స్వాతంత్ర్యోత్తర యుగంలో తెలుగు భాషా సాహిత్య పరిశోదనలు
ఆధునిక సాహిత్యరంగంలో:
గత వేయి సంవత్సరాల ప్రాచీన సాహిత్యం ఒక ఎత్తు కాగా 1900 తరువాత పుట్టిన ఆధునిక సాహిత్యం మరో ఎత్తు. వైవిధ్యం, ప్రజాజీవిత ప్రతిఫలనం, మార్పునాశించటం ఆధునిక సాహిత్య ప్రధాన లక్షణాలు. చలం, శ్రీశ్రీ, కుటుంబరావుగార్లు రచయితలుగా మాత్రమే కాకుండా విమర్శకులుగా ఆధునిక పరిశోధనరంగాన్ని బహుధా ప్రభావితం చేశారు. వీరందరూ సాహిత్య ప్రయోజనాన్ని గురించి ప్రశించినవారే. ఫలితంగా ఆధునిక సాహిత్య పరిశోధన ''ప్రయోజ''నాన్ని ఉద్దేశించి జరిగింది.ఆచార్య సి.నారాయణరెడ్డిగారి ''ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు - ప్రయోగములు'' ఒక విధంగా ఆధునిక కవిత్వం మీద పరిశోధనకు కరదీపిక అయింది (1967). అంతకు ముందు కెవి.రమణారెడ్డిగారు గురజాడ మీద రచించిన ''మహోదయం'' ఒక విధంగా రచయిత మీద పరిశోధించే సూత్రాల్ని అందించిందని చెప్పవచ్చు (1958-1969).
వీరి కంటే ఒక దశాబ్దం ముందే ''తెలుగు సాహిత్యం మీద పాశ్చాత్య ప్రభావం'' గురించి ఆచార్యులు జి.యస్.రెడ్డి, కొత్తపల్లి వీరభధ్రరావులు పరిశోధించారు. నాటకరంగం మీద సి.యస్.ఆర్.అప్పారావుగారు, కథానిక మీద పోరంకి దక్షిణామూర్తిగారు, వ్యాస పరిణామం మీద కొలకలూరి ఇనాక్ గారు రచించిన సిద్ధాంత గ్రంథాలు గొప్ప ఆకర గ్రంథాలు. ఈ దశలోనే స్వాతంత్ర్యోద్యమ కాలంలోని జాతీయ గేయ కవిత్వం మీద ఆచార్య మద్దూరి సుబ్బారెడ్డి గారి పరిశోధన జరిగింది (1970 - 1980).
ఈ దశకంలోనే ఆధునిక సాహిత్య ప్రచారమూ ముమ్మరంగా సాగింది. కె.కె.రంగనాధాచార్యులుగారు ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో ఆధునిక సాహిత్యం మీద, ఉద్యమాల మీద, కవుల మీద, రచయితల మీద - ఉపన్యాసాలిప్పించి, ఆయా గ్రంథాలకు విపులమైన పీఠికలు రచించారు. ఆ పీఠికల్లో కొత్త కోణాలు సమగ్రంగా ఆవిష్కరింపబడ్డాయి. 1974లో వెల్చేరు నారాయణరావుగారు ''తెలుగులో కవితా విప్లవాల స్వరూపం'' మీద ఒక సిద్ధాంత వ్యాసం అమెరికాలో వుండి రచించారు. తొలిసారిగా తెలుగుదేశంలోని సాహిత్య ప్రియులంతా ఒకసారి కవితా విప్లవాల్ని గురించి ఆలోచించేలా చేసిన గ్రంథమిది. తరువాతి సంవత్సరాల్లో డా.సంజీవమ్మ, డా.వరవరరావు, డా.టి.ప్రభాకరరెడ్డి క్రమంగా నవలల్లో సామాజిక వాస్తవికత, భూమి సమస్య, విప్లవ కవిత్వంలో ప్రతీక అనే అంశాల మీద పరిశోధించారు. ఈవాళ దాదాపు ప్రతి విశ్వవిద్యాలయంలోనూ ఆధునిక, జానపద సాహిత్యాల మీద పరిశోధన సాగుతోంది. కేతవరపు రామకోటి శాస్త్రి, ముదిగొండ వీరభద్రయ్య, కేతు విశ్వనాథరెడ్డి, కేతవరపు కాత్యాయని, ఆధునిక సాహిత్యా పరిశోధన సూత్రాలను అన్వేషిస్తున్నారు
No comments:
Post a Comment