Friday, August 23, 2013

కొంపెల్ల రామకృష్ణమూర్తి** కవిత - శిధిల భ్రాంతి ||

కపిల రాంకుమార్||కొంపెల్ల రామకృష్ణమూర్తి**  కవిత - శిధిల భ్రాంతి ||

నిజమే
నిర్విచార తత్త్వం
నీవు లేనప్పుడే సిద్ధిస్తుంది!
తీరా నువ్వు హృదయాన్నాక్రమిస్తే
తీగలు సాగుతున్న మహాయోగం సైతం

మట్టిగొట్టుకుపోతుంది!
భ్రాంతీ!
గ్రీష్మాతపంలో దాహార్తుడైన జీవికి
మధురామృత పూరంలా కనిపించే ఎండమావీ!
ఎన్నెన్ని పవిత్ర కుసుమాల్ని
కాల రాసిన కసాయితనం నీది!
ఒక దీర్ఘ రాత్రి -
నాలో నాతోబాటు ఎదిగిన జాఢ్యమా!
పెదవి వంపుతో  మంద గమనంతో
కనుసైగతో నునువెచ్చని చుంబనంతో
నన్ను బానిసను చేసుకున్న ఇషకన్యా!
' దిసక్షసా మధ్య '  నిర్జీవ సంధ్యా!
 ఈనాడు నీ నిజ స్వరూపం గోచరిస్తోంది--
నీ ముఖానికి నువ్వు అందంగా పులుముకున్న
సువర్ణ వర్ణం - కాకి బంగారమని తేలిపోయింది.
యుగయుగాల నిజ హృదయ కాలుష్య దుర్గంధానికి
మృదూక్రుల పుస్హ్ప సౌరభం పూసి--
ముహుర్మిహుర్త్వివేక పరాజిత శిధిల శరీరాన్ని
సిగ్గులేక - హరిచందన చర్చలో గుబాళింపుచేసుకొని
ఆ రాత్రివేళ భయంకర స్వైరిణిలా
నా ప్రశాంత సదనంలో ప్రవేశించి - చేతి వేళ్ళతో
ఏ దురదృష్టగీత  నా నుదుట లిఖించావో!
ఏ అపస్వరం నా స్వరపేటికలో పొదిగావో!
తదాదిగా నా లేఖిని రక్తం కక్కుకుంది,
నా స్వరం శివరంజనిగా సాగింది!
భ్రాంతీ!
ఏ బలహీనతా సిసలైన మనిషిని లొంగదీసుకోలేదు
తాత్కాలిక మోహం ఏ శాశ్వత నిసర్గ చైతన్యాన్ని సమాధిచేయలేదు!
నీ ఆజ్ఞతో నన్ను అస్పష్టాలోచనల సంకెళ్ళతో బంధించిన రాత్రి -
నా వివేక సూర్యోదయంలో భగ్నమైపోయింది!
నిన్నరాత్రి నా గుండెను కోసిన శివరంజని
ఈ ఉదయం అపురూప భూపాలంగా మారిపోయింది!
భ్రాంతీ! ఓ పొగమంచూ!
ఏమైపోయావు నువ్వు?
ఏ దురదృష్టవంతుణ్ణ్ని నీ కొంగున ముడివేసుకున్నావు?
ఏ పాతాళలోకంలో '' పాప '' కన్యలా దాక్కున్నావు!
__________________________________________
పేజి. 8 భారతి మార్చి 1977 సంచిక ** కొం.రా.కృ.మూర్తి  1969 లో మాతోపాటు
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం (కొవ్వూరు)లోభాషాప్రవీణ విద్యార్థి. రేగడమిల్లి సత్యమూర్తి,
రెంటాల పార్వతి. నాకు గుర్తున్న పేర్లు. మా కంటే సీనియర్ గా బేతవోలు రామ బ్రహ్మం
వుండేవారు. వారితో ప్రతీ ఆదివారం కవిత గోష్ఠిలో పాల్గొన్న జ్ఞాపకాలు పదిలంగావుంచాను
ఎందుకో పాత భారతి పుస్తకాలుతిర్గేస్తుంటే ఇది కనపడింది. ఒక్కసారి పాత రోజులు గుర్తు
కొచ్చాయి. ఆ మిత్రుడెక్కడ వున్నాడో తెలుసుకోవాలనివుంది.
___________________________________________
23.8.2013  ఉదయం 10.42. 

No comments: