Saturday, August 31, 2013

కపిల రాంకుమార్ || చిలీ మరో సెప్టెంబర్ 11 ||పుస్తకపరిచయం||

కపిల రాంకుమార్ || చిలీ మరో సెప్టెంబర్ 11 ||పుస్తకపరిచయం||
1. ''ఒక మనిషి చిత్ర పటం'' - పాబ్లో నెరుడా - గేయం

స్వీయ అభద్రతా భావంతో
హత్యాకాండకి తెగబ్డి
చనిపోయినవారి రక్తంతో
పంకిలమైన ఆ చేతులని
విచారించవలసినదే
అమరులు ఈ భూమిలో నుండి
విషాదపు విత్తనాలవలె మొలకెత్తుతున్నావు
ఎందుకంటే మున్నెన్నడూ
ఇలాంటి కాలాన్ని కూడా ఉఓహించలేదు
బోనులో చిక్కిన ఎలుక మాదిరి
భయంతో ఇంతలేసి పెద్దవైన కళ్ళతో 'నిక్సన్‌'
తుపాకితో కాల్చేసిన జండాలు
పునరుద్ధానం అవడాన్ను చూస్తున్నాడు!
అతని అహంకారాన్ని క్యూబా తరిమికొట్టింది
ఇప్పుడీ సంధ్యా సమయం అస్తమించాక
ఆ కరకు కోరల పశువు కొరుకుడుపడని
' చిలీ' ని నమిలెయ్యాలని చూస్తుంది!
బహుశా అతగాడికి తెలిసివుండకపోవచ్చు
అంతగా పేరు ప్రఖ్యాతులులేని ఈ చీలీ దేశ ప్రజలు
అతనికి గౌరవంగా ఒక గుణపాఠం నేర్పించనున్నారు!
**
2. ప్రతి కార్మికుడు, ప్రతి రైతు చేతుల్లో తుపాకి ఉండివుంటే
ఫాసిస్టు తిరుగుబాటుకి ఆస్కారమే ఉండేది కాదు '' - ఫైడల్ కాస్ట్రో
**
3. '' విప్లవ క్రమాన్నీ నిక్కచ్చిగా, గౌరవప్రదంగా నిలబెట్టేదానికి
పరిరక్షించేదానికి మీరు కట్టుబడివుండండి. అవసరమైతే ప్రాణత్యాగానికైనా
సిద్ధపడితే - మీరు అందుకు సమర్థులని కూడా తెలిసిందే -
మీతోపాటు ఆ పోరాటంలో చీలీ దేశ ప్రజానీకాన్నీ భాగంచేసే
వీలుంటుంది. ఇవాళవున్న పరిస్థితుల్లో మీ మాతృదేశం ముందున్న
చారిత్రక విభాతసంధ్యలో - మీ ధైర్యసాహసాలు స్థిరమైన, దృఢమైన
మీ వీరోచిత నాయకత్వం ఎంతైనా అవసరం. మీ ఈ క్యూబా స్నేహితులు
మీకు ఎలాంటి సాయం అందించగలరో కార్లోన్‌, మాన్యుయల్ మీకు
స్వయంగా తెలియజేస్తారు. మా ప్రజల అచంచల విశ్వాసాన్ని అపారమైన
ప్రేమని పునరుద్ఘాటిస్తూ ...మీ సహచరుడు - ఫైడల్ కాస్ట్రో...జూలై 29 1973
ఒక లేఖలో మద్దతు.
**
సెప్టెంబరు 11 అనగానే మనకు అమెరికాపై దాడి జరిగిన 2001
సెప్టెంబరు 11 గుర్తుకొస్తుంది. కాని అదే రోజు 1973 లో చీలీలో
జరిగిన ఘోర ఉదంతం, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన సాల్వెడార్
అలేండీ నాయకత్వంలోని వామపక్ష ప్రభుత్వాన్ని అమెరికా ప్రోద్బలంతో
పినోచెట్ కూల ద్రోసి సైనిక నియంతృత్వాఅన్ని నెలకొల్పాడు. దేశాన్ని
రక్తపుటేరుల్లో ముంచెత్తాడు. సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరూడాలతో
పాతు ఈ ఘోరకలికి ప్రత్యక్ష సాక్షులైనవారు రాసిన వ్యాసాలు, గేయాలు
ప్రసంగాల సంకలనమే ఈ '' చిలీ మరోసెప్టెంబరు 11 '' హవానాలో జరిగిన
సంఘీభావ సభలో ఫైడల్ కాస్ట్రో, అలెండీ త్యాగాన్ని, ధీరత్వాన్ని
శ్లాఘిస్తూ ఎంతో ఉత్తేజకర ప్రసంగం చేశారు. ఇందులో ఏరియల్
డార్ఫ్మన్‌, సాల్వెడార్ అలెండీ, పాబ్లో నెరుడా, జోన్‌ జారా, ఫైడల్ కాస్ట్రో,
బియాట్రిస్‌ అలెండీ, జోన్‌ జారా, విక్టర్ జారా, మురీల్ రూక్యేసర్, డెవిడ్రే,
మెటిల్డా నెరుడా, ఎ. ఎప్పర్ సెల్లె లాంటి ప్రముఖుల వ్యాసాలు, గేయాలు,
వున్నాయి. దీనిని కె. సత్యరంజన్‌ అనువదించారు. ప్రజాశక్తి ప్రచురణ
ప్రథమ ముద్రణ మే.2005 వెల. 30/-
_______________________________________
28.8.2013 మ2.15

కపిల రాంకుమార్ || చదువుకోను సిగ్గు వద్దు ||

కపిల రాంకుమార్ || చదువుకోను సిగ్గు వద్దు ||

చీకటింట దీపమెట్ట వచ్చినామి లాహిర్!
చదువుకోను సిగ్గు వద్దు కదలాలిక డింగరి!
మాట నేర్చి పాడుకుంటూ - రాయగాను రారండి
రాత్రిపూట మదిలోన - సదవగాను రారండి!

బస్సుపేరు చదవొచ్చు - దర్జాగా యెక్కొచ్చు
బెదురులేక అదురులేక - నలుగురిలో తిరగొచ్చు!
సదువులోని మర్మాలు - ఒకటొకటిక నేర్వొచ్చు
మనుగడలో మలుపులన్ని - సులువుగాను దాటొచ్చు!

ఉత్తరాలు చదవొచ్చు - అర్జీలు పెట్టొచ్చు
పేపర్లు చదివిమీరు - లోకరీతి చూడవచ్చు!
కొత్తకొత్త విత్తనాలు గాదె నిందు సూత్రాలు
పంట పెంచు వివరాలు తెలుసుకోను వీలున్నది!

చెట్టు నరక వానలేమొ దూరమౌను లాహిరి
గట్టిలేక మట్టియంత జారిపోవు డింగరి
మంచిగాలి పొందగాను ఇంటి చుట్టు చెట్లు పెంచు
బలమునిచ్చు ఆకు కూర కలిమి పెంచి వెలుగులిచ్చు!

చేతిపనులు నేర్చుకోని ఆందాని పెంచుకోని
ఆడవారు మగ వారు మంచి తెలివి పొందవచ్చు
ఓటుకోస మొచ్చినోని సార, నోటు విసిరికొట్టి
పెజల బాగు కోరివాని గద్దెపైన నిలపొచ్చు!

______________________________
అక్షరాస్యతా ఉద్యమం రోజులలో 1990-91 ఖమ్మం జిల్లా
అక్షర దీపం కోసం - కల్లూరు మండలంలో మార్మ్రోగిన పాట!
______________________________
30.8.2013 మ. 12.35.

Monday, August 26, 2013

కపిల రాంకుమార్ ||బఠాణీలు||

కపిల రాంకుమార్|| బఠాణీలు||
రణమైనా
ఋణమైనా
మరణానికి మిత్రులే!
*
బతుకైనా
మెతుకైనా
చితికి పోయేవే!
*
బలమైనా
జలమైనా
కాలంతో పాటే!
*
మనసైనా
మనిషైనా
మనినంత సేపే!
*
మరులైనా
విరులైనా
మరలనంత వరకే!
*
జడమైనా
బడమైనా
కడతేరే వరకే!
*
సిరులైనా
కురులైనా
తరిగిపోనంత వరకే!
26.8.2013 ఉదయం 5.05

Sunday, August 25, 2013

కపిల రాంకుమార్|| అహం||

కపిల రాంకుమార్|| అహం||
కనిపెట్టక పోతే కనికట్టు కడతాడు
పట్టుపెట్టకపోతే మట్టుపెట్ట సూస్తాడు
గబ్బు వాసనొచ్చిందా నీ పక్కనే వున్నట్టు
సబ్బు వాసనొచ్చిందా ఎత్తులేస్తున్నట్టు
మబ్బు పట్టిన ఆకాశం దాడిచేయటానికి అవకాశం
పిడుగు పాటు దెబ్బతీయవచ్చన్నట్టు
చేతులెత్తి మొక్కాడంటే 
అరచేతిలో నిక్షిప్తాయుధమున్నట్టు
వంగి కాళ్ళకు నమస్కరించాడంటే
పొత్తి కడుపునకు కత్తి గురిపెట్టినట్టు
చిరునవ్వు రువ్వడంటే విషాన్ని చిమ్మటానికే
చిలుకపలుకులతో నొసలు వెక్కిరించడానికే
మాటలతో మైమరిపిస్తాడు
మత్తులో పడేసి మరులు కొల్పుతాడు
కంటికి కానరాని గాలిలా దుమారం లేపుతాడు
అదృశ్య రూపంలోనే
దృశ్యాదృష్ట వ్యధల తెరలను
అంతరంగావిష్కరణ కావిస్తాడు 
మనచేతే మనమీదే 
నేరారోపణ ఒప్పిస్తాడు
వాన రాకడ మనిషి పోకడ తెలియనట్టు
ఎప్పుడైనా విరుచుకు పడవచ్చు!
మెడలో దండ బదులు
మన చిత్రానికి పూల హారమౌతాడు!
మన ఆకారానికి చేటు తెచ్చే
అహంకారమౌతూ!
***
24.8.13

Friday, August 23, 2013

కొంపెల్ల రామకృష్ణమూర్తి** కవిత - శిధిల భ్రాంతి ||

కపిల రాంకుమార్||కొంపెల్ల రామకృష్ణమూర్తి**  కవిత - శిధిల భ్రాంతి ||

నిజమే
నిర్విచార తత్త్వం
నీవు లేనప్పుడే సిద్ధిస్తుంది!
తీరా నువ్వు హృదయాన్నాక్రమిస్తే
తీగలు సాగుతున్న మహాయోగం సైతం

మట్టిగొట్టుకుపోతుంది!
భ్రాంతీ!
గ్రీష్మాతపంలో దాహార్తుడైన జీవికి
మధురామృత పూరంలా కనిపించే ఎండమావీ!
ఎన్నెన్ని పవిత్ర కుసుమాల్ని
కాల రాసిన కసాయితనం నీది!
ఒక దీర్ఘ రాత్రి -
నాలో నాతోబాటు ఎదిగిన జాఢ్యమా!
పెదవి వంపుతో  మంద గమనంతో
కనుసైగతో నునువెచ్చని చుంబనంతో
నన్ను బానిసను చేసుకున్న ఇషకన్యా!
' దిసక్షసా మధ్య '  నిర్జీవ సంధ్యా!
 ఈనాడు నీ నిజ స్వరూపం గోచరిస్తోంది--
నీ ముఖానికి నువ్వు అందంగా పులుముకున్న
సువర్ణ వర్ణం - కాకి బంగారమని తేలిపోయింది.
యుగయుగాల నిజ హృదయ కాలుష్య దుర్గంధానికి
మృదూక్రుల పుస్హ్ప సౌరభం పూసి--
ముహుర్మిహుర్త్వివేక పరాజిత శిధిల శరీరాన్ని
సిగ్గులేక - హరిచందన చర్చలో గుబాళింపుచేసుకొని
ఆ రాత్రివేళ భయంకర స్వైరిణిలా
నా ప్రశాంత సదనంలో ప్రవేశించి - చేతి వేళ్ళతో
ఏ దురదృష్టగీత  నా నుదుట లిఖించావో!
ఏ అపస్వరం నా స్వరపేటికలో పొదిగావో!
తదాదిగా నా లేఖిని రక్తం కక్కుకుంది,
నా స్వరం శివరంజనిగా సాగింది!
భ్రాంతీ!
ఏ బలహీనతా సిసలైన మనిషిని లొంగదీసుకోలేదు
తాత్కాలిక మోహం ఏ శాశ్వత నిసర్గ చైతన్యాన్ని సమాధిచేయలేదు!
నీ ఆజ్ఞతో నన్ను అస్పష్టాలోచనల సంకెళ్ళతో బంధించిన రాత్రి -
నా వివేక సూర్యోదయంలో భగ్నమైపోయింది!
నిన్నరాత్రి నా గుండెను కోసిన శివరంజని
ఈ ఉదయం అపురూప భూపాలంగా మారిపోయింది!
భ్రాంతీ! ఓ పొగమంచూ!
ఏమైపోయావు నువ్వు?
ఏ దురదృష్టవంతుణ్ణ్ని నీ కొంగున ముడివేసుకున్నావు?
ఏ పాతాళలోకంలో '' పాప '' కన్యలా దాక్కున్నావు!
__________________________________________
పేజి. 8 భారతి మార్చి 1977 సంచిక ** కొం.రా.కృ.మూర్తి  1969 లో మాతోపాటు
ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం (కొవ్వూరు)లోభాషాప్రవీణ విద్యార్థి. రేగడమిల్లి సత్యమూర్తి,
రెంటాల పార్వతి. నాకు గుర్తున్న పేర్లు. మా కంటే సీనియర్ గా బేతవోలు రామ బ్రహ్మం
వుండేవారు. వారితో ప్రతీ ఆదివారం కవిత గోష్ఠిలో పాల్గొన్న జ్ఞాపకాలు పదిలంగావుంచాను
ఎందుకో పాత భారతి పుస్తకాలుతిర్గేస్తుంటే ఇది కనపడింది. ఒక్కసారి పాత రోజులు గుర్తు
కొచ్చాయి. ఆ మిత్రుడెక్కడ వున్నాడో తెలుసుకోవాలనివుంది.
___________________________________________
23.8.2013  ఉదయం 10.42. 

Monday, August 19, 2013

సాహితీ స్రవంతి - ఖమ్మం అధ్యయన వేదిక మూడవ ఆదివారం 18.8.2013



కపిల రాంకుమార్||సా.స్ర.అధ్యయన వేదిక 18.8.2013||
ప్రతినెల మూడవ ఆదివారం నాడు సాహితీ స్రవంతి ఖమ్మం జిల్లా కమిటీ జరపలని నిర్ణయించుకున్న విషయం తెలిసినదే. ఆ సందర్భంగా 18.8.2013 ఆదివారం సాయంత్రం 5 గంటలకు స్థానిక బి.వి.కె. గ్రంథాలయంలో కె.దేవేంద్ర అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది.వేదికపైకి డా. కావూరి పాపయ్య శాస్త్రి, డా.పొత్తూరి వెంకట సుబ్బారావు,లను సాహితీ స్రవంతి జిల్లా కార్యదర్శి రౌతు రవి అహ్వానించగా, గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్  పర్యవేక్షణలో కార్యక్రమం జయప్రదంగా జరిగింది
సాహిత్య ప్రయోజనం అనే అంశంపై తొలుత పాపయ్య శాస్త్రి మాట్లాడుతూసాహిత్యమనే మందిరపు గడపదగ్గర మనమున్నామని, ప్రవేశించితేకానిఎన్నో విషయాలను తడమటానికి వీలుకలుగదని అంటూ స-హితయోర్భావ: సాహిత్యమని, విశ్వ శ్రేయం దాని లక్ష్యమని, బహిజన హితాయ, బహుజన సుఖాయ లోకా సమస్తా సుఖినో భవతు అనే ఆర్యోక్తిని సార్థకం చేసేదిగా వుండాలని అన్నారు. కవులు అనధికార శాసనకర్తలని, ముందు చూపు కలవారని, క్రాంత దర్శకులని రాబోయే విపత్కర సామాజిక సమస్యలనుగుణంగా స్పందిస్తూ రచనలు తమ కోసం కాక జన సామాన్యం కోసం రాయాలని వక్కాణించారు. భాష రాని స్థితినుండి, సైగలు, గుర్తులు దాటి మాట్లాడె దశ, రాసే దశ (లిపి) మార్పుచెందుతూ అనుభూతులను, అనుభవాలను తోటి వారితో పంచుకునే అనివార్య పరిస్థితే భాషావిర్భానికి ప్రాత్రిపదికని తెలిపారు. నన్నయ కాలంలో సంస్కృత పదాల వాడకం నుండి  తెలుగు పదాల వాడకం ఆరంభమైనా ఆయన తెనిగించిన మహాభారతంలో సంస్కృత సమాసాలు, తత్సమ, తత్భవాలు యెక్కువే అయితే చిన్న చిన్న పదాలతో విస్తృత అర్థం వచ్చే ప్రయోగాలకు నాంది పలికాడని. తిక్కన కాలానికి అది తెలుగు పదాల వాడకం (అందునా అచ్చతెనుగు) మొదలయిందని, అలా పురాణాలు, ఇతిహాసాలు అనువాదం కావింపబడటం జరిగిందని, తెలిపారు. ఆది కవిగా నన్నయను గుర్తించినా, ఆంధ్ర కవితా పితామహుడని అల్లసాని పెద్దనకే పీఠం దక్కిందని, తెలుగులో ప్రబంధాల యుగానికి ఆద్యుడని ' మనుచరిత్ర ' తార్కాణమని, అలా సాహిత్యంలో వివిధ దశలు, ప్రక్రియలు, పద్య, గద్య, చంపూ, వాటి క్రమ పరిణామం., ఆధినిక కవితా ధోరణి కి ఆద్యుడుగా గురజాడ నుండి శ్రీశ్రీ, శ్రీశ్రీ నుండి ఎన్నో మలుపులు ప్రయోగాలు తెలుగు సాహిత్యంలో చోటు చేసుకున్నాయని, అసలు కవిత్వ, కథ, పాట ఎవరికోసం అనేదానిని బట్టి దాని మనుగడ ఆధారపడివుంటుందని సొదహరణ ప్రసంగం చేస్తూ భావ, అభ్యుదయ, దిగంబర, విప్లవ, స్త్రీవాద, దళితవాద అంటూ ఎన్నో శాఖోపశాఖలుగా సాహిత్యం మార్పులు చెందుతూ ఆధినిక సాంకేతికతను సంతరించుకొని కంప్యూటర్ ద్వారా, అంతర్జాలం ద్వారా విశ్వమంతా ఎగపాకుతోందని కూడ తెలిపారు. ఏది యేమైనా సమాజంలోని అధిక శాతంగా వున్న జన సామాన్యానికి అర్థమయ్యేలా, వారి ప్రయోజనాలను గమనంలో వుంచికొని వారి అమోదాన్ని పొందటమే సాహిత్య లక్ష్యంగా వుండాలని ముగించారు. తదుపరి డా. పి.వి.సుబ్బారావు గారు మాట్లాడుతు యే కవిత్వానికైతే లయ, శ్రుతివుంటాయో అది యెక్కువ మన్ననపొందుతుందని, అనాదిగా జానపద గేయ సాహిత్యం మౌఖికమైనా ఇప్పటికీ కొనసాగుతూనేవుందని అలాంటి కవిత్వం ప్రక్రియ పాట, కథ, సామెత, చాటువు, హరికథ, బుర్రకథ లోక హితానికి చేరువగా వుంటేనే శాశ్వతంగా వెలుగుతుందని పేర్కొన్నారు. సార్వజనీనంగావుండాలన్నారు. భావాల వ్యక్తీకరణ, బాధల పంపకం, సమస్యల పరిష్కారం సాహిత్యం తీర్చాలని అన్నారు. కవి మిత్రులు  సునంద. ఉష,శైలజ, బండారు రమేష్,చర్చలో  పాల్గొని తమ తమ అభిప్రాయాలు చెబుతునే, వారికొచ్చిన  సందేహాలను నివృత్తి చేసుకోటం గమనార్హం సాహిత్యం ఎందుకు, ఎవరికోసం అనే ఆంశంపై శ్రీశ్రీ రాసిన వ్యాసాన్ని ఈ సందర్భంగా చదివి వినిపించారు గ్రంథాలయ నిర్వాహకుడు కపిల రాంకుమార్. కన్నెగంటి వెంకటయ్య,మేడగాని శేషగిరి, సాదనాల వెంకటస్వామి నాయుడు, కవితాంజనేయులు, కొన్ని సలహాలు సూచనలు యిచ్చారు. ఇది కవిత్వ పాఠ శాలగా రూపొందాలని, వివిధ ప్రక్రియలపై శిక్షణాతరగతులు నిర్వహించేందుకు ప్రణాళిక వేసుకోవాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా కథ, పాట, వచన కవిత, నాటిక, వ్యాస రచన, విమర్శనా పద్ధతులపై ఒక కార్యక్రమం  రూపొందిస్తామని  నిర్వాహకులు కపిల రాంకుమార్, రౌతు రవి తెలియ చేసారు. ఈ అధ్యయన వేదిక యితర సాహిత్య వేదికలకు ఆదర్శం కావాలని  డా. పాపయ్య శాస్త్రి, డా. సుబ్బారావు అభిప్రాయపడితూ, దానికి కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని,  ప్రముఖలను రప్పించే ప్రయత్నంకూడ చేద్దామని సమావేశంలో నిర్ణయించారు. కె. దేవేంద్ర  మొత్తం చర్చలను సమీక్షిస్తూ  ఈ నాతి కవిత్వం  అనంత విశ్వంలో మనిషియొక్క అస్థిత్వం గురించి చర్చిస్తే మన ఒక చిన్న రేణువంత కూడ వుండదు. ఒకరినుంచి ఓకరికి ఏం జరుగుతుందో తెలియపరచడంలోనే అనుసంధానం వున్నది. మనిషి అభివృద్ధికి ప్రత్యామ్నాయం యేమిటి? దేనిని మానవ అభివృద్ధి అంటాము? మనిషి ప్రయాణంలో నాది అనుకునే భావన మానవునికి శత్రువు! భాష వ్యక్తీకరణలో ఇదంతా యిమిడివుంది. వర్గ సమాజంతో వర్గ సాహిత్యం పెనవేసుకుని వుంటుంది. ఇంకా లిఖిత, అలిఖిత (మౌఖిక) సాహిత్యం చేరని ప్రజల సంఖ్య యెక్కువగా వున్నపుడు, వారిని చేరే విస్తృతార్థంలో భూత దయ, కరుణ వేరుగా వున్నాయి. సాహిత్య ప్రయోజనం వర్గ ప్రయోజనంగా వుండాలని, మానవ భౌతిక అవసరాలతోనే సాహిత్యం ముడిపడి వుండాలని అప్పుడే సరియైన బడుగు బలహీన వర్గాల పక్షాన సాహిత్యం ప్రయోజనకారిగా రుపాంతరం చెందాలని ప్రతిపాదించారు. నిత్య చేతనం నిరంతరం కొనసాగాలని కోరారు. తదనంతరం కవి సమ్మేళనం జరిగింది కపిల రాంకుమార్, తోట కృష్ణారావు శైలజ, సునంద, బండారురమేష్, దేవేంద్ర, సాదనాల, కన్నెగంటి  తమ కవితలు వినిపించగా, డా.పాపయ్యశాస్త్రి వాటిని సమీక్షించి తగు సూచనలిచ్చారు. వచ్చే నెల సెప్టెంబర్ మూడవ ఆదివారం 15 'జాషువా సాహిత్యం - సామాజిక కోణం 'పై కన్నెగంటి సాహిత్యోపన్యాసం చేయాలని, తదుపరి కవి సమ్మేళనం కవితలు  చదివే వారు ముందుగానే కవితలు అందిస్తే, వాటిపై నిర్మాణాత్మక  సూచనలివ్వటానికి వీలుకలుగుతుందని వాటిని గ్రంథాలయంలో ఒక రోజు ముందుగా అందచేయాలని వందన సమర్పణ చేస్తూ రౌతు రవి ప్రకటించారు.

Friday, August 16, 2013

ఏది మూలం ఏది ముఖ్యం

||కపిల రాంకుమార్|| ఏది మూలం ఏది ముఖ్యం ||

మున్నీటి సంద్రాలు, హిమవన్నగాలు
విశ్వమంతా ఖ్యాతి మన భరత జాతి!

వేదాల్ విజ్ఞాన వెలుగులు నింపి-
లోకాన చీకట్లు తొలగించునట్టి
సింధులోయల్లోన ప్రాచీన సంపద -
బౌద్ధాలు, జైనాలు వర్థిల్లెనిచట!

స్వర్ణయుగంలోన గుప్తునున్నాడు -
అర్థశాస్త్రంలోన చాణక్యుడున్నాడు
శ్రీహర్ష, హాల, భాస బాణులే కాక -
కాళిదాసాది వాల్మీకి కవులున్నారు!

స్థూపాల రూపాన దేవనాగరి పాడింది -
గంగమ్మ యమునల ఆర్యమ్ము వెలిసింది
వారణాసి, నలందా తక్షశిలలోన -
వేదవేదాంగ మీమాంస శాస్త్రాలు !

శాతవాహన కాకతీయ- చేర చోళ కళింగాలై
కృష్ణమ్మ గౌతమీ - ఉత్తుంగ భద్రలై
కర్ణాటాంధ్ర - మళయాళ తమిళాలు
పెన్నమ్మ కావేరీ ద్రావిడా జాతులు!

ఆనాటి సంస్కృతులెల్ల కల్లోలాయె
నాల్గుదిక్కులలోన మూల్గులెక్కువాయె
మున్నీటి సంద్రాలు పొంగుచున్నాయి
హిమవన్నగాలు మండుచున్నాయి!

కాపాడుకోవాలి ఆనాటి కుడ్యాలు
తెగనాడుకోవాలి మనలొని మౌఢ్యాలు!

మతము జపము తపము కంటె- కూడు గుడ్డ గూటి కోసం
ఎల్ల వేళల సమరశీలత - పెంచుకొనుటే భారతీయత!

16..2013 ఉదయం 6.30

Thursday, August 15, 2013

వచ్చాను వచ్చాను - అనిసెట్టి సుబ్బారావు కవిత

కపిల రాంకుమార్||| **వచ్చాను వచ్చాను ||| అనిసెట్టి సుబ్బారావు కవిత ||

వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి!
వెళ్ళిపోయిన కోటికోట్ల జీవుల విడిచి
కుళ్ళిపోయే నేటి కోట్ల జీవుల కొరకు
పొర్లివచ్చే కోటీ కోట్ల జీవులకొరకు
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి ! 
కలగుండు వడియు నిశ్చలమైన గుండె వలె
నిద్రించు నీటిలో విడుచు పొడిరాయివలె
ఆడవులూ, పడవులూ ' అహఒఉ ' టెల్లలు దాటి
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి ! 
పగిలించి రణ్భేరి, పద్మవ్యూహము త్రెంచి
శివమెత్తి విస్ఫులింగములు చిమ్ముతులేచి
ఈ జగతిలో నూతన జగతి పెకలిస్తాను!
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి ! 
తలవొగ్గి బానిస సలాము చెయ్యరు మీరు,
ధన మదాంధత బలిసి తారసిల్లరు మీరు,
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !
రాళ్ళు రప్పలు ప్రాణ్మొలొకి పులకింపగా
పరాకోటినందు ప్రాణుల కళాసృష్టి;
ఎగసి ప్రవహిస్తుంది ఇక వెలుగు బావుటా

వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !

ప్రేమమూర్తుల నిత్యనృత్యమై, సత్యమై
భువనముల్ సకలముల్ పొంగి పోవంగా
నిర్భరానందమావిర్భవించగా
వచ్చాను వచ్చాను
వ్యాస సంతతి వాణ్ణి !

_________________________________
(**పేజి.4.5- అనిసెట్టి సుబ్బారావు ''అగ్నివీణ  -బిచ్చగాళ్ళపదాలు''
సంకలనం నుండి- విశాలాంధ్ర ప్రచురణ డిసెంబరు 1992 రు.32/- )
_________________________________
15.8.2013  ఉదయం 10.10


Wednesday, August 14, 2013

రంగులు మారుతున్న స్వరాజ్యం

కపిల రాంకుమార్ || రంగులు మారుతున్న స్వరాజ్యం||

అరవైఆరేళ్ళ స్వరాజ్యానికీ
ఆరళ్ళు తప్పటంలేదు
' కాగ్ ' అక్షితల సాక్షిగా!
పైగా పాలకులు చీలికలు
పెట్టడమూ మానలేదు!
**
వయోజనుల ఓటెందుకో
ప్రతీసారీ ఓటిపోతోంది!
ప్రణాళికా సాళ్ళ వంకర టింకరలవల్ల
ప్రతీ సారీ వట్టిపోయిన పాడిపంటలయినట్టు
రెడ్డొచ్చి మొదలాడే ఆటలా
అంచనాల వ్యయం పెరగటమే తప్ప
ఫలితాలు ప్రజలకందేలోగా
ప్రజల ప్రతినిధులు ప్రతీ నిధిలో వేలు పెట్తుంటే
రూపు మార్చుకొని , రూటు  మార్చుకుంటున్నాయి!
**
అందుకే ప్రతీ ' అర ' క్షణమూ
ప్రతీ చోట ' అ-రక్షణమే!
రావణకాష్టంలా సమస్యలు
అనుకోని విధ్వంసాల పాలవుతుంటే
సార్వభౌమత్వపు ఉబికికే
సవాలు విసిరేలా అంతర్గత శత్రువులు
కకావికలం చేయబోతుంటే
అందుకే - మౌనం వహించటం కవులవంతు కాదు!
ప్రజల చైతన్యంకై భేరి మోగించకా తప్పదు!
పంద్రాగష్టు రంగులు మారకుండా
సుస్థిరమైన దీక్ష పట్టక తప్పదు!

_______________
14..8..2013

కపిల రాంకుమార్ || చదివిన గ్రంథము ||ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర ||

కపిల రాంకుమార్ || చదివిన గ్రంథము ||ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర ||

అంశము: అరాచకము – ప్రజల కడగండ్లు

గోగులపాటి కూర్మనాథుడను కవి 1724 ప్రాంతములో విశాఖ జిల్లాలోని విజయనగరాన్ని పరిపాలించిన మొదటి ఆనందగజపతి ఆస్థానములో వున్నాడు. ఈ ఆనంద గజపతి, పాయకరావుపేటను పరిపాలిస్తున్న పాయకరాజా అను ఉత్కళరాజు కలిసి నైజాంప్రభువు వద్ద కొన్ని లక్షలు అప్పు తీసుకొని, యివ్వనందున నైజాంసేనలు ఆ ప్రాంతాన్ని కొల్లగొట్టసాగినవి. నాతి ప్రజల దుస్థితిని, నైజాంసేనల దురాగతాలను ఎండకట్టుతూ గోగులపాటి కూర్మనాథ కవి సింహాద్రి నరసింహస్వామి పేర యిలా నివేదన చేసాడు.

'' యవనేశుధాటికి నడలి సర్వస్వమ్ము విడిచి మందిరములు వెడలు వారు,
వెడలియు తలదాచ వెరవేమి గానక నడవుల నిడుమల బడెడువారు,
బడియునెచ్చట కూడుబెట్ట గానక తమ శిశువులతో వెతికించువారు,
జెంది డెందము గుంద గాందిశీకత నభిమానార్థులై ఖేదమూనువారు
నైరి యొక్కొక్క భార్యతో నాని ప్రజలు
అష్టమహిషులపై పదియారువేల
సతులతో నూవు వలసకెచ్చటికరిగెదు
వైరి నరసింహ సింహాద్రి నార్సింహ!

పొట్టేళ్ళ గతిబట్టి బొడి సన్యాసుల ఢీయను తాకులాడించు నొకడు
సోమయాజుల బ్రహ్మసూత్రముల్ ద్రెంచి సింగాణి వింద్లకు నల్లెగట్టు నొకరు
ఖూబు ఘోడాయంచు గుడికీలు గుర్రము నెక్కి ధేయని తరటెత్తు నొకడు
పైకాలు గొమ్మని బల్మికోమతివారి చెలువపైబడి బూతుసేయునొకడు

గ్రామముల్ నిర్థూమమ్ములయ్యెను సస్యంబులెల్ల నశనముజెందె
దొడ్లలో శకముల్ దుంపశుద్ధిగబోయె దోచిరి సర్వంబు గోచి చక్క.
కనిపించు కోవుగా ఖలులు మార్గస్థుల కొంకక ముక్కులు గోయునపుడు
ఆలకింపవుకదా అయ్యయ్యో ప్రజఘోష ధూర్తులు పడి ఊళ్ళూ దోచునపుడు
జాలి రాదాయె గా చటుల తుష్కరులు భామినులను చెరపట్టినపుడు !

ఈ విధంగా ప్రజల బాధలను వర్ణించి ఈ బాధలనుండి కాపాడవలసినదిగా సింహాద్రి నరసింహుని వేడుకున్నాడు.

మా మొఖాసాకు గ్రామంబులిమ్మనలేదు కొంపలు గాల్పింపకూడదంటి
కరి హయాదుల మేము కాంక్షింపగాలేదు గోవధమాంపించి ప్రోవుమంటి
మాకు మిమ్ములను సామ్రాజ్యమిమ్మనలేదు జనులను డోపింపజనదటంటి
స్వామి మా కొరకేమి కామింపగాలేదు క్షితిలోన ప్రజల రక్షింపమంటి…
----------------------------------------------------------------------
ఇది ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర – ఏటుకూరి బలరామ మూర్తి – విశాలాంధ్ర (ప్రథమ ప్రచురణ జూన్ 1953 ) ఇది 10 వ ప్రచురణ September 1990
రు. 20/-
____________________________________________________
14.8.2013 సా.2.47

Tuesday, August 13, 2013

చదువుయాగం

కపిల రాంకుమార్||చదువు యాగం|| **

కొండమీద గుడివద్ద - రాత్రి బడివున్నదిరా
అందులోని సామిలాగె - చదువుతల్లి దొడ్డదిరా
మా పిలుపులు వినిమీరు - చదువుకోను వడివడిగా
పలకలు చేతబూని - యిటురాక తప్పదురా!

నాగేటి సాళ్ళలో - యే కొలతాకందని
చతురతాచూపేటి - దుక్కినాగళ్ళు
చతురంపు గళ్ళలతో ఎదలు దోచి
ఏరువాక పాటలో పిలిచే పొలాలు!

కలనేత బట్టలో చేనేత చిత్రాలు
చిత్రకారుని కుంచె తలదించుకోవాలె
కోలాటమాడంగ - బతుకమ్మలాడంగ
గొబ్బిళ్ళు ముంగిట కళకళాలాడంగ!

ఏ బాస నేర్చేను మదిలోని ఊహల్లు
ఈ పాటపాడేను దంచేటి రోకళ్ళు
శ్రమలోన పనిలోన అలసటాతీరంగ
పాడేటి పాటల్లు పద సంపదల్లు!

గడచిన యేండ్లకంటె - మిగిలిన వయసులోన
చదువుతల్లి నీడలోన - తెలివిపొంద కదలండి
ముచ్చటకాదుకాని - చచ్చినంత అవసరం
అక్షర కుసుమాలను - దండలాగ పేర్చగాను!

మా కేకలు -మీకోసం

మా గంతులు మీకోసం!
ఉరకలెత్తి కదలిరండి 
చదువుయాగం జరపండి!
__________________________________
(** అక్షరాస్యతా ఉద్యమంలో 1991-92 లో  ఖమ్మం జిల్లా కల్లూరు
మండలం కో-ఆర్డినేటరుగా పనిచేసినరోజుల్లో రాసినది.
____________________________________
13.8.2013 మ.12.30

Sunday, August 11, 2013

కపిల రాంకుమార\\ ఇప్పుడేంచేస్తావు?

కపిల రాంకుమార్|| ఇప్పుడేమి చేస్తావు?||
అధికార మార్పులు
వాటాల తుంపులు
గద్దెనెక్కేవాడెవడు?
అహ ఎవడైతే మనకేంటి?
అని అనకు!
యోచించకుంటే
యాచకునికంటే
యోజనాల దూరం
విసిరేయబడతావ్!
అంతరం సమాంతరమై
అంతంకాని అనంత సమస్యల
సొరంగమవుతుంది!
వాడు
అడ్డకూలీలకు
పిలిచి పని యిస్తాడా?
బుడ్డోళ్ళ గోళ్ళూడగొట్టి
పెద్దోడికి మెట్లు కడతాడా
యోచించకుంటే ఎలా?

నిరుద్యోగ యువత
కలలు నెరవేర్చి కొలువులిస్తాడా?
ధరలను దించి
అధరాలకు రుచులు  అందింస్తాడా?
రైతుకు కల్తీలేని విత్తులిచ్చి
హరితారంగేట్రం చేయిస్తాడా?
ఉరితాళ్ళను తరిమేస్తాడా?
దళారీలులేని ధర్మ రాజ్యం తెస్తాడా?
అవినితిని సమాధికడతాడా?
కట్నపుసెగలు నిలువరిస్తాడా
యోచించకుంటే
యాచకుని కన్నా కనికష్టం
గరిష్ఠంగా ని బతుకు!
విద్య,వైద్య, ఆరోగ్యమందించి
సజావుగా బతుకనిస్తాడా?
బతుకుల్ని బస్తాలో కుట్టి
పోస్ట్ మార్టం లేకుండా చేస్తాడా?
మామూలుగా తాగి తందనాలాడండని
మందుపోసి మాయమాటల బుట్టలో పడేస్తాడా?
ఇవేమీతేలకుండానే
తెలుసుకోకుండానే
మద్దతా?
ఏ ముద్దతు దీనికి ప్రామాణికం!
ఏ పరిమాణంలో సౌకర్యాలు?
ఏ ప్రమాణాల మేరకు పాలన?
 రాబోయే ప్రిణామాలు బేరీజు వేయకుంటే
మొత్తానికి చిప్పేగతి!
యథాస్థితే కొనసాగితే
అనివార్య ప్రజా పోరాటానికి
సనంద్ధుడివ్ కాక తప్పదు!
విభజించినా, భజనచేసినం,
జరిగేదదే!
పోరాడితే నైరాశ్యపు బతుకునుండి విముక్తి!
అందకు కూడకట్టు నికార్సయిన ప్రజాశక్తి!!
చెప్పు ఇప్పుడేమి చేస్తావు!
తేల్చుకోకపోతే చస్తావు! (యిలాగే  ...యిలాగే కాలం గడుపలేక !)

11.8.2013   6.45. am.

Thursday, August 8, 2013

చేరా ప్రశంస

కపిల రాంకుమార్ || చేరా. ప్రశంస ||
ఫాబ్లో నరుడా కవితా సంకలనం ''శిక్షించాలనుకుంటున్నా'' అనువాదం చేసిన కె. రాజేశ్వరరావును చందోంతరంగవేది అన్నారు. -చే.రా. .మాష్టారి కితాబులోంచి ముఖ్య భాగం ||
....
ఈ కావ్యాన్ని రాజేశ్వరరావు గారు ఛందోరహితంగా ప్రారంఘించారు. అంతమాత్రామ లయ లేదని కాదు. లయ క్రమ బద్ధంగా లేదని. ప్రకటలలాంటి చోట్ల సంపూర్ణ లయ సాధ్యంకాదు/ ఉదాహరణకు చూడండి
'' హిమ శీతలమైన ఈదర గాలుల్లో
ఇసుక తుఫానుల అర్థ సమాద్హుల్లో
మైదానాల్లో గడ్డి బీళ్ళూ ద్వీకకల్పాల్లో
నదీ తీరాళ్ళో, ఎడారి అంచుల్లో
హించారిరంసువుల చేతుల్లో
కోల్పోయారు తమ ప్రాణాలు ''
ఈ పాదాల్లో అంతర్గతంగా చతురశ్ర గతి అణగిమణ్గి కనిపిస్తుంది తరువాత ఖండికల్లో అది స్పష్టంగా బయటకువస్తుంది.
'' ఆకులు రాలిన చెట్ల నీడలొ
రేకులు విచ్చిన గడ్డిపూల్లో
అడవులు కండలు ఎడారి దారులు
గనులూ, పనులూ కార్ఖానాల్లో
కనిపించెను మా శ్రామిక వీరులు
ఓడ్చిన ఎర్రని రక్తపు చారలూ''
కావ్యరచనలో ఛందో వైవిధ్యం మన తెలుగు వాళ్ళ కావ్య సంప్రదాయం/ అవసమైన చోట గతి వైవిధ్యం చూపించటం అవసరం త్రిశ్ర గతిలో కొన్ని పాదాలు నడిచాయి.
'' ఆ వీరులు మనకోసంబలిపీఠం యెక్కినారు
ముష్కరమూకలు వారిని
ముక్కలుగా నరికినారు
బతికి ఉండగానే చితి
మంటల్లో వేల్చింబారు ''
అంటూ సాగుతుంది. త్రిశ్రగతిలో వేగంలోవుంటూంది. మార్చింగ్ లా వుంటుంది. ఖండగతిలో అలసత వుంటుంది. ఉయ్యాల తూగుగావుంటుంది. అది యెట్లా సాధించారో చూడండి.
'' చావు బతుకుల వంటి
సమ్మె పోరాటాన
గడిపాను వారితో
గాఢమైత్రిని నెరపి ''
మళ్ళీ మిశ్రగతిలయలో ముత్యాల సరాల గతిని జ్ఞాపకం చేస్తూ రచించిం పద్ధతి చూడండి
'' కాలిపోయిన జీవితాలను
జరిగిపోయిన దారుణాలను
మరచు నేనా హంతకులతో
ఎన్నడైనా చేయికలపను ''

ఛంద్స్సుల అంతరంగాఅన్ని పట్టుకొని భావనుగుణంగా వాడుకోవాలంటే ఛందస్సులను తెలుసుకోవటం ఒక్కటే చాలదు తగిన పద సంపద కావాలి. అది పుష్కలంగా ఉన్నవాడు రాజేశ్వరరావుగారు.

నేను కవిత్వం రాసే రోజుల్లో రాజేశ్వరరావుగారిలాగనే ' నాజిమ్‌ హిక్మత్ ' ని మాత్రాఛందస్సుల్లో తెలిగించాను. దానికి భాషా సంపదా, లయ పరిజ్ఞానమూ జోడు గుర్రాలలాగ సంధించాల్సిన అవసరం గుర్తించాను. అట్లాంటి ప్రయత్నం తగిన స్థాయిలో చేసిన రాజేశ్వరరావుగారిని అభినందించటం కోసం రాశానీ నాలుగు మాతలు. ఇవి ఆయన కోరితే రాసినవి కావు. నా మనస్త్రప్తికొసం రాసినవి. చివరిగా ఒక మాట చెప్పనా? ఆయన కవిత్వంలో ఆత్మ దర్శనం చేసుకుంటున్నాను.
-- చే.రా. 30.4.2003.
________________________________
8.8.2013 ఉదయం 5.25

యోచన మంచిదi

కపిల రాంకుమార్||యోచన మంచిది||

పరిపరి - ఒకపరి - యోచన మంచిది
రసముల రుచులకు పరిగిడు కోయిలా!

విశ్వ వ్యాపిత ఆర్థిక దోపిడి
పెనుభూతమై దాడి సలుప
నీరు నింగి - నేల గాలి
కల్మషమై మలినమయ్యె!

నయగారపు నగరాల మోజులో
చిక్కిన మనుగడ వడలిపోతుంటే
కొత్త పాటలె నీ నోట పలకాలి
ఆశల భవిత రోగరహితం కావాలి!

కనిపించిన ప్రతీ అందాన్నీ
కోరికోరి కొనితెచ్చుకోకు
మాయదారి రోగపుబారి
పొరపాటున పాలుపడకు!

హద్దులు దాటకు గొడవలు పడకు
ఆశల బతుకు కడదాక నిలుపు
గుచ్చుకునేది గుచ్చేది
మలినమైతే నొచ్చుకునేది
మనసు - చచ్చేది మనిషి!

వ్యసనాలపై వ్యయాలకు
పరిపరి యోచన మంచిది!
అవశాన దశాతీరాలకు
దూరంగా జరుగుట మంచిది!

(ఎయిడ్స్ రహిత సమాజాన్ని ఆశిస్తూ)
7.8.2013 సాయంత్రం 6.15

Wednesday, August 7, 2013

పరాన్నభుక్కులు - ఫాబ్లో నెరూడా

కపిల రాంకుమార్|| పరాన్నభుక్కులు -ఫాబ్లో నెరూడా ||

నేటికి ఈ నాటికి
ఈ క్లిష్టక్షణం వరకు
బ్రో్డబెర్రి, గరస్టాజు
బాంజరుతో చేయికలిపిన
'నిక్సన్‌-ఫ్రీయ్-పినిఛెట్ 'లు
ప్రపంచాన్ని తినదలచిన
పరాన్న భుక్కులు కుక్కలు!

అగ్ని కీలలందు ఎగసి-అహరహమూ పోరాడిన
మృతవీరుల క్రొన్నెత్తుట-తడిచిన జయకేతనాన్ని
పగతో పరపర కొరికే-పందికొక్కుమందలు!

క్షుద్రులైన సామంతులు-దోచుకునే పిశాచాలు
న్యూయార్కు తోడేళ్ళకు-అమ్ముడైన మరబొమ్మలు!

దాలర్లకు తపియించే-మారణయంత్రాల తృష్ణ
మృతయోధుల త్యాగరుధిర-ధారలతో తీరుతోంది!

శ్వేతభవన ప్రాంగణాన-ఎంగిలి మెతుకులు కతికే
వీళ్ళు మృత్యుకందకాలు-తార్చి బతుకు నికృష్టులు!

ఆకలి కొరడాలతోటి-చర్మాలను చిట్లగొట్టి
చిత్రహింసలు పెట్టే-చట్టాలే వీళ్ళ బతుకు!
______________________________________
||ఫాబ్లో నరుడా ' సంకలనం ' శిక్షించాలనుకుంటున్నా ' లో మొదటిది.(అనువాదం కె. రాజేశ్వరరావు - ' అమన్‌' ప్రచురణలు నల్లకుంట -హైదరాబాద్. 2003 వెల రూ.6/ || చందోంతరంగవేది రాజేశ్వర రావు -చే.రా. మాష్టారి కితాబు రేపు కవిసంగమంలో|| ___________________________________7.8.2013 ఉదయం 10.15
Like ·  · Promote · 

Tuesday, August 6, 2013

ఇది ఏ కర్మ ఫలం? ధర్మ ఫలం!

కపిల రాంకుమార్ ||ఇది ఏ కర్మ ఫలం? ధర్మ ఫలం!||
ఊరి చెరువునుండి
కావిళ్ళతో నీళ్ళు తేవాలి, కాని
గుమ్మం యివతలే దించాలి
పేడకళ్ళు యెత్తి, కసువూడ్చి
గేదెల్ని కడిగి, మేతేసి
ఇత్తడి తెపాలకు పాలుపితికాలి, కాని
గుమ్మంయివతలే పెట్టాలి
ధాన్యంకైలు చేసినా
గుమ్మెలోనో , గరిసెలోనో
వడ్లు నింపటమే మా పని, కాని
మాకు వడ్డించే విస్తరి మాత్రం
గుమ్మం యివతలే!
ఏది ముట్టుకోకూడదు, కాని
అన్ని పనులు చేయాల్సిందే!
పురిటింట్లో కాని, ఆఖరికి కాటిలో కాని
మాతోనే పని
గృహప్రవేశం మాత్రం నిషేధం
**
మా ఆడంగులు గదులన్నీ ఊడ్చి శుభ్రంచేసి
దుమ్ము దులపొచ్చు
కడిగి తుడవొచ్చు, కాని
వంటింట్లోకి మాత్రం అడుగేయ నిషిద్ధం!
కాని మాకు అర్థంకానిదొకటే వారి ద్వంద్వ నీతి!
కళ్ళుకనపడని కామందుల
(కామాంధుల)
కోరికకు మాత్రం ఆంటరానితనం హుష్ కాకి!
మా తప్పులకు రాద్ధాంతంచేస్తారు
వెలివేతకు గురుచేస్తారు!
వారి తప్పులకు యే విధివిధానాలుండవు, కాని
గుండె కోతలు, బతుకు వెతలు ఛీత్కారాలు
పుష్కలం!
**
ఇది ఏ కర్మ ధర్మ ఫలం!
ఇక ఆగదు తిరిగిబాటు పవనం
ఝంఝామారుతంలా!

5.8.13 సా. 2.10

Saturday, August 3, 2013

|| రైతు కవిత సంకలనం – పరిచయం||

|| రైతు కవిత సంకలనం – పరిచయం|| ‘ అదును ‘
దేశం దేశమంతా రైతు భుజాల మీద కూర్చొనుంది. అతని కాలికింద కదలబారుతుంది. ఆ కదలికల్ని గుదిగుచ్చి, రైతుల శ్రమని గౌరవించాలని మా ఆలోచన. ఇది ఎప్పుడో మొదలై యిప్పుడే ఓక కొలిక్కి వచ్చింది. ఓ పనిలో కొన్ని మార్గదర్శక సూత్రాలు పెట్టుకున్నాం 1985-2000 మధ్య కాలంలో పత్రికలలో, పుస్తకాల్లో వచ్చిన వ్యవసాయ సంబంధంగల కొన్ని మేలైన వచన కవితలు గ్రహించటం మా పరిథి.
కవిత రైతు జీవనంలో ఏదో ఒక ముఖ్య కోణం స్పృశించాలి.
కవితలో వస్తు నిష్ఠ, రూప సౌందర్యం వుండాలి.
స్థూలంగా విషయం ఒక్కటే అయినా కర్షక జీవితంలోని విభిన్నచ్ఛాయలతో సంకలనం వైవిధ్యభరితZMgaa రూపొందాలని మాఆశయం.
కవిత ఎన్నిక వస్తు ప్రధానమే తప్ప వ్యక్తి ప్రధానం కాదు.
సారాంశం ఒకటే కావొచ్చు. కానీ, సమస్యలు కొన్ని ప్రాంతాన్ని బట్టి వేరుగవుండొచ్చు, కనుక ఆని ప్రాంతాల రైతుల బాధలు చిత్రించే కవితలు తీసుకున్నాం.
వివిధ సామాజిక పరిణామాల వరస తప్పకుండా కవిత ముద్రణలో కాలక్రమం పాటించాం.
వచన కవిత్వానికు ముందే కావు జీవన చిత్రణ, సహానుభూతి గల పద్య, గేయ కవిత్వం వచ్చింది. అది కూడ కలుపుకుంటే క్రమ పరిణామం బాగా తెలుస్తుంది. అందుకని అనుబంధంలో (తొలికాపు ) వెనుకటి తరాల రచనలు కొన్ని చేర్చాం.
కాపు సమస్యలకు స్పందించిన కవులకు, రచనల సేకరణలో సహకరించిన సహృదయులకు కృతజ్ఞతలు.
ఇందులో 75 వచన కవితలు 17 పాత తరం రచయితల పద్యాలు, గేయాలు చేర్చబడటమే కాక , దేశ చరిత్రలో రైతు క్రీపూ.2600-1800 నుండి కాలక్రమంలో జరిగిన వివిధ రైతు సంబంధ వివరాలు పేర్కొన్నారు.

అందులోది మచ్చుకొక పద్యం; 1948 లోనే ‘ ఇనగంటి పున్నయ్య చౌదరి ‘ రైతు కన్నీరు ‘ శీర్షికలో :
 ” నెల జీతములు లేవు, అలవెన్‌సులును లేవు, ఇంక్రిమెంటులు లేవు, ఇంక్రిమెంటులు లేవు, ఇతర గ్రాంటులు లేవు,ఎలమి పెంషన్ు లేదు సెలవు లేదు,అంచె బుల్లులు లేవు, బెంచి బల్లలు లేవు, ట్రావిలింగును లేదు, డ్రస్సు లేదు, డిన్నరులును లేవు, మన్ననలును లేవు, శాల్యూటు లేదు, యే వల్యూ లేదు, రెక్కలను ముక్కలొనరించి, రేయింబవలు, పొలము బెకిలించి చెమట చుక్కలను రాల్చి, ఖర్చులుకు బంటలను గట్టి, కడుపు నిండ తిండి జాలక కృశియించెఉచుండె రైతు ”….అని అనాడే వాపోయారు. _____________________________
సంపాదకులు 1.పాపినేని శివ శంకర్ 2. బండ్ల మాధవరావు, 3.ఎమ్వీ రామిరెడ్డి – ప్రచురణ ” మువ్వ చిన బాఅపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణలు -7 – పెదపరిమి – 522 236 – గుంటూరు జిల్లా. మే 2004 ప్రథమ ముద్రణ. వెల రు. 75/-
_____________________________
2.8.2013 సాయంత్రం 6.45

కపిల రాంకుమార్ || ''యత్రనార్యంతి ....''||

కపిల రాంకుమార్ || ''యత్రనార్యంతి ....''||

కార్యేషు దాసి, కరణేషు మంత్రి ,
భోజ్యేషు మాతా, శయనేషు రంభా
షట్కర్మలంటూ ఘోరాతిఘోరంగా
శ్లోకాలలో నిను బంధించి
లోకాల శోకాల పాపాలు - కడిగి
శాపాలు తొలగించు దీపాలు ఆరేను......

చెదలు పట్టిన ఎదలు తుడిచి మేలుకొనవే చెల్లెలా!
వెతల బతుకున వెలుగునింప సాగిరార తమ్ముడా!

ఆణిగి మణిగివుండవలసిన ఆడదానికి స్వేచ్ఛలేదని
మనువుచెప్పిన ధర్మమంటూ, పు-రుషులెవరో ' గీత ' గీస్తే!

మొదటిగురువు తల్లియంటూ, మొదలుపెట్టిన చదువులిపుడు
మొదలకంటా కూల్చివేసే, యెదలు నరికే కత్తులైనవి!

విలువలేమొ తరిగిపోయె, వలువలేమొ చిరిగిపోయె
కళ్ళుతెరచి కుళ్ళుతుడిచె, ముళ్ళబాట బాగుచేయగ !

ముక్కుపచ్చలారనట్టి, మూడుయేండ్ల పాపని
ముద్దులాడె నెపముపెట్టి, తండ్రివయసున్నవాడు
ఎర్రముద్దగ చేసినాడు, సిగ్గుబిళ్ళదోచినాడు
యేమి జరిగెనొ చెప్పలేక, వెక్కి వెక్కి గ్రుక్కపట్టె!

వావి వరుసలు కానలేని, కామరాజుల కళ్ళకు
తల్లి చెల్లి చిన్న పిల్ల ,చప్పరించే గుళికలా?
పిచ్చిదైనా బిచ్చగత్తెను మందుపిచ్చిలో తల్లిచేసే
అచ్చుబోసిన ఎద్దుమించిన మదపు వెధవలకంతమెపుడో?

పదవికోసం పెదవి తడిపి పరపతంటూ తప్పుచేసి
సతుల,సుతల తార్పజూసే, మురికి వెధవలకంతమెపుడో?

అందుకొమ్మని చేతులిస్తే,బొందపెట్టె బుద్ధితోడ
పట్నవాసపు కట్న సెగలకు, పల్లెటూళ్ళు కాలుతున్నాయ్!

' అగ్ని ' సాక్షిగ జరుగుపెళ్ళి, రుద్ర భూమికి దారితీయ
ఆడపిల్లల పెండ్లియంటె, పీడకలగ మారుతుండె!

లింగ బేధం తెలుసుకోని, ఆడపిల్లల చంపివేస్తే
ఆదిశక్తికి మూలమైన - నీకు నాకు ప్రాణమిచ్చె
' అమ్మ ' తనము లేని లోకమెందుకు?
వెర్రితలల జ్ఞానమెందుకు?
రొంపినుండి బయటకొచ్చె, సమానత్వపు పురిటికోసం

పూర్వకాలపు శిఖరపీఠం - మహిళకిచ్చే రోజుకోసం

ఒకరినొకరు తెలుసుకుంటూ, ఎదలు కలిపి మసలుకుంటూ
సంఘమందున కుళ్ళిపోయిన, మూఢమతులనేరివేయగ
చెదలు పట్టిన ఎదలు తుడిచి మేలుకొనవే చెల్లెలా!
వెతల బతుకున వెలుగునింప సాగిరార తమ్ముడా!
_______________________
(నగారా - ఖండ కావ్యం నుండి ...2004)
_______________________