Saturday, November 10, 2012

చలం 'బ్రాహ్మణీకం'లో ఏముంది ?

చలం 'బ్రాహ్మణీకం'లో ఏముంది ?

ఇటీవల 'ఉమన్‌ ఇన్‌ బ్రాహ్మణిజం' అనే సినిమా ట్రయిలర్‌పై పెద్ద వివాదం చెలరేగింది. ఈ సినిమా బ్రాహ్మణ స్త్రీలను అసహ్యంగా చూపిందని, బూతు ప్రదర్శనను బ్రాహ్మణిజం అని చెప్పినట్టు కనబడుతోందని, దీనిని వెంటనే రద్దు చేయాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. దర్శక నిర్మాతలు ఇది చలం బ్రాహ్మణీకం నవల ఆధారంగా తీసిన సినిమా అని, చలం నవలపై లేని నిషేధాన్ని సినిమాపై ఎందుకు విధించాలని వాదిస్తున్నారు. సినిమా మొత్తం చూసే అవకాశం ఇంకా మనకు రాలేదు. ట్రయిలర్‌లో మాత్రం పక్కా అశ్లీలత, సెక్స్‌ సన్నివేశాలు కనపడుతున్నాయి. సినిమా వ్యాపార ప్రచార లాభాల బరి తెగింపులో యువతను ఉద్రేకపరిచే దృశ్యాల చిత్రీకరణ నేపథ్యంలో ఈ సినిమాలో చలం నవలాంశం ప్రధానంగా తెరకెక్కిందో, లేదో అనుమానమే!
సినిమాపై వాద విదాదాలపై చర్చ కంటే ముందుగా చలం బ్రాహ్మణీకంలో ఏం చెప్పారు అనేది చూద్దాం. బ్రాహ్మణీకం 1937లో రాసిన నవల. ఆనాటి బ్రాహ్మణ సమాజం, వారి కుటుంబాల్లో నెలకొన్న ఆచారాలు, సాంప్రదాయాలు స్త్రీలను ఎన్ని ఇబ్బందులకు గురిచేశాయో, వారు ఎంత బానిసలుగా జీవితాలు వెళ్లదీయాల్సి వచ్చిందో నవలలోని విషయం. బ్రాహ్మణ కుటుంబాల్లో ఆచారాల ముసుగులో జరుగుతున్న అమానవీయ ఆగడాలను కళ్ళకు కట్టినట్లుగా చూపాడు చలం.
క్లుప్తంగా నవలాంశం ఇదీ.. : ఎనిమిదో ఏటనే మేనత్త కొడుకుతో సుందరమ్మకు పెళ్ళి చేస్తారు. సుందరమ్మ అందాల రాశి. 'ఠీవీ, నిదానమూ, తులసీ దళాలూ, కర్పూరమూ, కుంకుమా కలిసి ఏర్పడ్డ దేహ పరిమళం' అని వర్ణిస్తాడు చలం. భార్యాభర్తలు అన్యోన్యంగా హృదయాలూ, దేహాలు విడివడకుండా జీవిస్తారు. కొంతకాలానికి భర్త జబ్బు చేసి చనిపోతాడు. తర్వాత సుందరమ్మ మానసికంగా కుంగిపోతుంది. తండ్రీ చనిపోతాడు. ఆస్తిపాస్తులు అప్పుల కింద పోతాయి. దిక్కూమొక్కులేని వారవుతారు. విజయవాడలో మేనమామ ఆదరించి సాకుతుంటాడు. సుందరమ్మ నిర్వేదంగానే భర్తను గుర్తు చేసుకుంటూ కాలం గడుపుతుంటుంది. మేనమామ కాలానుగుణంగా ఆచారాల్ని మార్చుకునే ఆలోచన కలవాడు. ఇక్కడ కంచాలలో తినడం, మైలబట్టలతో పీటలమీద కూర్చోడం, సొంతంగా క్షవరం చేసుకోవడం, చాకలి తోడిన నీళ్ళతో స్నానం చేయడం చూసి సుందరమ్మ అసహ్యించుకునేది. గత్యంతరం లేక అలవాటు పడింది. బ్రాహ్మల ఆచారాలను, కట్టుబొట్లను, నిష్టను, వారు బోధించే తత్వాలకనుగుణంగా మనోవాక్కాయ కర్మలా ఆచరించే సామాన్య మహిళ సుందరమ్మ. మేనమామ తన కూతురికి చదువు చెప్పడానికి చంద్రశేఖరం అనే టీచరును ఇంట్లోనే ఉంచుకుని పోషిస్తుంటాడు. అతను సుందరమ్మను మోహిస్తాడు. ఎన్నో రకాలా సుందరమ్మకు తన ఉద్దేశం చెప్పాలనుకుంటాడు. కానీ సుంద రమ్మకు ఆ ధ్యాసే రాదు. చంద్రశేఖ రానికి జ్వరం వస్తుంది. దయతో సుందరమ్మ సేవలు చేస్తుంది. అది అలుసుగా శేఖరం సుందరమ్మను చెర పట్టేందుకు పూనుకుంటాడు. ఆమె అసహ్యించుకుంటుంది. ఇంట్లో ఎవరూ లేని రోజున బతిమాలి, బామాలి, ఏడ్చి, తను దిక్కులేని వాడినని, సుందరమ్మ లేకపోతే బతకనని చెప్పి ఆమెను లొంగదీసుకుంటాడు. ఆమె గర్భవతి అవుతుంది. అందరికీ తెలుస్తుందని భయంతో శేఖరం వెళ్ళిపోతాడు. మేనమామ కొంత ఆధునికుడు కావడంతో శేఖరం ఊరికి వెళ్ళి తీసుకువచ్చి సుందరమ్మతో పెళ్ళి చేస్తాడు. అతన్ని ఉద్యోగంలో పెట్టిస్తాడు.
పెళ్లి తర్వాత చంద్రశేఖరం ప్రవర్తన మారుతుంది. ఆమె అందాన్ని చూసి తహతహలాడినవాడు, ఆమె కోసం ఏడ్చినవాడు ఇపుడు ఆమె సేవలో లోపాన్ని వెతుకుతున్నాడు. భార్య అయిన తరువాత ఆమె చులకనైపోయింది. భోజనానికి కూడా లేని చంద్రశేఖరాన్ని చేరదీసి, సుందరమ్మతో వివాహం జరిపించి, ఉద్యోగంలో పెట్టిస్తే తాను వేరే అమ్మాయిని చేసుకుంటే కట్నమొచ్చేదనే ఆలోచనలోకి వచ్చాడు.
శేఖరానికి బ్యాంకులో ఉద్యోగం. అక్కడ అతను బానిస. ఇంటి దగ్గర భార్య తన బానిస. అధికారులు చెప్పినట్లు అక్కడ తను చేయాలి. ఇంటి దగ్గర భార్య చేయాలి. ఆమె తిండికి, చీరెలకు అయ్యే ఖర్చులనూ లెక్కించసాగాడు. అన్నీ ఆర్థిక లావాదేవీల ఆలోచనలుగా మారాయి. కొద్దిరోజుల తర్వాత సుందరమ్మ మీద అనుమానం ఏర్పడింది. తనకంటే ముందు ఎందర్ని మోహించిందోనని, తను అజాగ్రత్తగా ఉంటే ఎందర్ని మోహిస్తుందోనని భయం మొదలైంది. వితంతు వివాహం చేసుకున్నందుకు, సుందరమ్మ భార్య అయినందుకూ విచారపడ్డాడు. సుందరమ్మకు మొదటినుంచీ ఈ కాపురం కంటకంగానే ఉంది. శేఖరం దౌర్జన్యాన్ని వ్యతిరేకించింది. అయినా, ఈ జన్మకు తన గతి ఇంతేనని ఒక విధమైన జడత్వం పొందింది. 'ఎవడు మొన్నటిదాకా తన కన్నా కిందమెట్టు మీద ఉన్నాడో; తన దయ కోసం, అంగీకారం కోసం పరితపించి కాళ్ళు పట్టుకున్నాడో; వాడు ఈనాడు తన అధికారై, తనని ఆజ్ఞాపిస్తే, మహారాణిలాగా ఎవడికి తాను మోహ వరాలిచ్చిందో వాడు ప్రభువై తన అమూల్యమైన ఆనందాన్ని లాక్కుంటే ఆమె శరీరం మీదనే ఆమెకి అసహ్యం కలిగింది. అనుమానము, నీచ పరిహాసమూ ఆమెనెంత బాధించినా పవిత్ర బ్రాహ్మణ కుటుంబాల్లో అటువంటి దౌర్జన్యాలు సాధారణంగా ఉంటాయని ఆమెకు తెలుసు గనుక 'ప్రపంచ స్వభావమే అంత' అని మాట్లాడకుండా తలవంచుకుని ఊరుకొంది'. ఆచారం వల్లా, పెంపకం వల్లా వితంతు వివాహం ఘోర పాపమని సుందరమ్మ నమ్మకం. ఈ పాపం వల్లా, చనిపోయిన భర్తకు ద్రోహం చేయటం వల్లా ఈ బాధలు అనుభవిస్తున్నానని అనుకొంది. ఇంట్లోనే భర్తకు దూరంగా ఉంటోంది. ఇద్దరూ శత్రువుల్లా జీవిస్తున్నారు.
చుట్టుపక్కల వాళ్ళూ, చుట్టాలూ ఎవరూ అంటుకోకుండా ఉంటున్నారు. ఇంటి చాకిరీ, శేఖరానికి సేవ... ఇదే ఆమె జీవితం. పెళ్ళయ్యే నాటికే ఆరునెలల గర్భం. పురుడుకు మంత్రసాని తప్ప ఎవరూ లేరు. అమ్మాయి పుడుతుంది. బిడ్డను కనిపెట్టుకుని ఉండడం, తన పని తనే చేసుకోవడం, భర్త పిలిచినా పలకకపోవడం... ఇంటి గదికే పరిమితమవుతుంది సుందరమ్మ. బిడ్డకు జబ్బు చేస్తుంది. శేఖరం పట్టించుకోడు. పేకాటకు బానిసవుతాడు. తన పాలనే ఔషధంగా పడుతుంది. చుట్టుపక్కల వాళ్ళు, వితంతు వివాహమని చెప్పి ఏ సాయమూ చేయరు. బిడ్డ రోగానికి మందు కోసం ధైర్యం చేసి బజారులోకి వెళుతుంది. మర్యాదస్తులు, ఉద్యోగస్తులూ అనబడే వాళ్ళ నుంచి రౌడీల వరకూ అందరూ ఆబగా చూడటాన్ని ఓర్చుకోలేక ప్రపంచాన్ని తనని తిట్టుకుని ఇంట్లో పడుతుంది. పార్వతీదేవికి చీర మొక్కుకుంటుంది. బిడ్డ కొంత కుదుట పడుతుంది. మొక్కు తీర్చడానికి చీర కోసం భర్తను పదిహేను రూపాయలు అడుగుతుంది. అంత డబ్బు ఎందుకు ఖర్చు చేస్తావని ఇవ్వడు. ఆఖరికి అప్పటివరకూ భర్తకు దూరంగా ఉంటున్న ఆమె ఆ రాత్రి తన మొక్కు కోసం భర్తను సుఖపెడుతుంది. బతిమాలుతుంది. మూడు రూపాయలిచ్చి చాలంటాడు. ఎలాగోలా చీర కొని గుడికి వెళ్తే వితంతు వివాహమైన మలినురాలి మొక్కును తీసుకోమంటారు. బిడ్డకు మళ్ళీ జబ్బు చేస్తుంది. పిల్లకు మందు వేయిద్దామంటే శేఖరం డబ్బివ్వడు, పిల్లవంక చూడడు. 'బిడ్డకు కావలసిన సహాయానికై మొగవాణ్ని యాచించే గతి ఒక ఈ నాగరికతపు తల్లులకే పట్టింది' అంటాడు చలం. పిల్ల అమ్మా! అని యేడ్చింది. తన హృదయాన్ని అరగదీసి మందుగా ఆ బిడ్డకి పొయ్యలేకపోతిని కదా అని యేడ్చింది. డాక్టరు రాసిచ్చిన మందుల కోసం డబ్బు లేదు. మందుల షాపు వద్దకు వెళితే అక్కడ రామయ్య నాయుడు చూస్తాడు. ఆమెకు సహాయం చేయాలని మందు బిళ్ళలు తీసుకుని సుందరమ్మ ఇంటికి వెళ్తాడు. 'ఎవరమ్మా మీరు?' అని అడుగుతాడు'. 'బ్రాహ్మలం' అంటుంది. ఆ ఒక్క మాట సమాజ చరిత్రను, చరిత్రలో జరిగిన పీడన రామయ్యకు గుర్తు చేస్తుంది. 'బ్రాహ్మల నించి అన్యాయాన్నీ, అవమానాన్నీ ఎదుర్కొని కౄర శిక్షలకూ, పక్షపాతాలకూ పాలై శూద్రుల అంధకారం అతడికి కనిపిస్తుంది. బ్రాహ్మణుల చేతుల్లో చిక్కి మానాల్నీ ప్రాణాల్నీ అర్పించిన శూద్ర వనితల అవమానం, కసి, అన్నీ అతని రక్తంలో తాండవమాడతాయి. దీంతో సుందరమ్మను 'నేను వైద్యం చేస్తాను నాకేమిస్తావు' అని అడిగాడు. ఆమె నిశ్చేష్ఠురాలయింది. బిడ్డ కోసం తల్లడిల్లిపోయింది. మౌనంగా వాలిపోయింది. ఆ తర్వాత మందులివ్వమంది. తాను డాక్టరును కాను అంటాడు. ఒకేసారి పెద్ద ఘోషలో అగ్ని లాంటి కళ్ళతో పైకి లేస్తుంది. నాయుడుకి భయం వేస్తుంది. వెనకకు అడుగులేస్తూ, ఆమె కళ్ళలో జ్వలించే వెలుగును చూడలేక భగ్గుమని మండిపోతాడు. పంచెకు దీపం అంటుకుని కాలిపోతాడు. సుందరమ్మ బిడ్డ మీద పడి చనిపోతుంది. ఇదీ కథ.
ఇందులో వితంతు వివాహం మీద ఆనాటి సమాజానికి ఉన్న వ్యతిరేక భావాలు, అందులోనూ బ్రాహ్మణ కుటుంబాల్లో ఆచారాలు, పూజలు, క్రతువులు ఎంత మూఢ విశ్వాసాల్లోకి స్త్రీలను నెట్టేశాయో చూపిస్తూనే సహజంగా స్త్రీ కరుణామయమైన హృదయాన్ని చిత్రించాడు. స్త్రీ బానిసత్వ సంకెళ్ళలో ఎలా చిక్కుబడి పోయిందో నిరూపించాడు. మగవారి ద్వంద్వ నీతులు, పరస్త్రీల పట్ల మోహం, భార్య పట్ల చులకనభావం, మొత్తం సమాజంలో బ్రాహ్మణ భావజాల ఆధిపత్యం, దీనికి గురైన వారి ప్రతీకార చర్యలు, మనిషి మరలా మారిపోవడం ... ఎన్నో విషయాలు ఈ నవల ద్వారా తేటతెల్లం చేశాడు చలం. ఇవే విషయాలను గురజాడ కన్యా శుల్కంలోనూ చూపాడు. బ్రాహ్మణీకంలోని స్త్రీ వేదనా భరిత జీవితం సినిమాలో ప్రధానంగా ప్రతిబింబిస్తే ఆక్షేపణ ఉండదు. వితంతు వివాహం పట్ల నేడు అంతగా వ్యతిరేకతా లేదు. కానీ ఆ నవల పేరుతో స్త్రీ శారీరక వాంఛలను, విపరీత సెక్స్‌ తపనలను చిత్రీకరించి సొమ్ము చేసుకోవాలనుకోవడం చలానికి అన్యాయం చేయడమే అవుతుంది.
(వ్యాసకర్త ఫోను నెం. 9948787660)

No comments: