Tuesday, October 1, 2024

నాలుగు దారుల కూడలి

 ఓ నాలుగు దారుల కూడలి

ఏ దారెటుపోతుందో 

తెలిపే దిక్సూచి విరిచేసారెవరో

రాజకీయాలు నాట్యమాడే రోజులు కదా

తూర్పు ముఖంగా వెడదామా

సూరీడెదురొచ్చి పంబరేపుతాడు

పడమర దారి పడితే

చీకటి పాలవటమేతప్ప గమ్యం చేరం

ఉత్తరం నడక సాగిద్దామా అంటే

మనకి సిఫార్సు చేసేవారు లేరు

హిమాలయాల మంచు నిలువరిస్తుంది

దక్షిణ వెంపు సాగుదామంటే

డబ్బు దస్కం లేదాయె.

కన్యాకుమారి కాడ మూడు సముద్రాల సంగమంలో నిమజ్జనమే

ఏది దారి ..

రహదారి చీటీ యిచ్చేదెవరు

నిజాలకి ఇజాలకీ చోటులేని ఇలాకాలో

కక్కుర్తిపడే జనాలకు భోజనాలు భజనలుంటే చాలు

సామాన్య ప్రజలు చస్తేనేం

బతికితే నేం

ఐదేళ్ళ ఓట్ల జాతరలో చుక్క, ముక్క లెక్క కిక్కురుమనకుండా పుచ్చుకుని

అచ్చేస్తేచాలు

ఏ దిక్సూచి ఏమి చెప్పినా

పట్టించుకునేదెవరు

అమ్ముడుపోయే జాతంటే

నేతలకు నేతిమిఠాయేకదా.

నిజాయితీ నిలువెత్తు లోతులో

సమాధైతే అదే. పదివేలు

మళ్ళీ ఎన్నికల దాకా

ఎన్నో రంగులకలలు.


No comments: