Tuesday, November 27, 2012

మనసు విరిగితే?

కపిల రాంకుమార్//మనసు విరిగితే??//

ఆకాశం - అవకాశ శూన్యం!
ఆర్ణవం - అఘాతం!
జీవితం - అవకాశరహితాల అఘాతాల సమ్మేళనం!

ఆలోచనా బంధనాల కాసారంలో, అతల స్పర్శగా ఈదలేక
తహతహలాడే ప్రాణంతో కొట్టుకు రావాలి!

గ్రీష్మంలో - ప్రత్యోదను కిరణాల తిగ్మంతో
ఝంఝామారుతాల తాకిడికి తట్టుకోవాలి!

ఆగ్రహాయిణిలో, జలధరుని సౌదామిని కళలనుండి
ప్రచేతజ్జనిత వజ్రనిర్ఘోషధారాసంపాత శీకరాల్ దెబ్బలకు నిలబడాలి!

ప్రావృట్కాల శైతవాయువుల బిగింపులకు
గజగజలాడినా సర్దుకు పోవాలి! ఉన్ని రగ్గులతోనో,
నెగళ్ళ సెగళ్ళతోనో!

ఎప్పుడో ఎక్కడినుండోి చల్లగా, మెల్లగా వీచిన
గంధవాహకుడ్ని మెచ్చుకోవాలి!

సరోవిహారంలో మృణాలను ఆరగించే రాయంచకు
రాజీవాల్ పరాగా్న్నాస్వాదించే అళిపుంగవుడ్ని
సుధాంశుని హస్తలాఘవంచేత
ఆనందపరవశియై కువలయ విన్యాసం సూస్తూ
ప్రక్కగా జాలువారే సెలయేటీ విపంచిక నిక్వణక్వణ స్వనాలను
వింటూ పరవశం చెందాలి!....కాని

ఎన్నో సమస్యలతో, తెగని ఆలోచనలతో
సతమతమవుతున్న మానవుడికి
ఏ మిథ్యాభిశంసనంవల్లో మనో వికల్పం కలిగి
ప్రాపంచిక విషయాలకు దూరంగా
అదృశ్యమవడానికి దారదం కోసం
ఏ తామస రాత్రో, నిశీథిలో, మరొకరి ప్రమేయంలేకుండా...
నిష్క్రమిస్తాడు!1 అస్తమిస్తాడు!!!.

27-11-2012

**ఇది ఈ రోజు పోస్టు చేసినా దీని రచనాకాలం 1969 - ఆంధ్ర గీర్వాణ విద్యాపీఠం (కొవ్వూరు ప.గో.జిల్లా)
అప్పటి కాలంలో వాడిన పదాలు కాబట్టి కొంచెం సంస్కృత భాషపై అనురాగం మెండుగా ఉన్నట్టు గ్రహించగలరు.

No comments: