Monday, August 19, 2013

సాహితీ స్రవంతి - ఖమ్మం అధ్యయన వేదిక మూడవ ఆదివారం 18.8.2013



కపిల రాంకుమార్||సా.స్ర.అధ్యయన వేదిక 18.8.2013||
ప్రతినెల మూడవ ఆదివారం నాడు సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటీ జరపలని నిర్ణయించుకున్న విషయం తెలిసినదే. ఆ సందర్భంగా 18.8.2013 ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక బి.వి.కె. గ్రంథాలయంలో కె.దేవేంద్ర అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.వేదికపైకి డా. కావూరి పాపయ్య శాస్త్రి, డా.పొత్తూరి వెంకట సుబ్బారావు,లను సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి రౌతు రవి అహ్వానించగా, గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్  పర్యవేక్షణలో కార్యక్రమం జయప్రదంగా జరిగింది
సాహిత్య ప్రయోజనం అనే అంశంపై తొలుత పాపయ్య శాస్త్రి మాట్లాడుతూసాహిత్యమనే మందిరపు గడపదగ్గర మనమున్నామని, ప్రవేశించితేకానిఎన్నో విషయాలను తడమటానికి వీలుకలుగదని అంటూ స-హితయోర్భావ: సాహిత్యమని, విశ్వ శ్రేయం దాని లక్ష్యమని, బహిజన హితాయ, బహుజన సుఖాయ లోకా సమస్తా సుఖినో భవతు అనే ఆర్యోక్తిని సార్థకం చేసేదిగా వుండాలని అన్నారు. కవులు అనధికార శాసనకర్తలని, ముందు చూపు కలవారని, క్రాంత దర్శకులని రాబోయే విపత్కర సామాజిక సమస్యలనుగుణంగా స్పందిస్తూ రచనలు తమ కోసం కాక జన సామాన్యం కోసం రాయాలని వక్కాణించారు. భాష రాని స్థితినుండి, సైగలు, గుర్తులు దాటి మాట్లాడె దశ, రాసే దశ (లిపి) మార్పుచెందుతూ అనుభూతులను, అనుభవాలను తోటి వారితో పంచుకునే అనివార్య పరిస్థితే భాషావిర్భానికి ప్రాత్రిపదికని తెలిపారు. నన్నయ కాలంలో సంస్కృత పదాల వాడకం నుండి  తెలుగు పదాల వాడకం ఆరంభమైనా ఆయన తెనిగించిన మహాభారతంలో సంస్కృత సమాసాలు, తత్సమ, తత్భవాలు యెక్కువే అయితే చిన్న చిన్న పదాలతో విస్తృత అర్థం వచ్చే ప్రయోగాలకు నాంది పలికాడని. తిక్కన కాలానికి అది తెలుగు పదాల వాడకం (అందునా అచ్చతెనుగు) మొదలయిందని, అలా పురాణాలు, ఇతిహాసాలు అనువాదం కావింపబడటం జరిగిందని, తెలిపారు. ఆది కవిగా నన్నయను గుర్తించినా, ఆంధ్ర కవితా పితామహుడని అల్లసాని పెద్దనకే పీఠం దక్కిందని, తెలుగులో ప్రబంధాల యుగానికి ఆద్యుడని ' మనుచరిత్ర ' తార్కాణమని, అలా సాహిత్యంలో వివిధ దశలు, ప్రక్రియలు, పద్య, గద్య, చంపూ, వాటి క్రమ పరిణామం., ఆధినిక కవితా ధోరణి కి ఆద్యుడుగా గురజాడ నుండి శ్రీశ్రీ, శ్రీశ్రీ నుండి ఎన్నో మలుపులు ప్రయోగాలు తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్నాయని, అసలు కవిత్వ, కథ, పాట ఎవరికోసం అనేదానిని బట్టి దాని మనుగడ ఆధారపడివుంటుందని సొదహరణ ప్రసంగం చేస్తూ భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, దళితవాద అంటూ ఎన్నో శాఖోపశాఖలుగా సాహిత్యం మార్పులు చెందుతూ ఆధినిక సాంకేతికతను సంతరించుకొని కంప్యూటర్ ద్వారా, అంతర్జాలం ద్వారా విశ్వమంతా ఎగపాకుతోందని కూడ తెలిపారు. ఏది యేమైనా సమాజంలోని అధిక శాతంగా వున్న జన సామాన్యానికి అర్థమయ్యేలా, వారి ప్రయోజనాలను గమనంలో వుంచికొని వారి అమోదాన్ని పొందటమే సాహిత్య లక్ష్యంగా వుండాలని ముగించారు. తదుపరి డా. పి.వి.