Wednesday, September 26, 2012

తిరగ రాసే శక్తివమ్మా

కపిల రాం కుమార్// తిరగ రాసే శక్తివమ్మా!//

అమ్మదనపు కమ్మదనం - విషతుల్యం చేస్తున్నారు
కాలుష్యపు తుపానులో సతమతమవుతున్నది.
పనిచేసే ప్రతిచోట కసిచూపులు మామూలే
ప్రతివాడి వాడి పలకరింత మసిపూసిన కోరికలే
ఎవరమ్మ తలచేది పదేపదే ' అమ్మా ' అని
గాయమైన వేళ వినా - ఆకలైతే తప్ప ఆతృతపడేది!

అవనిలో సగమన్నది పచ్చి నిజం!
మగడు సగమన్నది - సగమే నిజం!
సమానమైన సగాల్లో సమాజాన విలువేది?
ఆటబొమ్మలాగ ఆడుకోచూస్తారు!
ఆదుకోమంతేను అదోలా చూస్తారు!

ఎందుకమ్మా ప్రేమను - అంతయిదిగ పంచుతావు
విలువలు (వలువలు) తుంచుతున్నా
మమతలు పెంచుతూనే పశువులనాదరించుతావు?

తల్లిగా ముద్దులిచ్చి - గోరుముద్దలందించి
తల్లడిల్లునీకు చివరికేమి దక్కు?
పనిపాటల అలసినా ఆలంబన లేదు నీకు
కనిపెంచిన (కన్న తరువాత పెంచక చస్తుందా)
బిడ్డలకూ లోకువేనా?

మగనితోటి - అత్తతోటి-ఆడపదుచు మనసుతోటి
అల్లుకొను, సర్దుకొని సంసారమీదుతావు!
నుదుట రాసిన గీతంటూ, మనువు పెట్టిన షరతులన్నీ
తలచుకుంటే తిరగరాసే శక్తివమ్మా
తరతరాల పొగరు దింపు!

26-09-2012

No comments: