ఒకప్పుడు ఊరెళ్ళాలంటే ఉర్కుంటా పోయేటోళ్ళం,
ఇప్పుడేమో ఊసురోమనే ఊర్ని చూస్తంటే కళ్ళెంట నీరొస్తాంది.
ఊరందరికి అవసరాలకు ఆపత్తులకు ఆధారమైన మా తాతయ్య గారిల్లు
సాయతకి సిద్ధంగుండేది
ఊరి మధ్యలో మర్రిచెట్టు
దాని కైవారం చుట్టూ రాతి అరుగు పంచాయతీలకు నెలవు
వానాకాలం చెర్ల వరద వాగును ముద్దాడుతుంటే
వాగులోని చేపలు చెర్లోకి ఎదురొస్తవుంటే
ఒడిసిపట్టి మా మోటబాయిలో ఏసినరోజులమరవలేదు
వాగొడ్డు పరికపళ్ళు ఏరుకున్నపుడు ముళ్ళుగీరుకున్నది ఎరుకే
దుబ్బపాడు తాళ్ళలో తిరుగుతూ
తీపికల్లు తాగి,
తాటిముంజెలు కొట్టించుకుని తిన్నగుర్తులు ఇంకా యాదున్నాయి
ఆరుదూలాలు నాలుగు దిక్కులా వసారా
పోస్ట్ డబ్బాతో మా యిల్లు
జనాలతో కళకళలాడేది
ఇప్పుడది కూలిపోయి
నాలుగు కొబ్బరి చెట్లకు
మూడు మామిడి చెట్లకు
రెండు పనస చెట్లకు ఊసులు చెప్పలేక ఉసూరంటూ మట్టిని ముద్దాడుతోంది
శారద రాత్రుళ్ళు చిడుతల రామాయణం వినిపించే మట్టికట్డడం రాములోరి దేవళం
అవన్నీ శిథిలావస్థకు చేరి
పాత రోజుల తలచుకుని వెక్కి వెక్కి ఏడ్చే ఓపిక లేనందున
ఊరిని చూడబుద్దయితలేదు
ఉన్న చెలక వదలలేను
చెట్లకోసం వూర్ల వుండలేను
ఊరొదిలి ముప్పై ఏండ్లాయి పలకరించే సోపతులు తక్కువే.
చుట్టపు చూపుగా వెళ్ళి రావడంతప్ప
అమ్మని ఆలింగనం చేయలేకపోతున్నాను
ఆ మట్టిలో కలసిపోయిందని మనేది వల్ల
తెరలుతెరలుగా దుఃఖం ఆపుకోలేక
ఊరువెళ్ళలేకపోతున్నా
ఈ కష్టమెవరికీ వద్దు..రావద్దు.
ఊరి ఊసెత్తితే
ఎన్ని పాత తీపి గుర్తులో
సౌకర్యాలు లేని రోజుల్లో గడిపిన ఎన్ని దుఃఖపు మబ్బు తెరలో
ఒక్కొక్కటిగా సన్నని చిరుజల్లులవుతున్నాయ్
ఊరుమ్మడి మంచినీళ్ళ బావి ఒకటి గంగాజలంలా తీయగా వుండేవి...
ఆ రుచి అరవైఏళ్ళైనా మధురజలం రుచి చెడలేదంటే అతిశయోక్తి కాదు.
మట్టిరోడ్లు. ఎడ్లబండి పయనాలు...
అటు తూర్పు దిశగా....పోతే కిష్టారం పోయే అడవి దారిన
పన్నెండు మైళ్ళపోతే కిష్టారం చేరితేనే బస్సెక్కి రాజమండ్రి కి తారురోడ్డు
ఇటు పదహారు మైళ్ళు పోతే
వంగాముత్యాల బంజర చేరిఖమ్మం హైదరాబాద్ వెళ్ళేదారి
మరోవెంపు ఇరవై మైళ్ళు అడవిబాటలో బండిమీద వెడితే... కొత్తగూడెం
సరుకులు కొనుగోలుకు, పంట అమ్మకాలకు
ఊరి అవసరాలకు ఇంకోటి జిల్లా పరిషత్ వాళ్ళు తవ్వించిన వాడకం నీటి బావి..
మా వూరికి రెండు మైళ్ళ దూరంలో అన్నపురెడ్డిపల్లి...అక్కడ కాకతీయుల కాలంనాటి బాలాజి వెంకన్న గుడి
***
డెబ్బై య్యో దశకంలో.... కచ్చా రోడ్లు
తారు నింపుకున్నాయి
కిరోసిన్ దీపస్తంభాలు కరెంట్ దీపాలయ్యాయి.
కృష్ణ జిల్లా తిరువూరు నుండి మొదట్లో ప్రయివేటు బస్సులు తిరిగాయ్
క్రమేపి ఆర్.టి.సి. రోజుకు నాలుగు ట్రిప్పులతో నైట్ హాల్ట్ అన్నపురెడ్డిపల్లి..
***
No comments:
Post a Comment