17, నవంబర్ 2012, శనివారం

అభినయ దర్పణము – తెలుగుసేత -లింగముగుంట మాతృభూతయ్య

అభినయ దర్పణము – తెలుగుసేత -లింగముగుంట మాతృభూతయ్య
More articles by మల్లిన నరసింహారావు »
Written by: మల్లిన నరసింహారావు
Tags: Abhinaya Darpanam

2010వ సంవత్సరం డిశెంబరు నెల 24 -26 తేదీల మధ్య భాగ్యనగరంలోని ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో సిలికానాంధ్రవారు ఇంటర్నేషనల్ కూచిపూడి డాన్స్ కన్వెన్షన్ ను నిర్వహించారు. దానిలో ప్రేక్షకునిగా పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. ఆ నిర్వహకులు వచ్చిన వారికందరికీ సిలికానాంధ్ర వారు ప్రచురించిన ”సుజన రంజని – నాట్యమంజరి” అనే పేరుతో ఆ సందర్భంగా విడుదల చేసిన సావనీరును బహుమతిగా పంచిపెట్టారు. ఆ సావనీరులో చివర అనుబంధంగా “అభినయదర్పణము” అనే పేరుకల – లింగముగుంట మాతృభూతయ్య కవి విరచితమైన – ఓ చిరుపొత్తాన్నిచేర్చటం జరిగింది. ఈ అభినయ దర్పణము బహు సుందరమైనది. నాట్యాభ్యాసకులకు, నాట్యంలోని అభినయ ముద్రలను గుఱించి తెలుసుకోవాలన్న కుతూహలం ఉన్నవారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అనిపించింది. దీనిని మన పుస్తకం.నెట్ చదువరులకు పరిచయం చేస్తే బాగుంటుందని అనిపించి ఇక్కడ దానిని పొందు పరుస్తున్నాను. ఇది 3 ఆశ్వాసాలతో కూడి ఉన్నది. పద్యాలు చాలా సరళంగానూ మంచి ధారాశుద్ధి కలిగిన్నీ ఉన్నాయి. ఓ 6-7 భాగాలుగా దీనిని పరిచయం చేద్దామని ప్రయత్నం. మొదటి భాగాన్ని క్రింద ఇస్తున్నాను.
అభినయదర్పణము – 1
— వ్రాసిన కవి లింగముగుంట మాతృభూతయ్య
శ్రీకరమై చెలంగు సరసీరుహమిత్రుని పాదపద్మముల్
సేకొని వందనంబులను జేసి ముదంబున యాజ్ఞవల్క్యులం
బ్రాకట మొందఁగాను మఱి ప్రార్థనచేసి ముదంబు మీఱఁగా
నైకవిధాల నామహుని నారసి యేఁ ప్రణమిల్లి గొల్చెదన్. 1

శ్రీ విలసిల్లుపార్వతికిఁ జెన్నుగఁ బుత్రుఁడుగా జనించి యా
భావజుభావ మై దనరి భక్తులపాలిటి పారిజాతమై
యీవగ నెల్లలోకముల నేలెడి యా గణనాథు కెప్పుడున్
సేవ యొనర్చెదన్ మిగులఁ జిత్తములో నను బాయ కుండఁగన్. 2

సరసిజనాభ ! దేవమునిసన్నుత ! మాధవ ! భక్తపోషణా !
పరమదయానిధీ ! పతితపావన ! పన్నగతల్ప ! కేశవా !
కరివరదాప్రమేయ ! భవఖండన ! యో జగదీశ ! కావవే
మురహరి ! వాసుదేవ ! యఘమోచన ! కస్తురిరంగనాయకా! 3

శారద ! నిన్ను గొల్చెదను సారెకు, నా మనవాలకింపవే
నారదుఁ గన్నతల్లి ! కృప నాయెడ నుంచి వరంబు లియ్యవే
నీరజనేత్రి ! విద్యలకు నీవె గదా మఱి వేల్పు ధాత్రిలోఁ
గూరిమి మీఱఁ గొల్చెదను, గోర్కెలొసంగు మదంబ ! వేఁడెదన్. 4

ధరలోన రామచంద్రుని
చరితము గావ్యంబుగాను సల్పి జగంబుల్
వెరగందఁ జేయు మౌనిని
నిరవుగ భజియింతు నేను నింపుగ ధాత్రిన్. 5

సకలపురాణంబులు నిలఁ
బ్రకటంబుగఁ జేసి, మిగుల భారత కథయున్,
రకముగఁ దెల్పిన మౌనికి
నిఁక నే వందన మొనర్తు నింపలరంగన్. 6

పరఁగ నల కాళిదాసుని బాణు నెలమి
దండి భవభూతి మాఘుల మెండుగాను
ధరను సజ్జనులగు వారి కరుణఁ గోరి
సరస సత్కవులను నేను సన్నుతింతు. 7

అవని భాగవతోత్తముఁ డనఁగఁ బరఁగు
పొంకముగఁ జాల బమ్మెర పోతరాజు
సొరిది శ్రీనాథుఁ దిక్కన సోమయాజి
భాస్కరుని సన్నుతింతును బాగు మీఱ. 8

ఎలమి నిరక్షరకుక్షులఁ
బలుమఱు నే ధిక్కరించి ప్రభవ మొప్పం
జెలు వొందఁ గృతియుఁ జెప్పెద
సలలితసత్కవులు సూచి సన్నుతి సలుపన్. 9

సరవి లింగమగుంట శంకరనారనా
ర్యునకుఁ బౌత్రుండ నయి దనరు వాఁడ
ననువుగా మృత్యుంజయార్యుపుత్రుండ నై
నిరతంబుఁ గీర్తిచే నెగడువాఁడఁ
బరమపావనుఁ డైన కరిరాజవరదుని
వరముచే జనియించి పరఁగువాఁడ
ననువుగఁ జెలు వొందు యాజ్ఞవల్కాచార్యు
కరుణకుఁ బాత్రమై మెఱయువాఁడ.

నమరఁ గాశ్యపగోత్రజుఁ డైనవాఁడఁ
జేరి హరిదాసులకు సేవ చేయువాఁడ
నవనిఁ గవి మాతృభూత నామాన్వితుఁడుగఁ
జెలగువాఁడను శ్రీహరి గొలుచువాఁడ. 10
వ. అని యిట్లు కమలమిత్రుఁ డైన మార్తాండునికి వందనంబు గావించి, మదీయ కులాచార్యులైన యాజ్ఞవల్కులకు బ్రణమిల్లి, గణనాధునిం బూజించి, యిష్ట దేవతా ప్రార్థనంబు సేసి, భారతిని బ్రణుతించి, యాదికవీంద్రులైన వాల్మీకి వ్యాసాది మునీంద్రులం బ్రస్తుతించి, వరకవి కాళిదాసాదులన్ సన్నుతించి, యాంధ్రకవి పితామహులైన బమ్మెరపోతరాజు, శ్రీనాథులం గొనియాడి, కుకవి తిరస్కారంబునుం జేసి, మదీయ వంశావలంబులన్ సన్నుతించి, యొకానొక ప్రబంధంబు రచియింపంబూని యున్న యవసరంబున, నొక్కనాడు మదీయ స్వప్నంబున, 11
నీలమేఘము వంటి నెమ్మేను గలవాఁడుఁ
డంబైన పీతాంబరంబువాఁడు
నీరజారిని గేరునెమ్మోము గలవాఁడుఁ
గరమున శంఖచక్రములవాఁడుఁ
గస్తూరితిలకంబు సిస్తు మీఱినవాఁడుఁ
గమలంబులను గెల్చు కనులవాఁడుఁ
శ్రీవత్సకౌస్తుభాంచిత వక్షుఁడగువాఁడుఁ
బక్షివాహనుఁ డయి పరఁగువాఁడుఁ

చెలఁగి యొకనాఁడు స్వప్నమం దెలమి వచ్చి
యెనసి యభినయదర్పణం బనఁగ నిలను
ఘనప్రబంధము నొక్కటి గరిమ మీఱఁ
బూని రచియింపు మనుచును నానతిచ్చె. 12

శ్రీకరగుణహార ! శ్రితజనమందార !
హరి ! వాసుదేవ ! మహానుభావ !
చారుమోహనగాత్ర ! సన్మునిస్తుతిపాత్ర !
యినకోటిసంకాశ ! యిందిరేశ !
గోవర్ధనోద్ధార ! గోబృందపరివార !
భావనాసంచార ! భవవిదూర !
యరవిందలోచన ! యఘభయమోచన !
పంకజాసననుత ! భవ్యచరిత !

వరద ! యచ్యుత ! గోవింద ! హరి ! ముకుంద !
భక్తజనపోష ! మృదుభాష ! పరమపురుష !
సరసగుణహార ! శ్రీరంగపురవిహార !
రాక్షసవిరామ !కస్తూరిరంగధామ ! 13
షష్ట్యంతములు
కమలాప్తతేజునకు నా
కమలాసనవందితునకు గమలాపతికిం
గమలారివదనునకు మఱి
కమలజదళ నేత్రునకుఁ గరివరదునకున్. 14

కువలయదళనిభనేత్రుకుఁ
గువలయదళగాత్రునకును గుణశీలునకుం
గువలయపరిపాలునకును
గువలయనాథునకు మదనగోపాలునకున్. 15

హరిసుత పరిపాలునకును
హరివైరితురంగునకును హరివదనునకున్
హరిధరునిమిత్రునకు నా
హరిరూపముఁ దాల్చినట్టి హరిరంగనికిన్. 16
వ.
అభ్యుదయ పరంపరాభివృద్ధిగ నా యొనర్పఁబూనిన యభినయదర్పణంబను మహాప్రబంధమునకు లక్ష్యలక్షణంబు లెట్టి వనిన. 17

అభినయ దర్పణము -2

అభినయ దర్పణం సంస్కృతంలో నందికేశ్వరునిచే రచింపబడిన గ్రంథం. Digital library లో దొరుకుతుంది. లింకు ఇదిగో. http://www.dli.ernet.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0012/538&first=1&last=119&barcode=2020120012533

తరువాత మాతృభూతయ్య గారి అనువాదం ఇలా సాగింది.
ధరను విలసిల్లునభినయదర్పణంబు
గరిమ నిది పద్యకావ్యంబు గా నొనర్తు
సరవి మీఱంగఁ గరుణింపు, సన్నుతాంగ !
రాక్షస విరామ ! కస్తురి రంగధామ ! 18

ఇక్కడితో ఉపోద్ఘాతం పూర్తవుతుంది. ఇక్కడినుండి నందికేశ్వరుని సంస్కృత అభినయ దర్పణానికి తెలుగు పద్యాలలో మాతృభూతయ్య గారి అనువాదం కొనసాగుతుంది.
నందికేశ్వరుని మూలం
కంఠే నాలమ్బయేత్ గీతం హస్తే నార్థం ప్రదర్శయేత్ !
చక్షుర్భ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళ మాచరేత్!! 1

యతో హస్తః తతో దృష్టిః యతో దృష్టిః తతో మనః!
యతో మనః తతో భావః యతో భావః తతో రసః!! 2
(నటించు పాత్రము కంఠముచేత గానమును, హస్తాభినయముచే దాని అర్థమును, నేత్రములచే అందలి భావమును, కాళ్ళతో తాళమును నడుపవలయును.
ఎచ్చట హస్తము వినియోగింపబడునో అచ్చట దృష్టియు, ఆ దృష్టియున్నచోటనే మనస్సును, ఆ మనస్సు ఉన్నచోటనే భావము ఉండునెడల ఆ రసము పుట్టును.)
దీనికి మాతృభూతయ్యగారి ఆంధ్రానువాదం.

చెలు వొంద గీతంబు చెన్ను మీఱఁగఁ బాడి
యర్థంబుఁ గరముల నమర బట్టి
పరఁగఁ గన్నులయందు భావంబుఁ దగ నుంచి
పదములఁ దాళంబు బరగదీర్చి
హస్తంబు పొడచూపునచట దృష్టియు నుంచి
మఱి దృష్టి గలచోట మనసు నిల్పి
మనసు నిల్పినయెడ నెనయ భావము నుంచి
భావంబుతో రసం బలరఁజేసి

యెలమి నివియెల్ల నొక్క టై మెలఁగుచుండ
నట్టిదే సూడ నిలలోన నభినయంబు
నెనసి భరతజ్ఞు లిది మెత్తు రింపు మీఱ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 19

వ.
ఇట్లు, ఋగ్యజుస్సామవేదంబులచేత బోధింపబడిన నాట్యశాస్త్రంబు బ్రహ్మదేవుం డను భరతజ్ఞునివలన గంధర్వులు నప్సర స్త్రీగణంబులు బోధింపఁ బడిన వారలైరి. వారలచేత దేవలోకంబున నీ భరతశాస్త్రార్థంబు విశదమై గనఁబడుచుండె. నంత. 20
సరగున నొక్కనాఁ డలరి శంభుడు మిక్కిలి ప్రేమతోడుతం
జెలువుగ నాట్యశాస్త్రమును జెన్నుగఁ బార్వతిదేవి కొప్పుగం
బలుమరు బోధచేయుచును భావములన్ వివరించునంత, నా
నెలఁత ముదంబు జెందె, మఱి నిక్కము, గస్తురి రంగనాయకా ! 21

అంతట, నార్య ధాత్రిఁ గల యా ముని సంఘముతోడఁ బ్రేముడిన్
వింతగ నాట్యశాస్త్రమును వేమఱు భావము వీడఁ దెల్పినన్,
సంతస మంది యా మునులు సారెకు నార్యకు మ్రొక్కి వార ల
త్యంత వినోదయుక్తులయి రంబుజలోచన ! రంగనాయకా !22

నాట్య శాస్త్రంబు మునులు సౌరాష్ట్రదేశ
స్త్రీలకును దెల్ప, వారిచేఁ జెలువు మీఱి
సకల దేశంబు లందెల్ల సాగి మహిని
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 23

అలరు నీ నాట్య శాస్త్రంబు నరసి యజుఁడు
వెలయ మఱి దాని మహిమలు విశదముగను
దెలియఁ బల్కెను జగమెల్లఁ దేటపడఁగ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 24

తనరు నీ నాట్య శాస్త్రం బభ్యసించినఁ
బొలుపొంద సంపద ల్వొందియుండుఁ
బరఁగను సౌఖ్యంబుఁ బ్రౌఢత్వమును జెంది
ధర నుదారంబుగా మెఱయుచుండుఁ
బలుమాఱు సత్కీర్తి వడసి సంతస మొంది
యెలమి సద్గుణముల వెలసియుండు
స్థిరధైర్యమునఁ జాలఁ జె న్నొంది మిగులను
జెలఁగి సుజ్ఞాని యై వెలుగుచుండు

భోదములు లేక నెమ్మది మోద మలర
నొనరి యేవేళ సద్గోష్టి నెనసియుండు
ననుచుఁ బల్కిన నా ధాత ఘనత మీఱ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 25

నారదారి మునీంద్రు లీ నాట్యశాస్త్ర
మందుఁ జిత్తంబులను నుంచి యద్భుతముగ
నెనసి యానందపరులయి రింపు మీఱ
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 26  

అభినయ దర్పణము – 3
సభా లక్షణము:
సంస్కృత కావ్యం నుండి:
శ్లో!!
సభాకల్పతరుర్భాతిః వేదశాఖోపశోభితః !
శాస్త్రపుష్పసమాకీర్ణోః విద్భద్భ్రమరసంయుతః !!

( సభ యనెడి కల్పవృక్షము వేదములనెడి కొమ్మలచేత ప్రకాశించునదియు, శాస్త్రములనెడి పుష్పములచేత నిండుకొన్నదియును, విద్వాంసులనెడి తుమ్మెదలతో గూడినదియునై వెలుగుచున్నది.)
శ్లో!!
సత్యాచారసభా గుణోజ్జ్వలసభా సద్ధర్మకీర్తి స్సభా!
వేదాలంకృత రాజపూజితసభా వేదాన్తవేద్యాసభా!!
శ్లో!!
వీణావాణివిశేషలక్షితసభా విఖ్యాతవీరాసభా!
రాజద్రాజకుమారశోభితసభా రాజత్ప్ర కాన్తిస్సభా!!

(సత్యముతప్పక నడపువారు గలదియును, సద్గుణములచే మెరయునదియును, మంచి దర్శనమును కీర్తియును గలిగినదియు, వేదము చదివిన రాజులచేత పూజింపబడినదియు, వేదాంతము నెఱిగినదియు, వీణాగానము, వాచిక గానము మొదలగువానితో గూడినదియు, ప్రసిద్ధవీరులు గలదియు, తేజస్సుచేత వెలుగుచున్న రాజకుమారుల చేత ప్రకాశించునదియు, ప్రకాశించుచున్న కాంతి గలదియు సభ అనబడును. అనగా సభ యనునది యిన్ని లక్షణములు గలదయి యుండవలయుననుట.)

మాతృభూతయ్యగారి సభాలక్షణము:
తనరు సభ యను నల కల్పతరువునకును
శ్రుతులు శాఖలు, శాస్త్రముల్ సొరిది విరులు
చెలఁగు, విద్వాంసు లల తుమ్మెదలుగఁ బరఁగు,
రాక్షస విరామ ! కస్తురి రంగధామ ! 27

సభా సప్తాంగ లక్షణములు:
సంస్కృత దర్పణము:
శ్లో!!
విద్వాంసః కవయోః భట్టాః గాయకాః పరిహాసకాః !
ఇతిహాస పురాణజ్ఞాః సభా సప్తాఙ్గ లక్షణమ్ !!
(విద్వాంసులు, కవులు, పెద్దలు, పాఠకులు, పరిహాసకులు, ఇతిహాసములను తెలిసినవారు, పురాణములను తెలిసినవారు, అనునవి యేడును సభయొక్క యేడు అంగములు అగును)
కవులు విద్వాంసులును బట్లు గాయకు లితి
హాసహాస్యపురాణజ్ఞు లలరి యెలమి
వెలయ సభకును సప్తాంగములును నివియె
రాక్షస విరామ ! కస్తురి రంగధామ !! 28

సభానాయక లక్షణమ్:
శ్లో!!
శ్రీమాన్ ధీమాన్ వివేకీ వితరణనిపుణోః గానవిద్యాప్రవీణః !
సర్వజ్ఞః కీర్తిశాలీః సరసగుణయుతోః హావభావేష్వభిజ్ఞః !
మాత్సర్యా2ద్యైర్విహీనః ప్రకృతిహితః సదా2చారశీలోదయాళుః !
ధీరోదాత్తః కలావాన్ నృపనయచతురోసౌ సభానాయకస్స్యాత్ !!
(సంపద గలవాడును, మంచిబుద్ధిమంతుడును, యుక్తాయుక్తవివేకము గలవాడును, దానశీలుడును, గానవిద్య యందు నేర్పు గలవాడును, అన్నియు తెలిసినవాడును, కీర్తిచేత ఒప్పినవాడును, సరసగుణములు గలవాడును, హావభావముల యందలి తెలివి గలవాడును, మాత్సర్యాది దుర్గుణములు లేనివాడును, ఆయాకాలములకు తగిన మంచి నడవళ్ళ నెరిగినవాడును, దయ గలవాడును, ధీరోదాత్తుడును, విద్వాంసుడును, రాజనీతియందు చతురుడును అగువాడు సభానాయకుడు అగును. బుద్ధి యనగా అప్పటికి తోచునట్టిది.)

మాతృభూతయ్యగారి సభాపతి లక్షణము:
శ్రీమంతుఁడై చాలఁ జెన్నొంది ధీరుఁడై
వితరణశీలుఁ డై వెలయువాఁడు
గానవిద్య దెలిసి ఘనకీర్తి శాలి యై
సరససద్గుణములఁ బరఁగువాఁడు
నిరు వొంద సత్కవిహృదయంబు లరయుచు
ధాతయై మిక్కిలి తనరువాఁడు
భావజ్ఞుఁ డనఁగను బరమదయాళుఁ డై
మఱియు సర్వజ్ఞుఁ డై మెఱయువాఁడు

నెలమి శృంగారలీలల మెలఁగువాఁడు
నెనసి సౌందర్యవంతుఁ డై దనరువాఁడు
నిల సభాపతి యనఁగను వెలయువాఁడు
రాక్షస విరామ ! కస్తురి రంగధామ ! 29

అభినయ దర్పణము -4
(“అభినయ దర్పణము” గ్రంథానికి సంబంధించి వస్తున్న వ్యాసాల్లో నాలుగవది ఇది. ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవవచ్చు)

నాట్యప్రశంస:

మెఱయు సభాపతి ముందఱ
సరవిగ నాట్యంబు నవరసంబులుఁ దొలఁకన్
మఱి సత్కవి సన్నుతముగ
గరిమను సలుపంగవలయుఁ గస్తురిరంగా! 30

నాట్యవినియోగము:

ఇరవుగ నుత్సవాదులను నింపుగఁ బట్టము గట్టువేళలం
బరఁగ వివాహవేళ మఱి బాగుగ శోభనవేళలందునున్
మెఱయ గృహప్రవేశమున మేల్మిని బుత్రుడు గల్గువేళలన్
సరవిగ నాట్యమున్ సలుప సంతసమొప్పును, రంగనాయకా ! 31

సంస్కృత దర్పణములో రంగ లక్షణమును గుఱించి ఇలా చెప్తారు.

రఙ్గలక్షణమ్:

శ్లో!! ఏవంవిధస్సభానాధః ప్రాజ్ఞ్ముఖోనివసేన్ముదా!
వసేయుః పార్శ్వతత్తస్య కవిమన్త్రిసుహృజ్జనాః!!
(ఇట్లు సభానాయకుడు సంతోషముతో తూర్పుముఖముగా గూర్చుండగా వానిప్రక్కలను కవి, మంత్రి, సుహృజ్జనము లుండవలయును)

శ్లో!! తదగ్రే నటనం కార్యం తత్స్థలం రఙ్గముచ్యతే !!
(ఆ రాజున కెదుట నటనము చేయవలయును. ఆ స్థలము రంగము అనబడును)

(సంస్కృత దర్పణమునకు లింగముగుంటవారిది యథాతథానువాదము కాదు. నందికేశ్వరుడు, మాతృభూతయ్య వీరిరువురూ కూడా భరతార్ణవమో మరొకటో సంస్కృతమూలాన్ని అనుసరించి స్వతంత్రముగా రచన చేసారని ప్రాజ్ఞులంటారు. ఎందుకంటే కొన్ని కొన్ని ఇందులో ఉన్నవి అందులో ఉండవు. ఇంకొన్ని అందులో ఉన్నవి ఇందులో కనబడవు.)

మాతృభూతయ్యగారి రంగపూజ:

చెలఁగుచు రంగపూజ మఱి సేయక దేవళమందు నైనఁ దాఁ
బలుమఱుఁ బట్నమం దయినఁ బాటిగ నాట్యము లోలి సల్పుచో
నెలమిని నాస్థలంబులకు నెప్పుడు నగ్నినిరోధ మంచునన్
వెలఁయగ శాస్త్రముల్ పలుకు వేమఱుఁ గస్తురిరంగనాయకా ! 32

రంగపూజా యంత్రలక్షణము:

నాల్గుకోణంబులు నయ మొప్పఁగా వ్రాసి
మొనసి యా నాలుగుమూలలందు
బాగుగా నాలుగు పద్మంబులను వ్రాసి
వశముగా నాలుగు దిశలయందుఁ

బ్రక్కకు రెండేసిపద్మంబులును గాను
జెలఁగ నెన్మిదిపద్మములను వ్రాసి
యందు మధ్యంబున ననువుగా వృత్తాలు
మఱి మూడు గుంపుగాఁ బరఁగ వ్రాసి

సొరిది వృత్తాలచుట్టును సొంపు మీఱ
వరుసఁ జతురంబుగా గీఁత వ్రాయఁగాను
జాలు నది రంగయంత్ర మై, మేలు దనరు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 33

రంగపూజా యంత్రాధిదేవతలు:

పరగఁ దూర్పునను దిక్పాలకు లాగ్నేయ
మందంగ దేవత ల్పొందుగాను
యమదిశయందును నలరఁ ద్రిమూర్తులు
నైరృతియందు వినాయకుండు

వరుణభాగంబున మఱి షణ్ముఖుండును
వాయుదిక్కున క్షేత్రపాలకుండు
నుత్తరదిక్కున నొగి నాందిదేవతల్
సప్తమాతృకలు నీశానమునను

జెలఁగి యధిదేవతలు గాను జెలువు మీఱి
యలచతుర్వింశ దేవతల్ వెలసి మిగుల
నలరియుండుదు రీ రంగయంత్రమునకు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 34

రంగపూజా ద్రవ్యములు:

గణనాథునికి మంచిగరికె సమర్పణ
శ్రీషణ్ముఖునకు నక్షింతలొప్ప
నిల క్షేత్రపాలున కిం పొంద జాజులు
దిలలును నల నాందిదేవతలకు

సరవి మీఱంగను సప్తమాతృకలకుఁ
గూరిమి యగు జపాకుసుమములును
సరగఁ ద్రిమూర్త్యాది సకలదేవతలకు
మల్లెలు మొల్లలు మంచివిరులు

నెనసి యీరీతి వారి కర్చన మొనర్చి
వెలయుఫలముల నైవేద్యములను సల్పి
వందనంబుల నొనరింపవలయుఁ జుమ్ము!
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 35


అభినయ దర్పణము-5
More articles by మల్లిన నరసింహారావు »
Written by: మల్లిన నరసింహారావు

(“అభినయ దర్పణము” గ్రంథానికి సంబంధించి వస్తున్న వ్యాసాల్లో ఐదవది ఇది. ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలన్నీ ఇక్కడ చదవవచ్చు)

భూమ్యుద్భవ లక్షణము

సరవిగా నంబరశబ్దంబువలనను
వాయువు పుట్టెను వరుసగాను
సరగ నవ్వాయుసంస్పర్శంబువలనను
బొలు పొందఁ దేజంబు గలిగె నంతఁ
గూర్మిఁ దేజసత్త్వగుణమువలనఁ జాల
నొప్పుగఁ నటు ధాత్రి యుద్భవించెఁ

బంచృశత్కోటియోజనపరిమిత మది
పరఁగ బంగారువర్ణమై పరిఢవిల్లు
సరసగుణహార ! శ్రీరంగపురవిహార !
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 36
(ఇక్కడి సీస పద్యంలో 6 చరణాలే ఉన్నవి, 8 చరణాలకు బదులుగా)

భూమి లక్షణము

చెలఁగ సుభద్రయు భద్రక
తుల లేనటువంటి పూర్ణధూమ్ర యనంగా
నిల మఱి నాలుగునిధములు
గలిగియు శోభిల్లుచుండుఁ గస్తురిరంగా ! 37

సుభద్రాభూమి లక్షణము

నయ మొప్ప ధాత్రియు నాల్గుకోణంబు లై
వైపుగా బంగారు వర్ణ మమరి
ప్రియ మొందఁగ లకారబీజసంయుక్త మై
పరమేష్ఠి దేవతై పరఁగుచుండు
సరవిని మఱి చరాచరములు ధరియించి
తగ సమస్తమున కాధార మగుచు
సలలితంబుగఁ బంచశత్కోటియోజన
విస్తీర్ణముం గల్గి వేడ్క మీఱ

గరిమ నాధారశక్తి గాఁ గమఠ మమరి
యష్టదిగ్దంతులను బైని నలరఁగాను
బరఁగ శేషునిపైని సుభద్ర మెఱసె
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 38

భద్రకాభూమి లక్షణము

సరగ మఱి విష్ణుశక్తిచే శంఖవర్ణ
మొదవి నవరత్నమయముగా ముదము మీఱి
భద్రక యనెడియాధాత్రి పరఁగుచుండు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 39

పూర్ణాభూమి లక్షణము

వెలసి శంకరుశక్తిచే నలరి మిగుల
రక్తవర్ణంబునున్ బహురత్నములను
గలిగి శోభిల్లి పూర్ణయుం జెలువు మీఱు
రాక్షస విరామ ! కస్తురిరంగధామ ! 40

ధూమ్రభూమి లక్షణము

పరఁగఁ ద్రిమూర్తిశక్తియును బచ్చనివర్ణముఁ గల్గి ధాత్రియున్
గరిమను నారికేళక్రముకంబులు వృక్షము లెల్లఁ బర్వఁగా
నిరవుగ భూసురోత్తములు నెల్లెడలన్ వసియింప మిక్కిలిం
బరఁగును ధూమ్ర యీవగను బాగుగఁ గస్తురిరంగనాయకా ! 41


అభినయ దర్పణము -6

(ఈ శీర్షికలో వస్తున్న వ్యాసాలు ఇక్కడ చూడండి)

తాళ లక్షణము

అంబరంబున నల తకారంబు పుట్టె
ధారుణిని నుద్భవించె ళకార మెలమి
దనరి యీ రెండునుం గూడిఁ దాళ మయ్యె
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 42

తకార ళకారములకు స్వరూపదేవతలు
పరఁగఁ దకారమె యీశుం
డరయ ళ కారంబె శక్తి యా శివశక్తుల్
పరఁగఁగ, వారల కూటమి
గరిమను దాళంబు నయ్యెఁ గస్తురిరంగా ! 43

తాళాధి దేవతలు

అల తకారంబునకు వేల్పుఁ దపనుఁ డయ్యెఁ,
గోరి శశి దేవతయ్యె ళ కారమునకు,
నిలను దాళంబునకు వేల్పు లినుఁడు శశియు,
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 44

తాండవ నృత్య లక్షణము
అల తకారంబె తాండవ మయ్యె మిగుల
మఱి ళ కారంబె నృత్యమై మహిని వెలసె
దనర నీ రెండుఁ గూడినఁ దాళ మయ్యె
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 45

నట్టువు లక్షణము

సారజ్ఞుఁడై నాట్యచర్యుఁడు నై నృత్య
శిక్షయందలి నేర్పు చెలఁగువాఁడు
సూళాదిసంకీర్ణ తాళాదుల నెఱింగి
భావజ్ఞుఁ డగుచును బరఁగువాఁడు
హస్తభేదంబులు నల మండలాదులు
నంగరేఖలుఁ దెల్పి యలరువాఁడు
గాయకుఁ డై తాను ఘనకీర్తిశాలి యై
కాలనిర్ణయములు గలుగువాఁడు

మఱి నవరసములు నెఱింగి మెఱయు వాఁడు
బండితుం డన సుగుణి యై ప్రబలువాఁడు
ధరను నట్టువు గాఁ జెల్లుఁ దగవు గాను
రాక్షసవిరామ ! కస్తురిరంగధామ ! 46

నట్టువున కంగదేవతలు

విను బాహుమూల వాణియు
ననువుగ నదె బాహుమధ్యమం దిందిర దా
నెనయఁ గరాగ్రమునన్ మృడ
ఘన వామకరంబునందుఁ గస్తురిరంగా ! 47

మఱి బాహుమూల బ్రహ్మయు
హరువుగ నా బాహుమధ్యమందున హరియుం
బరఁగఁ గరాగ్రం బీశుఁడు,
గరిమను దక్షిణ కరాన కస్తురిరంగా ! 48

గాయకుని లక్షణము

ఎలమి స్వరజ్ఞానంబును
సరవి లయజ్ఞానమును సుశారీరంబున్
గలపండితుఁడై ధైర్యముఁ
గలవాఁడగు గాయకుండు, కస్తురిరంగా ! 49

పాత్ర లక్షణము

సరసిజ నేత్రియై సౌందర్యశాలియై
చెండ్లను గెల్చు పాలిండ్లతోను
సరవిగా రత్నభూషణములు ధరియించి
చిఱునవ్వు మోమునఁ జెలువు మీఱఁ
గాల నిర్ణయములు గలిగి భావ మెఱింగి
గాననృత్యములందు ఘనత మీఱి
నవరసచాతుర్యనయమును సంపద
దగువిలాసమును శాంతంబు గల్గి

కూర్మి దాతృత్వమును గల్గి గుణము గల్గి
మెలఁత తొలకరిమెఱుపు నెమ్మేనితోడఁ
జెలఁగునది పాత్ర యనఁ జెల్లు, శ్రీనుతాంగ !
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 50

పాత్ర దశప్రాణములు

నిరతము రూపు రేకలును నిల్కడ వేగముఁ గల్గి కాంతియుం
బరఁగఁగ దృష్టిభేదమును బాటయు వాగ్జరి గల్గి మిక్కిలిన్
అరుదుగ సంతసం, బొదవి యంతట వేసటలేక యుండుటల్
బరువిడి యీ పదిం జెలికిఁ బ్రాణము, గస్తురిరంగనాయకా ! 51

పాత్రాంగ దేవతాలక్షణము

బ్రహ్మరంధ్రానకుఁ బరఁగ సదాశివుల్
ఫాలంబునకు క్షేత్రపాలకుండు
సరవి గంఠానకు శాస్త్రాయనీశక్తి
యెలమి వక్షంబునం దీశ్వరుండుఁ
బరఁగఁగా గౌనందుఁ బరమేష్ఠి విష్ణువుఁ
గనుఁజూపులకును శృంగారరసము
నుదరంబునందున నొనరంగా గణపతి
గర నాభియందును దారలమర !

వరుణ వాయువు లూరులవైపుగాను
దరుణినెమ్మోమునందు సుధాకరుండు
నంగదేవత లివి పాత్ర కనువుగాను
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 52

బాహుమూలంబునఁ బరమేష్ఠి యాబాహు
మధ్యమందునను శ్రీమాధవుండు
ఘనముగా బంధమందున నుమాపతియుఁ గ
రాగ్రమందునను బార్వతియుఁ దనరె
నదె బాహుదండంబునందుఁ ద్రిమూర్తులు
గోవిందుఁ డమరె నంగుష్ఠమందుఁ
దగె షణ్ముఖుండును దర్జనియందునఁ
బరఁగె మధ్యమున భాస్కరుండు

మారుతుఁ డనామికందు నమరెఁ గనిష్ఠ
కందు గురువును గరతలమందు శశియు
నలరెదరు పాత్రకున్ వామహ స్తమునను
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 53

భుజమూలమున ధాత్రి భుజమధ్యమున వాణి
బాహుదండంబునఁ బార్వతియును
మణిబంధమున రవి మఱి కరాగ్రం బింద్రుఁ
డంగుష్ఠమునను దా నంగజుండు

తర్జనియందునఁ దనరఁ బావకుఁడును
గరిమ మధ్యమునను గమలభవుఁడు
నరయ ననామిక కంబర మే వేల్పు
దగఁ గనిష్ఠికకు గంధర్వు లరయ

నెలమిఁ గరతలమందున నిద్ధరయును
నమరి పాత్రకు దక్షిణహ స్తమునను,
వెలసియుందురు వేల్పులు వేడ్క మీఱ
రాక్షస విరామ! కస్తురిరంగధామ ! 54

పాత్రగమన లక్షణము

హరిహంసదంతిలావక
వరశిఖి కుక్కుట బకాదివరగమనములున్
నిరతంబు దెలిసి పాత్రయు
గరిమను వెలయంగవలయుఁ గస్తురిరంగా! 55

నేత్రభేద లక్షణము

అలోకితావలోకిత
జాలప్రలోకితవిలోక సమసాచియునున్
ఉల్లోకి తానువృత్తముఁ
గా లలి నేత్రములు చెలఁగుఁ గస్తురిరంగా ! 56

ఇక్కడ సంస్కృత అభినయ దర్పణం నుండి కొన్ని విషయములు –

శ్లో!! ఆఙ్గికో వాచిక స్తద్వాహార్య స్సాత్త్వికః పరః !
చతుర్థాభినయ స్తత్రచా2జ్ఞికో2జ్గైర్నదర్శితః !
వాచావిరచితః కావ్యనా2టకాదిషువాచికః !
ఆహార్యోహారకేయూరవేషాది భిరలఙ్కృతిః !
సాత్వికస్సాత్వికైర్భావైర్భావ్ఙజైశ్చనిదర్శితః !!

ఈ అభినయము , ఆంగికము, వాచికము, ఆహార్యము, సాత్వికము అను నాలుగు విధములు కలది. అందు అంగములచేత చూపబడునది ఆంగికము, మాటలచేత తెలుపబడినది వాచికము, ఇది కావ్యనాటకాదులందు గానబడుచున్నది, హారకేయూరాదుల నలంకరించుకొనుట ఆహార్యము. సాత్వికాది భావములచేత అభినయించెడు పదభావము సాత్వికము, అని భావజ్ఞులచేత చెప్పబడుచున్నది.

శ్లో!! అజ్ఞికా2భినయత్రైవిధ్యమ్

శ్లో!! అత్రాఙ్గికో2ఙ్గప్రత్యఙ్గోపాఙ్గభేధాత్త్రిధామతః

ఆంగికాభినయము – అంగాభినయము, ప్రత్యంగాభినయము, ఉపాంగాభినయము అని మూడు విధములు కలది.

అఙ్గలక్షణము

శ్లో!! అంగాన్యత్రశిరోహస్తౌకక్షఃపార్శ్వకటీతటౌ
పాదావితిషడుక్తానిగ్రీవామప్యపరేజగుః!!

ఈ అంగాభినయమందు తల, చేతులు, చంకలు లేక పార్శ్వములు, నడుము, పాదములు ఈ యారును అంగములనబడును. కొందరు కంఠమును సయితము అంగమని చెప్పెదరు.

ప్రత్యఙ్గలక్షణము

శ్లో!! ప్రత్యంగానిత్వథస్కంథౌ బాహుప్రుష్ఠం తథోదరమ్!
ఊరూజఙ్ఘెషెడిత్యాహు రపరే మణిబన్థకౌ!
జానునీకూర్పరమితిత్రయ మప్యధికం జగుః!!

ప్రత్యంగాభినయమందు మూపులు, చేతులు, వీపు, కడుపు, పిక్కలు ఈ యారును ప్రత్యంగములు. కొందరు మణికట్లు, మోకాళ్ళు, మోచేతులను కూడా ప్రత్యంగములని చెప్పుదురు.

ఉపాఙ్గలక్షణము

దృష్టిభ్రూపుటతారాశ్చకపోలౌనాసికాహనుః !
అధరోదశనాజిహ్వాచుబుకం వదనం తథా !
ఉపాంగాని ద్వాదశైతే శిరస్స్యంగాన్తరే తథా !
పార్ష్ణిగుల్ఫౌ తథాంఙ్గుళ్యఃకరయోఃపదయోస్తలే !
ఏతాని పూర్వశాస్త్రానుసారేణోక్తానివైమయా !!

చూపు, ఱెప్పపాటు,నల్లగ్రుడ్డు,చెక్కిళ్ళు, ముక్కు, దవుడలు, అధరము, దంతములు, నాలుక,గడ్డము,మొగము,శిరస్సు – ఈ పండ్రెండును ఉపాంగములు. వీని అంగాంతరములుగా గుదికాలు,చీలమండ, కాళ్ళచేతుల వ్రేళ్ళు, అరచేతులు – ఇవి పూర్వశాస్త్రము ననుసరించి నాచేత చెప్పబడినవి.

శ్లో!!
నృత్యమాత్రోపయోగ్యాని కథ్యం తే లక్షణం క్రమాత్!
ఫ్రథమంతు శిరోభేధః —

ఈవిధంగా సాగిపోతుంది. ఉత్సాహం పట్టలేక వ్రాస్తూపోతున్నాను. అన్యథా భావించరని తలుస్తూ–

16, నవంబర్ 2012, శుక్రవారం

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

పెన్నాతీరం – ఈతకోట సుబ్బారావు

More articles by సౌమ్య »
Written by: సౌమ్య
Tags: ,
ఈపుస్తకం కొన్నాళ్ళ క్రితం ’ఆంధ్రజ్యోతి’ లో వారంవారం ఇదేపేరుతో వచ్చిన వ్యాసాల సంకలనం. ఈ వ్యాసాలన్నీ నెల్లూరు జిల్లా చారిత్రక విశేషాలను తెలియజేసేవే.
పుస్తకాన్ని – ’ఒంగోలు వెంకటరంగయ్య’ గారికి అంకితమిచ్చారు. ఈపుస్తకంలోకి తల దూర్చాకే అలాంటి ఒక మనిషి ఉన్నాడని తెలిసింది కానీ, ఆయన గురించి చదువుతూ ఉంటే ఆసక్తికరంగా అనిపించింది. ఇక పుస్తకం గురించి – వి.యస్. రామచంద్రరావు గారి ముందుమాటలో – నెల్లూరు జిల్లా విశేషాలను తెలుపుతూనే, ఈపుస్తకంలో రాసిన విషయాల గురించి కూడా చెప్పారు. బాగా రాసారు.
పుస్తకం లోపలికెళ్తే – నెల్లూరు జిల్లా తొలి గ్రాడ్యుయేట్, తొలి ఎమ్మే పట్టాదారుడు, నెల్లూరుకు థెరిసా రాక, నెల్లూరు లో తొలి బ్యాంకు, తొలి ట్రావెలర్స్ బంగళా వంటి విషయాలతోపాటు దాదాపు వందేళ్ళ క్రితం నాటి వ్యవసాయం, తూకాలు-కొలతలు, ధరలు, నీటిపారుదల, డ్రైనేజీ వ్యవస్థ; అలాగే, నెల్లూరు లోని – మూలపేట, సంతపేట, ఆర్.ఆర్.వీథి వంటి స్థలాల కథలు, నెల్లురుకు ప్రముఖ సాహితీపుత్రుల రాక, నెల్లూరీయులే అయిన ఎందరో గొప్ప సాహితీవేత్తల పరిచయం (ఈ వ్యాసాలు పుస్తకం.నెట్ లో ప్రచురిస్తూ ఉన్నాము. అవి ఇక్కడ చూడవచ్చు), నెల్లూరులోని పాత స్కూళ్ళ కథ, బ్రిటీషు కాలంనాటి ఆహ్వాన పత్రాలు, రాయలకాలం తెలుగు శాసనాలు – ఇలా ఒక విషయమని కాక, నెల్లూరు గురించిన సమస్త విషయాల గురించీ రాసారు.
నెల్లూరుతో నాకు ఉన్న అనుబంధం అది మా అమ్మమ్మ, తాతల తరానికి సొంతూరు కావడమే. ఎప్పుడో చిన్నప్పుడు మూణ్ణాలుగు సార్లు వెళ్ళిన జ్ఞాపకమంతే. కానీ, నాకు సహజంగానే ఏదన్నా పాత ఊరి గురించిన కథలను తెలుసుకోడంపై ఉన్న ఆసక్తి వల్ల ఈపుస్తకం బాగా నచ్చింది. నెల్లూరీయులు మరింత బాగా ఆస్వాదించగలరనుకుంటాను. మనం ఓ ఊర్లో కొన్నాళ్ళుంటే, పుట్టింది మొదలు అదే ఊర్లో ఉంటున్న పక్కింటాయన అడపాదడపా గోడ మీదుగా మనకి ఆ ఊరి కథలు, అక్కడి మనుష్యుల కథలూ చెప్తూ ఉంటే ఎలా ఉంటుందో, ఈ పుస్తకమూ అలాగే ఉంటుంది.
పుస్తకంలో ప్రధాన లోపాలు:
-ఒక విషయ సూచిక లేకపోవడం. కొన్ని పుస్తకాలకి ఎందుకు విషయసూచికలుంచరో మరి, అసలర్థం కాదు!!
-తరుచుగా అసంపూర్ణ/అస్పష్ట వాక్యాలు తారసపడ్డం.
-ఒంగోలు వెంకటరంగయ్య గారికి అంకితమిస్తూ రాసిన వ్యాసం మినహాయిస్తే దాదాపు వ్యాసాలన్నీ అసమగ్రంగా ఉండటం. ఆ వ్యాసంలా మిగితా వ్యాసాలు రాసి ఉంటే, ఈ భావన కలిగేది కాదేమో.
-ఒక్కటంటే ఒక్క రిఫరెన్సైనా ఇవ్వకపోవడం. ’చరిత్ర’ అని క్యాప్షన్ పెట్టాక కనీసం ఆమాత్రమన్నా ఇవ్వకుంటే, ఒకవేళ ఎవరి గురించన్నా వివరంగా తెలుసుకోవాలనిపిస్తేనో? కనుక, రిసర్చీయులకి పుస్తకం పనికిరాదు కానీ, మామూలుగా చదివి క్యూరియాసిటీ పెంచుకోడానికి పనికొస్తుంది.
పుస్తకం వివరాలు:
పెన్నాతీరం
రచయిత: ఈతకోట సుబ్బారావు
తొలి ముద్రణ: సెప్టెంబర్ 2008
కాపీలు: ఈతకోట సుబ్బారావు, H.No. 24-1175, 2nd Street, Ravindra nagar, Nellore – 524004.
మొబైల్: 9440529785
వెల: వంద రూపాయలు
పేజీలు: 200

పరిశోధనా తృష్ణ – బంగోరె

[ఈ చిన్న వ్యాసం నెల్లూరు చారిత్రక విశేషాలను తెలుపుతూ రాసిన ’పెన్నాతీరం’ అన్న పుస్తకం నుండి స్వీకరించబడ్డది. రచన: ఈతకోట సుబ్బారావు. ఇందులో ప్రస్తావించిన విషయాలు పుస్తకాభిమానులకు ఆసక్తి కలిగించవచ్చు అన్న ఆలోచనతో ఇక్కడ తిరిగి ప్రచురిస్తున్నాము. అనుమతి ఇచ్చిన ఈతకోట సుబ్బారావు గారికి కృతజ్ఞతలు. - పుస్తకం.నెట్]
’ఇటీజ్ నాట్ మై షర్ట్ దట్ ఐ క్యాస్ట్ ఆఫ్ టుడే బట్ స్కిన్ విత్ మై ఓపెన్ హ్యాండ్స్’ - అన్న ఖలీల్ జిబ్రాన్ కవిత్వ చరణాలతో ఒక దౌర్భాగ్య పత్రికకు అద్భుతమైన సంపాదకత్వాన్ని నిర్వహించిన బంగోరె తన పాఠకులకు వీడ్కోలు చెప్పుకున్నాడు. బంగోరెగా కీర్తిశేషుడైన బండి గోపాలరెడ్డి (1937-82) నెల్లూరు జిల్లా వాసి అని మనము చెప్పుకుంటే సాహిత్య పరిశోధనరంగమే చిన్నబుచ్చుకుంది. ఎందుకంటే బంగోరె ’రైతులో కూనిరాగాలు’ శీర్షికలో – నెల్లూరు ప్రాంత స్థానికచరిత్ర, సుబ్రమణ్యభారతి చంద్రిక కథ, తెలుగులో జర్నలిజం, తొలకరిజల్లులు, బ్రౌన్ లేఖలు, బ్రౌన్ సేకరించిన తాతాచార్ల కథలు, కన్యాశుల్కం మొదటి ముద్రణ ప్రతి, మాలపల్లిపై నిషేధాలు, వేమన పద్యాల్లో ప్రక్షిప్తాలు, సి ఆర్ రెడ్డి రచనలు – ఎన్నింటినో ఆయన తవ్వి తీశారు. ఆ పత్రిక సంపాదకత్వం అస్థిరమైన తన నలభై ఐదేళ్ళ జీవితంలో బంగోరె చేసిన అసంఖ్యాకమైన ఉద్యోగాల్లో ఒకటి. ఎప్పుడూ కుదురుగా ఒకచోట ఉద్యోగం కూడా చేయని, విరామం లేని ఆయన జీవితంలో ఒక ఏకత్వం లేకుండా పోలేదు. అదే ఆయన పరిశోధనాతృష్ణ. తెలుగుదేశంలో పరిశోధన ప్రస్తుతం నిలిచిపోయింది. ఈ శతాబ్ది మొదటిభాగంలో ప్రతి విషయంలోనూ మౌలికమైన పరిశోధనను, మొదటితరం అగ్రగణ్యులను వదిలేస్తే సుమారు అన్నిరంగాల్లో ప్రస్తుత పరిశోధన ఈస్థితికి చేరువౌతుంది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు రెండు విశ్వవిద్యాలయాలు అయ్యాయి. అకాడమీలు, భాషాసమితులు ఏర్పడ్డాయి. భారతీయ,సామాజిక,శాస్త్ర పరిశోధనా మండలి, భారతీయ చరిత్ర పరిశోధనామండలి, కోర్టు ఫౌండేషన్, రీసర్చ్ గ్రాంట్లు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వ పరిశోధనల ఆదరణ పెరిగి, పరిశోధన పేరుతో కోట్ల రూపాయలు నీళ్ళలా పరిగెడుతున్నాయి. ఈవ్యవహారాలు వ్యవహరించేందుకు పెద్ద పాలనా యంత్రాంగం రాక్షసిలా పెరిగి పరిశోధనలపై నిర్ణయాత్మక అధికారాన్ని చెలాయిస్తుంది. ఈ యంత్రాంగంలో ఉన్న అధికారులతో వ్యక్తిగత పరిచయాలు, పైరవీలు చేయగలశక్తి ఉండటమే ఈరోజు పరిశోధకుడికి ఉండవలసిన ప్రాథమిక అర్హత. బంగోరెకు ఈ పరిశోధనావృత్తి చట్రంలో ఇమడగల సమర్థత లేకుండానే మరోవైపు ఆ ప్రాజెక్టులలో పని చేస్తూ ఒక పాజెక్టు నుంచి మరో ప్రాజెక్టుకు మార్చబడుతూ వచ్చిన విరామం ఎరుగని పరిశోధకుడు. పరిశోధన ఒక తీరని దాహంగా ఆయన పడిన శ్రమే విద్యాలయాల్లో జరుగుతున్న పరిశోధనపై ఆయనకు అసహనాన్ని కలుగజేసింది. చరిత్రకారులకు పనికివచ్చే ముడిసరుకును ఆయన ఒక్కడే తవ్వితీసి అందరికీ పంచి ఇచ్చాడు. ఆ మహానుభావుడే -బంగోరె!

12, నవంబర్ 2012, సోమవారం

జన వేమన -3 వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా

జన వేమన -3 వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా

    జన వేమన -3
                                             వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా 
ఇప్పటి వరకు మనం వేమన భావాలను స్థూలం గా పరిశీలించి చూశాం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేసి ,ఆయన భావ దీపికా ప్రకాశాన్ని పొందుదాం .అజ్ఞాన తిమిరం లో ఉన్న మాన వాలికి ఆయన అందించిన జ్ఞాన తేజస్సు ను పరికిద్దాం .ముందుగా ఆయనకు మతం మీద ఉన్న అభి ప్రాయాలను తెలుసు కొందాం .ఇది తెలుసు కోవటానికి ముందు అసలు మతం అంటే ఏమిటో తెలియాలి కదా .”రెలిజియన్ ఈస్ రియలైజేషన్ ”అన్నారు .మతం అంటే మనం ఎవరో తెలుసుకొనే ;;ఎరుక. ”దాన్ని తత్వ శాస్త్ర అన్వయం అన్నారు .ఇంతకీ తత్త్వం అంటే /ఆధ్యాత్మికం గా మానవుని పెరుగుదలే తత్వ శాస్త్రం .ఎలా జీవించాలి ,ఎలా చని పోవాలో చెబుతుంది .ప్రకృతి ,మానవుల మధ్య సంబంధాన్ని తెలియ జేస్తుంది .జరిగి పోయిన దాన్ని గురించి కాక ,జరుగుతున్నదీ ,శాశ్వత మైన దాని గురించి చెబుతుంది .దీన్ని బట్టి చూస్తె మతం చాలా పవిత్ర మైనది గానే కనీ పిస్తుంది .అపూర్వ ,గౌరవ స్తానం కలిగి ఉంది .అలాంటి మతాన్ని ప్రవచించిన ప్రవక్తలు ,తాము సన్మార్గం లో నడిచి ,అనుయాయులకు చక్కని మార్గాన్ని చూపించారు .అయితే కాల క్రమం లో ప్రవక్తలు చూపిన మార్గాన్ని వదిలేసి ,తప్పు దొవలు పట్టి మతాలు కొంత చెడు చేశాయి .ఉత్కృష్ట జీవన విధానం సడలి పోయింది .ప్రలోభాలూ మూధా చారాలు అమలు లోకి వచ్చాయి .మత పెద్ద పెద్దరికం వదిలి హక్కు కోసం ,అణచి వేతకు పాల్పడ్డాడు .అప్పుడే మతం అంటే ఏవగింపు కలిగింది .ఇలాంటి సమయం లో సామాన్యులకు విలువ లేకుండా పోయింది .మాన్యులకే అన్నీ హక్కు భుక్తాలైనాయి .ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోకుండా మతం సంఘం తయా రైనాయి .ఎవరు పూనుకొని దీన్ని మళ్ళీ గాడి లో పెట్టాలి ?అందుకే ఆ బాధ్యతను కవులూ ,కళా కారులూ తీసుకొన్నారు .నెమ్మదిగా చెప్పారు .కళాత్మకం గా చెప్పారు .హితం గా ,మితం గా చెప్పి  చూశారు .అయినా మార్పు వచ్చే సూచన కనీ పించ లేదు .మార్పు రాక పోతే సమాజం పతనా వస్థ కు చేరుతుంది .అదిగో అలాంటి సమయం లోనే వేమన లాంటి మహనీయుని అవసరం కలిగింది
.అవినీతి ,చెడు ,దుష్టా చారం మాంసాన్ని దాటి ,ఎముకలకు పట్టేసి  వదలని స్తితిలో ఉన్నాయి .కనుక చెప్పాల్సిన విషయాన్ని చాలా బలం గా ,తీవ్రం గా ,కఠినం గా చెప్పాల్సిన పరిస్తితి కల్గింది .ఆ పనే వేమన చేశాడు .యే కులాన్నీ ,యే మతాన్నీ వదిలి పెట్ట లేదు .అన్నిటిని ఝాడించి వదిలాడు .ఉతికేసి ,పిండేసి ఆరేశాడు .యే చెడ్డ విధానాన్ని వదిలి పెట్ట లేదు .చాలా ఆవేదన తో ,మనసు పై సుత్తి తో కొట్టి నంత బలం గా చెప్పాడు .మార్పు రావాలంటే ,ఆ మాత్రం ఆఘాతాలు తప్పవు అని భావించి చెప్పాడు వేమన్న .ఏదో ఎవరో అనుకుంటా రనే భయం ఆయనకు లేదు .బాధా లేదు .మార్పు రావాలి అంతే ఆయన ధ్యేయం .చీకటి లోంచి సమాజం వెలుగు లోకి రావాలి .అందరి సుఖమే అయన ధ్యేయం .అందుకే ఆయన మాట వేదం అయింది .వేదం లా శాసించింది .ఖచ్చితం గా అమలు చేయాల్సిన పరిస్తితి కలిగింది  .
       హిందూ మతం 
సనాతనం గా హిందూ మతం మన దేశం లో ఉంది .హిందూ మతం లేదు -అదొక జీవన విధానం అంటారు .అయినా కాల గతం గా ఎన్నో మార్పులు వచ్చాయి .విగ్రహారాధన ,యజ్న యాగాలు ,మంత్రాలు ,మాయలు ,మాయ స్వాములు ,తంత్రాలు ఎక్కువై ధార్మిక మార్గం పక్క దారి పట్టింది .ధర్మం కను మరుగైంది .సాటి మనిషికి విలువ నివ్వని సమాజం తయారైంది .గుడులు ,గోపురాలు ,దేవతలు ,పీథాది పతులు ,ప్రాచుర్యం పొందారు .మానవత్వం మృగ్య మైంది .మనిషిని మనిషి గా మార్చాల్సిన మతం కుహనా విధానాలకు నిలయ మైంది .అందుకే వేమన కు ఈ పద్ధతి నచ్చలేదు .గమ్యాన్ని మరచి ప్రవర్తించే వారి పై పద్యాల పిడి గుద్దులు ప్రహారం చేశాడు .”రాళ్ళన్నీ దేవుల్లయితే ,రాసులు మింగవా ?అని నిలేశాడు .”కూడు ,గుడ్డ ను కోరడు దేవుడు ”అని గట్టిగా చెప్పాడు .అంతా ”రాయి మయం ”అయితే ,దేవుడేవడో భక్తుదేవడో తెలుసు కోవటం ఎలా ?శిలకు మొక్కితే మనమూ ఆ శిలలు గా మారి పోతామేమో ఆలోచించ మన్నాడు .దేహమే దేవాలయం అన్న మాట ను వదిలి మంచిని ,సోదర భావాన్ని గాలికి వదిలేసి ,ప్రసాదాలు తీర్ధాలు మరిగి ,బొజ్జలు పెంచుకోవటం హేయం గా భావించాడు .”గుడి దేహ మాత్మ దేవుడు -చెడు రాళ్ళకు వట్టి పూజ సేయకు వేమా ”అని హెచ్చరించాడు .చీకటి గర్భాలయం లో ,దేవుడు అనే రాతిని ప్రతిష్ట చేసి ,మొక్కులు సమర్పిస్తూ ,కాలక్షేపం చేస్తారు కాని ,తమ లోని పర బ్రహ్మాన్ని గుర్తించరు మనుషులు అని ఆవేదన చెందాడు .”ఉల్ల మందు బ్రహ్మ ముందుట తెలియరు ”అన్నాడు అందుకే .ముక్తి కోసం చేసే ప్రార్ధనలు సత్ఫలితాలివ్వవు అంటాడు .
”యుక్తిగా నెరుకై తోచును -ముక్తికి నిలయమ్పు దారి మానుకొని వేమా ”.ఎరుక ఉంటేనే ,పరమ పదం సాధ్యం .మిగిలినవేవీ పనికి రావు .అసలు మర్మం తెలియ కుండా మతాలను సృష్టించారని ఈస డిస్తాడు .ఇలాంటి వారి భావాలన్నీ ”గాజుటింట కుక్క కళవళ పడి నట్లు ”ఉంటాయట .”పూజ కేమి వచ్చే ,బుద్ధి ప్రధానము ”అన్నాడు .పరమాత్మ విశ్వంభరుడై ,విశ్వం లో వెలుగుతూ ఉంటాడు.”అతన్ని చూడండి  అన్నాడు .”క్షేత్రంబున క్షేత్రజ్నుని ,-గాత్రంబును జూచి నియతి గల లక్ష్యంబున్ –రాత్రిం బవలును నొకటిగ -సూత్రించిన ముక్తి సులభము వేమా ”అని ముక్తికి సులభ మార్గాన్ని చెప్పాడు .రాతి ప్రతిమను రాజసం లో ఉంచి పూజించే వాడు బుద్ధి మాలిన వాడు.అలాంటి వాడు ”భావమందు పరము భావించ నేరడు ”అని వాడిఅవి వేకాన్ని జాలి పడతాడు ”శిలలు శిలలే కాని ,శివుడు కాదని -తనదు లోని శివుని దానేల తెలియడో ”అని నిట్టూరుస్తాడు .
హిందూ మతం లో ఉన్న యజ్న యాగాలు దారి తప్పి హింసకు పట్టం కట్టాయి .కాలజ్నులు వాటిని సహించ లేక పోయారు .ప్రత్యామ్నాయాలు చూపించారు .మార్పు వచ్చి పశు హింస తగ్గింది .తన కాలం లో ఇంకా అమలు లో ఉన్న పశు హింస పై’- విమర్శ వజ్రాయుధాన్ని ప్రయోగించాడువేమన యోగీంద్రుడు .”సోమయాజి –మేక పోతును బట్టి మేడలు విరవటం ”ఆయన్ను కలిచి వేసింది .”జీవ హింసకు చిక్కునా మోక్షంబు ”అని తీవ్రం గానే ప్రశ్నించాడు .ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గం లో రంభాదుల పొందు విందు లభిస్తుందనే ఆశ మాత్రమె యజ్ఞానికి కారణం అన్నాడు .సోమయాజి, కామ యాజి అవటం సహించ లేక పోయాడు .పక్క వాడు ఆకలితో అలమటించి చస్తుంటే పట్టించుకోని జనం తల్లి దండ్రుల శ్రాద్ధా లకు వేలు ఖర్చు చేయటం బాధించింది .”పిండములను జేసి పితరుల దల పోసి –కాకు లకు బెట్టు గాడిద లారా –పియ్య తినెడి కాకి పితరు డేట్లాయేరా “‘అని మందలించాడు .ఇంతకీ పిండాలు కాకులకే ఎందుకు పెడతారు / అనే సందేహం వస్తుంది .ఉత్తర రామాయణం లో దీనికి ఒక కధ ఉంది. మరుత్తుడు అనే రాజు యజ్ఞం చేస్తుంటే ,రావణుడు రాక్షస సైన్యం తో వచ్చి ఇంద్రాది దేవతలను భయ పెట్టి పార దోల్తాడు .అప్పుడు వాళ్ళు అందరు పశు ,పక్షాది రూపాలు పొంది పారి పోతారు .పితృదేవత లకు ప్రభువైన యముడు కాకి రూపం దాల్చి అక్కడే ఉంటాడు .అప్పటి నుంచి పితృదేవతలకు వేసే పిండాలను కాకులకు పెట్టటం అలవాటు లో ఉంది .అప్పటి దాకా పక్షుల్లో చాలా హీనం గా చూడ బడిన కాకి అప్పట్నించి పవిత్రత సాధించింది .”కాకి పెండ్లి నెవరు కానరు భువిని –కాకికి అన్నముంచి కాళ్ళకు మొక్కరు ”అని ఆశ్చర్య పోయాడు వేమన్న .”సంజ్ఞా మది యందు బూనూట సాధు  వ్రుత్తి -మనసు మగ్నము నొందుట మనన వ్రుత్తి ”అంతే కాని ,యజ్న యాగాదుల వల్ల ప్రయోజనం లేదు అన్నాడు.
చేసిన పాపం చెడని పదార్ధం అని తత్వ గీతం .ఎన్నెన్నో పాపాలు చేసి వాటి పరిహారం కోసం తీర్ధ యాత్రలు చేసి పాపాన్ని పోగొట్టు కోవాలను కొంటాము .పిల్లిని చంపిన పాపం వేరు గుడి కట్టిన పుణ్యం వేరు అని తెలుసు కో లేం .హృదయాలను కడుక్కోవాలి శరీరాలను కాదు .శారీరక మాలిన్యం కంటే మానసిక మాలిన్యం చాలా ప్రమాదం .దాన్ని వదిలిన్చుకోక పోతే ఉత్తమ గతులుండవు .పశ్చాత్తాప దగ్ధం తోనో ,పరోప కారం తోనో సహనం తోనో ,సానుభూతి, సహవేదన ,దయా ,దాక్షిణ్యం ,కరుణ లతోమనో  మాలిన్యం పోతుంది .గంగాది నదుల్లో స్నానం వల్ల ఆత్మ సంస్కారం రాదు .సద్గురు కటాక్షం వల్లనె సాధించాలి .”తిరుపతికి బోవ తురక దాసరి కాడు–కాశి కేగ లంజ గరిత గాదు–కుక్క సింహమగునే గోదావరికి బోవ “”అని వితర్కిస్తాడు .కల్మషాలన్నీ ,కడుపు  లో పెట్టు కొని ,నదీ స్నానాలు ,భగవద్దర్శనాలు చేస్తే ప్రయోజనం లేదంటాడు .మానసిక మార్పు రావాలి .ఒక వేళ ఆ పవిత్ర స్తలాల వల్ల మార్పు వస్తే వేమన్న కంటే సంతోషించే వాడు లేడు .కొన్ని స్థలాలు పవిత్రాలు కొన్ని అపవిత్రాలు అని భావించటం తప్పు అనేదే వేమన్న చెప్పిన వేదం లాంటి విషయం .”పుణ్యమనగ నేమి ? చేసిన పుణ్యమే ”అని చక్కని సమాధానం చెబుతాడు .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం

తెలుగులో కవితా విప్లవాల స్వరూపం
More articles by అతిథి »
Written by: అతిథి
Tags: K.V.S.Ramarao, Velcheru Narayanarao
velcherubook

వ్రాసిన వారు: కే.వి.యస్.రామారావు
********
(ప్రొఫెసర్ వెల్చేరు నారాయణ రావు ఎంతోకాలం యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్ సిన్, మేడిసన్ కేంపస్ లో కృష్ణదేవరాయ పీఠం ఆచార్యునిగా పనిచేసి అక్కడి నుంచి పదవీవిరమణ చేసి ప్రస్తుతం అట్లాంటా లోని ఎమరీ యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. తెలుగు సాహిత్యానికి అంతర్జాతీయంగా గుర్తింపూ, ఖ్యాతి తెచ్చే గురుతర బాధ్యతని ఏకాకిగా వహిస్తూ, భరిస్తూ నిరంతర కృషి సాగిస్తున్న ఈ ఎనభై ఏళ్ల యువ విమర్శకుడి శోధన, సాధన అనితరసాధ్యాలు. ఇప్పటికి ఎన్నో లోతైన పరిశోధనల్ని పుస్తకాలుగా, పరిశోధనా పత్రాలుగా ప్రచురించారు. నారాయణ రావు గారి గౌరవార్థం “సింపోజియా” లు కూడ జరిగాయి. ఆయన ఈమధ్యనే ఎనభై ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా “పుస్తకం” పాఠకులకు ఆయన పరిశోధనా గ్రంథాల్ని కొన్నిటిని పరిచయం చెయ్యటం ఈ శీర్షిక లక్ష్యం.)

1974 లో నారాయణ రావు గారు ఆంధ్రా యూనివర్సిటీ నుంచి పి.ఎచ్.డి. పట్టా కోసం రాసిన సిద్ధాంత వ్యాసాన్ని పొడిగించి 1978 లో పుస్తకరూపంలో ప్రచురించారు. అదే ఈ “తెలుగులో కవితావిప్లవాల స్వరూపం“. ఆ తర్వాత మరో రెండు ముద్రణలు అయ్యాయి. చివరిది 2009లో. ఎన్నో కోణాల్లో విప్లవాత్మకమైన రచన ఇది. అంతకు ముందు అలవాటుగా ఆచారంగా వస్తున్న సిద్ధాంత వ్యాసాల గ్రాంధిక భాషని తోసిపుచ్చి సరళమైన భాషలో రాయటమే కాదు, మరీ ముఖ్యంగా వాడే ప్రతి పదానికి స్పష్టమైన, నిర్ద్వంద్వమైన నిర్వచనాన్ని వాడారు. అంటే, వాడుక మాటలకి కవిత్వంలో వేరే అర్థాలు ఎలా ఉంటాయో అలాగే సాహిత్య విమర్శలో కూడ విమర్శకి సంబంధించిన విస్పష్టమైన అర్థాలు ఉండాలని ప్రతిపాదించి, ఆచరించి చూపారు. కనుక ఈ గ్రంథంలో మాటలు మామూలుగానే అనిపించినా వాటి అర్థాలు మాత్రం వాడుక అర్థాలు కావని వేరే సాంకేతికార్థాలు ఉన్నాయని మనం గ్రహించాలి. అలా గ్రహించి చదివితే తెలుగు కవిత్వం గురించిన విప్లవాత్మక ప్రతిపాదనలు ఎన్నో కనిపిస్తాయిక్కడ.

ఈ గ్రంథం లక్ష్యం తొలినాళ్ల నుంచి నాటివరకు తెలుగు కవిత్వంలో వచ్చిన మౌలికమైన మార్పుల్ని నిగ్గుతీసి ఆ మార్పులకు దారి తీసిన ప్రాథమిక కారణాల్ని స్పష్టంగా లెక్కతేల్చి ఈ వ్యవస్థ అంతటినీ ఒక సైద్ధాంతిక వ్యూహనిర్మాణం ద్వారా వివరించటం. ఇంతటి బృహత్తరమైన పనిని సాధించటంలో అంతకుముందున్న పరిశోధనలు అంతగా సహకరించకపోగా ఎక్కువభాగం అయోమయానికి, జారుడుతనానికి నిదర్శనాలుగా ఉన్న సందర్భంలో వాటినుంచి దూరంగా నిలబడి కొత్తచూపుతో వెయ్యేళ్ల పైగా విస్తరించిన తెలుగు కవిత్వాన్ని వీక్షించి ఎప్పుడెప్పుడు ఏయే సందర్భాల్లో ఏయే కారణాల వల్ల పెనుమార్పులు సంభవించాయో గుర్తించి సహేతుకంగా వాటన్నిటినీ వివరించటానికి ఒక సరళమైన సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఈ గ్రంథం.

ఈ సిద్ధాంతం చూపిన ఒక ముఖ్యమైన ఫలితం – కవుల వల్ల విప్లవాలు రావని, కవిత్వ సందర్భంలో కలిగే పెద్ద మార్పులు మాత్రమే కవితా విప్లవాలకు దారితీస్తాయని. అలాగే కవి ఎంతటి ప్రతిభావంతుడైనా కవిత్వసందర్భానికి వ్యతిరేక దిశలో నడవటానికి ప్రయత్నిస్తే ఆ కవి రచనలు అప్పటి కవితావిప్లవంలో పాలు పంచుకోలేవని సోదాహరణంగా నిరూపిస్తుంది. గురజాడ ఇందుకు ఒక ముఖ్యమైన దృష్టాంతం. తర్వాతి కవులు గురజాడని ఎంతగా పొగిడారో అంతగానూ ఆయన కవిత్వాన్నుంచి పారిపోయారనేది కనిపించే సత్యం – ఎంతమంది ముత్యాలసరాలు రాశారు? ఎంతమంది గురజాడ జాడలో పాటలు రాశారు? ఇలా ఎందుకు జరిగిందో ఖచ్చితంగా వివరిస్తుంది నారాయణ రావు గారి కవితావిప్లవ సిద్ధాంతం. అలాగే తిరుపతి వెంకటకవులు ఎందుకు ఎవరికీ మార్గదర్శకులు కాలేకపోయారో వివరిస్తుంది.

విజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు ఎలా ఉండాలో ఇప్పటికి మనకి ఒక స్పష్టమైన అవగాహన వుంది – ఏ సిద్ధాంతమైనా దాని పరిధిలోని విషయాలన్నిటినీ సమగ్రంగా సమూలంగా సూటిగా డొంకతిరుగుడు లేకుండా వివరించగలగాలి, అప్పటి వరకు తెలియని కొత్త విషయాల్ని ప్రతిపాదించగలగాలి. కవితావిప్లవ సిద్ధాంతానికి ఈ గుణాలున్నాయి. అలా కవిత్వవిమర్శకి కూడ విజ్ఞానశాస్త్ర స్థాయిని కలిగించిన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఈ గ్రంథం.

ఇలాటి విస్తృతమైన సిద్ధాంతంతో పాటు “బోనస్” గా నారాయణ రావు గారు మరో ముఖ్యమైన పని కూడ చేసిపెట్టారీ గ్రంథంలో – అది ఒక్కో విప్లవ కాలం లోని పద్యాన్ని ఎలా చదివి అర్థం చేసుకోవాలనేది ఉదాహరణలతో చూపించటం. నన్నయ గారి పద్యాన్నీ శ్రీశ్రీ పద్యాన్నీ అర్థం చేసుకునే పద్ధతి ఒకటి కాదని అందరూ ఆలోచించకుండానే ఒప్పేసుకుంటారు; ఐతే ఖచ్చితంగా తేడా ఏమిటి అంటే చెప్పగలిగే వాళ్లు చాలా కొద్దిమంది, ఉద్దండ పండితుల్లో కూడ. కవితా విప్లవం అంటే అన్ని కవిత్వపార్శ్వాల్లోనూ మార్పులు వస్తాయని, కవిత్వభాష, కవిత్వ శ్రోత (లేదా పాఠకుడు), కవిత్వానుభవం, కవిత్వాస్వాదన, కవిత్వ విషయం – ఇవన్నీ మారతాయని గుర్తించి స్పష్టీకరించటమే కాకుండా ఏయే విప్లవంలో ఇవన్నీ ఎలా మారాయో కూడ చూపిస్తుందీ గ్రంథం.

“ఇది నా యుగం, నేనే ఈ యుగకవిని, నా వెనక ఇప్పటి కవిత్వం నడుస్తుంది” అని ఎప్పటికప్పుడు భుజాలు చరుచుకునే కవులు వస్తూనే వుంటారు. ఏ కవీ యుగకర్త కాడని, యుగాలే (అంటే కవితావిప్లవాలే) కవుల్ని తయారుచేస్తాయని, ప్రతిభ వున్న కవులు ఆ యుగధర్మానికి అనుగుణంగా కవిత్వం రాసి పేరుతెచ్చుకుంటారని ప్రతిభ లేని వారు యుగధర్మాన్ని గుర్తించకపోవటమో లేక గుర్తించినా దానికి ఎదురీదటానికి ప్రయత్నించటమో చేసి వెనకబడి పోతారని చాటుతుందీ సిద్ధాంతం. అలా, కవితావిప్లవాల్ని గుర్తించటానికి, ఆ విప్లవకాలాల్లో ప్రతిభావంతులైన కవుల్ని గుర్తించటానికి అవసరమైన సాధనాల్ని పాఠకులకి అందిస్తుందీ గ్రంథం. అంతేకాకుండా గత రెండు మూడు దశాబ్దాల్లో వచ్చిన కవిత్వమార్గాల్లో ఏవైనా విప్లవాత్మకమైనవి వున్నాయా, వుంటే వాటిలో ప్రధాన కవులెవరు? అప్రధాన కవులెవరు? అన్న ప్రశ్నలకు ఎవరికి వారే సమాధానాలు చెప్పుకోగలిగిన సాధనసంపత్తిని అందిస్తుంది. చివరగా, ముందుముందు తెలుగు కవిత్వంలో ఎలాటి విప్లవాలు రావచ్చో ఊహించటానికి అవసరమైన పరికరాల్నిస్తుంది.

తెలుగు కవిత్వం గురించి, సాహిత్యం గురించి ఏమాత్రం ఆసక్తి వున్నవారైనా తప్పక చదివి తీరవలసింది ఈ గ్రంథం. ఒకసారి కాదు, ఎన్నో సార్లు చదవాలి. ప్రతిసారి కొత్తవిషయాలు, రహస్యాలు బయటకు వస్తాయి. ఆషామాషీగా కాదు, పదపదాన్ని జాగ్రత్తగా విచారిస్తూ వివేచిస్తూ చదవవలసిన గ్రంథం. ఆలోచనామృతమైన పుస్తకం.

నవోదయ, విశాలాంధ్ర, తదితర పుస్తకవిక్రేతల దగ్గర ప్రతులు దొరుకుతాయి. వెల వంద రూపాయలు.
———————

పుస్తక పరిచయ కర్త: కె. వి. ఎస్. రామారావు, శాన్ రమోన్, కేలిఫోర్నియా, యు. ఎస్.

రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ

రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ

(ఇది డెట్రాయిట్ తెలుగు లిటరరీ క్లబ్ వారి చర్చ సారాంశం. ఈ చర్చ 2008లో వారి సమావేశంలో జరిగింది. ప్రచురణకు అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)
సమీక్షకుడు: బసాబత్తిన శ్రీనివాసులు
రాయలసీమలో ఆధునిక సాహిత్యం – సామాజిక సాంస్కృతిక విశ్లేషణ
రచయిత: వల్లంపాటి వెంకట సుబ్బయ్య

సమావేశ స్థలం: ఫార్మింగ్టన్ హిల్స్ గ్రంధాలయం, ఫార్మింగ్టన్ హిల్స్, మిచిగన్.
తేదీ, సమయం: ఆదివారం, జూన్ 8, 2008, మధ్యాహ్నం 2 నుండి 5 గంటల వరకు
పాల్గొన్నవారు: ఏపూరి హరనాథ్బాబు (చికాగొ), మెట్టుపల్లి జయదెవ్ (చికాగొ), వేములపల్లి రాఘవేంద్రచౌదరి, శంకగిరి నారాయణస్వామి, మద్దిపాటి కృష్ణారావు, పన్నూరు నారాయణ (కందుకూరు, ప్రకాశం జిల్లా), ముసునూరు ఆనంద్,
ఆరి సీతారామయ్య, తెలంగాణా జయప్రకాశ్, చెక్కిళ్ళ చైతన్య, వెలగా రవి, బసాబత్తిన శ్రీనివాసులు (ముఖ్య చదువరి), అడుసుమిల్లి శివ, ఆళ్ళ గణేష్, ఉండవల్లి అనూరాధ, సిద్దం రావు, చేకూరి విజయ్, ముఖ్య అతిధులు నెల్లుట్ల
వేణుగోపాల్, సి. వనజ.

రాయలసీమలో పుట్టినటువంటి నాకు రాయలసీమ పుట్టు పూర్వోత్తరాలకు సంబందించిన ఈ పుస్తకాన్ని చదవడానికి అవకాశమిచ్చిన డిట్రాయిట్ లిటరరీ క్లబ్ కి ముందుగా ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఈ మహత్తరమైన పుస్తకాన్ని రాసిన స్వర్గీయ వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారికి నా అభివందనలు! ఇక పుస్తకం మీద నా అభిప్రాయం విషయానికి వస్తే వల్లంపాటి గారు రాయలసీమ చారిత్రక చిత్రం లో రాయలసీమ ఏర్పాటు గురించి మంచి వివరాలు అందించారు. రాయలసీమలో బళ్ళారి
లేకుండా పోవడం తద్వారా తుంగభద్ర ప్రాజెక్టు పోవడం ఇంకా ఆంధ్రభోజుడూ పరాయి వాడయిపోవడం గురించి చర్చించారు. సీమలో ప్రజలు బాదామి చాళుక్యులు, కంచి పల్లవుల మధ్య యుద్ధాలవల్ల ఎలా నలిగిపోయారో వివరించారు. విజయనగర సామ్రాజ్యంతో రాయలసీమ సంబంధాలు, మరాఠాలతో నైజాం నవాబుల పోరాటాలు సీమ ప్రజల జీవితాలను అతలాకుతలం చేయడాన్ని గుర్తుచేశారు. పాలెగాళ్ళని విజయనగర రాజులు పొషించడం, దత్త మండలాల ఏర్పాటు గురించి వివరించారు. రాయలసీమ సాహిత్యంతో కరువు సాన్నిహిత్యాన్ని వల్లంపాటి గారు స్పష్టంగా వివరించారు. ఇక కోస్తా ప్రాంతంలో ఆనకట్టలు, తద్వారా బాగా పంటలు పండడం దానివల్ల అక్షరాస్యత బాగా పెరిగిందని సీమ ఇటువంటి మార్పుకి దూరమైందని వల్లంపాటి గారి అవేదన మనకి పుస్తకమంతా కనిపిస్తూనే ఉంటుంది. పాతరోజుల్లో పాళెగాళ్ళు, ప్రస్తుత కాలంలో ఫాక్షనిస్టుల మధ్య సీమ ఎలా నలిగిపోతుందో చెప్పారు. రాజకీయనాయకులు రాయలసీమకి అన్యాయం జరుగుతుండగా చూస్తూ ఉన్నారే కానీ అన్యాయాన్ని ఎదుర్కోలేదని వాపోయారు.
ఇక సాహిత్యంలో రాయలసీమ చైతన్యం గురించి వివరిస్తూ శ్రీకృష్ణదేవరాయలు రచించిన “ఆముక్త మాల్యద” లో సామాన్య జీవితాలు మరియు వాటి వర్ణన పేర్కొన్నారు.గురజాడ “కన్యాశుల్కం” రాస్తున్న సమయంలో సీమలో వావిలకొలను సుబ్బారావు “ఆంధ్రవాల్మీకి రామాయణం”,”ఆర్య కథానిధి” మరియు “పతివ్రతా హితచర్య” వంటి గ్రంధాలను రాస్తున్నారని తెలిపారు. ఆధునిక సాహిత్యం సీమలో ప్రారంభం కాకపోవటానికి కవి పండితుల ప్రతిభా రాహిత్యం ఎంత మాత్రం కారణం కాదన్నారు. 19వ శతాబ్దం మధ్య భాగం నుంచి కోస్తా జిల్లాల ఆర్ధిక స్వరూపం మారిపోవడం, తద్వారా మంచి బడుల ద్వారా అక్కడి ప్రజల అక్షరాస్యత పెరగడం గుర్తు చేసారు. బెంగాల్ లో పుట్టిన సంఘ సంస్కరణోద్యమం గోదావరి జిల్లాలను ఎలా తాకిందో వివరించి, ఈ ప్రభావం రాయలసీమను తాకలేదన్న వాస్తవాన్ని గుర్తు చేసారు.
ఆధునిక కవిత్వంలో రాయలసీమ చైతన్యం రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ “పెనుగొండ” అన్న పాటతో ప్రారంభమయిఉండచ్చని వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు అభిప్రాయపడ్డారు. విద్వాన్ విశ్వం గారి “పెన్నేటి పాట” మాహాప్రస్థానం కి కవితావేశంలో ధీటైన కావ్యం అన్నారు. విశ్వం గారి మాటల్లో చెప్పాలంటే రాయలసీమ ఆధునిక కవిత్వంలో “శుకపిక శారికారపరుచుల్వినిపించవు”. ప్రేమలు, విరహాలు కనిపించవు. రాయలసీమ కవిత్వం రాయలసీమ బతుకంత భయంకరంగా, నిర్జీవంగా, శుష్కంగా, అలంకార రహితంగా ఉంటుంది. అన్నమయ్యను తొలి సంకీర్తనాచార్యుడిగా గుర్తిస్తే తెలుగులో సంకీర్తనా సాహిత్యం రాయలసీంలోనే ప్రారంభమయిందని అన్నారు.
1872లో అచ్చయిన “శ్రీ రంగరాజు చరిత్ర” మొదటి నవల తొలి తెలుగు నవల అయి ఉండచ్చని చాలా మంది వాదించారని వల్లంపాటి గారు అన్నారు. ఈ నవలని చారిత్రక నవలగా ఎలా పరిగణించలేమో విశ్లేషించారు. అలాగే ఈ నవలలో కధా వస్తువు లేదు అని చెప్పారు. 1915 నుంచి 1950 వరకు సీమలో నవలా సాహిత్యం సంచలనం ఎందుకు లేదో వివరించారు. సబా, నాదమునిరాజు నవలలో ప్రారంబించిన సమకాలీన జీవితచిత్రణను తరువాత తరం కొద్దిగా విస్త్రుతం చేయగలిగిందన్నారు. ప్రసిద్ధ కధారచయిత పి.రామక్రిష్ణారెడ్డి 1975లో రాసిన “నత్తగుల్లలు” సంచలనం కలిగించిందన్నారు. రాలసీమ నవలను నిశ్చితమయిన మలుపు తిప్పి దళిత, నిమ్నవర్గాలకూ, వర్ణాలకూ అంకితమిచ్చిన వాడు కేశవరెడ్డి అని చెప్పారు వల్లంపాటి గారు.
“దళితుడి పయనం” రెండవ ముద్రణకు ముందు మాటలో కేశవరెడ్డి “గత 22 సంవత్సరాలలో దళితపోరాటం వివిధ ప్రాంతాలలో సాగి, ఎన్నో దశలను దాటింది.నేడు దళితుడు తన సంకెళ్ళను కళ్ళకు అద్దుకోవటం లేదని నిస్సంకోచంగా అంగీకరిస్తున్నాను” అని చాలా స్పష్టంగా చెప్పారన్నారు.
గురజాడ “దిద్దుబాటు” ని మొదటి కథగా గుర్తిస్తే ఆ తరువాత 30 ఏళ్ళకు గానీ రాయలసీమలో మొదటి కథ రాలేదు. ఈ 30,40 సంవత్సరాల కాలంలో కొస్తా జిల్లాలలో గురజాడ, చింతా దీక్షితులు, శ్రీపాద సుబ్రమణ్య శాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, వేలూరి శివరామ శాస్త్రి, మల్లాది రామక్రిష్ణ శాస్త్రి, గోపీచంద్, చలం, బుచ్చిబాబు, కరుణకుమార, కొడవగంటి కుటుంబరావు వంటి మహోన్నత కథా రచయితలు ఉద్భవించారని, అదే సమయంలో రాయలసీమలో సమకాలీన జీవితాన్ని
గురించిన సామజిక అవగాహన కనిపించలేదన్నారు వల్లంపాటి గారు. రాయలసీమలో కరువు గురించి రచయితలు గొప్ప కథలు రాశారని, నేటి యువతరం వీరి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగుతారన్న విశ్వాసాన్ని వ్యక్త పరిచారు.

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ – పునరాలోచనలు

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ – పునరాలోచనలు

తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఆరు దశాబ్దాలకు పైగా ఉనికిలో ఉంది. 1930ల మధ్యనుంచీ తెలుగు సాహిత్యంలోకి మార్క్సిస్టు భావాల ప్రవేశం ఉన్నప్పటికీ, 1930లలోనే కొడవటిగంటి కుటుంబరావు రాసిన వ్యాసాలు, జి.వి.కృష్ణారావు రాసిన వ్యాసాలు, ‘కావ్యజగత్తు’ పుస్తకం ఉన్నప్పటికీ, మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944లో అచ్చయిన రెండు వ్యాసాలను తెలుగులో మెరుగయిన మార్క్సిస్టు సాహిత్య విమర్శకు ప్రారంభంగా గుర్తించవచ్చు. వీటిలో ఒకటి కురుగంటి సీతారామయ్య రాసిన ‘నవ్యాంధ్ర సాహిత్యవీథులు’ పై మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన, 1944 మార్చిలో వెలువడిన ‘అభ్యుదయ రచనల సంపుటి’ లో అచ్చయిన సమీక్షావ్యాసం. రెండవది, ‘సాహిత్యం – రాయిస్టులు’ పేరుతో మద్దుకూరి చంద్రశేఖరరావు ‘తెలుగుతల్లి’ పత్రికలో 1944 డిసెంబర్ సంచికలో రాసిన వ్యాసం. వీటికి కొనసాగింపుగా మద్దుకూరి చంద్రశేఖరరావు రాసిన ‘ఆంధ్ర సాహిత్యంలో కొత్తపోకడలు’, శ్రీశ్రీ రాసిన ‘ఏది విప్లవ పంథా?’ వ్యాసాలను కూడ చెప్పుకోవాలి. ఇవి రెండూ కూడ 1946 అక్టోబర్ లో ప్రచురితమైన అభ్యుదయ మొదటి సంచికలో అచ్చయ్యాయి. వీటిలో ‘ఆంధ్రసాహిత్యంలో కొత్త పోకడలు’ వ్యాసంలో మార్క్సిస్టు దృక్పథం సరిగా వ్యక్తం కాలేదని, యాంత్రికంగా ఉందని, తేల్చివేశారని పుచ్చలపల్లి సుందరయ్య 1947లోనే విమర్శించారు. ఆ విమర్శతో ప్రత్యేకంగా కమ్యూనిస్టు పార్టీ ఒక సర్క్యులర్ ను సభ్యులకు పంపింది. అంటే, తెలుగులోకి మార్క్సిస్టు సాహిత్యవిమర్శ ప్రవేశమే దృక్పథం గురించిన వివాదంతో మొదలయింది.
ఈ ఆరు దశాబ్దాలలో మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందిన పుస్తకాలు దాదాపు వంద వెలువడి ఉంటాయి. విడిగా పత్రికలలో ఐదారువేల పేజీల విమర్శరచనలు మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా పేరు తెచ్చుకుని ఉంటాయి. మద్దుకూరి చంద్రశేఖరరావు, పుచ్చలపల్లి సుందరయ్య, జి వి కృష్ణారావు, కంభంపాటి సత్యనారాయణ, తాపీ ధర్మారావు, పాములపర్తి సదాశివరావు, కొడవటిగంటి కుటుంబరావు, శ్రీశ్రీ, కె వి రమణారెడ్డి, తుమ్మల వెంకటరామయ్య, ఆవంత్స సోమసుందర్, రాచమల్లు రామచంద్రారెడ్డి, ఆరుద్ర, చేకూరి రామారావు, త్రిపురనేని మధుసూదనరావు, వల్లంపాటి వెంకటసుబ్బయ్య, వరవరరావు, వెల్చేరు నారాయణరావు, కేతు విశ్వనాథరెడ్డి, కె కె రంగనాథాచార్యులు, రంగనాయకమ్మ, అద్దేపల్లి రామమోహనరావు, సొదుం రామ్మోహన్, వై విజయకుమార్, రాంభట్ల కృష్ణమూర్తి, నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు, సి వి సుబ్బారావు, ఓల్గా, కె బాలగోపాల్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, జె సి, వి చెంచయ్య, జయధీర్ తిరుమలరావు, చేకూరి శ్రీనివాసరావు, ఆర్వియార్, బి సూర్యసాగర్, సంజీవమ్మ, టి ఎల్ కాంతారావు, ఎస్వీ సత్యనారాయణ, కాత్యాయనీ విద్మహే, పాపినేని శివశంకర్, కె రాంమోహన్ రాయ్, తక్కోలు మాచిరెడ్డి, తెలకపల్లి రవి వంటి తెలుగు సాహిత్యవిమర్శకులెందరో మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులుగానో, కనీసం కొన్ని మార్క్సిస్టు సాహిత్య విమర్శా పరికరాలు ఉపయోగించిన విమర్శకులుగానో గుర్తింపు పొందారు, పొందుతున్నారు. మార్క్సిస్టు సాహిత్యవిమర్శ పరికరాలను వినియోగించడంలో, దృక్పథ స్పష్టతలో వీరిమధ్య తరతమ భేదాలు, భిన్నాభిప్రాయాలు ఉండవచ్చుగాని వీరందరినీ ఏదో ఒక రూపంలో తెలుగు సాహిత్యవిమర్శ రంగంలో మార్క్సిస్టు వైఖరికి ప్రతినిధులుగా చూసే సంప్రదాయం ఉంది. ఏడు దశాబ్దాలకు మించని చరిత్రగల ఒక సాహిత్యవిమర్శ రంగంలో కనీసం యాభైమంది పనిచేసి ఉండడం, దాదాపు వంద పుస్తకాలు వెలువడడం గణనీయమైన విషయమే.
ఇంత ఘనమైన చరిత్ర, సంప్రదాయం ఉన్నప్పటికీ, తెలుగులో అసలు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ అంటే ఏమిటి, మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా దేన్ని గుర్తించాలి, మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తించడానికి మౌలిక ప్రాతిపదికలేమిటి అనే ప్రాథమిక విషయాలలోనే విస్పష్టమైన, సర్వాంగీకారమైన అభిప్రాయం ఏర్పడినట్టులేదు. సాహిత్యవిమర్శకుడు మార్క్సిస్టుగా గుర్తింపు పొంది ఉన్నట్టయితే అతను రాసిందల్లా మార్క్సిస్టు సాహిత్య విమర్శగా చలామణీ అయిపోయిన సందర్భాలు ఉన్నాయి. మార్క్సిస్టు సాహిత్యధార నుంచి, మార్క్సిస్టు సాహిత్యకారుల సంఘాల నుంచి వెలువడిన సాహిత్యవిమర్శ అంతా మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా పరిగణించబడింది. మార్క్సిస్టు సాహిత్యధారలో వచ్చిన పుస్తకాలపై విమర్శ మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందింది. మార్క్సిస్టు రచయితలైనా సాంప్రదాయక అంశాలపైన, సాంప్రదాయక రచయితలపైన, పుస్తకాలపైన రాసినప్పుడు అది మార్క్సిస్టు సాహిత్య విమర్శగా గుర్తింపు పొందడం ఇబ్బంది అయింది. కొన్ని సందర్భాలలో కేవలం మార్క్సిస్టు సాహిత్య విమర్శలోని పారిభాషికపదాలను వాడడమే మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందింది. మార్క్సిస్టు సాహిత్య విమర్శ చెప్పే విషయాలనే చెప్పినప్పటికీ, ప్రత్యేక పదజాలంలో చెప్పకపోతే అది మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తింపు పొందలేదు. తాము రాస్తున్నది మార్క్సిస్టు సాహిత్యవిమర్శ అనుకున్నవాళ్లు కూడ తమ రచనలలో మార్కిస్టేతర, అమార్క్సీయ సాహిత్యవిమర్శా పరికరాల, భావనల సాయం తీసుకున్నారు. మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులమని తమనుతాము గుర్తించుకున్నవాళ్లలో కూడ అన్ని సందర్భాలలోనూ దృక్పథస్పష్టత లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే మార్క్సిస్టు సాహిత్య విమర్శ అంటే ఏమిటి అనే ప్రశ్నకు సూటి సమాధానాన్ని తెలుగు సాహిత్యలోకం ఇంకా తయారు చేయలేదు. ఆ దిశగా చెప్పుకోదగిన, గౌరవించదగిన ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆ ప్రయత్నాలన్నిటినీ సమన్వయపరచిన సమగ్ర కృషి జరగలేదు.
ఇందుకు కారణమేమిటో గుర్తించాలంటే, అసలు మార్క్సిస్టు సాహిత్యవిమర్శకు ప్రాతిపదికలు ఏమిటో, అవి తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో వ్యక్తమయ్యాయోలేదో పరిశీలించాలి.
ఒక సాహిత్యవిమర్శ రచనను మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా గుర్తించడానికి కనీసం ఐదు ప్రధాన ప్రాతిపదికలు ఉండాలి. అవి 1. మార్క్సిస్టు సాహిత్యవిమర్శా సిద్ధాంతం, 2. మార్క్సిస్టు సాహిత్యవిమర్శా పద్ధతి, 3. సమాజసాహిత్యసంబంధాల అవగాహన, అది విమర్శలో వ్యక్తమయే తీరు, 4. వస్తుశిల్పాల చర్చ, విశ్లేషణ, 5. సాహిత్యానికి గల తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాల స్పృహ. ఈ ఐదు ప్రాతిపదికలలోనూ తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో కొంతకృషి జరిగినప్పటికీ, జరగవలసిన కృషి ఎంతో ఉంది.
మార్క్సిస్టు సాహిత్య విమర్శా సిద్ధాంతం తెలుగులో మార్క్సిస్టు సాహిత్య విమర్శ ఎక్కువగా పుస్తక సమీక్షల రూపంలో, అనువర్తిత, అన్వయ విమర్శగానే సాగింది గాని సాహిత్యవిమర్శా సిద్ధాంతం వైపునుంచి ఎక్కువ కృషి జరగలేదు. అసలు సైద్ధాంతికస్థాయిలో మార్క్సిస్టు సాహిత్యవిమర్శా పద్ధతి ఏమిటనే చర్చ ఎక్కువగా జరగలేదు.
నిజానికి మార్క్సిస్టు సాహిత్యవిమర్శను ఇతర సాహిత్యవిమర్శల నుంచి వేరుచేసేది దాని సిద్ధాంతం, దాని పద్ధతి. సాహిత్యసృజన గురించీ, సమాజ సాహిత్యసంబంధాల గురించీ, సాహిత్య ప్రభావం గురించీ, సాహిత్య ప్రయోజనం గురించీ మార్క్సిస్టు దృక్పథంలో ప్రత్యేకమైన సైద్ధాంతిక అవగాహన ఉంది. ఆ అవగాహన మార్క్స్ ఎంగెల్స్ ల రచనలలోనే ప్రారంభమై, గత నూట అరవై సంవత్సరాలలో ఎంతగానో విస్తరించింది. సోవియట్ యూనియన్, చైనా వంటి దేశాలలో ఆచరణలోకి వచ్చి, ఆ ఆచరణక్రమంలో మార్పులు చేర్పులకు గురయిన సాహిత్య సైద్ధాంతిక అవగాహన ఒకవైపు ఉండగా, జర్మనీ, ఫ్ర్రాన్స్, హంగరీ, బ్రిటన్, చెకొస్లవేకియా, అమెరికా లలో విశ్వవిద్యాలయాలలోనూ, కమ్యూనిస్టుపార్టీలలోనూ మేధావుల విశ్లేషణా కృషిలో అనేక కొత్త అంశాలు, ఆలోచనలు వెలికివచ్చాయి. ఇరవయో శతాబ్ది పొడవునా అద్భుతంగా వికసించిన ఈ మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్నంతా మదింపు వేసి, మన సామాజిక, సాంస్కృతిక ప్రత్యేకతలతో జతచేసి మనకై మనం ఒక విస్పష్టమైన మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతాన్ని రూపొందించుకోవలసి ఉంది. అందులో మార్క్సిస్టు దృక్పథంలోని సార్వజనీన, సార్వకాలీన అంశాలూ ఉంటాయి, వాటిలో అదనంగా వచ్చిచేరే అంశాలూ ఉంటాయి, మన సమాజ, సాహిత్య ప్రత్యేకతలను వివరించగల ప్రత్యేక అంశాలూ ఉంటాయి. తెలుగులో అటువంటి మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతం అభివృద్ధి చేయడానికి అవసరమయిన కృషి చాల తక్కువ జరిగింది.
అటువంటి స్వతంత్ర సాహిత్యసిద్ధాంతం రూపొందించడానికి కృషి తగినంతగా జరగకపోవడం మాత్రమే కాదు, ఇతర భాషలలో జరిగిన అటువంటి కృషిని తెలుగులోకి అనువదించే ప్రయత్నం కూడ తగినంత జరగలేదు. సాహిత్యం గురించి లెనిన్ ఒక ప్రత్యేక సందర్భంలో ప్రకటించిన అభిప్రాయాలు, విముక్తప్రాంతంలో ఎర్రసైనికులను, రచయితలను ఉద్దేశించి మావో చేసిన ప్రసంగం మినహా, మొత్తంగా సాహిత్యం గురించి మార్క్సిస్టు సైద్ధాంతిక అవగాహనలు తెలుగులోకి ఇంతవరకూ రానేలేదు. మార్క్స్ ఎంగెల్స్ లు సాహిత్యం గురించి వెలిబుచ్చిన అద్భుతమైన విశ్లేషణలు గానీ, స్థూలంగా మార్క్సిస్టు అవగాహనా చట్రంలోనే అయినప్పటికీ, విభిన్నమైన పద్ధతిలో ప్లెహనోవ్, మయకోవ్ స్కీ, లూనషార్ స్కీ, క్రిస్టఫర్ కాడ్వెల్, ఎర్నెస్ట్ ఫిషర్, అల్థుజర్, జార్జి లూకాచ్, బెర్టోల్ట్ బ్రెహ్ట్, జీన్ పాల్ సార్త్రే, అలెక్ వెస్ట్, హొవార్డ్ ఫాస్ట్, రేమండ్ విలియమ్స్, వాల్టర్ బెంజమిన్, టెర్రీ ఈగిల్ టన్, ఫ్రెడరిక్ జేమ్ సన్ వంటి ఎందరో మేధావులు చేసిన అపారమైన సాహిత్య విమర్శ చర్చ గాని, కొత్త భావాలుగాని, కనీసం వాటి పరిచయాలుగాని తెలుగులోకి రానే లేదు. (మాగ్జిం గోర్కీ, రాల్ఫ్ ఫాక్స్ , ఇల్యా ఎహ్రెన్ బర్గ్ , జార్జి థామ్సన్ ల రచనలలోంచి కొన్ని మాత్రం తెలుగులోకి రావడం మినహాయింపు). ఆయా సైద్ధాంతిక చర్చల మౌలికాంశాలు, భావనలు పరిచయం కాలేదుగాని, ఆ చర్చలలోని వివాదాలు, అనవసర అంశాలు మాత్రం పరోక్షంగా చిలవలు పలువలతో తెలుగు చర్చా సంప్రదాయంలోకి వచ్చిచేరాయి. సిద్ధాంతం మీద కన్న ఎక్కువ పూనిక వివాదం మీద ఉండిందనేది ఒక చేదు వాస్తవం.
ఈ విధంగా తెలుగులో మార్క్సిస్టు సాహిత్యవిమర్శగా పేరుతెచ్చుకున్న రచనలకు అవసరమైన తాత్వికపునాది, సైద్ధాంతిక భూమిక కొంత సమస్యాత్మకంగా ఉంది. అందువల్ల దాదాపుగా మినహాయింపులు లేకుండా అందరు “మార్క్సిస్టు సాహిత్యవిమర్శకుల”లోనూ ఎక్కడో ఒకచోట సైద్ధాంతిక పటుత్వం లేకపోవడం కనబడుతుంది. మన సమాజంలో మార్క్సిస్టులుగా మారదలచుకున్నవారి మీద ఏదో ఒకరూపంలో హైందవ బ్రాహ్మణ్య ఆలోచనల ప్రభావం కొనసాగినట్టుగానే, మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులు కాదలచుకున్నవారి మీద కూడ ఆలంకారిక సాహిత్యవిమర్శాపరికరాల గతకాలపు భారం కొనసాగడం కనబడుతుంది. మరొకవైపు వారే పాశ్చాత్య సాహిత్యవిమర్శ ముందుకు తీసుకొచ్చిన కొన్ని మిరుమిట్లు గొలిపే పరికరాల మోజులో పడి మార్క్సిస్టు దృక్పథపు మౌలిక పునాదులను విస్మరించడం కూడ కనబడుతుంది. అందువల్ల మార్క్సిస్టు సాహిత్యసిద్ధాంత అవగాహన పటిష్టంగా ఉండవలసినచోట, కొన్ని మార్క్సిస్టు భావాలు, కొన్ని ఆలంకారిక సాహిత్యసిద్ధాంత భావనలు, కొన్ని పాశ్చాత్య సాహిత్యసిద్ధాంత భావనలు, కొన్ని సాదాసీదా సాహిత్య ఆలోచనలు శాంతియుత సహజీవనం చేయడం కనబడుతుంది.
మార్క్సిస్టు సాహిత్య విమర్శా పద్ధతి మార్క్సిస్టు సాహిత్యవిమర్శ కూడ ఇతర సాహిత్య విమర్శలలాగనే ఒక సాహిత్య రచనలోని వస్తువును, శిల్పాన్ని, ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని, ప్రభావాన్ని పరిశీలిస్తుంది. రచనను వివరించడానికి, విశ్లేషించడానికి ప్రయత్నిస్తుంది. రచనను ఒక నేపథ్యంలో పెట్టి పాఠకులు ఆ రచనను గ్రహించే భూమికను విశాలం చేస్తుంది. అంటే స్థూలంగా చూసినప్పుడు మార్క్సిస్టు సాహిత్య విమర్శ కూడ ఇతర సాహిత్య విమర్శలలాగనే పనిచేస్తుందని అనిపిస్తుంది. కాని, మార్క్సిస్టు సాహిత్య విమర్శ స్పష్టంగా విభిన్నంగా, విశిష్టంగా ఉండేది దాని సంవిధానంలోనే.
ఆ సంవిధానాన్ని నిర్ణయంచేవి చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక, సాంస్కృతిక కోణాలు. ఇతర సాహిత్యవిమర్శా రూపాలలో వీటిలోని ఒకటో రెండో కోణాలు ఉండవచ్చుగాని అవి కూడ సమగ్రంగా ఉండే అవకాశంలేదు. ఉదాహరణకు, ప్రాచీన, ఆలంకారిక సాహిత్యవిమర్శలో చారిత్రక, రాజకీయార్థిక, సామాజిక కోణాలు లేవుగాని, సాంస్కృతిక కోణం ఎక్కువగానే ఉంటుంది. అయితే, ఆ సాహిత్యవిమర్శలో సంస్కృతి అంటే ఏమిటని నిర్వచించే విషయంలో, సాంస్కృతిక కోణాన్ని ఆధ్యాత్మిక అర్థంలో నిర్వచించే విషయంలో సమస్యలు ఉన్నాయి. అట్లాగే సామాజికశాస్త్రాల స్పర్శతో సాగే ఆధునిక సాహిత్యవిమర్శలో సామాజిక, చారిత్రక, రాజకీయార్థిక కోణాలు ఎంతో కొంత కనబడవచ్చుగాని అవి సమగ్రంగానూ, ఒక మొత్తంగానూ ఉండే అవకాశం లేదు. మౌలికప్రశ్నల దగ్గరికి వెళ్లే అవకాశం లేదు.
మార్క్సిజమంటే సంవిధానమే అనే అతివాద సూత్రీకరణ చేసిన విశ్లేషకులు కూడ ఉన్నారుగాని, దానిలోని అతివాదాన్ని పక్కనపెట్టి, మార్క్సిస్టు పరిశీలనా, విశ్లేషణా, పరివర్తనా క్రమంలో సంవిధానానికి చాల ప్రాధాన్యత ఉందని గుర్తించవలసిఉంది. ఒక వస్తువును పరిశీలించడంలో, విశ్లేషించడంలో, దానిలో మార్పుకు పునాది అయిన అంశాలను గుర్తించి ఎత్తిపట్టడంలో, ఆ పరివర్తనా అంశాలను సమర్థించి వాటి భవిష్యత్తును సూచించడంలో ఇతర అన్ని దృక్పథాలనుంచి మార్క్సిస్టు దృక్పథాన్ని ఆ సంవిధానమే వేరుచేసి చూపుతుంది.
మార్క్సిస్టు సంవిధానం ఏమిటి అనే అంశంమీద గత నూటయాభైఏళ్లుగా చాల చర్చ జరిగింది, జరుగుతోంది. ప్రధానంగా రాజకీయార్థిక శాస్త్రానికి అన్వయించి జరిగిన ఈ చర్చనుంచి ఇతర శాస్త్రాలకు ఉపయోగపడే సంవిధానాన్ని రూపొందించడానికి కూడ ప్రయత్నం జరిగింది. ఆ చర్చ గురించి ఇక్కడ వివరంగా ప్రస్తావించనక్కరలేదుగాని, రూపం – సారం, నిర్దిష్టత – సాధారణీకరణ, చారిత్రక దృష్టి, వైరుధ్యాలు అనే నాలుగయిదు ప్రమేయాలు మార్క్సిస్టు సంవిధానంలో ప్రధానమయినవి. ఈ ప్రమేయాలన్నీ కూడ సాహిత్యవిమర్శకు అన్వయించగలిగినవే.
అయితే, ఆరు దశాబ్దాల తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో ఈ మార్క్సిస్టు సంవిధానాన్ని సంపూర్ణంగా వినియోగించడం జరగలేదనే చెప్పాలి. నిజానికి సాహిత్యవిమర్శ చేసే పని, సాహిత్యాన్ని పరిశీలించడం, వివరించడం, విమర్శించడం, విశ్లేషించడం, భవిష్యత్ రచనకు మార్గదర్శక ప్రాతిపదికలు సూచించడం అని అనుకుంటే, ఆ అన్ని పనులూ చేయడానికి ఉపయోగపడే మార్క్సిస్టు సంవిధానాన్ని వాడుకోకుండా, మార్క్సిస్టు సాహిత్యవిమర్శ సాగిందంటే అది ఉండవలసినంత సమగ్రంగా లేదనే అనుకోవాలి. తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ చాలవరకు మార్క్సిస్టు సంవిధానం జోలికి వెళ్లకుండానే, అంటే, సాహిత్యవిమర్శ చేయవలసిన పనులన్నీ చేయకుండానే ముగిసిపోయింది. ఎక్కువలో ఎక్కువ పరిశీలనను, వివరణను మాత్రం చేపట్టిందిగాని విమర్శ, విశ్లేషణ, భవిష్యత్ సూచనలు జరగవలసినంతగా జరగలేదు.
రూపానికీ సారానికీ మధ్య అంతరం లేకపోతే ఒక వస్తువును విశ్లేషించడానికి శాస్త్రం అవసరమే లేదని మార్క్స్ చేసిన మౌలిక ఆలోచనాస్ఫోరక సూత్రీకరణను తెలుగు సాహిత్యవిమర్శకులలో చాలమంది గుర్తించినట్టు కనబడదు. రూపం గురించీ, సారం గురించీ తగినంత లోతులకు వెళ్లకుండానే, ఉపరిశోధనలతోనే విమర్శ రాసి, అదే మార్క్సిస్టు సాహిత్యవిమర్శ అనుకున్నవాళ్లు చాలమంది ఉన్నారు. సారం జోలికే పోకుండా రూపాన్ని తిరగరాసే సంప్రదాయం, రూపం గురించి ఎంత మాత్రం పట్టించుకోకుండా సారాన్ని వివరించే సంప్రదాయం తెలుగులో విస్తృతంగానే ఉన్నాయి. మార్క్సిస్టు సాహిత్యవిమర్శకులుగా పేరుతెచ్చుకున్నవాళ్లలో కూడ చాలమంది ఈ పనే చేశారు.
నిర్దిష్టత – సాధారణీకరణ గురించి, వాటి అంతస్సంబంధాన్ని గురించి మార్క్సిస్టు సంవిధానం చేసిన అద్భుత సూత్రీకరణలెన్నో ఉన్నాయి. స్వయంగా మార్క్స్ ఈ ప్రమేయాన్ని పరిశోధనా పరికరంగానూ, వివరణ పరికరంగానూ ఎట్లా వాడుకోవచ్చునో చెప్పాడు. తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో ఈ అంశం పొందవలసినంత గుర్తింపు పొందలేదు. ఒక రచన అనే నిర్దిష్ట వస్తువును తీసుకుని సాధారణీకరణ ఎట్లా చేయవచ్చును, ఆ సాధారణీకరణను మళ్లీ ఎట్లా నిర్దిష్ట వస్తువులకు అన్వయించవచ్చును, అసలు సామాజిక నిర్దిష్టత సాహిత్య సాధారణీకరణగా ఎట్లా మారుతుంది, సాహిత్యంలోనూ, సమాజంలోనూ నిర్దిష్టతలకూ సాధారణీకరణలకూ ఉన్న గతితార్కికసంబంధం ఎట్లా వ్యక్తమవుతుంది అనే వైపునుంచి సాహిత్యవిమర్శ సాగిస్తే అద్భుతమైన నిర్ధారణలకు రావచ్చు.
అట్లాగే చారిత్రక దృక్పథం అనేది మార్క్సిస్టు సంవిధానంలో చాల ప్రధానమైనది. అది ఏ పరిశీలనావస్తువునైనా ఒక పూర్వరంగంలో ఉంచడానికి, దాని పుట్టుక, పెరుగుదలలను సవ్యంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో సాహిత్యవిమర్శకు అత్యవసరమైన, సాహిత్యానికి వనరుగా నిలిచే సామాజిక, రాజకీయార్థిక, సాంస్కృతిక నేపథ్యాన్ని గుర్తించడం చారిత్రక దృక్పథం సహాయంతోనే సాధ్యమవుతుంది. తెలుగు సాహిత్యవిమర్శలో ఈ సంవిధాన పరికరాన్ని తగినంతగా వాడుకోలేదని అనిపిస్తుంది.
ఇక వైరుధ్యాలు, ఒకే వస్తువులో విరుద్ధాంశాల ఐక్యత, ఘర్షణ ప్రధానంగా తాత్విక ప్రమేయాలుగా కనిపించినప్పటికీ, ప్రకృతిలోనూ, సమాజంలోనూ, మానవమేధలోనూ జరిగే పరిణామాలన్నిటినీ అర్థంచేసుకోవడానికి ఉపయోగపడే ప్రమేయాలు అవి. ఆ ప్రమేయాల్ని సృజనాత్మకంగా ఉపయోగిస్తే, ఒక సాహిత్య రచనను ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడమూ, చేయించడమూ సాధ్యమవుతుంది. కాని తెలుగు సాహిత్యవిమర్శలో ఈ ప్రమేయాన్ని వాడుకున్నప్పుడు యాంత్రికంగా వాడుకోవడమూ, లేకపోతే అసలే వాడుకోకపోవడమూ జరిగింది.
సమాజ సాహిత్య సంబంధాలు
మార్క్సిస్టు సాహిత్యవిమర్శలో ప్రధానశక్తి సమాజ సాహిత్య సంబంధాలను అర్థం చేసుకోవడంలోనే, వివరించడంలోనే ఉంది. మిగిలిన అన్ని సాహిత్యవిమర్శ పద్ధతులూ సమాజానికి ఇవ్వవలసినంత ప్రాధాన్యం ఇవ్వవు. సాహిత్యానికి ఇవ్వవలసిన స్థానం కన్న ఎక్కువ స్థానం ఇస్తాయి. మార్క్సిజం మాత్రమే సమాజంలోని విభిన్న పార్శ్వాలమధ్య అంతస్సంబంధాలు ఏ పద్ధతిలో రూపొందుతాయో, వాటిమధ్య ఏయే రంగాలకు ఎంత స్థానం ఉంటుందో సరిగా వివరిస్తుంది. ఎ కాంట్రిబ్యూషన్ టు ది క్రిటిక్ ఆఫ్ పొలిటికల్ ఎకానమీ ముందుమాటలో సుప్రసిద్ధమైన సూత్రీకరణలో పునాది – ఉపరితలం అనే ప్రతీకల ద్వారా మార్క్స్ ఈ అంతస్సంబంధాన్ని వివరించాడు. తర్వాతకాలంలో ఈ సూత్రీకరణకు తప్పుడు వ్యాఖ్యానాలు వచ్చినప్పుడు, స్వయంగా మార్క్స్ ఎంగెల్స్ లు, ఆ తర్వాత ఎందరో మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలు, సాహిత్యవిమర్శకులు దాన్ని వివరించడానికి ప్రయత్నించారు.
ఆ చర్చ వివరాలలోకి ఇక్కడ పోనక్కరలేదుగాని, ఆ సూత్రీకరణను తెలుగు సమాజ ప్రత్యేకతకు అన్వయించి ఇక్కడ పునాది ఏమిటో, చారిత్రక క్రమంలో ఆ పునాది ఎట్లా మారుతూ వచ్చిందో, ఆ మార్పులు వివిధ ఉపరితల రంగాలలో ఎట్లా ప్రతిఫలించాయో, అవి సాహిత్యంలో ఎట్లా వ్యక్తమయ్యాయో వివరించడానికి ఎంతో అవకాశం ఉంది. ఆ దిశగా చాల తక్కువ ప్రయత్నం జరిగింది. తెలుగు సమాజ ప్రత్యేకతలు అన్నప్పుడు, ఇక్కడి సమాజంలోని కుల, మత, స్త్రీ-పురుష, ప్రాంతీయ, భాషా అస్తిత్వాల మధ్య అంతరాలు, అద్భుతమైన మౌఖిక సాహిత్య వారసత్వం, వెయ్యి సంవత్సరాలపాటు సాగిన రాజాస్థాన, మార్గ, అగ్రవర్ణ సాహిత్యం, రాజాశ్రయ సంప్రదాయానికి భిన్నంగా, సమాంతరంగా సాగిన దేశి, ధిక్కార, ప్రజా సంప్రదాయం, ఆధునికతా భావాల వల్ల రెండువందల సంవత్సరాలకింద ప్రారంభమై వేర్వేరు పాయలుగా సాగుతున్న ఉద్యమ సాహిత్యం వంటి అనేక అంశాలున్నాయి. వీటిలో ఏ ఒక్కటయినా మార్క్సిస్టు సాహిత్యవిమర్శకు గొప్ప ముడిసరుకు కాగలదు. ఆరు దశాబ్దాల మార్క్సిస్టు సాహిత్యవిమర్శా కృషి తర్వాతకూడ ఆ దృక్పథం నుంచి తెలుగు సాహిత్య చరిత్ర రచన జరగలేదంటే, సమాజసాహిత్య సంబంధాల అధ్యయనంలో తెలుగు సాహిత్య విమర్శకుల అనాసక్తి కనబడుతుంది.
సమాజ సాహిత్య సంబంధాలగురించి మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా వస్తుశిల్పాల చర్చ అవసరమవుతుంది. సాహిత్యానికి వస్తువును సమాజమే సమకూరుస్తుంది. శిల్పం ఒక చారిత్రక క్రమంలో, సామాజిక పరిణామ ఉత్పత్తిగా రూపొందుతుంది. అది ప్రయోగాల ద్వారా కొత్త అభివ్యక్తిని సంతరించుకుంటుంది. అందువల్ల సమాజ సాహిత్య సంబంధాల చర్చ, వస్తు శిల్పాల చర్చ ఒకదానితో ఒకటి అవినాభావంగా సాగవలసినవే. తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శలో ఎక్కువభాగం వస్తుశిల్పాల చర్చ తగినంత లోతుగా, విస్తృతంగా జరగలేదు గనుక, అది సమాజ సాహిత్య సంబంధాల చర్చదాకా విస్తరించలేదు. మార్క్సిస్టు సాహిత్యవిమర్శ వస్తువును మాత్రమే పట్టించుకుంటుందనే అపోహ వచ్చేంతగా, వస్తువు మీద శ్రద్ధాసక్తులు, చర్చ, విశ్లేషణ జరిగాయి. మార్క్సిజం రూపవాదాన్ని వ్యతిరేకిస్తుందిగాని రూపాన్ని కాదు అని మార్క్సిస్టు సాహిత్య సిద్ధాంతకారులందరూ పదేపదే చెప్పిన విషయాన్ని పక్కనపెట్టి, రూపాన్ని వ్యతిరేకిస్తున్నారేమోనని అనుకునే స్థాయిలో రూపంపట్ల వ్యతిరేకత, వస్తువు మీద పూనిక కొనసాగాయి. నిజానికి, వస్తువుమీద పూనిక కూడ శిల్పం మీద పూనికతో కలిసి సాగకపోతే, అది వస్తువుకు కూడ ఏమీ మేలుచేయదు.
అటు సమాజ సాహిత్యసంబంధాల మీద తక్కువ శ్రద్ధ, ఇటు వస్తుశిల్పాల ఐక్యత మీద చిన్నచూపు కలిసి సాహిత్యానికి సంబంధించిన మరొక రెండు అంశాలపట్ల తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శకు చిన్నచూపు కలిగించాయి. అవి సాహిత్యకత, తాత్వికత. ఒక సాహిత్య రచనను ఇతర రచనలతో వేరుచేసేది ఏమిటి? కరపత్రానికీ, కవితకూ తేడా ఏమిటి? ఒకటి గొప్ప ఒకటి తక్కువ అనుకోకుండానే, సాహిత్యరచనల ప్రత్యేకతను గుర్తించవలసి ఉంటుంది. ఈ చర్చలో భాగంగా సాహిత్యవిమర్శలో సాహిత్యకత అనే ఒక కొత్త భావన అభివృద్ధి అయింది. ఆ సాహిత్యకత సమాజాన్ని విడిచి సాముచేయగూడదనడం వరకూ ఫరవాలేదుగాని, అసలు సాహిత్యకత లేని రచనను సాహిత్యం గా అంగీకరించడం కష్టం. అట్లాగే, జీవితాన్ని ఉన్నతీకరించే ఒక సాధనంగా సాహిత్యం తప్పనిసరిగా తాత్వికతను తనలో భాగం చేసుకుంటుంది. సాహిత్యంలో ప్రాపంచిక దృక్పథం, తాత్వికత ఉంటాయి. మార్క్సిస్టు సాహిత్య విమర్శ కర్తవ్యాలలో ఈ సాహిత్యకతను, తాత్వికతను వెలికితీసి ప్రదర్శించడం, విశ్లేషించడం కూడ భాగమే. తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ ఈ పనిని చేయవలసినంత సమగ్రంగా చేసిందా అనేది అనుమానమే.
తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాలు
బహుశా తెలుగు మార్క్సిస్టు సాహిత్య విమర్శ లోపాల గురించి మాట్లాడుకునేటప్పుడు, తక్షణ – దీర్ఘకాలిక ప్రయోజనాల మధ్య తేడాను విస్మరించడం ఒక ప్రధానాంశంగా గుర్తించవలసిఉంటుంది. సాహిత్యానికీ, సాహిత్య విమర్శకూ, ఆ మాటకు వస్తే ఏ ఆలోచనకైనా, ఏ ఆచరణకైనా తక్షణ, దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ఆ ఆలోచనాపరులకూ, ఆ కార్యకర్తలకూ ఈ అవగాహన ఉండడం తప్పనిసరి. తమ ఊహ, తమ పని ఇవాళ్టికివాళ సాధించగలిగినదీ ఉంటుంది, ఎప్పుడో భవిష్యత్తులో సాధించగలిగినదీ ఉంటుంది. ఈ వర్తమాన భవిష్యత్తులమధ్య దూరం సమీపమైనదీ కావచ్చు, సుదూరమైనదీ కావచ్చు. కళలకూ, సాహిత్యానికీ ఐతే ఈ తక్షణ, దీర్ఘకాలాల మధ్య దూరం వేల సంవత్సరాలు కూడ ఉండవచ్చు. గుహల మీద వేటచిత్రాలు గీసుకున్న ఆదిమమానవులు తమ తక్షణ వేట అవసరంకోసమే వాటిని గీసుకుని ఉండవచ్చు. ఆ చిత్రాలు ఇవాళ్టికీ ఆదిమ చిత్రకళగా మన అనుభవంలోకి రావచ్చు. సాహిత్యకారులు కూడ తమ నిర్దిష్ట వర్తమానాన్ని అక్షరీకరించి ఉండవచ్చు, ఆ రచనలు వేల, వందలఏళ్ల తర్వాత సమాజానికి ఉపయోగపడుతుండవచ్చు, సామాజిక అనుభవాన్ని ఉన్నతీకరిస్తుండవచ్చు. సాహిత్యానికీ, సాహిత్యవిమర్శకూ ఈ చారిత్రక విహంగావలోకనాదృష్టి ఉండడం చాల అవసరం. తెలుగు సాహిత్యంలోనూ, తెలుగు సాహిత్యవిమర్శలోనూ ఈ దృష్టి కొంత తక్కువే. సద్యోరచన, సద్యోవిమర్శ ఎక్కువ. మార్క్సిస్టు సాహిత్యవిమర్శలోకి కూడ ఈ తాత్కాలికత ప్రవేశించింది.
తెలుగులో ఉద్యమ సాహిత్య సంప్రదాయం చాల ఎక్కువ గనుక, ఆయా ఉద్యమాలకు తక్షణ అవసరాలు ఉంటాయిగనుక, సాహిత్యంలో కొంతభాగం ఈ తాత్కాలిక అవసరాలు తీర్చడానికి వినియోగపడితే అర్థం చేసుకోవచ్చు. కొంతభాగం సాహిత్యవిమర్శ కూడా ఆ తాత్కాలికత అవసరాలు తీర్చడాన్ని అర్థం చేసుకోవచ్చు. కాని మొత్తంగా సాహిత్య సంప్రదాయం, సాహిత్య విమర్శా సంప్రదాయం తాత్కాలికతకు గురికావడం సమస్యలకు దారితీస్తుంది.
ముగింపు
ఈ లోపాలు గుర్తించడం తెలుగు మార్క్సిస్టు సాహిత్యవిమర్శ లోపభరితంగా ఉన్నదని చెప్పడానికి కాదు. అద్భుత ప్రజాపోరాటాలతో గొప్ప సామాజికానుభవం, ఆ అనుభవాన్ని కళలో, సాహిత్యంలో అనితరసాధ్యంగా గ్రహించిన కళా సాహిత్య సంప్రదాయం ఉన్నచోట, ఆ అనుభవానికీ, ఆ సంప్రదాయానికీ తగినంతగా సాహిత్యవిమర్శ సంప్రదాయం అభివృద్ధి చెందలేదని గుర్తించడానికి. ఇప్పటికైనా తెలుగు సాహిత్యవిమర్శకులందరూ, ప్రత్యేకించి మార్క్సిస్టు సాహిత్యవిమర్శ రంగంలో పనిచేస్తున్నవారు ఈ అంశాలమీద దృష్టి పెట్టి పనిచేయాలని గుర్తు చేయడానికి.

11, నవంబర్ 2012, ఆదివారం

చిత్త శతకం లోని పద్యం/ శ్రిపతి భాస్కర్ /

కపిల రాం కుమార్ / చిత్త శతకం లోని పద్యం/ శ్రిపతి భాస్కర్ /

చిత్తరులుత్తవత్త కవి చెత్తలు సత్తరులుత్తమోత్తముల్
ముత్తియు, బుత్తి, చిత్తియుం మొత్తమురిత్తబు క్రొత్తక్రొత్తలౌ
పొత్తములెత్త మత్తరము పొత్తగు నెత్తరి నత్తుగుత్తమౌ
బిత్తరపుత్తిసత్తియగు బెత్తలుకత్తళమత్తు చిత్తమౌ!

11-11-2012 ( సేకరణ్ - శతక కవుల చరిత్రము - నిడదవోలు వెంకట్రావు)

తెలుగు కవిత్వంలో వస్తువు?

తెలుగు కవిత్వంలో వస్తువు?: కాదేదీ కవితకనర్హం అన్నాడు శ్రీశ్రీ. దీన్ని బట్టి కవిత్వానికి ఏదైనా వస్తువు అవుతుంది. కవిత్వానికి వస్తువు అనుభూతి కావచ్చు. ఒక వర్గానికి, మరో వర్గానికి మధ్య శత్రుపూరిత ...

10, నవంబర్ 2012, శనివారం

నడ్డివిరగక తప్పదు!//

కపిల రాంకుమార్/ నడ్డివిరగక తప్పదు!//

ఈ రోజు పొద్దున్నే ఇలా జరిగింది .....
అది...
వాసం ఊడి నెత్తిమీదబడి
రక్తం కారుతున్న
మధ్యతరగతి మానవుడ్ని
అందుకే పండుగ రోజే కాదు
ప్రతీ రోజు గుండె దడే!
ధరలో - ధరలు
ఆకాశంలో విహరిస్తుంటే
దీపావళి సామాను కొనలేదని
మా చంటోడు మా 'రాము'
మారాము చేస్తుంటే్,
పండుగనాడూ పాత చీరేనా? అని
శ్రీమతి హెచ్చరికో, ముచ్చటకో తెలియదు కాని
తల అటూ ఇటూ
తిప్పి కఫీ కప్పు పెట్టి,
నేనేదో చెప్పబోతుంటే
ప్రతిసారి అలా ' సారీ ' చెప్పకండి
ఒక్క శారీ కోసం!
తనే సర్దుబాటు చేసింది!
కురిసే ఇంటి కప్పు సంగతేమిటని ఆలోచిస్తుంటె
చేతిలోని కప్పు జారిపోతే
అయిన చప్పుడి విని ఇంటి కప్పు కూలినంతపనైంది!
పండక్కి (ఏ పండక్కైనా)
పట్టు పరికిణి కుట్టించలేదని
మా తల్లి పేచీపెడ్తూ గీపెడుతోంది
దానికి వంత పాటలా దగ్గుతూ ' నా మందులు తేలేదా?
అమ్మ చార్జిషీట్
పెంషను కాయితాలు రాలేదని
మరీ టెంషను పడుతూ మా నాన్న
ఆయాసపు చూపులు
ఎక్కడికైనా పారిపోదామనుకుంటె
ఎదురుగా ' దీపావళి ' పండుగై వచ్చింది
ఫాల్స్ ప్రిస్టేజి చూపించ్కపోతే
ప్రిస్టేజీకే పుట్టగతులుండవని
పీడనకు బలికాక తప్పదనిపిస్తోంది!్
అప్పులు
తిప్పలు
బొప్పులు
ముప్పులు
సందిగ్ధ జీవితకోణాన్ని బేరీజు వేస్తుంటే
ఆలోచన!
ఆవులింత !
ఆడంబరానికి - ఆనందానికి మధ్య
పండుగలొస్తే
మధ్యతరగతి మనిషికి
తప్పదు నడ్డి విరుగక!

10-11-2012 - 10.29 ఉదయం

చలం 'బ్రాహ్మణీకం'లో ఏముంది ?

చలం 'బ్రాహ్మణీకం'లో ఏముంది ?

ఇటీవల 'ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' అనే సినిమా ట్రయిలర్‌పై పెద్ద వివాదం చెలరేగింది. ఈ సినిమా బ్రాహ్మణ స్త్రీలను అసహ్యంగా చూపిందని, బూతు ప్రదర్శనను బ్రాహ్మణిజం అని చెప్పినట్టు కనబడుతోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దర్శక నిర్మాతలు ఇది చలం బ్రాహ్మణీకం నవల ఆధారంగా తీసిన సినిమా అని, చలం నవలపై లేని నిషేధాన్ని సినిమాపై ఎందుకు విధించాలని వాదిస్తున్నారు. సినిమా మొత్తం చూసే అవకాశం ఇంకా మనకు రాలేదు. ట్రయిలర్‌లో మాత్రం పక్కా అశ్లీలత, సెక్స్‌ సన్నివేశాలు కనపడుతున్నాయి. సినిమా వ్యాపార ప్రచార లాభాల బరి తెగింపులో యువతను ఉద్రేకపరిచే దృశ్యాల చిత్రీకరణ నేపథ్యంలో ఈ సినిమాలో చలం నవలాంశం ప్రధానంగా తెరకెక్కిందో, లేదో అనుమానమే!
సినిమాపై వాద విదాదాలపై చర్చ కంటే ముందుగా చలం బ్రాహ్మణీకంలో ఏం చెప్పారు అనేది చూద్దాం. బ్రాహ్మణీకం 1937లో రాసిన నవల. ఆనాటి బ్రాహ్మణ సమాజం, వారి కుటుంబాల్లో నెలకొన్న ఆచారాలు, సాంప్రదాయాలు స్త్రీలను ఎన్ని ఇబ్బందులకు గురిచేశాయో, వారు ఎంత బానిసలుగా జీవితాలు వెళ్లదీయాల్సి వచ్చిందో నవలలోని విషయం. బ్రాహ్మణ కుటుంబాల్లో ఆచారాల ముసుగులో జరుగుతున్న అమానవీయ ఆగడాలను కళ్ళకు కట్టినట్లుగా చూపాడు చలం.
క్లుప్తంగా నవలాంశం ఇదీ.. : ఎనిమిదో ఏటనే మేనత్త కొడుకుతో సుందరమ్మకు పెళ్ళి చేస్తారు. సుందరమ్మ అందాల రాశి. 'ఠీవీ, నిదానమూ, తులసీ దళాలూ, కర్పూరమూ, కుంకుమా కలిసి ఏర్పడ్డ దేహ పరిమళం' అని వర్ణిస్తాడు చలం. భార్యాభర్తలు అన్యోన్యంగా హృదయాలూ, దేహాలు విడివడకుండా జీవిస్తారు. కొంతకాలానికి భర్త జబ్బు చేసి చనిపోతాడు. తర్వాత సుందరమ్మ మానసికంగా కుంగిపోతుంది. తండ్రీ చనిపోతాడు. ఆస్తిపాస్తులు అప్పుల కింద పోతాయి. దిక్కూమొక్కులేని వారవుతారు. విజయవాడలో మేనమామ ఆదరించి సాకుతుంటాడు. సుందరమ్మ నిర్వేదంగానే భర్తను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతుంటుంది. మేనమామ కాలానుగుణంగా ఆచారాల్ని మార్చుకునే ఆలోచన కలవాడు. ఇక్కడ కంచాలలో తినడం, మైలబట్టలతో పీటలమీద కూర్చోడం, సొంతంగా క్షవరం చేసుకోవడం, చాకలి తోడిన నీళ్ళతో స్నానం చేయడం చూసి సుందరమ్మ అసహ్యించుకునేది. గత్యంతరం లేక అలవాటు పడింది. బ్రాహ్మల ఆచారాలను, కట్టుబొట్లను, నిష్టను, వారు బోధించే తత్వాలకనుగుణంగా మనోవాక్కాయ కర్మలా ఆచరించే సామాన్య మహిళ సుందరమ్మ. మేనమామ తన కూతురికి చదువు చెప్పడానికి చంద్రశేఖరం అనే టీచరును ఇంట్లోనే ఉంచుకుని పోషిస్తుంటాడు. అతను సుందరమ్మను మోహిస్తాడు. ఎన్నో రకాలా సుందరమ్మకు తన ఉద్దేశం చెప్పాలనుకుంటాడు. కానీ సుంద రమ్మకు ఆ ధ్యాసే రాదు. చంద్రశేఖ రానికి జ్వరం వస్తుంది. దయతో సుందరమ్మ సేవలు చేస్తుంది. అది అలుసుగా శేఖరం సుందరమ్మను చెర పట్టేందుకు పూనుకుంటాడు. ఆమె అసహ్యించుకుంటుంది. ఇంట్లో ఎవరూ లేని రోజున బతిమాలి, బామాలి, ఏడ్చి, తను దిక్కులేని వాడినని, సుందరమ్మ లేకపోతే బతకనని చెప్పి ఆమెను లొంగదీసుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. అందరికీ తెలుస్తుందని భయంతో శేఖరం వెళ్ళిపోతాడు. మేనమామ కొంత ఆధునికుడు కావడంతో శేఖరం ఊరికి వెళ్ళి తీసుకువచ్చి సుందరమ్మతో పెళ్ళి చేస్తాడు. అతన్ని ఉద్యోగంలో పెట్టిస్తాడు.
పెళ్లి తర్వాత చంద్రశేఖరం ప్రవర్తన మారుతుంది. ఆమె అందాన్ని చూసి తహతహలాడినవాడు, ఆమె కోసం ఏడ్చినవాడు ఇపుడు ఆమె సేవలో లోపాన్ని వెతుకుతున్నాడు. భార్య అయిన తరువాత ఆమె చులకనైపోయింది. భోజనానికి కూడా లేని చంద్రశేఖరాన్ని చేరదీసి, సుందరమ్మతో వివాహం జరిపించి, ఉద్యోగంలో పెట్టిస్తే తాను వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నమొచ్చేదనే ఆలోచనలోకి వచ్చాడు.
శేఖరానికి బ్యాంకులో ఉద్యోగం. అక్కడ అతను బానిస. ఇంటి దగ్గర భార్య తన బానిస. అధికారులు చెప్పినట్లు అక్కడ తను చేయాలి. ఇంటి దగ్గర భార్య చేయాలి. ఆమె తిండికి, చీరెలకు అయ్యే ఖర్చులనూ లెక్కించసాగాడు. అన్నీ ఆర్థిక లావాదేవీల ఆలోచనలుగా మారాయి. కొద్దిరోజుల తర్వాత సుందరమ్మ మీద అనుమానం ఏర్పడింది. తనకంటే ముందు ఎందర్ని మోహించిందోనని, తను అజాగ్రత్తగా ఉంటే ఎందర్ని మోహిస్తుందోనని భయం మొదలైంది. వితంతు వివాహం చేసుకున్నందుకు, సుందరమ్మ భార్య అయినందుకూ విచారపడ్డాడు. సుందరమ్మకు మొదటినుంచీ ఈ కాపురం కంటకంగానే ఉంది. శేఖరం దౌర్జన్యాన్ని వ్యతిరేకించింది. అయినా, ఈ జన్మకు తన గతి ఇంతేనని ఒక విధమైన జడత్వం పొందింది. 'ఎవడు మొన్నటిదాకా తన కన్నా కిందమెట్టు మీద ఉన్నాడో; తన దయ కోసం, అంగీకారం కోసం పరితపించి కాళ్ళు పట్టుకున్నాడో; వాడు ఈనాడు తన అధికారై, తనని ఆజ్ఞాపిస్తే, మహారాణిలాగా ఎవడికి తాను మోహ వరాలిచ్చిందో వాడు ప్రభువై తన అమూల్యమైన ఆనందాన్ని లాక్కుంటే ఆమె శరీరం మీదనే ఆమెకి అసహ్యం కలిగింది. అనుమానము, నీచ పరిహాసమూ ఆమెనెంత బాధించినా పవిత్ర బ్రాహ్మణ కుటుంబాల్లో అటువంటి దౌర్జన్యాలు సాధారణంగా ఉంటాయని ఆమెకు తెలుసు గనుక 'ప్రపంచ స్వభావమే అంత' అని మాట్లాడకుండా తలవంచుకుని ఊరుకొంది'. ఆచారం వల్లా, పెంపకం వల్లా వితంతు వివాహం ఘోర పాపమని సుందరమ్మ నమ్మకం. ఈ పాపం వల్లా, చనిపోయిన భర్తకు ద్రోహం చేయటం వల్లా ఈ బాధలు అనుభవిస్తున్నానని అనుకొంది. ఇంట్లోనే భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ శత్రువుల్లా జీవిస్తున్నారు.
చుట్టుపక్కల వాళ్ళూ, చుట్టాలూ ఎవరూ అంటుకోకుండా ఉంటున్నారు. ఇంటి చాకిరీ, శేఖరానికి సేవ... ఇదే ఆమె జీవితం. పెళ్ళయ్యే నాటికే ఆరునెలల గర్భం. పురుడుకు మంత్రసాని తప్ప ఎవరూ లేరు. అమ్మాయి పుడుతుంది. బిడ్డను కనిపెట్టుకుని ఉండడం, తన పని తనే చేసుకోవడం, భర్త పిలిచినా పలకకపోవడం... ఇంటి గదికే పరిమితమవుతుంది సుందరమ్మ. బిడ్డకు జబ్బు చేస్తుంది. శేఖరం పట్టించుకోడు. పేకాటకు బానిసవుతాడు. తన పాలనే ఔషధంగా పడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు, వితంతు వివాహమని చెప్పి ఏ సాయమూ చేయరు. బిడ్డ రోగానికి మందు కోసం ధైర్యం చేసి బజారులోకి వెళుతుంది. మర్యాదస్తులు, ఉద్యోగస్తులూ అనబడే వాళ్ళ నుంచి రౌడీల వరకూ అందరూ ఆబగా చూడటాన్ని ఓర్చుకోలేక ప్రపంచాన్ని తనని తిట్టుకుని ఇంట్లో పడుతుంది. పార్వతీదేవికి చీర మొక్కుకుంటుంది. బిడ్డ కొంత కుదుట పడుతుంది. మొక్కు తీర్చడానికి చీర కోసం భర్తను పదిహేను రూపాయలు అడుగుతుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తావని ఇవ్వడు. ఆఖరికి అప్పటివరకూ భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఆ రాత్రి తన మొక్కు కోసం భర్తను సుఖపెడుతుంది. బతిమాలుతుంది. మూడు రూపాయలిచ్చి చాలంటాడు. ఎలాగోలా చీర కొని గుడికి వెళ్తే వితంతు వివాహమైన మలినురాలి మొక్కును తీసుకోమంటారు. బిడ్డకు మళ్ళీ జబ్బు చేస్తుంది. పిల్లకు మందు వేయిద్దామంటే శేఖరం డబ్బివ్వడు, పిల్లవంక చూడడు. 'బిడ్డకు కావలసిన సహాయానికై మొగవాణ్ని యాచించే గతి ఒక ఈ నాగరికతపు తల్లులకే పట్టింది' అంటాడు చలం. పిల్ల అమ్మా! అని యేడ్చింది. తన హృదయాన్ని అరగదీసి మందుగా ఆ బిడ్డకి పొయ్యలేకపోతిని కదా అని యేడ్చింది. డాక్టరు రాసిచ్చిన మందుల కోసం డబ్బు లేదు. మందుల షాపు వద్దకు వెళితే అక్కడ రామయ్య నాయుడు చూస్తాడు. ఆమెకు సహాయం చేయాలని మందు బిళ్ళలు తీసుకుని సుందరమ్మ ఇంటికి వెళ్తాడు. 'ఎవరమ్మా మీరు?' అని అడుగుతాడు'. 'బ్రాహ్మలం' అంటుంది. ఆ ఒక్క మాట సమాజ చరిత్రను, చరిత్రలో జరిగిన పీడన రామయ్యకు గుర్తు చేస్తుంది. 'బ్రాహ్మల నించి అన్యాయాన్నీ, అవమానాన్నీ ఎదుర్కొని కౄర శిక్షలకూ, పక్షపాతాలకూ పాలై శూద్రుల అంధకారం అతడికి కనిపిస్తుంది. బ్రాహ్మణుల చేతుల్లో చిక్కి మానాల్నీ ప్రాణాల్నీ అర్పించిన శూద్ర వనితల అవమానం, కసి, అన్నీ అతని రక్తంలో తాండవమాడతాయి. దీంతో సుందరమ్మను 'నేను వైద్యం చేస్తాను నాకేమిస్తావు' అని అడిగాడు. ఆమె నిశ్చేష్ఠురాలయింది. బిడ్డ కోసం తల్లడిల్లిపోయింది. మౌనంగా వాలిపోయింది. ఆ తర్వాత మందులివ్వమంది. తాను డాక్టరును కాను అంటాడు. ఒకేసారి పెద్ద ఘోషలో అగ్ని లాంటి కళ్ళతో పైకి లేస్తుంది. నాయుడుకి భయం వేస్తుంది. వెనకకు అడుగులేస్తూ, ఆమె కళ్ళలో జ్వలించే వెలుగును చూడలేక భగ్గుమని మండిపోతాడు. పంచెకు దీపం అంటుకుని కాలిపోతాడు. సుందరమ్మ బిడ్డ మీద పడి చనిపోతుంది. ఇదీ కథ.
ఇందులో వితంతు వివాహం మీద ఆనాటి సమాజానికి ఉన్న వ్యతిరేక భావాలు, అందులోనూ బ్రాహ్మణ కుటుంబాల్లో ఆచారాలు, పూజలు, క్రతువులు ఎంత మూఢ విశ్వాసాల్లోకి స్త్రీలను నెట్టేశాయో చూపిస్తూనే సహజంగా స్త్రీ కరుణామయమైన హృదయాన్ని చిత్రించాడు. స్త్రీ బానిసత్వ సంకెళ్ళలో ఎలా చిక్కుబడి పోయిందో నిరూపించాడు. మగవారి ద్వంద్వ నీతులు, పరస్త్రీల పట్ల మోహం, భార్య పట్ల చులకనభావం, మొత్తం సమాజంలో బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం, దీనికి గురైన వారి ప్రతీకార చర్యలు, మనిషి మరలా మారిపోవడం ... ఎన్నో విషయాలు ఈ నవల ద్వారా తేటతెల్లం చేశాడు చలం. ఇవే విషయాలను గురజాడ కన్యా శుల్కంలోనూ చూపాడు. బ్రాహ్మణీకంలోని స్త్రీ వేదనా భరిత జీవితం సినిమాలో ప్రధానంగా ప్రతిబింబిస్తే ఆక్షేపణ ఉండదు. వితంతు వివాహం పట్ల నేడు అంతగా వ్యతిరేకతా లేదు. కానీ ఆ నవల పేరుతో స్త్రీ శారీరక వాంఛలను, విపరీత సెక్స్‌ తపనలను చిత్రీకరించి సొమ్ము చేసుకోవాలనుకోవడం చలానికి అన్యాయం చేయడమే అవుతుంది.
(వ్యాసకర్త ఫోను నెం. 9948787660)

మహాకవి పోతన-కరుణశ్రీ కవితా ఖండిక.

అక్టోబర్‌ విప్లవం- నిరంతర ఉద్యమం

అక్టోబర్‌ విప్లవం- నిరంతర ఉద్యమం

1917, నవంబర్‌లో రగిల్చిన జ్వాలను ఆర్పివేయడం సాధ్యంకాదు. ఆ స్ఫూర్తి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితిని సక్రమంగా చేపడితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మాజీ యుఎస్‌ఎస్‌ఆర్‌లో సోషలిజం విఫలమైనా, సామ్రాజ్యవాదం, దాని ఏజెన్సీలు సాగిస్తున్న భీకర ఆర్థిక, సైనికపరమైన దాడులు కొనసాగుతున్నా నిరాశ చెందాల్సిన పనిలేదు. పైన చర్చించిన అంశాలతో పాటు కమ్యూనిస్టు ఉద్యమం పురోగతి సాధించేందుకు సైద్ధాంతిక నిజాయితీ, కమ్యూనిస్టు పార్టీ, దాని నాయకుల, సభ్యుల దృఢ సంకల్పం అత్యంత ముఖ్యమైన అంశం.
'గత శతాబ్దపు విప్లవోద్యమ చరిత్రలో రెండు ప్రధాన సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవి 'ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులు' పేరుతో జాన్‌ రీడ్‌ అభివర్ణించిన అక్టోబర్‌ ఉద్యమం జరిగిన రోజులు, సోవియట్‌ యూనియన్‌ కమ్యూనిస్టు పార్టీ 20వ మహాసభ (1956 ఫిబ్రవరి 14-25). అవి రెండూ ప్రపంచాన్ని 'ముందూ', 'ఆ తరువాత'గా విభజించాయి. ఈ రెండు ఉద్యమాలతో పోల్చగల స్థాయిలో ప్రధాన సైద్ధాంతిక లేదా రాజకీయ ఉద్యమానికి సంబం ధించి మరి ఏ ఇతర సంఘటననూ నేను పోల్చజాలను. ఇంకా సరళంగా చెప్పాలంటే, అక్టోబర్‌ విప్లవం ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమాన్ని సృష్టించింది. 20వ మహాసభ దానిని నాశనం చేసింది'.
ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమంపైనా, ఇటీవలి కాలంలోని పోరాటాలతో సహా కార్మిక పోరాటాలపైనా అనేక సంపుటాల చారిత్రాత్మక విశ్లేషణ చేసి మరణించిన ప్రముఖ మార్క్సిస్టు చరిత్రకారుడు ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.
వాస్తవానికి ప్రపంచాన్ని కుదిపేసిన ఆ పది రోజులకు సంబంధించిన ప్రత్యక్ష కథనాన్ని అమెరికా పాత్రికేయుడు జాన్‌ రీడ్‌ ఆవిష్కరించారు. 1917, నవంబర్‌లో రష్యా కార్మికవర్గం వీరోచిత తిరుగుబాటు చేసిన ఆ పది రోజుల్లో ప్రపంచం ఎంతగా కుదిపివేతకు, మౌలికంగా మార్పుకు గురైందో ఆయన కన్నుల ముందు ఆవిష్కరింపజేశారు. ఫ్రాన్స్‌ సాయుధ కార్మిక వర్గం సృష్టించిన 1881 విప్లవాన్ని విశ్లేషిస్తూ పారిస్‌ కమ్యూన్‌ను కారల్‌ మార్క్స్‌ 'స్టార్మింగ్‌ ఆఫ్‌ హెవెన్స్‌'గా ప్రశంసించారు. అయితే దురదృష్టవశాత్తు అది రెండు మాసాలకు మించి కొనసాగలేకపోయింది. విప్లవం విఫలం కావడానికి కారణాలను మార్క్స్‌ వివరించారు. కార్మికవర్గ నియంతృత్వం, అంటే బూర్జువా వర్గ పాలన స్థానంలో కార్మిక వర్గ పాలన చోటుచేసుకుంటే ఆచరణలో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ప్రపంచానికి ఉద్బోధించారు.
అయితే రష్యా విప్లవం ఇందుకు భిన్నమైంది. రష్యా కార్మిక వర్గం లెనిన్‌ నేతృత్వంలో సాయుధ విప్లవం నిర్వహించింది. లెనినిస్టు సిద్ధాంతాలపై ప్రపంచ కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణం జరిగింది. కేంద్రీకృత, పాక్షిక మిలిటరీ కమాండ్‌ నేతృత్వంలో ప్రపంచంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు అంకితభావంతో ఏకైక క్రమశిక్షణ గలిగిన సైన్యంగా కార్మికవర్గ నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ ఈ విప్లవం తెచ్చింది. నాజీ జర్మనీని ప్రతిఘటించడానికి తెగింపు ప్రదర్శించి యుద్ధంలో అగ్ర రాజ్యంగా నిలిచిన యుఎస్‌ఎస్‌ఆర్‌తో అనుసంధానం కావడంతో అది ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకన్న ఉద్యమమైంది. విశాలమైనదే అయినప్పటికీ వెనుకబడిన దేశాన్ని అగ్ర రాజ్యంగా బోల్షివిజం తీర్చిదిద్దింది. ఇతర దేశాల్లో సోషలిజం పురోగమనానికి, వలసవాద, అర్ధ వలసవాద ప్రపంచం తన విముక్తికి దాని మద్దతును, అయిష్టంగానే అయినప్పటికీ కొన్ని సమయాల్లో నిజమైన రక్షణను తీసుకుంది. దాని బలహీనతలు ఏమైనప్పటికీ యుఎస్‌ఎస్‌ఆర్‌ ఉనికి సోషలిజం ఒక కలకు అతీతమైనదనే విషయాన్ని నిరూపించింది. రష్యాలో బూర్జువా వర్గం పాలన శృంఖలాలను తెంచి వేయడం కమ్యూనిస్టు ఉద్యమానికి అతి పెద్ద సవాలుగా పరిణమించింది. కమ్యూనిజానికి వ్యతిరేకంగా జరిగిన తీవ్ర ప్రచ్ఛన్న యుద్ధంలో పాల్గొన్నవారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కమ్యూనిస్టులను మాస్కో ఏజెంట్లుగా అభివర్ణించారు. వారిని యుఎస్‌ఎస్‌ఆర్‌తోనూ, దాని సోషలిస్టు సిద్ధాంతాలతోనూ గట్టిగా ముడిబెట్టారు.
1917 నుంచి 1990 వరకు, అంటే 73 సంవత్సరాల సోషలిస్టు పాలన అనంతరం యుఎస్‌ఎస్‌ఆర్‌ 1991లో పతనమైంది. ఈ సంఘటనతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు, స్తబ్ధతకు గురైన కమ్యూనిస్టు పార్టీలు మునుపటి యుఎస్‌ఎస్‌ఆర్‌లో సోషలిజం పతనం కావడానికి గల కారణాలను విశ్లేషించడం ప్రారంభించాయి. ఈ లోపు కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు విచ్ఛిన్నం కావడమో లేదా పాక్షికంగా విచ్ఛిన్నం కావడమో జరిగింది. మరి కొన్ని దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు చెక్కుచెదరకుండా పటిష్టంగా నిలిచాయి. రష్యా అరుణతార లేకుండానే అవి పునర్వ్యవస్థీకరణ కార్యకలాపాలను ప్రారంభించాయి.
అవి ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమానికి అత్యంత గడ్డు రోజులుగా పరిణమించాయి. అయితే ప్రస్తుత ప్రపంచ పరిస్థితుల్లో కమ్యూనిస్టులు, కమ్యూనిస్టు ఉద్యమ సానుభూతిపరులు పెట్టుబడి పాలనపైనా, నయా ఉదారవాద ప్రపంచీకరణపైనా పోరాటాన్ని తిరిగి ప్రారంభిస్తున్నారు. ప్రపంచ కార్మికవర్గంపైనా, పేదలపైనా ప్రపంచ పెట్టుబడిదారీ వ్యవస్థ ఇప్పటి వరకూ జరిపిన అత్యంత తీవ్రమైన దాడిగా నయా ఉదారవాద ప్రపంచీకరణను పేర్కొనవచ్చు.
కానీ యుఎస్‌ఎస్‌ఆర్‌ ఎందుకు విఫలమైంది లేదా పతనమైంది? యుఎస్‌ఎస్‌ఆర్‌ పతనం కారల్‌ మార్క్స్‌ విశ్లేషణకు ఒక బలమైన వాదననను ముందుకు తెచ్చింది. మార్క్స్‌ 1859లో ఈ విధంగా రాశారు. 'తమ జీవనోపాధికి సంబంధించిన సామాజిక ఉత్పత్తిలో మానవులు తమ అభిమతాలకు భిన్నంగా నిర్దిష్టమైన, అవసరమైన ఉత్పాదక సంబంధాలను నెలకొల్పుకుంటారు. తమ భౌతిక ఉత్పాదక శక్తుల అభివృద్ధిలో కచ్చితంగా ఇటువంటి సంబంధాలు ఉంటాయి. వారి అభివృద్ధిలో ఒక నిర్దిష్ట దశలో సమాజానికి చెందిన భౌతిక ఉత్పాదక శక్తులకు అప్పటికే అమలులో ఉన్న ఉత్పత్తి సంబంధాలకు మధ్య వైరుధ్యం చోటు చేసుకుంటుంది. దీనిని ఇంతకుముందున్న ఆస్తి సంబంధాలకు సంబంధించిన చట్టపరమైన భావవ్యక్తీకరణగా పేర్కొనవచ్చు. ఉత్పాదక శక్తుల అభివృద్ధి రూపాల నుంచి ఈ సంబంధాలు సంకెళ్లుగా పరిణమిస్తాయి. అప్పుడు మనం ఒక సామాజిక విప్లవ శకంలో ప్రవేశిస్తాం'.
సామాజిక విప్లవానికి అవసరమైన పరిస్థితిని సృష్టించే మార్క్స్‌ సిద్ధాంతాన్ని ఎవరూ తిరస్కరించ లేరు. మార్క్స్‌ విశ్లేషణ రష్యా విప్లవానికి సరిపోతుందా అని కొంతమంది ప్రశ్నించవచ్చు. కానీ అదే గాక మార్క్సిస్టు విప్లవ సిద్ధాంతం పలచబడటం, సిపిఎస్‌యు 20వ మహాసభ అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు (రంగం నుంచి స్టాలిన్‌ నిష్క్రమించిన తరువాత జరిగిన తొలి మహాసభ) యుఎస్‌ఎస్‌ఆర్‌లో సోషలిజం పతనం కావడానికి భూమికను సిద్ధం చేశాయని చెప్పకతప్పదు. దాని ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమం ఎదుర్కొన్న సైద్ధాంతిక ప్రళయం నేటికీ కొనసాగుతోందనడాన్ని కాదనజాలం. ఈ నేపథ్యంలో ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ చారిత్రిక వాస్తవాలకు అనుగుణంగా చేసిన పై వ్యాఖ్యను పరిగణనలోకి తీసుకోవాలి.
మార్క్స్‌ ఉత్పత్తి శక్తులు సామాజిక, వ్యవస్థాగత, సిద్ధాంతపరమైన వ్యవస్థతో పడిన ఘర్షణ వెనుకబడిన వ్యవసాయాధారిత దేశాలను పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాలుగా చేశాయనడానికి స్పష్టమైన దృష్టాంతం ఏమీ లేదని కొందరు వాదించవచ్చు కూడా. రష్యా విప్లవం విషయంలో, ఇది ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. అయితే సోవియట్‌ యూనియన్‌ విచ్ఛన్నం కావడం వాస్తవం. ఈ పతనంలో సిపిఎస్‌యు 20వ మహాసభ పాత్రను హాబ్స్‌బామ్‌ విశ్లేషించారు.
మరి దీని స్థానాన్ని ఏది ఆక్రమిస్తుంది ? మనం 19వ శతాబ్దం నాటి మార్క్స్‌ ఆశావాదాన్ని ఇంకెంత మాత్రం అనుసరించలేం. పాత వ్యవస్థను కూల్చేస్తే దాని స్థానంలో మెరుగైన నూతన వ్యవస్థ ఏర్పాటవ్వాలని మార్క్స్‌ ఉద్బోధించారు. ఎందుకంటే, మానవాళి తాను పరిష్కరించ గల సమస్యలనే సృష్టించుకుంటుంది. మానవాళి, ఇంకా చెప్పాలంటే బోల్షివిక్‌లు 1917లో నిర్దేశించుకున్న లక్ష్యాలు వాటి కాలమాన పరిస్థితుల దృష్ట్యా పరిష్కార యోగ్య మైనవి కావు లేదా అసంపూర్ణంగా మాత్రమే పరిష్కార యోగ్యమైనవి. అయితే ప్రచ్ఛన్న యుద్ధం ఉధృతమైన విషయాన్ని చరిత్ర విస్మరించలేదు. ఆ ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా, ఇతర పశ్చిమ ఐరోపా దేశాలతో, వాటి జీవన ప్రమాణాలతో పోటీపడేలా బోల్షివిక్‌లపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది. అయితే, అదే సమయంలో సంస్కృతి, కళలు, సైన్స్‌, సామాజిక సమసమాజ రంగాల్లో సోవియట్‌ సాధించిన విజయాలను విస్మరించలేం.
సోవియట్‌ కమ్యూనిజం పతనంతో ఉత్పన్నమైన సమస్యలను సమీప భవిష్యత్తులో పరిష్కారం సాధ్యమేనని లేదా తరువాతి తరంలో లభించే ఏ పరిష్కారమైనా మాజీ యుఎస్‌ఎస్‌ఆర్‌ ప్రజలు, కమ్యూనిస్టు బాల్కన్ల పరిస్థితులు మెరుగుపడేందుకు దోహదం చేస్తుందని వాదించేందుకు అత్యంత తీవ్ర స్థాయిలో ఆత్మవిశ్వాసం అవసరం. యుఎస్‌ఎస్‌ఆర్‌ పతనంతో 'నిజంగా ఉనికిలో ఉన్న సోషలిజం'పై జరిపిన ప్రయోగం కొంతమంది పేర్కొన్నట్లుగా ముగిసింది. ఈ విషమ పరిస్థితిని విజయవంతంగా అధిగమించిన కమ్యూనిస్టు దేశాలు లేదా అధికారంలో కొనసాగిన చైనా వంటి దేశాలు కూడా ఏకైక, కేంద్రీకృత నియంత్రణ గల ప్రభుత్వ ప్రణాళికల ఆధారిత వ్యవస్థను రద్దు చేశాయి లేదా మార్కెట్‌ లేని సహకార వ్యవస్థతో కూడిన ఆర్థిక వ్యవస్థ గల దేశాలుగా మిగిలాయి.
సోవియట్‌ ప్రయోగం పెట్టుబడిదారీ వ్యవస్థకు ఒక ప్రపంచ ప్రత్యామ్నాయంగా రూపొందలేదు. తీవ్రంగా వెనుకబడిన ఒక దేశంలో నెలకొన్న ప్రత్యేక, తిరిగి పునరావృతం కాని చారిత్రిక నేపథ్యం గల పరిస్థితుల్లో నిర్దిష్ట ప్రతిస్పందనలుగా మాత్రమే రూపొందింపబడింది. ఎక్కడో విఫలమైన విప్లవం సోషలిజాన్ని మాత్రమే నిర్మించేందుకు యుఎస్‌ఎస్‌ఆర్‌ కట్టుబడి ఉండటానికి దోహదం చేసింది. ఇందులో యుఎస్‌ఎస్‌ఆర్‌ 1917లో విజయం సాధించగలిగింది. సామాజిక యాజమాన్యం, ఉత్పత్తి సాధనాల నిర్దిష్ట ప్రణాళిక, పంపిణీ, మారకం వ్యవస్థ అమలులో ఉన్న సోవియట్‌ యూనియన్‌లో ఈ ప్రయోగం విఫలం కావడం సాంప్రదాయిక సోషలిజం ప్రాజెక్టుపై ఎంత మేరకు ప్రభావం చూపుతుందనేది మరో ప్రశ్న. అటువంటి ప్రాజెక్టు సిద్ధాంతపరంగా ఆర్థికంగా హేతుబద్ధమైందనే వాస్తవాన్ని మొట్టమొదటి ప్రపంచ యుద్ధ కాలం నుంచీ ఆర్థికవ్తేతలు అంగీకరిస్తున్నారు. అయితే ఆ సిద్ధాంతాన్ని రూపొందించింది సోషలిస్టులు కాదు. సోషలిస్టేతర ఆర్థికవేత్తలే. కేవలం అధికార గణం ద్వారానే అమలు చేయాలంటే మాత్రం దీనికి ఆచరణపరంగా కొన్ని లోపాలున్నాయనే విషయం సుస్పష్టం. సోషలిజం వారికి ఏది మంచిదో ఉద్బోధించేదిగా కాకుండా వినియోగదారుల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకోవాలంటే, ఈ సిద్ధాంతం కనీసం పాక్షికంగానైనా మార్కెట్‌ ధరవరలు, వాస్తవికత ప్రాతిపదికగా గల అకౌంటింగ్‌ ధరలతో కలసి పనిచేయ్యాల్సి ఉంటుందనేది కూడా సుస్పష్టం. వాస్తవానికి పశ్చిమ దేశాల్లోని సోషలిస్ట్‌ ఆర్థికవేత్తలు ఈ అంశాలను 1930 దశకంలోనే విస్తృతంగా చర్చించారు. ఆ సోషలిస్ట్‌ వ్యవస్థ ఆచరణ సాధ్యమేనని చాటి చెప్పడం దాని ఆధిక్యతను చాటిచెప్పడం కాకపోవచ్చు.
ఎరిక్‌ హాబ్స్‌బామ్‌ తన స్వీయ అనుభవాలతో కూడిన ఆసక్తికరమైన కథను మనకు అందిస్తారు. 1930 దశకంలో అత్యంత ఆధునిక భావాలు గల సోషలిస్టు ఆర్థికవేత్త ఆస్కార్‌ లాంజ్‌ తన స్వదేశమైన పోలెండ్‌లో సోషలిజం నిర్మించేందుకు అమెరికా నుంచి వచ్చిన విషయాన్ని హాబ్స్‌బామ్‌ వివరించారు. లండన్‌ ఆస్పత్రిలో మరణశయ్యపై ఉండగా నాతో సహా తనను పరామర్శించేందుకు వచ్చిన స్నేహితులు, అభిమానులతో ఈ విధంగా పేర్కొన్నారు. 1920వ దశకంలో నేను రష్యాలో ఉండి ఉంటే నేను బుఖారినైట్‌ గ్రాడ్యుయలిస్ట్‌ అయి ఉండేవాడిని. రష్యా ప్రణాళికావేత్తల తరహాలో సోవియట్‌ యూనియన్‌ పారిశ్రామికీకరణ విషయంలో మరింత ఉదారంగా, పరిమితమైన లక్ష్యాలు నిర్దేశించు కోవాలని నేను సిఫార్సు చేసి ఉండేవాడిని. అయినా నేను వెనక్కు చూసుకుని విచక్షణారహితమైన, పాశవికమైన, మౌలికంగా ఎటువంటి నిర్దిష్ట ప్రణాళిక లేకుండా రూపొందించిన మొదటి పంచవర్ష ప్రణాళికకు ప్రత్యామ్యాయమేదైనా ఉందా అని ఆలోచించుకునే వాడిని. అయితే ఈ ప్రశ్నకు నాకు సమాధానం లభించబోదు' అని ఆస్కార్‌ లాంజ్‌ ప్రస్తావించిన విషయం నేను మననం చేసుకున్నాను. ఈ ప్రశ్నకు సమాధానం ఎవరు చెబుతారు?కనీసం సోవియట్‌ తరహా సోషలిజాన్ని విమర్శించేవారైనా చెబుతారా?
1917, నవంబర్‌లో రగిల్చిన జ్వాలను ఆర్పివేయడం సాధ్యంకాదు. ఆ స్ఫూర్తి ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితిని సక్రమంగా చేపడితే నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మాజీ యుఎస్‌ఎస్‌ఆర్‌లో సోషలిజం విఫలమైనా, సామ్రాజ్యవాదం, దాని ఏజెన్సీలు సాగిస్తున్న భీకర ఆర్థిక, సైనికపరమైన దాడులు కొనసాగుతున్నా నిరాశ చెందాల్సిన పనిలేదు. పైన చర్చించిన అంశాలతో పాటు కమ్యూనిస్టు ఉద్యమం పురోగతి సాధించేందుకు సైద్ధాంతిక నిజాయితీ, కమ్యూనిస్టు పార్టీ, దాని నాయకుల, సభ్యుల దృఢ సంకల్పం అత్యంత ముఖ్యమైన అంశం.
-సుకోమల్‌ సేన్‌

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-font color="red"bఅక్టోబర్‌ విప్లవం- నిరంతర ఉద్యమం/font/b

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-font color="red"bఅక్టోబర్‌ విప్లవం- నిరంతర ఉద్యమం/font/b

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-పింఛను విధులూ విదేశాలపాలు

PRAJASAKTI TELUGU NEWS PAPER DAILY-పింఛను విధులూ విదేశాలపాలు

7, నవంబర్ 2012, బుధవారం

ఉసురు/(రావెళ్ళ వెంకట రామారావు

కపిల రాంకుమార్//ఉసురు// **

మును టోలెనే మల్ల - ముందెత్తు బులిపించి
నసిగి నసిగీ యేదొ - మునగ గొడుతుంటారు

మాదారికడ్డాలు లేరయ్యా యింక
మాయ దారీ ముచ్చటేలయ్యా!

దోసాలు దొడవగుతున్నాయి
యేసాలతో యిసిగి యేసార్ వోనాము!

పోసుకోలూ కబురు కోరయ్యా! మా
పొట్ట నిండుతాద పోరయ్యా!

దేసె బాగ్గెంబెరిగి తిర్గబడెనన్నారు
లెక్కేసి మాబతుకు సిక్కులిడునన్నారు!

వుత్తుత్తి కూతలకు వోలయ్యా మము
లుబ్బిపొమ్మంటారు పోరయ్యా!

కన్నె పిల్ల్కు పరువు గప్ప గుడ్డేనేదు!
తలదాసుకోనీడ తలపులెంచగరాదు!

కొరకాసుతో తలలు వోలయ్యా ! మమ్ము
గో్కుక్కొమ్మంటారి పోరయ్యా!

పసిగందులకే జావ ససిగ దొరుకుతనేదు
రోగాలరొచ్చులో మాగి సత్తున్నాము!

సన్నకారుకు సుగములోరయ్యా1
సున్నయైపోనాది పోరయ్యా!

కసుగాయ వొసివాడి దుసిగిల్లుతున్నాది
పసిగుండెలలకచ్చె ముసురుగొంటున్నాది.

వుసురూరికేపోదు వోలయ్యా మిమ్ము
కసిబట్టి తరుముద్దిలేరయ్యా!

7.11.2012 సా.4.02 ని.
**(రావెళ్ళ వెంకట రామారావు -కవి- తెలంగాణా సాయు్ధపోరాటయేధుడు- గోకినేపల్లి /ముదిగొండ మండలం, మా ఖమ్మం జిల్లా - వారి రచనలోని పల్లె పదాల్ను ఆస్వాదించండి))

6, నవంబర్ 2012, మంగళవారం

with courtesy of yahoo - Album










అనువాద సమస్యలు

  1. అనువాద సమస్యలు
    More articles by సౌమ్య »
    Written by: సౌమ్య
    Tags: raa.raa, రా.రా

    “అనువాద సమస్యలు” పేరు బట్టి చూస్తే, పుస్తకం దేని గురించో అర్థం అవుతోంది కదా. ఈ పుస్తకం ఉద్దేశ్యం – ఇంగ్లీషు నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నప్పుడు కలిగే ఇబ్బందుల గురించి విశ్లేషించడం. రచయిత – రాచమల్లు రామచంద్రారెడ్డి. ఈ పుస్తకానికి ౧౯౮౮లొ కేంద్ర సాహిత్య అకాడెమి అవార్డు లభించింది. పుస్తకం ఉద్దేశ్యం అనువాదం గురించే అయి
    నా, సగానికి పైగా, తెలుగు భాషా, ప్రముఖులైన వారు సైతం చేసిన పొరబాట్ల గురించే సాగుతుంది. ఈ పుస్తకాన్ని గురించి అందరూ పొగిడారు కానీ, ఇది అనువాదాల గురించి కాదు అన్న విషయం ఒక్కరు కూడా చెప్పలేదు. అందుకని, ఇప్పుడు నేను ఈ వ్యాసం రాయాల్సి వస్తోంది.

    మొత్తంగా ఇరవై అధ్యాయాలు ఉన్నాయి పుస్తకంలో. “టైమెంత?” అన్న “తెలుగు” ప్రశ్నతో మొదలవుతుంది పుస్తకం. “టైం” అన్న పదం ఎన్ని రకాలుగా మన భాషలో భాగమైపోయిందో చెబుతూనే, ఏ ఏ సందర్భాల్లో “టైం” బదులు ఎలాంటి తెలుగు పదాలు వివిధ ప్రాంతాల్లో వాడుకలో ఉన్నాయో చక్కగా, స్పష్టంగా వివరించారు. అలాగే, మరికొన్ని తెలుగైపోయిన ఆంగ్ల పదాలను ఉదాహరణగా తీస్కుంటూ, కొన్ని పదాలకు ఆంగ్లంలో ఉన్నన్ని అర్థాలకు తెలుగులో సమానార్థకాలు ఉండవనీ చెబుతూ, అనువాదం గురించిన చర్చ ఇలాగే “టైం నుంచి సెక్సు దాకా” ఎన్నో అంశాలను స్పృశిస్తుందని చెబుతూ ఈ అధ్యాయం ముగించారు.

    “గొంతెమ్మ కోరికలా?” అన్న రెండో అధ్యాయంలో పదాలు, నుడికారం గురించి చెబుతూ, తెలుగులోనూ, ఆంగ్లంలోనూ ఉదాహరణలు ఇస్తూ, ఆంగ్లం నుంచి తెలుగులోకి అనువాదం చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది రావొచ్చు అని ఉదాహరణలు కూడా ఇస్తారు. చివరగా, అనువాదకుడికి మాతృభాషలో వాక్యనిర్మాణం పై బాగా పట్టు ఉండాలని చెబుతూ, తెలుగులో కొన్ని రచనలను ఎంచి (ఉదాహరణలన్నీ అనువాదాలు కావు!), వాటిలో వాక్య నిర్మాణ దోషాలు ఎత్తి చూపుతూ, చివర్లో, ఎంతమందికి భాషపై పట్టు ఉందని ప్రశ్నించడంతో ముగుస్తుంది. “తెలుగువాని యొక్క మొదటి పేరేమిటి?” అన్న మూడో అధ్యాయంలో ప్రకటనల్లో వాటిల్లో కనబడే కృత్రిమ తెలుగును గురించి చెబుతూ, ఎందుకు అలా రాస్తారో, ఆంగ్లం నుంచి మక్కికి మక్కి అనువదిస్తే ఏమౌతుందో చెబుతారు. “మాన్ అంటే మనిషేనా?” అన్న నాలుగో అధ్యాయంలో, ఒక్క “మాన్” అన్న పదం వివిధ సందర్భాల్లో తెలుగులోకి అనువదితమైనప్పుడు ఎలా అర్థాలు మారుతుందో చెబుతారు.

    “అసలు సమస్యలేమిటి?” అన్న ఐదో అధ్యాయంతో ఉదాహరణలు దాటుకుని, పరిష్కారాలు సూచిస్తూ, అసలు విషయం మొదలవుతుందని అనిపిస్తుంది మనకి. చేతకాని అనువాదాలను పక్కన పెడితే, ఇరుభాషలు తెలిసిన వారు కూడా అనువాదాలు చేయడంలో సమస్యలు ఎదుర్కుంటారని చెబుతూ, రా.రా. అనువాద సమస్యలని రెండు రకాలుగా వర్గీకరించారు – వాక్యనిర్మాణ సమస్యలు, పదాలకి సంబంధించిన సమస్యలు. వాక్యనిర్మాణ సమస్యలని ఉదాహరిస్తూ, ఒక అనువాదంలో ఆంగ్లంలో నుండి చాలా ఉపవాక్యాలు ఉన్న ఒక వాక్యాన్ని ఎలా అనువదించారో చూపుతూ, వ్యాసం ముగిస్తారు. (మళ్ళీ, ఉదాహరణ దగ్గరే ఆగిపోయారు!) ఆరవ అధ్యాయం, “వాక్య భాగాల క్రమం” లో ఆంగ్లానికి, తెలుగుకి మధ్య వాక్య నిర్మాణంలో ఉన్న భేదాలను గురించి చెబుతూ, అనువాద సమయంలో వాక్య నిర్మాణం ఎలా మారుతుంది, మారకపోతే వాక్యం ఎలా కృతకంగా ఉంటుంది? ఎలాంటి వాక్యాలు అనువాదంలో తిప్పలు పెడతాయి- వంటి అంశాలను చాలా వివరంగా రాసారు. అయితే, నాకు ఆశ్చర్యకరంగా అనిపించిన విషయం ఏమిటి అంటే, ఈ అధ్యాయం మొత్తంలోనూ, రా.రా. బాలేని ఉదాహరణలు కాక అనువాదం సరిగా ఉందంటూ ఇచ్చిన ఏకైక ఉదాహరణ, తాను చేసిన అనువాదానిదే కావడం! (పుస్తకం మొత్తం ఇదే ధోరణి కొనసాగింది. తెలుగులో రారా చేసినవి తప్ప ఒక్క మంచి అనువాదం కూడా లేదా! ఆయన చేసినది కూడా నాకు మామూలుగానే అనిపించింది, అది వేరే విషయం.)

    “పదాలు” అన్న ఏడవ అధ్యాయంలో ఒక భాష నుండి మరొక భాషకు అనువాదం చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఆ భాషలో ఉన్న పదాలకి ఈ భాషలో సమానార్థకాలు లేకపోవడం గురించి చెబుతూ, రా.రా. గారు తేల్చిన విషయం: “.. కానీ, prude, prig, filial, sanctimonious లాంటి పదాలు మనకి లేకపోవడానికి కారణం ఏమిటంటే మన నాగరికత ఇంకా అంతగా వికసించకపోవడమే అని చెప్పాలి, మన సమాజం ఆ భావాలను నిత్యజీవితంలో అర్థం చేసుకునే స్థాయికి ఇంకా ఎదగకపోవడమే అని చెప్పాలి” అంటారు (పుట 42). ఒక భాషలో కొన్ని పదాలు లేకపోవడం – నాగరికత లోపం ఎలా అవుతుంది? అన్నది నాకింకా అర్థం కాలేదు. ఇటీవలే, Guy Deutscher అన్న భాషాశాస్త్రవేత్త రాసిన “Through the language glass” అన్న పుస్తకం చదివాను. ఒక భాషలో ఏదో భావానికి పదాలు ఉండడం-లేకపోవడం అన్నది ఆ భావం గురించి ఆ భాషీయుల ఆలోచనలను ఎంతవరకూ ప్రభావితం చేస్తుంది? అన్నది ఆ పుస్తకం చర్చా వస్తువు. ఆస్ట్రేలియాలోని ఆటవిక తెగల భాషల గురించి కూడా చాలా వివరంగా చర్చించారు. ఒక్కచోట కూడా, ఇలా ఏ భాషలోనైనా పదాలు లేకపోవడం – “నాగరికత లోపం” అనలేదు. అది వారి సామాజిక పరిస్థితుల్లో భాగం అనే అన్నారు. తెలుగులో కానీ, వేరే భాషలో కానీ, చివరికి ఆంగ్లంలో కానీ, ఒక పదానికి సమానార్థకం లేకపోవడం నారికత లోపం అని అనడం కన్నా, డాయిషర్ ఇచ్చిన వివరణ సబబుగా అనిపించింది నాకు. ఇక్కడే మరొకటి అంటారు – “మనము, మేము అనే మాటలకు సంబంధించి నంతవరకు మన తెలుగు ఘనమైనదే. కానీ, అంతమాత్రాన, ఇంగ్లీషు లాంటి భాషలతో పోలిస్తే మన భాష బాగా అభివృద్ధి చెందినదని చెప్పలేం కదా” అని (పుట 42). మనం ఏ అంశాల గురించి పోలుస్తున్నాం? అన్న దాన్ని బట్టి ఉంటుంది కదా ఘనాఘనాల పోలిక? అన్నది నా సందేహం (ఆ మాటకొస్తే, ఆంగ్లంతో పోలిస్తే, గణన యంత్ర పరంగా తెలుగుని ప్రాసెస్ చేయడం చాలా కష్టం. యంత్రానికి ఎక్కువ శ్రమ ఇస్తుంది కనుక తెలుగు అభివృద్ధి చెందినది అనాలా? తెలుగుకంటే కంప్యూటరుని తిప్పలు పెట్టే భాషలూ ఉన్నాయి. ఈ లెక్కన ఇంగ్లీషు అభివృద్ధి చెందని భాష అనుకోవాలా?)..ఇలాగే ఆంగ్లంలో ఉండి, తెలుగులో సమానార్థకాలు లేని (బహుసా, ఆలోచిస్తే సమానార్థకాలు తట్టవచ్చేమో!) మరిన్ని ఉదాహరణలతో ఈ అధ్యాయం ముగుస్తుంది.

    “అనువాదమంటే” అన్నది ఎనిమిదో అధ్యాయం (ఎక్కడికక్కడ ఇదిగో, ఈ అధ్యయంతో అసలు విషయం మొదలవుతుంది..అనిపిస్తూ వచ్చింది నాకైతే!). “అనువాదం గురించి తెలుగులో వివరించడమంటే సిమెంటు రోడ్డుమీద కొత్తకారులో ప్రయానంలాగా సాఫీగా ఉండదు. దారీ డొంకా లేని కీకారణ్యంలో మన కాలిబాట మనమే నిర్మించుకుంటూ, సూటి బాట సాధ్యం కానప్పుడల్లా అటూ, ఇటూ మలుపులూ, మెలికలూ తిరగక తప్పదు. కనుక, పక్కదారి పట్టినా, పట్టినట్లు కనిపించినా, అది సరైన దారి కొరకు చేసే అన్వేషణలో భాగంగానే ఉంటుంది.” (పుట 46) అంటారు ఒకచోట. అంత కష్టం దేనికో నాకు అర్థం కాలేదు. ఒకవేళ అంత కష్టమే ఉన్నా, అది దేనికైనా సార్వజనీనంగా ఉండే కష్టం అని నా అభిప్రాయం. ఇదే ధోరణిలో కొనసాగి “అనువాదమంటే ఎంత కష్టమైనదో, దానికి ఎంత విశాలమైన లోకజ్ఞానమూ, ఎంత విస్తారమైన గ్రంథ పఠనమూ, ఎన్ని సిద్ధాంతాలతో, మతాలతో, విజ్ఞాన శాస్త్రాలతో, ఎన్ని దేశాల చరిత్రలతో పరిచయమూ అవసరమో మీకు అర్థమైతే తప్ప, మీ మనసులో నాటుకుంటే తప్ప, అనువాదమంటే ఏమిటో నేను చెప్పినా మీకు పూర్తిగా అర్థం కాదు కనుక, అనువాద నిర్వచనానికి ఇదంతా ఉపోద్ఘాతం అనుకోండి” (పుట 54) అంటారు. (తరువాత కొన్ని ఉదాహరణలతో అధ్యాయం ముగించేసారు..అనువాదం అంటే ఏమిటో చర్చించడం ఇక్కడ సాధ్యం కాలేదని ఒప్పుకుంటూ).

    తరువాతి అధ్యాయం “టైం కథ ఏమిటో చూద్దాం” లో, మరోసారి తెలుగులో “టైం” గురించి వివిధ సందర్భాల్లో “తెలుగు పదాలతో” వివిధ రకాలుగా ఎలా చెప్పొచ్చు అన్నది ఓపిగ్గా చాలా ఉదాహరణలతో వివరిస్తారు. అంతా అయ్యాక …”..వివరాలకు డిక్షనరీ చూడండి” అని రాసారు. పగలబడి నవ్వాను నేను. తెలుగు తెలుగు అంటూ అంత రాసిన మనిషి నిఘంటువు అనో, మరొకటనో అనలేకపోయరే అని.

    పదో అధ్యాయం – “అనువాద వివరణ“. పుస్తకం మొత్తం మీద, అనువాదం అంటే ఏమిటి? ఎలా ఉండాలి? అన్న విషయాల గురించి స్టడీ చేసి, సాధికారికత కలిగిన మనిషి రాసింది అనిపించిన అధ్యాయం ఇదే! దీని తరువాతి అధ్యాయం థియోడార్ సేవరీ అన్న ఆయన అనువాదం కళ గురించి ప్రతిపాదించిన సిద్ధాంతం గురించిన విమర్శ.