Saturday, August 3, 2013

కపిల రాంకుమార్ || ''యత్రనార్యంతి ....''||

కపిల రాంకుమార్ || ''యత్రనార్యంతి ....''||

కార్యేషు దాసి, కరణేషు మంత్రి ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మలంటూ ఘోరాతిఘోరంగా
శ్లోకాలలో నిను బంధించి
లోకాల శోకాల పాపాలు - కడిగి
శాపాలు తొలగించు దీపాలు ఆరేను......

చెదలు పట్టిన ఎదలు తుడిచి మేలుకొనవే చెల్లెలా!
వెతల బతుకున వెలుగునింప సాగిరార తమ్ముడా!

ఆణిగి మణిగివుండవలసిన ఆడదానికి స్వేచ్ఛలేదని
మనువుచెప్పిన ధర్మమంటూ, పు-రుషులెవరో ' గీత ' గీస్తే!

మొదటిగురువు తల్లియంటూ, మొదలుపెట్టిన చదువులిపుడు
మొదలకంటా కూల్చివేసే, యెదలు నరికే కత్తులైనవి!

విలువలేమొ తరిగిపోయె, వలువలేమొ చిరిగిపోయె
కళ్ళుతెరచి కుళ్ళుతుడిచె, ముళ్ళబాట బాగుచేయగ !

ముక్కుపచ్చలారనట్టి, మూడుయేండ్ల పాపని
ముద్దులాడె నెపముపెట్టి, తండ్రివయసున్నవాడు
ఎర్రముద్దగ చేసినాడు, సిగ్గుబిళ్ళదోచినాడు
యేమి జరిగెనొ చెప్పలేక, వెక్కి వెక్కి గ్రుక్కపట్టె!

వావి వరుసలు కానలేని, కామరాజుల కళ్ళకు
తల్లి చెల్లి చిన్న పిల్ల ,చప్పరించే గుళికలా?
పిచ్చిదైనా బిచ్చగత్తెను మందుపిచ్చిలో తల్లిచేసే
అచ్చుబోసిన ఎద్దుమించిన మదపు వెధవలకంతమెపుడో?

పదవికోసం పెదవి తడిపి పరపతంటూ తప్పుచేసి
సతుల,సుతల తార్పజూసే, మురికి వెధవలకంతమెపుడో?

అందుకొమ్మని చేతులిస్తే,బొందపెట్టె బుద్ధితోడ
పట్నవాసపు కట్న సెగలకు, పల్లెటూళ్ళు కాలుతున్నాయ్!

' అగ్ని ' సాక్షిగ జరుగుపెళ్ళి, రుద్ర భూమికి దారితీయ
ఆడపిల్లల పెండ్లియంటె, పీడకలగ మారుతుండె!

లింగ బేధం తెలుసుకోని, ఆడపిల్లల చంపివేస్తే
ఆదిశక్తికి మూలమైన - నీకు నాకు ప్రాణమిచ్చె
' అమ్మ ' తనము లేని లోకమెందుకు?
వెర్రితలల జ్ఞానమెందుకు?
రొంపినుండి బయటకొచ్చె, సమానత్వపు పురిటికోసం

పూర్వకాలపు శిఖరపీఠం - మహిళకిచ్చే రోజుకోసం

ఒకరినొకరు తెలుసుకుంటూ, ఎదలు కలిపి మసలుకుంటూ
సంఘమందున కుళ్ళిపోయిన, మూఢమతులనేరివేయగ
చెదలు పట్టిన ఎదలు తుడిచి మేలుకొనవే చెల్లెలా!
వెతల బతుకున వెలుగునింప సాగిరార తమ్ముడా!
_______________________
(నగారా - ఖండ కావ్యం నుండి ...2004)
_______________________

1 comment:

gnapika.sunny said...

..cheppesaaru..cheppaalsindantaa..loved it..hats off to u sir..