Thursday, December 6, 2012

మసి వాసన

కపిల రాంకుమార్//మసి వాసన//

మతమన్నది మౌఢ్యమై - పతనానికి మార్గమై
మనిషి కూలుతున్నాదు - మనసు కాలుతున్నది!

వందలాది మందమతుల రాజ్యకాంక్ష చూస్తుంటె
మనిషి మనసు కాలుతూ మసి వాసన వేస్తుంటే
బందిఖాన బ్రతుకులోన ప్రగతిమాత విలపించె
మందిరాలకోసం మందిరాలినపుడు!

ఈ రక్తం - ఈ దు:ఖం - మీ చిత్తం - ఈ యుద్ధం
తల్లిలాంటి భరతమాత తల్లడిల్ల భావ్యమా?
ప్రవహించె రక్తపు కాలువ - తలదించెను మానవత!
మతరక్కసి నర్త్రనలో దానవతే గంతులేయ!

సహనాలకు హద్దులులేక - కుహనాలకు బుద్ధులు మారి
దహనాలకు ఆజ్యంపోసే పవనాలను ఆపే దెన్నడు?
మారామే చేయబోని ఆ రాముని పేరు మీద
మానవుల మనుగడకు మచ్చతెచ్చు పనులేల?

నీ వార్ని చంపుకొనే మాయదారి మతమెందుకు?
నీ చెల్లి - నీ అన్న కనుపించర కనులుంటే?
చరితలోని సత్యాలకు - భవితనేల చంపటం?
భరతజాతి ఘనతనేల భావిలేక్ తుంచటం?

తరతరాల్ ఘర్షణలే కాలానికి వంతనలై
బానిసత్వ వర్షంలో వత్సరాలు తడిసాము
స్వాతంత్ర్యం సాధించుటలో సాగించిన సమరాలెన్నో
లక్ష్యాలను నెరవేర్చుటలో అడుగడుగున గండాలెన్నో?

నాటి స్పూర్తి మరల పొంది
కోటి గొంతు కోయిలలై
జనత ఘనత చాటవలె - సమత పాట పాడవలె!

6-12-2012 ఉదయం 5.20

(6-12-1992 - 6-12-2012 - 20 సంవత్సరాల కాలంలో ఇంకా మత సామరస్యం ఇంకా నెలకొనగపోగా ..అక్కడక్కడ జరుగుతున్న విధ్వంసాలకు స్పందనగా)

No comments: