Tuesday, October 1, 2024

వేళ్ళ రహస్యం.. సమీక్ష

 మీకూ నాకూ మధ్య...

పుట తెరిచి...

నా వేళ్ళు మీటిన రహస్యాల్లోకి ప్రవేశిస్తే... మీకూ నాకూ మధ్య ప్రవహించునది నా కవిత్వమే... ఇంక మన మధ్య వేరే భాష్యాలు ఎందుకు?

భరోసాతో...

మీరు నా అక్షరావరణంలోకి అడుగేయండి... నా అంతరాత్మతో మనసు విప్పి మాట్లాడుకోండి...

మోహాల్లేవ్.. మొహమాటాల్లేవ్

దడుల్లేవు...దాపరికాల్లేవు మౌనాన్ని బద్దలు కొట్టి చెప్పుకున్నా... అంతా బహిరంగమే..ఖుల్లం ఖుల్లా...

ఇక మనది

అనుభవ భూమిలో ఆత్మీయ సమావేశం...

- వఝల శివకుమార్


2.పేగుతీపి కవిత మెలిపెట్టిన తీరు అమ్మను ఆవిష్కరించడంలో శివకుమార్ తన సత్తా చాటారు. తొలి చూపులోనే ప్రేమ కలిగింది. సందేహం లేదు. చదవండి మీరు.

"కలబడినప్పుడు కన్న పేగులు మెలిపడ్డట్టు

విలవిలాడే వింత అనుభవం

బతికినంత కాలం తన బతుకును

వడ్డించిన విస్తరిలా పరిచిన ఆత్మ గల్ల

చేతి స్పర్శ

తోడు దూరమైనా కన్నబిడ్డ తోడు వదలలేని

బలహీన జీవిక "  (బలమైన మమకారం)

ఆర్ద్రత చెందక చస్తామా....కంట తడి బుగ్గలు కనిపెట్టేస్తాయి.


3. వేళ్ళరహస్యం పేర సుమారు డెబ్భై పైచిలుకు కవితలు వదలకుండా చదివించాయి. రహస్యపు దారి చాల పొడుగు. ఎలాగో కష్టపడి కొన్ని మాత్రమే చదివాను. కొన్ని అలా అలా  శీర్షికలు తడిమానని నిజమే చెప్పాలి కాబట్టి. నిజం యిదే.బాగా హత్తుకుని కదిపి కుదిపినవి ప్రవేశపెడతా.


4 .రెండోకవితలో  లోయతో మాట్లాడుకోవచ్చట, తదుపరి మట్టి ప్రేమల ఆలయంలోకి తీసుకెళ్ళాడు శివకుమార్.

మనసు మగ్గమవ్వగానే, చీకటికంచె అడ్డు వచ్చింది. ఎందుకంటే ఇల్లొక యుద్ధ శిబరం కాబట్టి. అది చెట్లకు పుట్టిల్లు కూడ. అంతేకాదు పుస్తకాలు భాండాగారం నవ్వులనదిని పరిచయం చేస్తుందంటాడు.

డ్యూటీకాల్ మిషలోనే మనకు వేళ్ళ రహస్యం కనబడుతుంది.ఆరోప్రాణమైన అక్షరాన్ని దిద్ది చరాచర విశ్వానికి నిరంతర

సందేశమిస్తుందని, రాగాలను శృతి చేసుకునే ప్రాణం ప్రణవమౌతుందని బట్టబయలు చేసాడు కవి. పక్కనే వున్న నైఋతిగదిలో అక్షరం ఒక నీడై గోడచాటుకు చేర్చబడింది. ఆ పూనికతో గదంతా అక్షరాలే. రాగాలై మాండోలిన్ పై వినిపిస్తున్నాయి. ఇక తొండాటాడుతూనే ఉంటుంది ఆశ. ఆశ కదా ఊగిసలాట దానికి సహజం. ఒకానొక చేటుకాలం పూర్తికాగానే ఎదురుగా కనపడే మల్లమ్మంటే చెప్పలేని మమకారం కురిపించారు కవి. ఏవేవో సంభాషణలు సంవాదాలు వినబడుతున్నాయి అక్కడేవున్ ఓట్ల మెట్లముందుర. ఎన్నో జెండాలు.ఎన్నో గుర్తులు. విజేతలు...పరాజితులు దర్శనమిస్తారు. ఒక పక్క ప్రమాదాల చావునగారా ఇంకో పక్క ప్రమోదాల ఆంబారీ సవారీ. అబ్బ మనోహంసకెన్ని ఊహలో కదా, మొన్నటి దొంగల భాగోతం

వానాకాలపు మేఘాల స్వైరవిహారం తిలకించే రెప్పలకు రెక్కలిస్తారు కవి.

ఎందుకంటే మనిషిని బతికించుకోవాలికదా,

పాలక వర్గాల ధ్వంసరచననుండి, బడ్జెట్ పగటికలలనుండి అరచేతిలో వైకుంఠంలా పగలే వెన్నెలనే మోసంనుండి, బతికించుకోవాలి. 

ఇలా రాసుకుంటూ పోతే ఇదేదో కొల్లేటి చాంతాడయ్యే ప్రమాదంలా వుంది. అందుకే ముక్తాయింపునిస్తాను.


ఇంక లెక్కతేలాలి, ఎందుకంటే

నేనెక్కడైనా దాటిన చాళ్ళల్ల

తిరగేసిన కవితల్ల

ఈ పేజీలమధ్య

(పేచీలేని) పంక్తుల నడుమంటూ

నడకలు, నడకల పరమార్థాలు

లెక్కతేలాలి

నాలో అవిటితనం పాలు

పాలకు పాలు, నీళ్ళకు నీళ్ళులా 

సరిచూసుకోవాలి...

ఇది కవికి అత్యవసరం కదా.ఆత్మ విమర్శకు నిలబడాలి. బేరీజు వేసుకోవాలి. ఇది శివకుమార్ నిబద్ధత.

అప్పుడే ఒక స్థానాన్ని సుసంపన్నం. చేసుకోవచ్చు.. ఆ రహదారి ఆయనకు దొరికింది. పయనిస్తున్నాడు. గమ్యం చేరుతాడు.


ఏవో నాలుగు మాటలు రాసే అవకాశం వేళ్ళరహస్యం లో ఉందని భావిస్తూ.


No comments: