‘వెన్నెల్లో
సింధు నదిలో పడవపై మలయాళ భామతో అందమైన తెలుగు పాట పాడుకోవాలి’ (సుందర
తెలింగిళ్ పాట్టు ఇసెత్తు) అని స్వప్నించిన కవి సుబ్రహ్మణ్య భారతి. ఈ పాటలో
ఆయన భారతదేశంలోని అన్ని జాతులవారూ కలిసి సాగాలని భావించారు. గురజాడ,
శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి కవితాప్రవాహాల త్రివేణీ సంగమం ‘భారతి’ గేయం.
‘ఊడి వలయాడు పాప...’ లాంటి చిన్నపిల్లల గీతాలు రాసినా, ‘కాలిపోయినా
బాధపడ్డా పదేపదే వందేమాతరం పాడాలి’ అని నినదించినా, ‘కవిత రాసేవాడు కవి
కాడు. కవిత్వాన్ని జీవితంగా జీవితాన్ని కవిత్వంగా చేసుకున్నవాడే కవి’ అని
పలికినా... సుబ్రహ్మణ్య భారతి పదాలు పదాలు కావు... అక్షర తూణీరాలు.
పార్థసారథి కోవెల అది.
చెన్నైలోని ట్రిప్లికేన్‌లో ఉంది.
అతనో యోగిలా ఉన్నాడు. రోజూలాగానే ఆ ఉదయం కూడా గుడిలోకి అడుగుపెట్టాడు.
ఎప్పటిలాగానే తాను తెచ్చిన అరటిపళ్లను అక్కడున్న ఏనుగుకి పెట్టాడు. అది
రోజూ జరిగేదే. కాని ఆ రోజెందుకో ఆ మాతంగం కదనం తొక్కింది. ఒక్కసారిగా ఆ
గజరాజు తన బలమైన కాళ్లతో ఆ కవియోగిని తొక్కేసింది. రక్తపు మడుగులో
మూర్ఛిల్లిన ఆ వ్యక్తి... భరతమాతకు కవితాహారతి పట్టిన తమిళ జాతీయ కవి
సుబ్రహ్మణ్య భారతి.
తమది ప్రత్యేక ద్రవిడ జాతి అన్న ఆత్మవిశ్వాసం
తమిళులది. భారతీయత కన్న తమిళ జాతీయతను మిన్నగా ప్రేమించే తత్త్వం వారిది.
అలాంటి తత్త్వం నుంచి బయటకు వచ్చిన తొలి తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి. ఓ
పక్క తమిళ సంస్కృతీ సాహిత్యాల ఉనికిని నినదిస్తూనే మరోపక్క భారతీయ ఏకాత్మను
చాటిన కవి.
అందుకే ‘కాశీ పండితుల స్వరాన్ని కంచిలో వినిపించే
పరికరాన్ని’ అని అనగలిగారు. తమిళ భాషని తల్లీ అని సంబోధించి అక్కున చేరిన
అదే కవి, ‘ప్రియురాలు తమిళంలో మాట్లాడితే అది జీవనదుల ఊట’ అని పలికిన అదే
కవి - ‘హిమాలయాలు మనవి, గంగానది మనది, ఇంకెందుకు ఆత్మన్యూనత మనకి’ అని
ఎలుగెత్తి చాటగలిగారు.
పువ్వు పుట్టగానే...
సుబ్రహ్మణ్య భారతి అసలు పేరు సుబ్బియ.
1882 డిసెంబర్ 11న తమిళనాడులోని తూతుకూడి జిల్లా ఎట్టియపురంలో జన్మించారు.
మూడేళ్ల ప్రాయం నుండే సంగీతం నేర్చుకునే భాగ్యం కలిగింది. కానీ అయిదేళ్లకే
తల్లి ఎలక్కుమి అమ్మాళ్ మరణించింది. దాంతో సుబ్బియ జీవితంలో ఏదో తెలీని
శూన్యత. అప్పుడు సంగీతమే తల్లయ్యింది.
1893లో ఎట్టియపురం రాజావారు
సంగీత పాటవ పోటీలు నిర్వహించారు. గండపెండేరాలు తొడిగించుకున్న ఉద్ధండ గాన
గంధర్వులతో 11 ఏళ్ల సుబ్బియ పోటీపడ్డాడు. పిట్ట కొంచెమైనా కూత
ఘనమనిపించాడు. రాజావారు ‘భారతీయార్’ అన్న బిరుదునిచ్చారు. అలా సుబ్బియ
కాస్తా సుబ్రహ్మణ్య భారతి అయ్యారు.
అయితే తండ్రి చిన్నస్వామి
సుబ్రహ్మణ్య అయ్యర్‌కి మాత్రం తన కొడుకు ఇంజినీర్ కావాలనిపించింది. కాని
సుబ్రహ్మణ్యానికి మాత్రం సంగీతమూ కవిత్వమే సర్వస్వాలయ్యాయి. ఒక్కోసారి
పిచ్చిపట్టినవాడిలా తనలో తాను పాడుకుంటూ అలౌకికానుభూతి పొందేవాడు. తండ్రికి
భయం వేసింది. పెళ్లే దీనికి మందు అనుకున్నాడు. అలా మరదలి వరసైన ఏడేళ్ల
చెల్లమ్మాళ్‌తో 16 ఏళ్ల సుబ్రహ్మణ్యానికి వివాహమైంది.
ఇల్లు,
ఇల్లాలు, పిల్లలు, ఇంజినీరింగ్... ఇవన్నీ సామాన్యులకు కొలమానాలు. పుట్టింది
తమకోసం కాదు అన్న సత్యం తెలిసినవారికి ఇవన్నీ నీటిబుడగలు. అందుకే
సుబ్రహ్మణ్య భారతి సంసారంలో ఇమడలేకపోయారు. మేడిపండు లాంటి ప్రాపంచిక సుఖం
ఆయనను ఆకర్షించలేకపోయింది. దాంతో జీవిత తత్త్వాన్వేషణతో లోక సంచారి
అయ్యారాయన.
వారణాసిలో...
అలా 17 ఏళ్ల వయసులో భారతి ఇల్లు
విడిచి కాశీకి పయనమయ్యారు. జాతీయవాదం, దేశభక్తి, హైందవ తత్త్వం లాంటి
భావాలపై భారతికి మక్కువ కలిగింది ఇక్కడే. సంస్కృతం, హిందీ, ఆంగ్ల భాషలపై
పట్టు రావడానికి కారణమైంది ఈ ప్రవాసమే. దీనికి తోడు నాలుగేళ్ల పాటు ఈ ఊరూ ఆ
ఊరూ అంటూ అనేక ప్రాంతాలు తిరిగారు. దాంతో ఆనాటి వాస్తవిక విషాదమయ భారతదేశం
ఎలా ఉందో తెలిసొచ్చింది.
కులం, లింగం, విద్య, డబ్బు పేరిట ఒకరు
మరొకరిని హీనంగా చూసే రుగ్మతల్ని చూసి ఆయన కళ్లు చెమ్మగిల్లాయి. ఫలితంగా
ఆయన ఆలోచనాఖడ్గధార పదునెక్కింది. వివేచనతో పాటు వేషమూ మారింది. తలపాగా,
దాని నుంచి మెడ చుట్టూ సాగే వస్త్రం, మెలి తిరిగిన మీసం, పెరిగిన గెడ్డం,
అమానవీయతను దహించే నిప్పు కణికల్లాంటి కళ్లు - వెరసి ఒక సాంఘిక వీరుడిలా
మారారు.
దార్శనికతకు నేపథ్యం
1905లో బెంగాల్ విభజనతో దేశం
అట్టుడికిపోతున్న రోజులవి. భారత రాజకీయాల్లో అతివాదం స్పష్టంగా
రూపుదిద్దుకుంటున్న కాలమది. స్వాతంత్య్రోద్యమ పోరాటంలో తన పాత్ర ఏమిటో
తెలిసొచ్చింది సుబ్రహ్మణ్య భారతికి. 1905లో బెనారస్‌లోనూ, 1907లో
సూరత్‌లోనూ జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొన్నారు.
ముఖ్యంగా సూరత్ సదస్సులో మితవాద, అతివాద నేతల మధ్య చీలిక రావడం; తిలక్,
అరవింద్ ఘోష్ లాంటి అతివాదుల వాదనలు... భారతిపై తీవ్ర ప్రభావం చూపాయి. అసలు
ఫైర్‌బ్రాండ్‌లా ఆయన మారడానికి కారణమిదే!
ఈ స్ఫూర్తితోనే జాతిని
ఉత్తేజితం చేసే కవితలు రాశారు. ‘భారతమాతను తల్చుకుంటేనే నీకు శత్రువులంటే
భయం పోతుంది’ అని నినదించగలిగారు. స్వదేశీ మిత్రన్, ఇండియా లాంటి పత్రికలకు
సంపాదకుడిగా వ్యవహరించి, జాతీయోద్యమ రచనలనెన్నింటినో వెలువరించారు.
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పత్రికల్లో రాజకీయ కార్టూన్లు,
క్యారికేచర్లను ప్రచురింపజేసింది ఈయనే!
ఆ కాలంలోనే స్వామి
వివేకానంద శిష్యురాలు సోదరి నివేదితను కలిసే అవకాశం వచ్చింది భారతికి.
ఆమెతో సంభాషించాక, స్త్రీజాతి ఎంత న్యూనంగా చూడబడుతుందో, మగువ తెగువ చూపి
ఎలా అడుగు ముందుకు వేయాలో అర్థమైంది. అందుకే స్త్రీ చైతన్యం కోసమే వెలసిన
తొలి తమిళ పత్రిక ‘చక్రవర్తిని’కి సంపాదక బాధ్యతల్ని చేపట్టారాయన.
మరోవైపు బాల భారత సంఘం స్థాపించి, యువతను ఆంగ్లేయులకు వ్యతిరేకంగా
పోరాడేలా చేశారు. 1908లో స్వాతంత్య్రాన్ని కాంక్షిస్తూ భారీ బహిరంగ సభ
నిర్వహించారు. ఇవన్నీ సహజంగానే బ్రిటిష్‌వారికి కంటగింపయ్యాయి. భారతిని
నిర్బంధించే పరిస్థితి వచ్చింది. దరిమిలా ఫ్రెంచి పాలనలో ఉన్న
పాండిచ్చేరికి వెళ్లిపోయారు.
తనకోసం కాదు...
పాండిచ్చేరిలో
దాదాపు దశాబ్ద కాలం ఉన్నారు. పదేళ్లూ దుర్భర జీవితమే! అయితేనేం... తన
సామాజిక సాహిత్య సేవ మాత్రం మానలేదు. విజయ, బాలభారత్, సూర్యోదయం, ఆర్య,
కర్మయోగి లాంటి పత్రికల్ని నడిపారు. ఫ్రెంచి నేర్చుకున్నారు. క్రీస్తు,
అల్లాపై సైతం కవిత చెప్పారు.
అత్యద్భుత కవిత్వ విలువలు ఉన్న
సాహిత్యమాయనిది. ఆయనది కవితాత్మకంగా సాగే పూతుక్కవితై అనే వచన గేయ శైలి.
తమిళులు గ్రాంథికాన్ని గుండెలకు హత్తుకుంటారు. కాని భారతిది అచ్చమైన వాడుక
భాష. తొలక్కాప్పియం లాంటి తమిళ ప్రాచీన వ్యాకరణ గ్రంథాల్ని సూత్రాల్ని
తమిళులు నెత్తిన పెట్టుకుంటారు. కాని ఈయన మాత్రం ఛందస్సుల సర్పపరిష్వంగం
వదిలి వ్యాకరణాల సంకెళ్లు తెంచుకున్నారు. కన్నన్ పాట్టు, కూయిల్ పాట్టు,
పాంచాలీ శపథం, పాప్ప పాట్టు, పూదియ ఆతి చూడి లాంటి అనేక రచనలు చేశారు.
తీవ్రమైన భావావేశంతో జలపాతంలా సాగే ఆయన కవితలు చదివితే హృదయనరం
జివ్వుమంటుంది. ‘నిప్పులో చెయ్యి పెడితే నిన్ను ముట్టుకున్నట్లే ఉందేమిటి
కృష్ణా’ అని భక్తిలోని గొప్పతనాన్ని చెబుతారు అమాయకంగా. ఆదిపరాశక్తిని
అపారంగా పూజించి ‘శక్తి దాసన్’గా పేరొందారాయన.
అందుకే ఆయన ఏ
ఉత్తరం రాసినా ‘ఓం శక్తి’ అని ప్రారంభించి, ‘మీరు శాశ్వతమవుగాక’ అని
ముగించేవారు. ఆదిపరాశక్తిని స్తుతిస్తూ ‘నా శవం కాలుతున్నా నిన్నే తలచాలి
నా హృదయం’ అనే భక్త్యావేశం ఆయనది. అదే ఆవేశం ఎంతాయం తామం, జయభారత్ లాంటి
దేశభక్తి గీతాల్లోనూ కనిపిస్తుంది.
బ్రాహ్మణ కులంలో పుట్టినా
మొదట్నుంచీ కులవివక్షను నిరసించారాయన. హరిజనుడికి స్వయంగా ఉపనయనం చేశారు.
ఒక దశలో తన కూతురు తంగమ్మను హరిజనుడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు.
బంధువులు పడనివ్వలేదు. నిమ్నకులాల వారిని ఇంటికి పిలిచి యాగాలు చేయించారు.
చివరకు మిగిలేది
సంపాదనపై ధ్యాస లేక, సంఘ రుగ్మతలపైనే కన్నెర్ర చేస్తూ సాగిన సుబ్రహ్మణ్య
భారతికి పాండిచ్చేరిలో గడవడం రాను రాను కష్టమైపోయింది. దాంతో 1918
నవంబర్‌లో చెన్నైకి తిరిగి రాక తప్పని పరిస్థితి. కడలూర్ దగ్గర బ్రిటిష్
ఇండియాలోకి ప్రవేశిస్తున్నప్పుడు పోలీసులు అరెస్టు చేశారు. మూడు వారాల
నిర్బంధంతో ఆరోగ్యం క్షీణించింది. బంధువుల బలవంతం మీద పోలీసుల నిర్బంధం
నుంచి బయటకు రాగలిగారు.
దాంతో చెన్నైలోని ట్రిప్లికేన్‌కి ఆయన
మకాం మారింది. అప్పటికే ఒకానొక యోగస్థితిలోకి వెళ్లిపోయారు. కవిత్వం రాయడం,
ఉపన్యాసాలివ్వడం, పార్థసారథి కోవెలకు వెళ్లడం, ఏనుగుతో గడపడం - ఇవీ ఆయన
నిత్యకృత్యాలు. ఈరోడ్‌లోని కరుంగల్పాయం లైబ్రెరీలో ‘మ్యాన్ ఈజ్ ఇమ్మోర్టల్’
అన్న అంశంపై ఇచ్చినదే ఆయన చిట్టచివరి ఉపన్యాసం. రోజూలాగానే ఆ రోజూ కోవెలకు
వెళ్లారు.
కానీ విధి విచిత్రమైంది. ఏనుగు దాడిలో గాయపడ్డ
సుబ్రహ్మణ్య భారతి కొంతకాలం మరణంతో పోరాడారు. మంచంపై ఉండే ‘భారత సముదాయం
వాళ్లవే’ (భరతమాత వర్ధిల్లు గాక) అన్న గీతం రాశారు. రాసిన మూడు వారాలకు
1921 సెప్టెంబర్ 11న 39 ఏళ్ల వయసులో కన్నుమూశారు.
‘పుట్టావా అయితే
బతుకును సార్థకం చేసుకో’ అంటారు తిరువళ్లువర్. ఆ తమిళ తాత్త్వికుడి మాటను
నిజం చేసిన తమిళ కవియోగి సుబ్రహ్మణ్య భారతి. తనకోసం, తన కుటుంబం కోసం
క్షణమంటే క్షణం కూడా గడపని, గడపాలని తెలీని కవి ఆయన. కాని ఆయన
అంత్యక్రియలకు హాజరైంది కేవలం 14 మంది మాత్రమే!
ఈ సమాజం కూడా ఆ ఏనుగు లాంటిదే!
సుబ్రహ్మణ్య భారతి జీవితచరిత్ర ఆధారంగా 2000 సంవత్సరంలో తమిళంలో ‘భారతి’
సినిమా వచ్చింది. షాయాజీ షిండే ప్రధాన పాత్ర పోషించగా, భారతీయార్ భార్యగా
దేవయాని నటించారు. జ్ఞాన రాజశేఖరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జాతీయ
అవార్డును సైతం గెలుచుకుంది. ఇళయరాజా సంగీతం అందించారు.
ఆకెళ్ల రాఘవేంద్ర