Wednesday, September 4, 2013

కపిల రాంకుమార్ ||బడి పిల్లలు - నీ ఒడి పిల్లలు||

కపిల రాంకుమార్ ||బడి పిల్లలు - నీ ఒడి పిల్లలు||

బడిపిల్లలు - నీ ఒడి పిల్లలు
బుడిబుడి నడకల బుడతలు వీరు

మరకలు లేని మరకత మణులు
మర్మాలెరుగని మందారాలు
అక్కున చేర్చి మక్కువ తీర
పాటలతో ఆటలతో
పాఠాలను అందించు!

మొక్కలు వీరు పసి - మొగ్గలు వీరు
అరమరికెరుగని - విరజాజులు వీరు!
ఇష్టపడే రీతి - కష్టపడె తీరు
సష్టవాలు పెంచు స్పష్టత కలిగించు

శిక్షణలో ఔదార్యం రక్షణలో సమతుల్యం

లక్ష్యాల బాటలపై లక్షణంగ నడుపు!
ఇంటివద్ద విసుగును ఇంటివద్దే వదిలి
కంటికి రెప్పలా కాపాడుతు వుండు!

మట్టిలోని మాణిక్యాలను మెరుగు దిద్దె శిల్పివై
మట్టి ఋణం తీర్చగాను వెరపెరుగని రైతువై
శత్రువలను దునుమాడ సరిహద్దుల జవానువై
బాధ్యతలు చేపట్టిన బుద్ధి జీవి నీవయ్య!

నీ జీతం పెరుగుదల నికెంత ముఖ్యమో
వారి జీవితమెదుగుట అదియంతే ముఖ్యం!
జాతికీర్తి నలుదిశలా వ్యాప్తిచేసే శక్తి నివ్వు
తరిగిపోని జ్ఞానమిచ్చే దాతవీవు పంతులయ్య!

సుద్దులెన్నొ నేర్పి పౌరులుగ తీర్చిదిద్ది
నీ పేరును నిలిపేలా శిష్యులను మలచు
గురువంటె దైవమనే భావన మంచిదే
పరువును పరువున పరువులో చేరనీకు!
_____________
(రచనా కాలం 2005)
4.9.2013 రాత్రి 8.21 (ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆశంస)

1 comment:

kapilaram said...

సష్టవాలు = సౌష్టవాలు ( సవరణ .. టైపు ఎర్రర్ )