కవిత్వంలో ' క్రాంతి' దర్శనం
సవ్వడి డెస్క్ - కె.ఆనందాచారి Sun, 3 Feb 2013, IST
"Poetry is the breath and finer spirit of all knowledge, is the
impressioned expression which is the countenance of all Science అంటాడు
వర్డ్స్‌వర్త్. కవిత్వాన్ని దొరకబుచ్చుకోవటం అంత తేలికైన విషయమేమీ కాదు.
అయితే, అన్ని నైపుణ్యాలను మనిషి సాధనతో సాధించవచ్చు. కవిత్వమూ ప్రయత్న
సాధ్యమైన విద్యనే! కానీ, కేవలం సాధన మాత్రమే సరిపోదు. జ్వలనం కావాలి. ఆ
జ్వలనంలో అంతరాత్మలోని కల్మషాలు ధ్వంసం కావాలి. ఒక స్వచ్ఛతను సాధించే నిత్య
ఏకాగ్రతలోంచే కవిత్వం వెలువడుతుంది. ప్యూరిటీ కోసం పరితపిస్తూ,
సత్యాన్వేషణ కోసం సంఘర్షించేవాడే కవి కాగలుగుతాడు. 'కవిత్వం ఒక ఆల్కెమీ,
దాని రహస్యం పెద్దన్నకు తెలుసు, కృష్ణశాస్త్రికి తెలుసు, శ్రీశ్రీకి
తెలుసు' అన్నాడు తిలక్.
కొన్నేళ్లుగా విద్యాలయాలను, విద్యాలయ
యాజమాన్య సంఘాన్నీ నడుపుతున్న క్రాంతి శ్రీనివాసరావుకూ ఈ విద్య తెలిసింది.
కొత్తగా చిగుర్లు వేస్తున్నట్లు, మొగ్గలు వికసిస్తున్నట్లు, ఉదయం రెక్కలు
తొడుగుతున్నట్లు, ఓ మలయ మారుతం హాయి గొలుపుతున్నట్లు, సముద్రం
ఉప్పొంగుతున్నట్లు, అగ్నిగుండం మంటలెగజిమ్ముతున్నట్లు ... సంధించిన
బాణాల్లా భావాలను కవిత్వాన్ని హృద్యంగా పేరుస్తున్నాడు. క్రాంతి కవి కాగల
మూలాలు గట్టిగానే ఉన్నాయి. ఒకటి : సామ్యవాద భావజాల దృక్పథం. ఇది
దార్శనికతను, స్పందించే గుణాన్ని, భవిష్యత్తుపై విశ్వాసాన్ని ఇచ్చింది;
రెండు : యాభై ఏళ్ల క్రితం గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరగడం... అప్పటికి
మానవీయ సంబంధాల విధ్వంసం జరగలేదు. రాజకీయ, సామాజిక చైతన్య చెలిమి నిండుగానే
ఉంది; మూడో విషయం : శ్రీశ్రీపై అభిమానంతో శతజయంతిని ఓ సంవత్సరమంతా జరిపి
విగ్రహాన్ని ప్రతిష్టించడం, ఆ సందర్భంగా ఆయన కవిత్వాన్నీ ఆవాహన చేయడం,
సీతారాం లాంటి స్నేహితుల బృందాన్ని అంటేసుకోవడమూ అతనిలో ఎక్కడో
గూడుకట్టుకున్న గువ్వను తట్టిలేపింది.
ప్రతి మనిషీ సృజనకారుడే!
సృజనాత్మకత అందరిలోనూ ఉంటుంది. కానీ, ఈ సమాజం మనిషిలోని సహజ ఉద్వేగాలను,
ఉద్రేకాలను సృజనాత్మకతలను నిరోధించి, ఆర్థిక మార్కెట్టు కార్యకలాపాలతో
బంధించి మనిషినే ఒక సరుకు చేసేస్తుంది. మానవ సంబంధాల స్థానంలో మార్కెట్
సంబంధాలు ఆధిక్యంలోకి వస్తాయి. ఇదొక మానవ విధ్వంస ప్రవాహం. కానీ, మనుషత్వం
ఎప్పుడూ ఘర్షణ పడుతూనే ఉంటుంది. మనిషి ఈ ఎదురీత, సంఘర్షణ ఒంటరిగా చేసి
విజయం పొందలేడు. అందుకే కవి సామూహానికి ప్రతినిధిగా నిలుస్తాడు. మనిషిగా
మరో జన్మ ఎత్తాలన్న ప్రయత్నంలోంచి కవిత్వం పెల్లుబుకుతుంది. క్రాంతిలోనూ
ఇప్పుడు ఈ మానవీయ ఘర్షణ కొనసాగుతోంది.
'ఎటాచ్‌మెంట్స్ లేని
అపార్ట్‌మెంట్స్‌ల్లో... ఏకాకి బృందాలం / సమూహంలో ఏకాకులం' అని అనటం వెనకాల
ఎంత ఘర్షణ ఉంది. 'గాజుపూలకంపులో... కల రివర్సయింది. 'మేల్కొనే ఉన్న నేను
వస్తువుల్లో ఇరుక్కుపోయిన నా జీవితాన్ని పట్టుకొందామని పరుగెత్తుతున్నా...
వస్తువుల్ని ప్రేమిస్తూ మనుషుల్ని వాడుకొంటున్న సమాజంలో సగటు మనిషిగా
ఉన్నానేమో నేను. అర్థం కాని గ్లాస్‌కర్టెన్ ఎకానమీ పద్మవ్యూహంలో
అభిమన్యునిలా / జీవితాలు వ్యర్థం అవుతూనే ఉన్నాయి'. ... అంటూ మార్కెట్
ఇంద్రజాలం మనిషిని ఎలా ఏమారుస్తున్నదో సరళంగా పట్టిస్తాడు. 'అందరం
మనుషుల్లాగే ఉందాం' అనే ఆకాంక్షలో మనుషుల్లా మనలేకపోతున్నామనే బాధ
కనపడుతుంది.
"Only a poem can record the dream" అన్నాడు కీట్స్
శిశువు మొదటిసారి జగత్తులోని వస్తుజాలాన్ని చూసి ఆనంద ఆశ్చర్యాల్లో
తేలియాడినట్లే- కవి కూడా ఒక అపూర్వ రసనావస్థలోకి దొర్లిపోతాడు. నిజంగానే
క్రాంతి దొర్లిపోయాడనిపిస్తుంది. 'బాల్యంలోకి, భవిష్యత్తులోకి,
బతుకుచక్రంలోకి, వెలుగు దివ్వెలోకి, కలుగు చీకట్లోకి, కటిక
దారిద్య్రాల్లోకి వెళ్ళి ... పిల్లకోడికెందుకంత పౌరుషమో, పామెందుకు ఆకలితో
మండిపోతోందో, తల్లులెందుకు తల్లడిల్లుతారో తెలుసుకున్నాడు.
కవి
మనిషికి కలుగుతున్న అన్యాయాన్ని సహించలేడు. పశుపక్ష్యాదులక్కూడా అధర్మం
జరక్కూడదంటాడు. అందుకనే ఆకుపచ్చ కన్నీరులో 'ఆకాశం ఓజోను వలువలు ఊడి
విలపిస్తూనే ఉంది / నదినీళ్ళు కాళ్ళకు సంకెలలు పడ్డాయి/ నూపురాలు ఊపిరులు
పోగొట్టుకున్నాయి' అని ఆవేదన చెందుతున్నాడు. 'నాన్నకళ్ళు'లో... 'అమ్మా
నాన్న వెక్కివెక్కి ఏడుస్తున్నారు, పొద్దునార్పిన పొయ్యి వెలిగించలేదు /
పెద్దెద్దు చనిపోయిందని వోదార్చేవాళ్ళు వోదారుస్తూనే ఉన్నారు.. తన మాట
వినగానే తనంతతానే కాడీ మెడకెత్తుకునేదనీ / నాగా పెట్టకుండా నాగలి
దున్నిందనీ, తనతో సమానంగా తన సంసారం లాగిందనీ/ తలుచుకుని తలుచుకునీ
విలపిస్తున్న నాన్న మాటలు / శోకపు గింజలై మొలకెత్తుతూనే ఉన్నాయి / ఏడ్చి
ఏడ్చి చింతనిప్పులయిన నాన్న కళ్ళు నాకింకా గుర్తే / ఎద్దుపోతేనే
గుండెలవిసిన నాన్న కళ్ళు మానవత్వపు వాకిళ్ళు' అని రైతుకూ, పశువులకూ మధ్య
ఉండే సంబంధాలను గొప్పగా అభివ్యక్తీకరించాడు. 'నిన్నటి ఆర్తనాదాలు
ఆగిపోయాయనుకునేంతలోపే గుండెలు పగులుతున్న చప్పుళ్ళు మళ్ళీ మొదలవుతున్నాయి /
నిన్నటి కన్నీటితో సేదతీరక ముందే సన్నటి ధార ప్రవహించాల్సి వస్తూనే ఉంది'
అనీ, 'పరిణామాలూ, పరివర్తనాలూ కాదు తిరుగుబాట్లు రావాలని' దళితులపై
జరుగుతున్న దారుణాలను క్రాంతి తన బాధగానే పలికించాడు. కవిగా క్రాంతి అందరి
జీవితాల్లోకి వెళ్ళాడు. ఓ మధ్య తరగతి జీవి గురించి, నెలజీతం కోసం ఎదురు
చూసే సగటు జీవన చిత్రాన్ని, ఆకలితో అలమటించే దీనదృశ్యాన్ని, 1975 నాటి
రాజ్యహింస బీభత్సాన్ని, విద్యావ్యవస్థలోని డొల్లతనాన్ని, మీడియాపాత్రనూ
దృశ్యీకరించాడు. ముదిగొండలాంటి చోట్ల 'రోడ్ల గుండెల్ని గుండ్లకు
అడ్డుపెట్టి / రహదారిపై రక్తపుష్పాలు రచిస్తుంటే' అని తన సామాజిక నిబద్ధత
చాటుకొన్నాడు. మనసులోకి దూసుకొచ్చిన ప్రతి అంశాన్ని కవిత్వీకరించడమే కాక
ప్రగతికాముక దృక్పథంతోనే ప్రతి విషయాన్ని, దాని మూలాలనూ చూడగలగటం క్రాంతి
ప్రత్యేకత. ఎంత శ్రీశ్రీ ప్రేమికుడైనా, కవి స్నేహితులు ఎందరున్నా తన సొంత
ముద్రతోనే కవితారంగ ప్రవేశం చేస్తున్నాడు. ఎన్నో వైవిధ్యమైన వస్తువులతో,
నూతనమైన అభివ్యక్తితో భావాలకు మెరుగులు పూసి ఇన్నిన్ని కవితల్ని మన మనసు
దోసిళ్ళలోకి కురిపిస్తున్నాడు. కవిత్వానికి కొత్త సాఫ్ట్‌వేర్‌ను తయారు
చేసే ప్రయత్నంలో పరిణతి చెందుతున్న బలమైన కవి ఖమ్మం గుమ్మంపై
అడుగుపెడుతున్నందుకు ఆనందంగా ఉంది.
- కె.ఆనందాచారి
9948787660
(ఇది క్రాంతి శ్రీనివాస్ వెలువరించిన కవిత్వ సంపుటి 'సమాంతర ఛాయలు'కు
రాసిన ముందుమాటలో కొంత భాగం. ఈ పుస్తకావిష్కరణ ఈనెల 6వతేదీ సాయంత్రం 5
గంటలకు ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో జరుగుతుంది.)
No comments:
Post a Comment