చిలిపి చిలిపి చేష్టలు, చిన్నారి పొన్నారి నవ్వులపువ్వులు
జారిపడే తప్పటడుగులు, మంచి చెడుగులేమెరుగని
అల్లరుల వల్లరులు
ముద్దు తీర్చు ముచ్చటైన మారాముల బాల్యం!
ఉద్రేకం కనుపించదు యుక్తాయుక్త విచక్షణం
క్షణికానంద ఆవేశం క్రమ్మి కామాగ్నికి ఆజ్యం-
ప్రయోజనం పూజ్యం - క్రమమైనది కాకపోతే - యౌవనం!
కౌమార్యం - బాధ్యతాయుతం
సంతునికని - సత్కర్మల నిర్వహించి
బిడ్డల భవిష్యత్తే ధ్యేయంగా
త్యాగమయ జీవనం శ్లాఘనీయం!
వార్థక్యం - జీవితానికి ఆఖరి మెట్టు
అనుభవాల ప్రోదియై
ముందు తరాల వారికాదర్శప్రాయుడై
తాను కరిగిపోతూ కొవ్వొత్తిలా
కుటుంబానికి వెలుగు బాటలు వేస్తూ
పొద్దుండగానే యిల్లు చక్కదిద్దుకునే
మార్గం చూపుతూ
చాదస్తాన్ని మరో హస్తంగా (కొంత మంది దృష్టిలో)
అస్త్రంగా ప్రయోగించి
ఉపయోగపడటమే వృద్ధులకానందం!!!
మానవ జీవన చక్రంలో - ముఖ్య సక్రమ ఘట్టాలివే
ఎన్నో బాధల,వేదనల, సంతోషాల సమిశ్రన చిత్రం!
5-12-2012
@@@(సుమారుగా 40 సంవత్సరాల క్రితం సంస్కృత శ్లోకానికి స్వేచ్చానువాదం)
No comments:
Post a Comment