యుద్ధం నివారించలేమా!
దొంగలు పడితే దౌర్జన్యం చేసైనా
ఇల్లు దోస్తారు
ఎదురు తిరిగిన యజమానిపై
కత్తి దూస్తారు. ప్రాణాలు తీస్తారు
అది వ్యక్తిగత నష్టం
వరదలొస్తే
ఊళ్ళకు ఊళ్ళను తడిపేస్తుంది
పంటపొలాల తుడిపేస్తుంది
రైతులను దిగాలు పరుస్తుంది
జీవనాన్ని కుదేలు చేస్తుంది
అది ప్రకృతి వైపరీత్యం
మరి యుద్ధమే వస్తే
అది రాజ్యాల మధ్య ప్రాణమానాలతో ముడిపడ్డ ఆర్థిక వినాశకారి
దాని ధాటికి
కరువు కాటకాలమించి
దేశంమొత్తాన్ని విధ్వంసం చేస్తుంది
క్షతగాత్రులను
శవాలగుట్టలను
భవన శిథిలాలలను
బహుమతిగా యిస్తుంది
చెట్టుకొకరు పుట్టకొకరు చెల్లాచెదరౌతారు
ఇళ్ళు గుళ్ళూ సర్వం తగలబడతాయ్
ఎవరు చనిపోయారో
ఎవరు బతికున్నారో
ఏ శిధిలాల కింద ఏ శిశువులు
ఏ పశువులు చిక్కుకున్నాయో
కూటికి గూటికి లోటుతెచ్చి
బతికుండగానే జనాలను
జీవచ్ఛవాలను చేస్తుంది
ఆ ఆకటికేకలనాదుకోవాలి
గాయపడ్డవారికి వైద్యమందించాలి
మారణహోమపు కీలలేకాదు
మానవతుల శీలాలు మంటకలిపే
దగుల్బాజీ వెధవలకు హక్కు
ఎవడిచ్చాడు
ఎవరి మీదకోపమో
ఇలా అమాయకులు బలికావలసిందేనా
యుద్ధకాంక్షతో బలసిన దేశాలు
మతోన్మాద వంకతో
బలహీనదేశాల నాశనానికి
కంకణం కట్టుకుంటే ఎలా
మతాలనో దేశపు ఆదాయం మీదో
కుళ్ళెందుకు
ఈ దౌష్ట్యాన్ని మీ దేవుడు సమర్థిస్తాడా
మనిషి తనం నుండి అమానవీయ
దుడుకుదనం మీ రక్తంలోనే వుందా
సభ్యసమాజం
వారిస్తున్నా బుద్ధిరాదా
ఈసమయంలోనే
సంయమనం కావాలి
ఆపన్నులకు సకాలంలో
చేయూతనివ్వాలి...
బతికి బట్టకట్టేలా
సహాయం అందించి మానవత్వం చాటుకోవాలి
యుద్ధ రహిత శాంతి సమాజం
నెలకొల్పాలి.
సామ్రాజ్య వాద వ్యతిరేక శక్తుల
ఐక్యతకు కృషి సల్పాలి
శాంతి సామరస్యవ్యవస్థను
పునరుద్ధరణకు చేయూత నివ్వాలి
No comments:
Post a Comment