జన వేమన -3 వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా
జన వేమన -3వేమన సమ్యక్ దర్శనం –మతాల పై ఝలిపించిన కొరడా
ఇప్పటి వరకు మనం వేమన భావాలను స్థూలం గా పరిశీలించి చూశాం .ఇప్పుడు కొంత సూక్ష్మ పరిశీలన చేసి ,ఆయన భావ దీపికా ప్రకాశాన్ని పొందుదాం .అజ్ఞాన తిమిరం లో ఉన్న మాన వాలికి ఆయన అందించిన జ్ఞాన తేజస్సు ను పరికిద్దాం .ముందుగా ఆయనకు మతం మీద ఉన్న అభి ప్రాయాలను తెలుసు కొందాం .ఇది తెలుసు కోవటానికి ముందు అసలు మతం అంటే ఏమిటో తెలియాలి కదా .”రెలిజియన్ ఈస్ రియలైజేషన్ ”అన్నారు .మతం అంటే మనం ఎవరో తెలుసుకొనే ;;ఎరుక. ”దాన్ని తత్వ శాస్త్ర అన్వయం అన్నారు .ఇంతకీ తత్త్వం అంటే /ఆధ్యాత్మికం గా మానవుని పెరుగుదలే తత్వ శాస్త్రం .ఎలా జీవించాలి ,ఎలా చని పోవాలో చెబుతుంది .ప్రకృతి ,మానవుల మధ్య సంబంధాన్ని తెలియ జేస్తుంది .జరిగి పోయిన దాన్ని గురించి కాక ,జరుగుతున్నదీ ,శాశ్వత మైన దాని గురించి చెబుతుంది .దీన్ని బట్టి చూస్తె మతం చాలా పవిత్ర మైనది గానే కనీ పిస్తుంది .అపూర్వ ,గౌరవ స్తానం కలిగి ఉంది .అలాంటి మతాన్ని ప్రవచించిన ప్రవక్తలు ,తాము సన్మార్గం లో నడిచి ,అనుయాయులకు చక్కని మార్గాన్ని చూపించారు .అయితే కాల క్రమం లో ప్రవక్తలు చూపిన మార్గాన్ని వదిలేసి ,తప్పు దొవలు పట్టి మతాలు కొంత చెడు చేశాయి .ఉత్కృష్ట జీవన విధానం సడలి పోయింది .ప్రలోభాలూ మూధా చారాలు అమలు లోకి వచ్చాయి .మత పెద్ద పెద్దరికం వదిలి హక్కు కోసం ,అణచి వేతకు పాల్పడ్డాడు .అప్పుడే మతం అంటే ఏవగింపు కలిగింది .ఇలాంటి సమయం లో సామాన్యులకు విలువ లేకుండా పోయింది .మాన్యులకే అన్నీ హక్కు భుక్తాలైనాయి .ప్రజల కష్ట సుఖాలను పట్టించుకోకుండా మతం సంఘం తయా రైనాయి .ఎవరు పూనుకొని దీన్ని మళ్ళీ గాడి లో పెట్టాలి ?అందుకే ఆ బాధ్యతను కవులూ ,కళా కారులూ తీసుకొన్నారు .నెమ్మదిగా చెప్పారు .కళాత్మకం గా చెప్పారు .హితం గా ,మితం గా చెప్పి చూశారు .అయినా మార్పు వచ్చే సూచన కనీ పించ లేదు .మార్పు రాక పోతే సమాజం పతనా వస్థ కు చేరుతుంది .అదిగో అలాంటి సమయం లోనే వేమన లాంటి మహనీయుని అవసరం కలిగింది
.అవినీతి ,చెడు ,దుష్టా చారం మాంసాన్ని దాటి ,ఎముకలకు పట్టేసి వదలని స్తితిలో ఉన్నాయి .కనుక చెప్పాల్సిన విషయాన్ని చాలా బలం గా ,తీవ్రం గా ,కఠినం గా చెప్పాల్సిన పరిస్తితి కల్గింది .ఆ పనే వేమన చేశాడు .యే కులాన్నీ ,యే మతాన్నీ వదిలి పెట్ట లేదు .అన్నిటిని ఝాడించి వదిలాడు .ఉతికేసి ,పిండేసి ఆరేశాడు .యే చెడ్డ విధానాన్ని వదిలి పెట్ట లేదు .చాలా ఆవేదన తో ,మనసు పై సుత్తి తో కొట్టి నంత బలం గా చెప్పాడు .మార్పు రావాలంటే ,ఆ మాత్రం ఆఘాతాలు తప్పవు అని భావించి చెప్పాడు వేమన్న .ఏదో ఎవరో అనుకుంటా రనే భయం ఆయనకు లేదు .బాధా లేదు .మార్పు రావాలి అంతే ఆయన ధ్యేయం .చీకటి లోంచి సమాజం వెలుగు లోకి రావాలి .అందరి సుఖమే అయన ధ్యేయం .అందుకే ఆయన మాట వేదం అయింది .వేదం లా శాసించింది .ఖచ్చితం గా అమలు చేయాల్సిన పరిస్తితి కలిగింది .
హిందూ మతం
సనాతనం గా హిందూ మతం మన దేశం లో ఉంది .హిందూ మతం లేదు -అదొక జీవన విధానం అంటారు .అయినా కాల గతం గా ఎన్నో మార్పులు వచ్చాయి .విగ్రహారాధన ,యజ్న యాగాలు ,మంత్రాలు ,మాయలు ,మాయ స్వాములు ,తంత్రాలు ఎక్కువై ధార్మిక మార్గం పక్క దారి పట్టింది .ధర్మం కను మరుగైంది .సాటి మనిషికి విలువ నివ్వని సమాజం తయారైంది .గుడులు ,గోపురాలు ,దేవతలు ,పీథాది పతులు ,ప్రాచుర్యం పొందారు .మానవత్వం మృగ్య మైంది .మనిషిని మనిషి గా మార్చాల్సిన మతం కుహనా విధానాలకు నిలయ మైంది .అందుకే వేమన కు ఈ పద్ధతి నచ్చలేదు .గమ్యాన్ని మరచి ప్రవర్తించే వారి పై పద్యాల పిడి గుద్దులు ప్రహారం చేశాడు .”రాళ్ళన్నీ దేవుల్లయితే ,రాసులు మింగవా ?అని నిలేశాడు .”కూడు ,గుడ్డ ను కోరడు దేవుడు ”అని గట్టిగా చెప్పాడు .అంతా ”రాయి మయం ”అయితే ,దేవుడేవడో భక్తుదేవడో తెలుసు కోవటం ఎలా ?శిలకు మొక్కితే మనమూ ఆ శిలలు గా మారి పోతామేమో ఆలోచించ మన్నాడు .దేహమే దేవాలయం అన్న మాట ను వదిలి మంచిని ,సోదర భావాన్ని గాలికి వదిలేసి ,ప్రసాదాలు తీర్ధాలు మరిగి ,బొజ్జలు పెంచుకోవటం హేయం గా భావించాడు .”గుడి దేహ మాత్మ దేవుడు -చెడు రాళ్ళకు వట్టి పూజ సేయకు వేమా ”అని హెచ్చరించాడు .చీకటి గర్భాలయం లో ,దేవుడు అనే రాతిని ప్రతిష్ట చేసి ,మొక్కులు సమర్పిస్తూ ,కాలక్షేపం చేస్తారు కాని ,తమ లోని పర బ్రహ్మాన్ని గుర్తించరు మనుషులు అని ఆవేదన చెందాడు .”ఉల్ల మందు బ్రహ్మ ముందుట తెలియరు ”అన్నాడు అందుకే .ముక్తి కోసం చేసే ప్రార్ధనలు సత్ఫలితాలివ్వవు అంటాడు .
”యుక్తిగా నెరుకై తోచును -ముక్తికి నిలయమ్పు దారి మానుకొని వేమా ”.ఎరుక ఉంటేనే ,పరమ పదం సాధ్యం .మిగిలినవేవీ పనికి రావు .అసలు మర్మం తెలియ కుండా మతాలను సృష్టించారని ఈస డిస్తాడు .ఇలాంటి వారి భావాలన్నీ ”గాజుటింట కుక్క కళవళ పడి నట్లు ”ఉంటాయట .”పూజ కేమి వచ్చే ,బుద్ధి ప్రధానము ”అన్నాడు .పరమాత్మ విశ్వంభరుడై ,విశ్వం లో వెలుగుతూ ఉంటాడు.”అతన్ని చూడండి అన్నాడు .”క్షేత్రంబున క్షేత్రజ్నుని ,-గాత్రంబును జూచి నియతి గల లక్ష్యంబున్ –రాత్రిం బవలును నొకటిగ -సూత్రించిన ముక్తి సులభము వేమా ”అని ముక్తికి సులభ మార్గాన్ని చెప్పాడు .రాతి ప్రతిమను రాజసం లో ఉంచి పూజించే వాడు బుద్ధి మాలిన వాడు.అలాంటి వాడు ”భావమందు పరము భావించ నేరడు ”అని వాడిఅవి వేకాన్ని జాలి పడతాడు ”శిలలు శిలలే కాని ,శివుడు కాదని -తనదు లోని శివుని దానేల తెలియడో ”అని నిట్టూరుస్తాడు .
హిందూ మతం లో ఉన్న యజ్న యాగాలు దారి తప్పి హింసకు పట్టం కట్టాయి .కాలజ్నులు వాటిని సహించ లేక పోయారు .ప్రత్యామ్నాయాలు చూపించారు .మార్పు వచ్చి పశు హింస తగ్గింది .తన కాలం లో ఇంకా అమలు లో ఉన్న పశు హింస పై’- విమర్శ వజ్రాయుధాన్ని ప్రయోగించాడువేమన యోగీంద్రుడు .”సోమయాజి –మేక పోతును బట్టి మేడలు విరవటం ”ఆయన్ను కలిచి వేసింది .”జీవ హింసకు చిక్కునా మోక్షంబు ”అని తీవ్రం గానే ప్రశ్నించాడు .ఇక్కడ యజ్ఞం చేస్తే స్వర్గం లో రంభాదుల పొందు విందు లభిస్తుందనే ఆశ మాత్రమె యజ్ఞానికి కారణం అన్నాడు .సోమయాజి, కామ యాజి అవటం సహించ లేక పోయాడు .పక్క వాడు ఆకలితో అలమటించి చస్తుంటే పట్టించుకోని జనం తల్లి దండ్రుల శ్రాద్ధా లకు వేలు ఖర్చు చేయటం బాధించింది .”పిండములను జేసి పితరుల దల పోసి –కాకు లకు బెట్టు గాడిద లారా –పియ్య తినెడి కాకి పితరు డేట్లాయేరా “‘అని మందలించాడు .ఇంతకీ పిండాలు కాకులకే ఎందుకు పెడతారు / అనే సందేహం వస్తుంది .ఉత్తర రామాయణం లో దీనికి ఒక కధ ఉంది. మరుత్తుడు అనే రాజు యజ్ఞం చేస్తుంటే ,రావణుడు రాక్షస సైన్యం తో వచ్చి ఇంద్రాది దేవతలను భయ పెట్టి పార దోల్తాడు .అప్పుడు వాళ్ళు అందరు పశు ,పక్షాది రూపాలు పొంది పారి పోతారు .పితృదేవత లకు ప్రభువైన యముడు కాకి రూపం దాల్చి అక్కడే ఉంటాడు .అప్పటి నుంచి పితృదేవతలకు వేసే పిండాలను కాకులకు పెట్టటం అలవాటు లో ఉంది .అప్పటి దాకా పక్షుల్లో చాలా హీనం గా చూడ బడిన కాకి అప్పట్నించి పవిత్రత సాధించింది .”కాకి పెండ్లి నెవరు కానరు భువిని –కాకికి అన్నముంచి కాళ్ళకు మొక్కరు ”అని ఆశ్చర్య పోయాడు వేమన్న .”సంజ్ఞా మది యందు బూనూట సాధు వ్రుత్తి -మనసు మగ్నము నొందుట మనన వ్రుత్తి ”అంతే కాని ,యజ్న యాగాదుల వల్ల ప్రయోజనం లేదు అన్నాడు.
చేసిన పాపం చెడని పదార్ధం అని తత్వ గీతం .ఎన్నెన్నో పాపాలు చేసి వాటి పరిహారం కోసం తీర్ధ యాత్రలు చేసి పాపాన్ని పోగొట్టు కోవాలను కొంటాము .పిల్లిని చంపిన పాపం వేరు గుడి కట్టిన పుణ్యం వేరు అని తెలుసు కో లేం .హృదయాలను కడుక్కోవాలి శరీరాలను కాదు .శారీరక మాలిన్యం కంటే మానసిక మాలిన్యం చాలా ప్రమాదం .దాన్ని వదిలిన్చుకోక పోతే ఉత్తమ గతులుండవు .పశ్చాత్తాప దగ్ధం తోనో ,పరోప కారం తోనో సహనం తోనో ,సానుభూతి, సహవేదన ,దయా ,దాక్షిణ్యం ,కరుణ లతోమనో మాలిన్యం పోతుంది .గంగాది నదుల్లో స్నానం వల్ల ఆత్మ సంస్కారం రాదు .సద్గురు కటాక్షం వల్లనె సాధించాలి .”తిరుపతికి బోవ తురక దాసరి కాడు–కాశి కేగ లంజ గరిత గాదు–కుక్క సింహమగునే గోదావరికి బోవ “”అని వితర్కిస్తాడు .కల్మషాలన్నీ ,కడుపు లో పెట్టు కొని ,నదీ స్నానాలు ,భగవద్దర్శనాలు చేస్తే ప్రయోజనం లేదంటాడు .మానసిక మార్పు రావాలి .ఒక వేళ ఆ పవిత్ర స్తలాల వల్ల మార్పు వస్తే వేమన్న కంటే సంతోషించే వాడు లేడు .కొన్ని స్థలాలు పవిత్రాలు కొన్ని అపవిత్రాలు అని భావించటం తప్పు అనేదే వేమన్న చెప్పిన వేదం లాంటి విషయం .”పుణ్యమనగ నేమి ? చేసిన పుణ్యమే ”అని చక్కని సమాధానం చెబుతాడు .
సశేషం –మీ– గబ్బిట దుర్గా ప్రసాద్ –20-8-12-కాంప్–అమెరికా
No comments:
Post a Comment