సుబ్బారావు గారు మాట్లాడుతు యే కవిత్వానికైతే లయ, శ్రుతివుంటాయో అది యెక్కువ మన్ననపొందుతుందని, అనాదిగా జానపద గేయ సాహిత్యం మౌఖికమైనా ఇప్పటికీ కొనసాగుతూనేవుందని అలాంటి కవిత్వం ప్రక్రియ పాట, కథ, సామెత, చాటువు, హరికథ, బుర్రకథ లోక హితానికి చేరువగా వుంటేనే శాశ్వతంగా వెలుగుతుందని పేర్కొన్నారు. సార్వజనీనంగావుండాలన్నారు. భావాల వ్యక్తీకరణ, బాధల పంపకం, సమస్యల పరిష్కారం సాహిత్యం తీర్చాలని అన్నారు. కవి మిత్రులు  సునంద. ఉష,శైలజ, బండారు రమేష్,చర్చలో  పాల్గొని తమ తమ అభిప్రాయాలు చెబుతునే, వారికొచ్చిన  సందేహాలను నివృత్తి చేసుకోటం గమనార్హం సాహిత్యం ఎందుకు, ఎవరికోసం అనే ఆంశంపై శ్రీశ్రీ రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్. కన్నెగంటి వెంకటయ్య,మేడగాని శేషగిరి, సాదనాల వెంకటస్వామి నాయుడు, కవితాంజనేయులు, కొన్ని సలహాలు సూచనలు యిచ్చారు. ఇది కవిత్వ పాఠ శాలగా రూపొందాలని, వివిధ ప్రక్రియలపై శిక్షణాతరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక వేసుకోవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా కథ, పాట, వచన కవిత, నాటిక, వ్యాస రచన, విమర్శనా పద్ధతులపై ఒక కార్యక్రమం  రూపొందిస్తామని  నిర్వాహకులు కపిల రాంకుమార్, రౌతు రవి తెలియ చేసారు. ఈ అధ్యయన వేదిక యితర సాహిత్య వేదికలకు ఆదర్శం కావాలని  డా. పాపయ్య శాస్త్రి, డా. సుబ్బారావు అభిప్రాయపడితూ, దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని,  ప్రముఖలను రప్పించే ప్రయత్నంకూడ చేద్దామని సమావేశంలో నిర్ణయించారు. కె. దేవేంద్ర  మొత్తం చర్చలను సమీక్షిస్తూ  ఈ నాతి కవిత్వం  అనంత విశ్వంలో మనిషియొక్క అస్థిత్వం గురించి చర్చిస్తే మన ఒక చిన్న రేణువంత కూడ వుండదు. ఒకరినుంచి ఓకరికి ఏం జరుగుతుందో తెలియపరచడంలోనే అనుసంధానం వున్నది. మనిషి అభివృద్ధికి ప్రత్యామ్నాయం యేమిటి? దేనిని మానవ అభివృద్ధి అంటాము? మనిషి ప్రయాణంలో నాది అనుకునే భావన మానవునికి శత్రువు! భాష వ్యక్తీకరణలో ఇదంతా యిమిడివుంది. వర్గ సమాజంతో వర్గ సాహిత్యం పెనవేసుకుని వుంటుంది. ఇంకా లిఖిత, అలిఖిత (మౌఖిక) సాహిత్యం చేరని ప్రజల సంఖ్య యెక్కువగా వున్నపుడు, వారిని చేరే విస్తృతార్థంలో భూత దయ, కరుణ వేరుగా వున్నాయి. సాహిత్య ప్రయోజనం వర్గ ప్రయోజనంగా వుండాలని, మానవ భౌతిక అవసరాలతోనే సాహిత్యం ముడిపడి వుండాలని అప్పుడే సరియైన బడుగు బలహీన వర్గాల పక్షాన సాహిత్యం ప్రయోజనకారిగా రుపాంతరం చెందాలని ప్రతిపాదించారు. నిత్య చేతనం నిరంతరం కొనసాగాలని కోరారు. తదనంతరం కవి సమ్మేళనం జరిగింది కపిల రాంకుమార్, తోట కృష్ణారావు శైలజ, సునంద, బండారురమేష్, దేవేంద్ర, సాదనాల, కన్నెగంటి  తమ కవితలు వినిపించగా, డా.పాపయ్యశాస్త్రి వాటిని సమీక్షించి తగు సూచనలిచ్చారు. వచ్చే నెల సెప్టెంబర్ మూడవ ఆదివారం 15 'జాషువా సాహిత్యం - సామాజిక కోణం 'పై కన్నెగంటి సాహిత్యోపన్యాసం చేయాలని, తదుపరి కవి సమ్మేళనం కవితలు  చదివే వారు ముందుగానే కవితలు అందిస్తే, వాటిపై నిర్మాణాత్మక  సూచనలివ్వటానికి వీలుకలుగుతుందని వాటిని గ్రంథాలయంలో ఒక రోజు ముందుగా అందచేయాలని వందన సమర్పణ చేస్తూ రౌతు రవి ప్రకటించారు.

No comments: