Monday, November 5, 2012

దళిత చైతన్యం ఒక అనువాదమై...

    - దేవరాజు మహారాజు devaraju.maharaju@gmail.com
    05/11/2012

TAGS:

తెలుగునాట దళిత స్పృహ ఉద్ధృతం కాకమునుపే 1980లలో మరాఠీ దళిత కవిత్వం తెలుగు పత్రికలకెక్కింది. పందొమ్మిదవ శతాబ్దంలో వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థలపై నిరసన భావంతో దళితవాద రచనలు ప్రారంభమయ్యాయి. మహాత్మాగాంధీ హరిజనోద్ధరణ ప్రారంభించిన తర్వాత అన్ని భారతీయ భాషల వలెనే తెలుగులో కూడా కావ్యాలు వెలువడ్డాయి. జాషువా ‘గబ్బిలం’, కాటూరి వెంకటేశ్వరరావు ‘గుడిగంటలు’ వంటివి ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. సాంఘికంగా దోపిడీకి గురవుతున్నవారు, అస్పృశ్యులుగా పరిగణింపబడుతున్నవారు, కేవలం శారీరక శ్రమపై బతుకుతున్నవారు దళితులు. విద్యావంతులైన కొందరు దళితులు సాటి సోదరులను చైతన్యపరచడానికి సాహిత్యాన్ని ఆయుధంగా వాడుకున్నారు. ఇదే దళిత సాహిత్యమైంది. ఇదే దళిత ఉద్యమమైంది.
త్రియంబక్ సప్‌కాలే, వహరు సోనావనే, భీమ్‌సేన్ దితె, ప్రశాంత్ ఖరత్, డుధాల్కర్, కేశవ్ మేష్‌రామ్, వామన్ కర్‌దక్ మీనా గజభియే, ఎల్.జ్యోతి, ఎఫ్.ఎం.షిండె, శరణ్‌కుమార్ లింబాలే వంటి ప్రముఖ దళిత కవులందరూ వందల సంఖ్యలో తెలుగు పాఠకులకు పరిచయమయ్యారు. వీరందరిలో కనిపించే సుగుణమేమంటే సాఫీగా, సరళంగా సాగుతూనే కవిత భావస్ఫోరకంగా, ధ్వని ప్రధానంగా ఉంటుంది. కొందరి రచనల్లో నినాదాలు, కసి కనిపించినా ఎక్కువమంది రచనల్లో కవితాత్మ కొట్టుకుంటుంది. వహరు సోనావనె - కవిత అడవిలో ఆదివాసుల జీవితమంతా కళ్ళకు కట్టిస్తుంది.
‘‘ఆకు పచ్చని ఆరోగ్యవంతమైన అడవిలో
రాలిపడిన టేకు ఆకుల్లా
దూరంగా విసిరేసిన గుడిసెలు
కీకారణ్యం మధ్యన ఆదివాసులు
వ్రేళ్ళూ, కందలు, దుంపలు తింటూ

