Sunday, November 4, 2012

అంటురోగం

కపిల రాం కుమార్// అంటురోగం// **

కులమన్నది పిచ్చిరా - వ్యాకులము నిచ్చురా!
మతమన్నది మచ్చరా అభిమతము చచ్చురా!

కాగితాల దండలు గుబాళింపులీయవు
శాసనాల తోటల్లో గులాబీలు పూయవు!

భాష పేర, జాతిపేర పెరుగనీకు విద్వేషం
విధ్వంసంకాకుండ తుంచవోయి కులతత్వం!

అంటరాని వాడంటే మన వెంటరానివాడే
లంచగొండి మనిషికన్న అంటురోగి యింకెవ్వడు?

కళ్ళు లేని కామానికి అంటరానితనంలేదు
కుళ్ళుబోతు సంస్కృతిని ఆపకుంటె బుద్ధిరాదు!

యాగాలకు వ్రతములకు వ్రణములిట్టె మానినా
పాటలకు మాటలకు రోగాలే తగ్గినా
యిన్ని వేల్ ఖర్చుల్తో వైద్యశాలలేలరా?
విశ్రాంతిపొందగ మరుభూమి మేలురా!

వ్యర్థమైన భావాలకు తలవంచుట్యెందుకు!
స్వచ్చమైన పోకడలో విషము కలుపుటెందుకు?
యోచనలేని మానవత్వ మనుగడ నీకెందుకు
అంటురోగమందరికి అంటించుట యెందుకు?

4.11.2012

** నగారా సంకలనం నుండి.

No comments: