కపిల రాంకుమార్|| జానపద గీతం||
|| కట్టాలనెదిరించి సక్కంగ వుందాము ||
ఆమె: సింత సెట్టెక్కేవు - సిగురాకు కోసేవు
సెప్పకుండ నీవు తిరునాలకెల్లేవు
అచ్చట తీర్సంగ ముచ్చట సెప్పంగ
యేడసూసినాకాని కానరాకున్నవు!
యిట్ట చేస్తివంటె రెంకో రెంకా
వల్లనూ నేనింక యెంకరోరెంక!
అతడు: అప్పుడంటావు -యిప్పుడంటావు
సప్పుడు లేకుంట తప్పుకుంటావు
అక్కోరి పిల్లా - అల్లరీ సేమాకు
అక్కున నీ వల్లో వాలి పోతాను!
ఆమె: మాయమ్మ తమ్ముడాని మనసిచ్చి నేనుంటి
అక్క బిడ్డానని అలుసేలయ్య!
తిక్కరేగిందంటె మాడుసెక్కపెట్టి
పచ్చడి మెతుకుల బొచ్చె బోర్లిస్త!
అతడు: పప్పులోకి సిగురు కమ్మగుంటాదమి
నాజూకు సేతుల గాజులూ నింప
సంతాకు నేబోతే పంతాలు నీకేల
నారాజు కామాకు నీ రాజు నే కాన!
ఆమె: ఉడికించ నిన్ను అట్లంటికాని
నినుయీడి నేనెటుల వుండేదిరెంక!
నీకాల ములుదిగిన నా కాలు నొవ్వేను
నాకాన కూడ - నా మగడవీవె!
అతడు: నీ తాన యెల్లపుడు నా పానముంటాది
యేకోన వున్నా మరువనంటాది!
తడవ తడవకు మరి గొడవల్లు సేమాకు
యెన్నెలా రాత్రుల్లు మంటలూ కానీకు!
ఇద్దరు: ఒకరు నొకరింక - యిడస కుండాను
యెవ్వరేమన్న దడసకుండాను!
సెట్టుకూ తీగల్లె పెనవేసుకుందాము
కట్టాలనెదిరించి సక్కంగనుందాము!
****
18.2.2013 సా. 3.41
(అముద్రిత ' జనపద్యం ' కావ్యం నుండి)
No comments:
Post a Comment