రాజ్యాంగ సౌలతులు పొందుతూ,
మేమేదో పొగరుగా
కాలర్ ఎగరేస్తున్నామనే ఈర్ష్య పొందుతున్న వారికి,
వాస్తవ పరిస్థితులను కళ్ళద్దాలు తీసి చూడండి
డప్పు మూయలేని మా బతుకులకు
మా చర్మాన్ని తాపించాలని చూసే
కామందులింకా మీసాలు మెలేస్తున్నారు
అరాకొరా ఉద్యోగాల సాకు చూపి
ఓట్లు దండుకునే యంత్రాంగం మా నెత్తిన
పెట్టి....చోద్యం చూడడం కాదు
పొలంలో, పని బిలంలో గడ్డపారలు ఒదేసిన
యోని రంధ్రాల రక్తస్రాల మరకల కనపడవా
వేటినో వీటినో కొన్నింటినో...రంగులతెరపై
బయస్కోపు చేయబూనుతూ
పచ్చినిజాలు చూడడానికి కళ్ళుతెరవండి
మాకు తలెత్తినా కనపడదు పట్టణంలో
ఈ మధ్యనే కట్టిన క్రీస్తు దేవాలయం
ఎవరూ చూడకూడదనుకున్నా
కూలిపోతున్న దళిత గుడెసలెన్నో
పెద్ద తెరమీద సైన్మా బొమ్మైనపుడు
మరియమ్మలు, అబ్రహాములు
మల్లమ్మలు సోమయ్యలు
వ్యత్యాసాల వాసాలమధ్య
వేలాడుతూ వున్నారు.
క్రైస్తవం వచ్చి ఎవరిని మెరుగుపరిచిందోలేదో
ఎంతమందకి చదువు పంచిందో లేదో
ఎంతమంది అంలలాలెక్కారో
ఎక్కలేక కుదేలయ్యారో కాని
ఆరోగ్య విషయంలోనే వున్నది తేడా
అమెరికా దింపిన ఆస్పత్రిలో
మందులు ఇచ్చి రోగాలు తగ్గుతున్నాయా
స్వస్థత ప్రార్థన వల్లనా....
అర్థం కాదు కాని గాలిలో కలసిన
శవాలు పూడ్చడానికి
చోటేలేని శ్మశానాలవిగో.....
శవాలగుట్టలనుండి
సవాలు విసురుతున్నా
దూరపు క్రైస్తవం తెచ్చింది లేదు
పుట్టుకతో హిందుత్వం ఇచ్చిందిలేదు
నిజం నిగ్గు తేల్చండని.
No comments:
Post a Comment