Friday, September 20, 2013

కపిల రాంకుమార్||| మాట - అర్థాలు పరమార్థాలు||

కపిల రాంకుమార్||| మాట - అర్థాలు పరమార్థాలు||

మాట = భాష కాని ఇంకేమైనా అర్థఛాయలు కనపడతాయేమో, చూద్దాం! అవి 
ఎన్నోవున్నాయి. ' ఏ మాటకామాటే చెప్పుకోవాలి ' మాష్టారు పాఠం చెప్పితే చాలా బాగా 
చెప్తారు. అంటే ఆయన పాఠం చెప్పడం అరుదు. కాని చెబితే చాల చక్కగా చెబుతారు 
అని అర్థం.దేశం కాని దేశంలో లేదా మనరాష్ట్రం కాని చోట తెలుగు మాటలు వినబడితే 
అవి తెలుగు పదాలని అర్థం. ఆ మాటలు ఎక్కడో విన్నట్టుంది కళ్ళు నులుంకుని చూచాను.
అంటే శబ్దాలు అని. ఈ ఒక్క సారి నా మాట విను, అటు వెళ్ళడం మానెయ్! చెప్పిన మాట
విన్నావంటే బాగుపడతావు, లేకపోతే నీ ఖర్మ! ఇక్కడ సలహా అని. గురుడు చెప్పిన మాట -
ధర్మ సూక్తి కావొచ్చు, ఆలి చెప్పిన మాట ఆజ్ఞ కూడ కావొచ్చు. నాన్న రాసిన నాలుగుపేజీల
వుత్తరంలో చెల్లెలు పెళ్ళిమాట ఎక్కడా లేదు, డబ్బు పంపమని తప్ప. వాళ్ళకి కట్నం మాట
ఎత్తితే కోపంట! - ఇక్కడ మాట అంటే ప్రస్తావన. వాడు నోటి మాట మీద లక్షలు పుట్టిస్తాడు.
మాట యిక్కడ భరోసాగానేనా? ఆ మాటకు వస్తే నేనూ వంట చెయ్యగలను తెలుసా!
మాట అంటే నిజంగానేనా? మొన్న నేనడిగిన డబ్బు మాట యేంచేసావ్? మాట అంటే
సంగతి/విషయం.ఇస్తానన్న మాట నిజమేగాని కాస్త నా మాట కూడ ఆలోచించు.
రెండు అర్థాలతో మాట. మీరు యెప్పుడు వచ్చేది, యేం చేసేది వేరే మాట, - మాట అనవసరం!
తిట్లమాట అటుంచు, దెబ్బలు కూడ పడ్డాయిగా? మాట విషయం/ సంగతి అవుతుంది
కరెంటు ఎలాదు యిపుడా చదువు మాట లేకపోతే స్విచ్చులన్ని ఆర్పేయరాదూ? మాట ఇక్కడ
ఉద్దేశం/ఆలోచన. నువ్వు వాళ్ళింటికి వెళ్ళే మాట తేలుస్తే, నేను నాకోసం అత్తెసరు వేసుకుంటా
మాట ఇక్కడ నిర్ణయమని/ఖచ్చితమని. ఆయన మాటే ఎప్పుడు పై మాట అంటే ఆయన నిర్ణయమే
ఖరారని. మా పాపకి మాటలు వస్తున్నాయి. వ్యక్తీరణ స్థితి వాడి మాట ఆవిడ దగ్గర యెత్తకు
మాట - ఊసు, ప్రస్థావన. నేను మాట యిచ్చాను తిరిగులేదు. వాగ్దానం. ఇదుగో ఆడిన మాట
తప్పడం మా యింటా వంటా లేదు. వాగ్దాన భంగం/మాట తప్పడం. ఎవరీ చెప్పనని మాటయిస్తే
అసలు విషయం చెబుతా! మాట ఒట్టులాంటిది. ఒరే మాటలు తూలకు! నోరు జారకు, మాట
జారకు అని. నేను మాట పదే వాడిని కాను. మాట ఇక్కడ అపవాదు అని. వాడు వూరకే మాటలు
తేల్చేస్తాడు.చూసావా ఎలా మాటలు నముల్తున్నాడో . నిర్దిష్టంగా లేకపోవటం/ దాటివేయటం.
ఇవాళవున్న పరిస్థితి ఐదురోజుల పెళ్ళంటే మాటలా? అన్నా, హైదరాబాదులొ ఉదయం
9 గంటలపుడు బస్సెక్కడమంటే మాటలా? ..కష్టమైన పని, సాధ్యం కానిది, ప్రయాసతో కూడినది
అనే అర్థాలు - మాటకు చెందుతాయి. మా ఆవిడకు నాకు మాటలు లేవు పొద్దుటినుండి. అంటే
అభిప్రాయ భేదాన్ని సూచిస్తుంది. మా నాన్నకి ఆ వకీలుకి మాటలు లేవు, నేనక్కడికి పోను.
అంటే శతృత్వం సూచిస్తుంది. మాటవరసకి అన్నానే అనుకో అలా చెప్పాపెట్టకూండా వెళ్ళడమే
అంటే ఉదాహరణకి అలా అన్నందుకు వెడతావా అని.'' మాటా మంతీ '' అంటే....సంభాషణ అని,
ఆ అమ్మాయి మాటల పోగు ' . అంటే మాటకారి. కబుర్ల పుట్ట. పని అయేఏసరికి ఎంత టైం అవుతుందో
మంచి మాట చేసుకుని వెళ్ళు......మర్మగర్భంగా భోజనం చేసి వెళ్ళు అని. అందుకే వాడితో స్నేహం
మానేసా మొన్నటినుంచి, నీ గురించే వాడికి నాకు మాటా మాటాఅనుకున్నాం. తగాదా పడ్డాం అని.
మాట .....ఎన్ని అర్థాలను వెదజల్లిందో...
___________________________________________
'' పదుగురాడుమాట పాటియై (పాడియై) ధరచెల్లు ......అని మనం వినేవుంటాం.
మాట అర్థం ఒక్కొక్క సందర్భాలలో ఎలా మారుతువుంటుందో జొన్నలగడ్డ
వెంకటేశ్వరరావు గారు '' తెలుగు పదాలు-అర్థాలు-పరమార్థాలు '' అనే వ్యాసం
' సాహితీ స్రవంతి ' మాసపత్రిక (సి.పి.బ్రౌన్‌ అకాడేమీ ప్రచురణ జనవరి 2012)
_సంచికలో (పేజి 50,51)..ఆధారంగా
__________________________________________
18.9.2013 సా.4.20

No comments: