దీపావళి
పండుగ బులబాటం
లంగావోణి బుజ్జమ్మ
తమ్ముడితో టపాసుల
కేరింతలెడుతుంటే
ఆ రెండంతస్తుల మేడలో
ముందస్తు వెలుగులు
జిగేలుమంటుంటే
దానికానుకుని ఉన్న
గువ్వంత గుడెసలో
గోపి కళ్ళు
గుండె అలసిన
వెక్కిళ్ళ ఏడుపుగా
ఉబుకుతున్నాయ్
తనెపుడు టపాసులెపుడు కాల్చాలా అని!
ంంంంంం
గుడికెళ్ళిన గురవమ్మ
కన్నేదో అదిరిందని కలవరపడి
కీడేదో తిష్టవేసుకుందని
బిరాన గుడెస దారి పట్టింది
ముక్కు చీదుకుంటూ
ంంంంంం
పొలంలో పుల్లయ్య
చేతిపార జారి
జానెడు ఎత్తులో
పాదానికి ముద్దెట్టుకుంటే
మట్టిరంగు బురదనీరు
ఎర్రతామరలా మెరుస్తున్నప్పుడు
అతడిని దుగంపై మేను వాల్చమంది
స్పృహతప్పిన శ్రమపై
జాలిపడింది కామోసు
చినుకులు పెరిగి ముఖాన్ని తడిపింది
తేరుకున్నదే తడవుగా
గోధూళివేళైందని
అరకెడ్లని తోలుకెళ్ళె గుడిసె వైపు
ంంంం
గోపి గోస ఆగలేదు
సముదాయించగ గురువమ్మకు
తోచడంలేదు
గుడెసచేరి నివ్వెరపోవడం
పుల్లయ్య వంతైతే
కాలిగాయానికి పసుపులేపనమద్ది
గోపిగాడిని చంకనెత్తుకుని
మేడలో కురుస్తున్న వెలుగుల్ని చూపెడుతోంది
సంబరంలో నోరెళ్ళబెట్టిన గోపి
కళ్ళప్పగిస్తూ తల తుడుచుకుంటూ పుల్లయ్య
బుగ్గమీదవేలేసుకున్న గురవమ్మ
తమ బతుకుకు దిగాలొందక
మేడవెలుగులు పంచుకొంటూ
పండుగ సంబడాలందుకోవడం
ఎంత విచిత్రంగా, సర్దుబాటు తత్వంగా
ఎంత సంయమనం..
తమకు లేకపోతేనేం
పొరుగువారి ఆనందాన్నైనా
ఆస్వాదించడం...
24.10.2022.దీపావళి శుభాకాంక్షలు...
No comments:
Post a Comment