అయినా ఇప్పుడేమున్నాయనీ?
దుంపలూ లేవు, వ్రేళ్ళూ లేవు
నోరు తెరచిన భయంకర
నాగరిక ఆకలి జ్వలలకుర
అన్నీ ఆహుతైపొయ్యాయ్
ఇప్పుడు అడవిలాంటి అడవిలో
ఆదిమ సమాజంలోని బానిసల్లాగ
పిల్లలు నగ్నంగా గుడిసెల ముందు బురదలో
ఆటవికంగా ఆడుకుంటున్నారు’’
నాగరిక ఆకలి జ్వాలలకు ఆహుతైపోయిన జీవితాల నేపథ్యం ఇందులో స్పష్టంగా ఉంది. ప్రశాంత్ ఖరత్ ‘కళ్ళు మూసిన ఆకాశం’ కవితను ఇలా ముగిస్తాడు.
‘‘మరి ఈ ఆకాశాన్ని శవపేటికలో పెట్టిందెవరు?
ఈ ఆకాశం మీద మబ్బుల తెల్ల వస్త్రాన్ని కప్పిందెవరు?’’
సరికొత్త ఆలోచన. సరికొత్త ఇమేజరి. తెలుగులో విప్లవ కవిత్వం చాలా వచ్చింది. అది విషయాన్ని ప్రజలకు చేరవేసే కరపత్రంలా పనికొచ్చిందేర కాని, ఒక ఉన్నత స్థాయిని సంతరించుకున్న కవిత్వంగా తన స్థానం సుస్థిరం చేసుకోలేదు. కేశవ్ మేష్‌రామ్ అనే కవి ‘మా గూడెం’ శీర్షికతో ఎంత గొప్ప వర్ణన అందించాడో చూడండి.
‘‘మా గూడెంలో / పోస్ట్‌మ్యాన్ ఠోకరా తింటాడు / సుభాషితాల అర్థాలు తారుమారవుతాయి / నాగరికత గజగజ వణుకుతుంది / సూర్యుడంతటి వాడు కమిలి నల్లబడతాడు / బురదలో పశువుల కాలి గుర్తుల్లాగ - మా ఇళ్ళు / వాటిమధ్య విద్యుత్తులా / ఈదుతూ పొగలా మా గుండె ధైర్యం / సంప్రదాయపు చట్రాల్లోంచి బయటపడి / భూమిలో ఇంకిపోతూ మా గూడెం / నల్లని వెంట్రుకలతో, నల్లని శరీరాలతో / గర్జిస్తూ మెలి తిరుగుతూ, ఉవ్వెత్తున లేచిపడే / తిరుగుబాటు సముద్రం - ఇక్కడి ప్రజలు / దూది మూటల్ని భుజాలమీద మోస్తుంటారు / పీలగా గరుకుగా ఉన్నవాళ్ళ చేతి గాజుల్లో / పగిలిన ఆకాశం కనిపిస్తుంటుంది / ఉష్ణాన్ని పీల్చి వడగట్టడమే తమ పనైనట్లు / పిల్లలు అన్నిచోట్లా తిరుగుతుంటారు’’ - అంటూ సాగే కేశవ్ మేష్‌రామ్ దీర్ఘకవిత ఇలా ముగుస్తుంది.
‘‘ఇప్పుడే మా పిల్లలు విషయం గ్రహిస్తున్నారు / కవితలు రాస్తున్నారు / కథలు, భారతీయ సాహిత్యం సృష్టిస్తున్నారు / సంప్రదాయపు వృక్షాల్ని పదాల గొడ్డళ్ళతో తెగ నరుకుతున్నారు / సాహిత్యపు కలలమీద / వేడెక్కిన కఠోర నిజాల్ని భోరున వర్షిస్తున్నారు / పోలీస్, పోస్ట్‌మేన్‌లు ఇప్పుడు కూడా తిరుగుతున్నారు / చీకటి, సూర్యుణ్ణి కబళించే వృధా ప్రయత్నమది’’
వ్యాఖ్యానమక్కరలేని దళిత కవిత్వం ఇది. తల దాచుకోవడానిక్కూడా సరైన గూడు లేని నిర్భాగ్యులైన దళితుల గూర్చి ఉత్తమ్ కోల్గాంకర్ ఇలా వర్ణిస్తాడు. శీర్షిక ‘‘గృహముంటే కదా స్వర్గసీమ’’.
‘‘అతడు ఇంట్లోకి పోయి తలుపు వేసుకుంటే
వెనక గోడ పూర్తిగా కూలిపోయే ఉంటుంది
భూమ్యాకాశాలు కలిసినట్టే ఉంటాయి
ఆకాశం ఆకాశమే వేలవేల కళ్ళతో
అతని ఇంటిమీద దాడి చేస్తున్నట్టే ఉంటుంది
ఆకాశం కూలి మీద పడుతున్నట్టే ఉంటుంది’’
కేవలం దళితుల సమస్యలమీద మాత్రమే కాకుండా, దళిత కవులు దేశ పరిస్థితుల మీద కూడా వ్యాఖ్యానించారు. బాబూరావ్ జగ్‌తాప్ అంటాడు.
‘‘ఈ దేశం వేయి ముక్కలయ్యింది
నగరాలుగా, మతాలుగా, కులాలుగా
ప్రజలూ, వాళ్ళ మెదళ్ళూ అన్నీ ముక్కలయి పొయ్యాయి
తుత్తునియలయి పొయ్యాయి
ఈ దేశంలోని ప్రతిరోజూ కాలిపోతోంది
మా జీవితపు ప్రతి క్షణాన్ని మాడ్చేస్తోంది
హృదయం లేని మతంతో ఈ దేశం నగ్నంగా నిలబడి ఉంది
ఇక్కడి నేతలు దొడ్డిదారి చట్టంతో ఖుషీఖుషీగా
జల్సాలకు అలవాటుపడ్డారు
అసలు మేమిక్కడ పుట్టి పెరిగామన్నది కూడా మరిచిపొయ్యారు’’
- ఈ విధంగా ఎంతో దళిత సాహిత్యం తెలుగులోకి అనువాదమయ్యింది. తెలుగులో వచ్చిన విప్లవ సాహిత్యం తాడితులు, పీడితులు అణగారిన వర్గాలన్నింటి గూర్చి, అణచివేయబడ్డ స్ర్తిల గురించీ వెలువడింది.
అదే తర్వాత కాలంలో దళితవాదం, స్ర్తివాదం, మైనార్టీవాదంలాగా విడివడి స్వతంత్ర ప్రతిపత్తిని చాటుకున్నాయి. ఉద్యమ స్ఫూర్తి ఏదైనా గొప్పదే! కాని, ఆ స్ఫూర్తినిరి నిలుపుకునే సహేతుకమైన శక్తిమంతమైన కవిత్వం రావడం చాలా అరుదు.

No comments: