదు తగదు!
"

No comments: