ఆయకట్టు కంటనీరు
కపిల రాంకుమార్||ఆయకట్టు కంటనీరు||వన్నెచిన్నెల పంటకాలువ పట్టుచీర కట్టునెపుడొ
విలువలెరిగి రైతులందరు నీటిపొదుపు చేసినపుడె!
జొన్నన్నమేగాని సన్నన్నమెరుగని పరిగకంకెలపాటి వరిపండనిచేలు
మెరకపొలాలన్న మొరటుచూపేల అరక పట్టిన వాడికే అరమరికలేదన్న!
పాతాళనూతుల్లో కొల్లేటి చాంతాళ్ళు శనగలెండుటె ఆనాటి చేవ్రాళ్ళు
కృష్ణమ్మ కరుణతో కాలువైపారేను చేదుకోబోతేను చేతికే అందేను!
ఉద్యమాల ఫలమియిద్ది లేతసూర్యుని కరములద్ది
నీలిరంగు అలలమీద సాగివచ్చె కృష్ణవేణి!
ఆటంకమూలేక ఆయకట్టుకంతా చివరిభూమివరకు నీరందునంటూ
ఆశతో యిన్నాళ్ళు కళ్ళుకాయలేకాచాయి అవకతవకల నీళ్ళు ఆశలే కూల్చాయి!
చిరిగిన చొక్కాయి నీరుకావి పంచె – పైమీదతుండు నెరసినాజుట్టు
బక్కచిక్కినరైతు డొక్కలెండుతూంటె – ఒక్కచుక్కకూడనీరందదండి!
కారులో వచ్చేటి కారుకూతాకదిరి నీటితో విందులు పోటీలు పడతారు!
బదిలీలు, స్థానాలు పదిలంగవుండాలి మజిలీలపి వారు యెదుగుతూండాలి!
నీటివేగపు కొలతలంటూ కాగితాల్లో చిక్కకుండా
మరలు తిప్పే గేటులోనే మర్మమంతా నింపుతారు!
మందురుచికె ఇంజినీర్లకు ముందుచూపు మందగించె
నీటినిలవచేయలేక మీనమేషపు లెక్కలెన్నో!
గొడవచేస్తే నీరుయిచ్చి – బుడగలెన్నోలెక్కకట్టి
మడతపేచీ పెట్టుతారు తడిమి జేబులు నింపుతారు
నమూనాల లోపాలు సృష్టికర్తల తప్పు – నిర్మాణపు లోపాలు కార్యకర్తల తప్పు
అజమాయిషీలేకుంట మనందరి తప్పు – ఇందరి తప్పులకు రైతులకు ముప్పు!
ఈ సాలు కాలువలు మోసాలు చేశాయి
చుక్కకూడ జారక వెక్కిరించె రైతును
దిక్కుతోచక అప్పుతీరక
గప్ చుప్ గా నొక్కిన గొంతులైరి
ఆలుపిల్లల వేలువిడిచి
గోడకెక్కిన దండలైరి
దీనికెవరు జాబు చెప్పరు
ఆదుకోవగ రూక రాల్చరు!
ఈ రీతి వాదాలు యేపాటి లాభాలు
ఏ జాతి బేధాలు పొడసూపకూండాను
యికనైన మనకు కలగాలి కనువిప్పు
ఉమ్మడి బాధ్యతలు మూపున వేసుకుందాం!
_____________________________________
2012-13 ఖరిఫ్- రబీలో నాగార్జునసాగర్ కాలువలలో సాగునీరందక
దిగాలుపడ్డ రైతు దీన స్థితికి స్పందన .
_____________________________________
30.7.2013
No comments:
Post a Comment