కపిల రాంకుమార్ ||ఇది ఏ కర్మ ఫలం? ధర్మ ఫలం!||
ఊరి చెరువునుండి
కావిళ్ళతో నీళ్ళు తేవాలి, కాని
గుమ్మం యివతలే దించాలి
పేడకళ్ళు యెత్తి, కసువూడ్చి
గేదెల్ని కడిగి, మేతేసి
ఇత్తడి తెపాలకు పాలుపితికాలి, కాని
గుమ్మంయివతలే పెట్టాలి
ధాన్యంకైలు చేసినా
గుమ్మెలోనో , గరిసెలోనో
వడ్లు నింపటమే మా పని, కాని
మాకు వడ్డించే విస్తరి మాత్రం
గుమ్మం యివతలే!
ఏది ముట్టుకోకూడదు, కాని
అన్ని పనులు చేయాల్సిందే!
పురిటింట్లో కాని, ఆఖరికి కాటిలో కాని
మాతోనే పని
గృహప్రవేశం మాత్రం నిషేధం
**
మా ఆడంగులు గదులన్నీ ఊడ్చి శుభ్రంచేసి
దుమ్ము దులపొచ్చు
కడిగి తుడవొచ్చు, కాని
వంటింట్లోకి మాత్రం అడుగేయ నిషిద్ధం!
కాని మాకు అర్థంకానిదొకటే వారి ద్వంద్వ నీతి!
కళ్ళుకనపడని కామందుల
(కామాంధుల)
కోరికకు మాత్రం ఆంటరానితనం హుష్ కాకి!
మా తప్పులకు రాద్ధాంతంచేస్తారు
వెలివేతకు గురుచేస్తారు!
వారి తప్పులకు యే విధివిధానాలుండవు, కాని
గుండె కోతలు, బతుకు వెతలు ఛీత్కారాలు
పుష్కలం!
**
ఇది ఏ కర్మ ధర్మ ఫలం!
ఇక ఆగదు తిరిగిబాటు పవనం
ఝంఝామారుతంలా!
5.8.13 సా. 2.10
No comments:
Post a Comment