Wednesday, September 11, 2013

కపిల రాంకుమార్|| కవిత్వానికి మానిఫెస్టో!||

కపిల రాంకుమార్ || కవిత్వానికి మానిఫెస్టో||

అనుభవాలను అనుపానంగా అందించే
ముసలాళ్ళను లెక్కచేయం!
పైగా వాళ్ళది చేదస్తమంటాం!
కాని ఒకప్పుడు 
నడిచే దారిలోనో, చేసే పనిలోనో
ఆటంకాలొచ్చినపుడు మాత్రం 
అనిపిస్తుంది వాళ్ళ మాట వినుంటే బావుండునేమోనని!
***
కొత్త  ఒక వింత – పాత ఒక రోతకదా మనకి!
జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ
పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!
***
అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!
***
కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!
ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే
తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా
హృదయస్పందన కలిగించేలా
ఊకను దంచకుండా
ఊహలని పెంచితేనే
పది కలాలు రాసినా
పది కాలాల పాటు నిలిచినా
కవిత్వమనిపించాలి
కవిత్వమై ఆలపించాలి
కవిత్వానికి '' మానిఫెస్టోలా '' !

11.09.2013 సాయంత్రం 4.40

1 comment:

kapilaram said...


Narayana Sharma Mallavajjala 11:34pm Sep 12
ఈనాటికవిత-40
____________________________
కపిల రాంకుమార్ -కవిత్వానికి మానిఫెస్టో

కొన్నళ్ల తరువాతకావొచ్చు,తొలిదశలోనే కావొచ్చు కవులకు కవిత్వం మీదా,ఆయా రచనల మీదా,ప్రక్రియల మీదా,వస్తువుల మీద కొన్ని అభిప్రాయాలుకలుగుతాయి.నిజానికి ఇవ్వే కొన్ని సార్లు తరువాతి కాలాలకు మార్గదర్శకమౌతాయికూడా.శ్రీశ్రీ "కవితాఓ కవితా".లాంటి కవితలు అలాంటివే.

ప్రాచీన కావ్యంలో కావ్య"ముఖం"పేరుతో అవతారిక ఒకటి ఉండేది.కవులు అలాంటి వాటిలోనే తమతమ అభిప్రాయాలు చెప్పేవారు.ఈ కాలంలో కూడా కవిత్వం ఇలా ఉండాలి అంటూ ఒకటో ,అరో కవితావాక్యాలు రాయనివారుండరు.

కపిల రాంకుమార్ గారు అలాంటి అంశాన్నే కవిత్వం చేసారు.ఇందులో రాంకుమార్ కొంత పూర్వుల మాటలకు విలువనిచ్చి మాట్లాడినట్టు కనిపిస్తారు.సినారే ఒక పద్యంలో "అంత కడివెడు పాలపై ఒకింత మీగడపేరినట్లు మనకు మిగులును గతములోపలి మంచి అదియె సంప్రదాయము"అన్నారు.పాతనించి మిగుల్చుకునేది ఎంతో కొంత ఉంటుంది.

"జ్వరం తగ్గి పథ్యం చేసే వేళ/పాత చింతకాయ పచ్చడి,
నిమ్మకాయ కారం తప్పనిసరి అవుతుంది
లాలాజల వృద్ధికి, పూర్వ శక్తి కూడగట్టుకోడానికి!"

సాధరణంగా కనిపించినా ఈవాక్యాల వెనుక ఓ నేపథ్యముంది.ఈ మాటల వెనుక పరోక్షంగా ప్రాచీన సాహిత్యాధ్యయనాన్ని గూర్చి చెబుతున్నారు.

"అలాగే కావ్యేతిహాసాలను
ఎప్పుడైనా పలుకరిస్తేనే కదా
పుక్కిటి పురాణాలేవో, ప్రతీకలకు ఆధరవులేవో
ఉపయోగించాలా వద్దా అని తెలిసేది!"

ఒక వాక్యాన్ని కళాత్మకంగ,ఆలంకరికంగా ఎలాచెప్పాలో తెలియడానికి అధ్యయనం చాలా అవసరం.పురాణాలల్లోనూ ప్రతీకలని పట్టుకోడానికి మార్గాలున్నాయంటున్నారు.నిజమే. బోదెలార్ సుసన్నా లాంటి పాశ్చాత్యులుకూడా వారిపుస్తకాలలో పురుషోత్తముడిలాంటివారిగురించి చెప్పుకున్నారంటారు.ఈ అధ్యయనం ఏ కాలానికైనా చాలావసరమే కదా.

"కథకైనా, కవితకైనా
నడకనేది అవసరం!
నడతనేదీ అవసరం!"
చదివించే లక్షణం (Reedability)ఒకటి కవితకి చాల అవసరం.ఆనడక వెంటే పాఠకుడు పరిగెడతాడు.

"ఛందమను, శబ్దమను, అలంకారమను
ఉపమానమను తెలీకుండానే/తోసుకువస్తాయి వరసలోకి!
అల్లిక వదులుగానో, బిగుతుగానో అయినా/హృదయస్పందన కలిగించేలా"

పాల్ వాలరీ"కవిత్వం మేధకు కాదు హృదయానికి చేరాలి" అన్నాడు.అధ్యయనం వల్ల ఇవన్నీ పెద్దగా కష్ట పడకుండానే అలవడుతాయి.కవిత్వం ఎలా ఉన్న బిగుతుగా ,ప్రౌఢభాషతో ఎలావున్నా కవిత్వం లో కవిత్వం కనిపించాలని అంటారు.

చాలావరకు అందరికీ కవిత్వం ఎందుకురాస్తున్నామో అర్థం కాదు.పడికట్టు పదాలతో కవిత్వాన్ని నిలుపుకోలేము.వస్తువూ ఎక్కువకాలం నిలుపదు.కవిత్వమే కావాలి.అందుకోసం హృదయాన్ని ఆవిష్కరించే నేర్పుకావాలి.అందుకు అధ్యయనం, సాధన కావాలి.ఈ రెంటి గురించే రాంకుమార్ గారి కవిత మనకు సూచన లిచ్చింది.ధన్యవాదాలు రాం కుమార్ గారు మంచికవిత.