Wednesday, August 14, 2013

కపిల రాంకుమార్ || చదివిన గ్రంథము ||ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర ||

కపిల రాంకుమార్ || చదివిన గ్రంథము ||ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర ||

అంశము: అరాచకము – ప్రజల కడగండ్లు

గోగులపాటి కూర్మనాథుడను కవి 1724 ప్రాంతములో విశాఖ జిల్లాలోని విజయనగరాన్ని పరిపాలించిన మొదటి ఆనందగజపతి ఆస్థానములో వున్నాడు. ఈ ఆనంద గజపతి, పాయకరావుపేటను పరిపాలిస్తున్న పాయకరాజా అను ఉత్కళరాజు కలిసి నైజాంప్రభువు వద్ద కొన్ని లక్షలు అప్పు తీసుకొని, యివ్వనందున నైజాంసేనలు ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టసాగినవి. నాతి ప్రజల దుస్థితిని, నైజాంసేనల దురాగతాలను ఎండకట్టుతూ గోగులపాటి కూర్మనాథ కవి సింహాద్రి నరసింహస్వామి పేర యిలా నివేదన చేసాడు.

'' యవనేశుధాటికి నడలి సర్వస్వమ్ము విడిచి మందిరములు వెడలు వారు,
వెడలియు తలదాచ వెరవేమి గానక నడవుల నిడుమల బడెడువారు,
బడియునెచ్చట కూడుబెట్ట గానక తమ శిశువులతో వెతికించువారు,
జెంది డెందము గుంద గాందిశీకత నభిమానార్థులై ఖేదమూనువారు
నైరి యొక్కొక్క భార్యతో నాని ప్రజలు
అష్టమహిషులపై పదియారువేల
సతులతో నూవు వలసకెచ్చటికరిగెదు
వైరి నరసింహ సింహాద్రి నార్సింహ!

పొట్టేళ్ళ గతిబట్టి బొడి సన్యాసుల ఢీయను తాకులాడించు నొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ద్రెంచి సింగాణి వింద్లకు నల్లెగట్టు నొకరు
ఖూబు ఘోడాయంచు గుడికీలు గుర్రము నెక్కి ధేయని తరటెత్తు నొకడు
పైకాలు గొమ్మని బల్మికోమతివారి చెలువపైబడి బూతుసేయునొకడు

గ్రామముల్ నిర్థూమమ్ములయ్యెను సస్యంబులెల్ల నశనముజెందె
దొడ్లలో శకముల్ దుంపశుద్ధిగబోయె దోచిరి సర్వంబు గోచి చక్క.
కనిపించు కోవుగా ఖలులు మార్గస్థుల కొంకక ముక్కులు గోయునపుడు
ఆలకింపవుకదా అయ్యయ్యో ప్రజఘోష ధూర్తులు పడి ఊళ్ళూ దోచునపుడు
జాలి రాదాయె గా చటుల తుష్కరులు భామినులను చెరపట్టినపుడు !

ఈ విధంగా ప్రజల బాధలను వర్ణించి ఈ బాధలనుండి కాపాడవలసినదిగా సింహాద్రి నరసింహుని వేడుకున్నాడు.

మా మొఖాసాకు గ్రామంబులిమ్మనలేదు కొంపలు గాల్పింపకూడదంటి
కరి హయాదుల మేము కాంక్షింపగాలేదు గోవధమాంపించి ప్రోవుమంటి
మాకు మిమ్ములను సామ్రాజ్యమిమ్మనలేదు జనులను డోపింపజనదటంటి
స్వామి మా కొరకేమి కామింపగాలేదు క్షితిలోన ప్రజల రక్షింపమంటి…
----------------------------------------------------------------------
ఇది ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర – ఏటుకూరి బలరామ మూర్తి – విశాలాంధ్ర (ప్రథమ ప్రచురణ జూన్ 1953 ) ఇది 10 వ ప్రచురణ September 1990
రు. 20/-
____________________________________________________
14.8.2013 సా.2.47

No comments: