Thursday, November 29, 2012

పచ్చి నిజం

కపిల రాంకుమార్ //పచ్చి నిజం // ***

ప్రసవించి
పక్షం రోజులు కాకముందే
రక్తం స్రవించేలా
రక్కస రతితో దాహం తీర్చుకుంటున్న
యిటు పతిని వారించనూ లేక
వక్షం నుండి క్షీర బిందువుల బదులు
కేవల స్వేదబిందు్వులే కారుతుంటే
రక్తం పిండిన బాధను భరిస్తూ

బిక్కమొహపు పసివాడ్ని అటు లాలించనూ లేక
ఆ తల్లి తల్లడిల్లుతున్నది.!

పిల్లగాడి బలానికి మందులు తెమ్మని
దుడ్డులిస్తే
తేకపోగా పైపెచ్చు
ఇంకో జిలవర్థక ' మందు ' కొట్టివచ్చిన
పశుపతి కాదు పతి పశు బలానికి
నీరసంగా లొంగిపోతున్న దయనీయ స్థితి ఆమెది.!

నియంత్రణల హోరుకు కాలం చెల్లిందో
నియమ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందో
అర్థంకాక
అర్థనగ్న అచ్చాదనతో
సరిపెట్టుకోలేక
సరిపెట్టుకుంటూనే
రోదిస్తున్నదామె!

ఆకలి తీర్చగ అన్నం లేకపోయినా
ఆ-ఆకలికి కరవులేదని
పరువుకోసం
బరువుగా కాలం దొర్లిస్తున్నది !

పురుషాధిక్యతకు నలిగిపోతూ
ఏ ఆపన్న హస్తమైనా ఆలంబన యివ్వదా అని
ఎదురుచూస్తున్నది!!

29.11.2012
_________________________________________
*** ఇది 10.7.1991 రాత్రి 8.15 లకు
ఆలిండియా రేడియో కొత్తగూడెం ఎఫ్.ఎం. ద్వారా ప్రసారమైనది.

No comments: