Thursday, September 20, 2012

పచ్చి నిజం

కపిల రాంకుమార్ // పచ్చి నిజం//

చక్కెర మిల్లు సైరనుకూసె - సైకిలెక్కు మామయ్యో!
డొక్కలునింప రెక్కలకట్టం తప్పాదింక మామయ్యో!

ఇంటికి వచ్చే దారిలోన కోతి చేష్టలు చెయ్య కుండ
యిద్దరి ఇజ్జతు నిలిచేలా దిక్కులు సూడక యింటికే రా!
వచ్చీపోయె దారీలోనా మాయదారి లారీలుంటాయ్
సైకిలెక్కి సోకులు పోతే గోతుల పడతావ్ మామయ్యో!

కొంపకు నీవు చేరే దాక పానం నీ మీదుంటదిరా
పసుపు తాడుగట్టికోసం రోజూ నిన్నే మొక్కుతవూంటా!
సారాకొట్టు, బ్రాంది షాపు కళ్ళతోన చూడమాకు
అంతకంటే మత్తునిస్తా గుండెమీద హత్తుకుంటా!

మల్లెపూల చెండు తోబాటు, పిండివంటకి శెనగపిండి
మర్చిపోక తెస్తివంటె మిర్చి బజ్జి చేసిపెడతా!
పెందలకాడె యింటికి చేరి తొందరగ్గ స్నానంచేస్తే
సందకాడ సరదా చేయ విందు భోజనమందిస్తా!

వెర్రి తలల కోరికతో కుర్ర చేష్టలు చేయమాకు
పక్క దారిన గడ్డికొరికి బక్క రోగం తెచ్చుకోకు
నీకు కట్టం-నాకూ కట్టం -బ్తుకు చీకటికొట్టం!
పయన మౌట కాష్టాలకే -ఎదురులేని పచ్చి నిజం!

20-9-2012

No comments: