Sunday, September 2, 2012

ఒరుగుతున్న అరక

కపిల రాం కుమార్// ఒరుగుతున్న అరక//26-8-2012

అరక బతుకున వెతలు ఎన్నో - కతలు కతలుగ చెప్పెదన్నా
గీచిగుడ్డకు మించియేది -పొందలేని బతుకులన్నా!

వేలిముద్రయేసియేసి ఏరువాకకుయెదురుచూసి
కోండ్రభూమికి అదనులేక మేడి అదురుకు ఒడలు నలిగె!
పుచ్చుటిత్తుల మొలకకోసం -ఎదురుచూసి నీరసించి
బాంకులిచ్చే అప్పుకోసం చేయి తడుపగ గొంతులెండె!

ఆరుగాలం కష్టపడ్డ ఆరుపుట్ల ధాన్య రాశి
ఎరువుకోసం, విత్తుకోసం షావుారి గాదె చేరె!
గంజినీళ్ళు తాగనీకి గింజ కూడ లేకపోతే
గుంజుకొచ్చే నరము బాధ నంజురోగం తెచ్చిపెట్టె!

బిడ్డ పెళ్ళికి డబ్బు ఉన్న చెక్క అమ్మివేసి
ఊరివారి బంతికోసం అప్పుచేసి చిక్కిపోతివి
నిరుటివరకు మోతుబరివి- నేటి సాలునకూలిపోతివి!
రామరాజ్యపు ముసుగులోన రైతు వెన్ను ముక్కలయినది

జాతికంతటి వెన్నుబొమికవి- పెరటి జొన్న కుళ్ళీపోయను
గూటిలోని పురుగు మందు మృత్యుగీతం పాడుతుండెను
గిట్టు బాటు ధరలలులేక చుక్కలెంక చూస్తువుంటే
అప్పులేమొ పెరిగిపోయి ఆత్మహత్య ల దారిచూపె!

ఆలుపిల్లల భవిత కోసం పాడి పంటల పెంపపుకోసం
అప్పు తీరే దారికోసం పప్పు బువ్వ కడుపుకోసం
చాకిరి ఒకడిది సుఖము వారిది-గతపు చరితల నడక మా ర్చగ
వెలుగు కోసం బతుకు కోసం పోరుచేయక తప్పదన్నా ...
అంతకన్నా దారి లేదు..............................!!!

No comments: